పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట

  •  
  •  
  •  

3-759-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యానతిచ్చి;ప్రజాపతిపుత్రుండును సమ్రాట్టును నైన స్వాయంభువమనువు బ్రహ్మావర్తదేశంబు నందు సప్తార్ణవమేఖలా మండిత మహీమండలంబుఁ బరిపాలించుచున్నవాఁ; డమ్మహాత్ముం డపరదివసంబున నిందులకు శతరూప యను భార్యాసమేతుండై భర్తృ కామ యగు కూఁతుం దోడ్కొని భవదీయ సన్నిధికిం జనుదెంచి; నీకు ననురూప వయశ్శీల సంకల్ప గుణాకర యైన తన పుత్రిం బరిణయంబు గావించు; భవదీయ మనోరథంబు సిద్ధించు; ననుం జిత్తంబున సంస్మరించు చుండు; నమ్మనుకన్య నిను వరించి భవద్వీర్యంబు వలన నతి సౌందర్యవతు లయిన కన్యలం దొమ్మండ్రం గను; నా కన్యకానవకంబు నందు మునీంద్రులు పుత్రోద్పాదనంబులు సేయంగలరు; నీవు మదీయ శాసనంబును ధరియించి మదర్పితాశేషకర్ముండ వగుచు; నైకాంతిక స్వాంతంబున భూతాభయదానదయాచరిత జ్ఞానివై నా యందు జగంబులు గలవనియు; నీ యందు నేఁ గల ననియు; నెఱింగి సేవింపుము. చరమకాలంబున ననుం బొందగలవు. భవదీయ వీర్యంబువలన నేను నీ భార్యాగర్భంబుఁ బ్రవేశించి మత్కళాంశంబునఁ బుత్రుండనై సంభవించి నీకుం దత్త్వసంహిత నుపన్యసింతు;"నని జనార్దనుండు గర్దమున కెఱింగించి; యతండు గనుగొనుచుండ నంతర్హితుండై.

టీకా:

అని = అని; ఆనతిచ్చి = తెలిపి; ప్రజాపతి = బ్రహ్మదేవుని; పుత్రుండునున్ = కొడుకును; సమ్రాట్టునున్ = చక్రవర్తియును; ఐన = అయినట్టి; స్వాయంభువ = స్వాయంభువుడు అను; మనువు = మనువు; బ్రహ్మావర్త = బ్రహ్మావర్తము అను; దేశంబున్ = దేశము; అందున్ = అందు; సప్త = ఏడు (7); ఆర్ణవ = సముద్రములు అను; మేఖలా = వడ్డాణముతో; మండిత = అలంకరింపబడిన; మహీ = భూ; మండలంబున్ = మండలమును; పరిపాలించుచున్ = ఏలుతూ; ఉన్నవాడు = ఉన్నాడు; ఆ = ఆ; మహాత్ముడు = గొప్పవాడు; అపర = మరుసటి; దివసంబున్ = దినమున; ఇందుల = దీని; కున్ = కొరకు; శతరూప = శతరూప; అను = అను; భార్యా = భార్యతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; భర్తృ = భర్తను; కామ = కోరుచున్నది; అగు = అయిన; కూతున్ = కూతురిని; తోడ్కొని = కూడా తీసుకొని; భవదీయ = నీయొక్క; సన్నిధి = సమీపమున; కిన్ = కు; చనుదెంచి = వచ్చి; నీకున్ = నీకు; అనురూప = తగినట్టి; వయస్ = వయసు; శీల = స్వభావము; సంకల్ప = సంకల్పములు; గుణ = ఉత్తమ గుణములును; ఆకర = కలిగినది; ఐన = అయినట్టి; తన = తన యొక్క; పుత్రిన్ = పుత్రికను; పరిణయంబున్ = వివాహము; కావించున్ = చేయును; భవదీయ = నీ యొక్క; మనోరథంబున్ = కోరికయును; సిద్ధించున్ = తీరును; ననున్ = నన్ను; చిత్తంబునన్ = మనసులో; సంస్మరించుచున్ = ధ్యానిస్తూ; ఉండున్ = ఉండును; ఆ = ఆ; మను = మనువు యొక్క; కన్య = కూతురు; నినున్ = నిన్ను; వరించి = పెండ్లాడి; భవత్ = నీ యొక్క; వీర్యంబున్ = వీర్యము; వలనన్ = వలన; అతి = మిక్కిలి; సౌందర్యవంతులు = అందమైనవారు; అయిన = అయినట్టి; కన్యలన్ = బాలికలను; తొమ్మండ్రన్ = తొమ్మిదిమందిని (9); కనున్ = కంటుంది; ఆ = ఆ; కన్యకా = కన్యలు; నవకంబున్ = తొమ్మిదిమంది (9); అందున్ = అందు; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; పుత్ర = పుత్రులను; ఉత్పాదనంబున్ = పుట్టించుట; చేయగలరు = చేయగలరు; నీవు = నీవు; మదీయ = నా యొక్క; శాసనంబునున్ = ఆజ్ఞను; ధరించి = స్వీకరించి; మత్ = నా యందు; అర్పిత = అర్పణచేసిన; అశేష = సమస్తమైన; కర్ముండవు = కర్మలు కలవాడవు; అగుచున్ = అవుతూ; ఏకాంతిక = ఏకాంతస్థితిని ఫొందిన; స్వాంతంబునన్ = మనసు కలిగి; భూత = ప్రాణికోటికి; అభయ = శరణ్యము; దాన = ప్రసాదించు; దయా = దయకల; చరిత = వర్తన కల; జ్ఞానివి = జ్ఞానము కలవాడవు; ఐ = అయ్యి; నా = నా; అందున్ = అందు; జగంబులున్ = లోకములు; కలవు = ఉన్నవి; అనియున్ = అనియును; నీ = నీ; అందున్ = అందు; నేన్ = నేను; కలను = ఉన్నాను; అనియున్ = అనియును; ఎఱింగి = తెలిసి; సేవింపుము = కొలువుము; చరమ = చిట్టచివరి; కాలంబునన్ = సమయము వచ్చినప్పుడు; ననున్ = నన్ను; పొంద = పొంద; కలవు = కలవు; భవదీయ = నీ యొక్క; వీర్యంబు = వీర్యము; వలనన్ = వలన; నేను = నేను; నీ = నీ యొక్క; భార్యా = సతి; గర్భంబున్ = గర్భమును; ప్రవేశించి = చేరి; మత్ = నా యొక్క; కళా = కళలోని; అంశంబునన్ = భాగముతో; పుత్రుండన్ = కొడుకును; ఐ = అయ్యి; సంభవించి = అవతరించి; నీకున్ = నీకు; తత్త్వసంహితను = తత్త్వసంహితను {తత్త్వసంహిత - ఒక వేదాంత విషయము, తత్త్వమును (స్వస్వరూపమును) గురించిన విషయములను సంహిత (చక్కగ కూర్పబడినది)}; ఉపన్యసింతును = ఉపదేశింతును; అని = అని; జనార్దనుండు = విష్ణుమూర్తి {జనార్దనుడు - జనులచే వేడుకొనబడువాడు, విష్ణువు}; కర్దమున్ = కర్దమున; కున్ = కు; ఎఱింగించి = తెలిపి; అతండున్ = అతడు; కనుగొనుచున్ = చూస్తూ; ఉండగన్ = ఉండగా; అంతర్హితుండు = మాయమైనవాడు; ఐ = అయ్యి;

