పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట

  •  
  •  
  •  

3-756-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవ! శబ్దాది విషయ సుఖకరం బగు రూపంబు విస్తరింపఁ జేయు టెల్ల నస్మదనుగ్రహార్థంబు గాని నీ కొఱకుం గా దాత్మీయమాయా పరివర్తిత లోకతంత్రంబు గలిగి మదీయ మనోరథ సుధాప్రవర్షి వైన నీకు నమస్కరించెద."

టీకా:

దేవ = భగవంతుడా; శబ్ద = శబ్దము {శబ్దాది విషయ పంచకము - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రుచి 5 వాసన}; ఆది = మొదలగు; విషయ = విషయములచే {విషయములు - ఇంద్రియార్థములు (గోచరించునవి)}; సుఖ = సుఖమును; కరంబున్ = కలిగించునది; అగు = అయిన; రూపంబున్ = రూపములను; విస్తరింపన్ = విస్తరించునట్లు; చేయుట = చేయుట; ఎల్లన్ = సమస్తమును; అస్మత్ = మా యొక్క; అనుగ్రహ = అనుగ్రహించుట; అర్థంబున్ = కోసమే; కాని = కాని; నీ = నీ; కొఱకున్ = కోసము; కాదు = కాదు; ఆత్మీయ = తన యొక్క; మాయా = మాయచేత; పరివర్తిత = తిప్పబడుతున్న; లోక = లోకములను; తంత్రంబు = నడపునది; కలిగి = కలిగి ఉండి; మదీయ = నా యొక్క; మనోరథ = కోరికలను; సుధా = అమృతమును; ప్రవర్షివి = చక్కగ వర్షించువాడవు; ఐన = అయినట్టి; నీకున్ = నీకు; నమస్కరించెదన్ = మొక్కెదను.

భావము:

దేవా! శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే విషయాలచే సుఖం కలిగించే స్వరూపాన్ని వృద్ధిచేయడం మమ్మల్ని అనుగ్రహించడానికే గాని నీకోసం కాదు. నీ మాయవల్ల ఈ లోకవ్యాపారాలన్నీ ప్రవర్తింప చేస్తూ మా మనోరథ సిద్ధి అనే అమృతాన్ని నిండుగా వర్షించే నీకు నమస్కరిస్తున్నాను.”