భావము:

అని పలికి ఇంకా “బ్రహ్మదేవుని కుమారుడూ చక్రవర్తీ అయిన స్వాయంభువ మనువు బ్రహ్మావర్త దేశంలో సప్తసముద్రాల నడుమ ఉన్న భూమండలాన్నంతా పరిపాలిస్తున్నాడు. ఆ మహాత్ముడు రేపు తన భార్య శతరూపతో కూడి, పెండ్లి కావలసిన కూతురును వెంటబెట్టుకొని వచ్చి వయస్సులో, స్వభావంలో, సంకల్పంలో, ఉత్తమగుణాలలో నీకు తగినట్టి ఆ పుత్రికను నీకిచ్చి వివాహం చేస్తాడు. నీ కోరిక తీరుతుంది. నన్ను మనస్సులో స్మరిస్తూ ఉంటే ఆ మనుపుత్రిక నిన్ను పెండ్లాడి, నీ వల్ల మిక్కిలి సౌందర్యవతులైన తొమ్మిదిమంది కుమార్తెలను కంటుంది. ఆ తొమ్మిదిమంది కన్యలకు మునులవల్ల ఉత్తములైన కుమారులు జన్మిస్తారు. నీవు నా ఆజ్ఞానుసారం నీవు చేసే సమస్త కార్యాలనూ నాకు అర్పిస్తూ ఏకాగ్రమైన మనస్సుతో ప్రాణికోటికి అవసరమైనప్పుడు అభయ మిస్తూ, దానాలు చేస్తూ, కరుణామూర్తివై, సుజ్ఞానివై, నాలో లోకాలన్నీ ఉన్నాయనీ, నీలో నేనున్నాననీ తెలుసుకొని నన్ను సేవించు. అంత్యకాలంలో నన్ను చేరగలవు. నీ తేజస్సువల్ల నేను నీ భార్య గర్భంలో ప్రవేశించి నా కళాంశతో నీ కుమారుడనై జన్మించి నీకు తత్త్వవిద్యను బోధిస్తాను.” అని ఈ విధంగా విష్ణువు కర్దమునికి తెలిపి అతడు చూస్తూ ఉండగా అంతర్ధానమై…