పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట

  •  
  •  
  •  

3-754-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక; దేవా! భవదీయ మాయావిమోహితులై హత మేధస్కులై సంసారపారావారోత్తారకంబులైన భవదీయ పాదారవిందంబులు దుచ్ఛవృత్తి కాము లయి సేవించి నిరయగతులైన వారికిం దత్కాయ యోగ్యంబు లగు మనోరథంబుల నిత్తు; వట్టి సకాము లైన వారిఁ నిందించు నేనును గృహమేధ ధేనువు నశేషమూలయుం, ద్రివర్గ కారణయుం, సమానశీలయు నయిన భార్యం బరిణయంబుగా నపేక్షించి కల్పతరుమూల సదృశంబు లైన భవదీయ పాదారవిందంబులు సేవించితి; నయిన నొక్క విశేషంబు గలదు; విన్నవించెద నవధరింపుము; బ్రహ్మాత్మకుండ వయిన నీదు వచస్తంతు నిబద్ధు లై లోకులు కామహతు లైరఁట; ఏనును వారల ననుసరించినవాఁడ నై కాలాత్మకుండ వైన నీకు నభిమతం బగునట్లుగాఁ గర్మమయం బైన భవదాజ్ఞాచక్రంబు ననుసరించుటకుఁ గాని మదీయ కామంబు కొఱకుఁ గాదు; భవదీయ మాయావినిర్మితంబును; గాలాత్మక భూరి వేగసమాయుక్తంబును; నధిమానస సమేత త్రయోదశ మాసారంబును; షష్ట్యుత్తరశతత్ర యాహోరాత్ర మయ పర్వంబును; ఋతుషట్క సమాకలిత నేమియుం; జాతుర్మాస్యత్రయ విరాజిత నాభియు; నపరిమిత క్షణలవాది పరికల్పిత పత్రశోభితంబునుం; గాలాత్మక భూరివేగ సమాయుక్తంబును నైన కాలచక్రంబు సకల జీవనికరాయుర్గ్రసన తత్పరం బగుం; గాని కామాభిభూత జనానుగత పశుప్రాయు లగు లోకుల విడిచి భవ పరితాప నివారణ కారణం బయిన భవదీయ చరణాతపత్ర చ్ఛాయాసమాశ్రయులై తావకీన గుణకథన సుధాస్వాదన రుచిర లహరీ నిరసిత సకల దేహధర్ము లైన భగవద్భక్త జనాయుర్హరణ సమర్థంబు గాకుండు" నని వెండియు.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగ; దేవా = గోవిందా; భవదీయ = నీ యొక్క; మాయా = మాయ చేత; విమోహితులు = మిక్కిలి మోహమునపడినవారు; ఐ = అయ్యి; హత = దెబ్బతిన్నట్టి; మేధస్కులు = తెలివి కలవారు; ఐ = అయ్యి; సంసార = భవము అను; పారావార = సముద్రమును; ఉత్తారకంబులు = దాటించునవి; ఐన = అయినట్టి; భవదీయ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; అరవిందంబులన్ = పద్మములను; తుచ్ఛ = నీచమైన; వృత్తి = విధమైన; కాములు = కోరికలు కోరువారు; అయి = అయ్యి; సేవించి = పూజించి; నిరయ = నరకమునకు; గతులు = పోవువారు; ఐన = అయినట్టి; వారి = వారి; కిన్ = కిని; తత్ = ఆయా; కాయ = దేహములకు; యోగ్యంబులున్ = తగినవి; అగు = అయినట్టి; మనోరథంబులున్ = కోరికలను; ఇత్తువు = తీర్చెదవు; అట్టి = అటువంటి; సకాములు = కోరికలు కలవారు; ఐన = అయినట్టి; వారిన్ = వారిని; నిందించు = నిందించే; నేనునున్ = నేను కూడ; గృహ = గృహములు; మేధ = యజ్ఞములు; ధేనువున్ = గోవులు; అశేష = మొదలగు సమస్తమునకు; మూలయున్ = మూలమైనదియును; త్రివర్గ = ధర్మము అర్థము కామము అను మూటి వర్గమునకు; కారణయున్ = కారణము అయినదియును; సమాన = సరియగు; శీలయున్ = ప్రవర్తన కలదియును; అయిన = అయినట్టి; భార్యన్ = భార్యను; పరిణయంబున్ = పెండ్లి; కాన్ = చేసుకొనుటను; అపేక్షించి = కోరి; కల్పతరు = కల్పవృక్షము యొక్క; మూల = మొదలునకు; సదృశంబులున్ = సమానములు; ఐన = అయినట్టి; భవదీయ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; అరవిందంబులున్ = పద్మములను; సేవించితిన్ = కొలచితిని; అయినన్ = అయినప్పటికిని; ఒక్క = ఒక; విశేషంబున్ = విషయము; కలదు = కలదు; విన్నవించెదన్ = చెప్పకొనెదను; అవధరింపుము = వినుము; బ్రహ్మ = బ్రహ్మదేవుని; ఆత్మకుండవు = స్వరూపమున ఉన్నవాడవు; అయిన = అయినట్టి; నీదు = నీ యొక్క; వచస్ = మాటల; తంతు = సమూహమునకు; నిబద్ధులు = బాగా కట్టబడినవారు; ఐ = అయ్యి; లోకులు = జనులు; కామ = కామములచే; హతులు = దెబ్బతిన్నవారు; ఐరి = అయినారు; అట = అట; ఏనునున్ = నేనుకూడ; వారలన్ = వారిని; అనుసరించిన = అనుసరించిన; వాడను = వాడిని; ఐ = అయ్యి; కాల = కాలము యొక్క; ఆత్మకుండవు = స్వరూపమైన వాడవు; ఐన = అయిన; నీకున్ = నీకు; అభిమతంబున్ = ఇష్టము; అగునట్లుగా = ప్రకారముగా; కర్మ = కర్మములతో; మయంబున్ = నిండినది; ఐన = అయినట్టి; భవత్ = నీ యొక్క; ఆజ్ఞా = అజ్ఞా; చక్రంబున్ = వలయమును; అనుసరించుట = ప్రకారము నడచుట; కున్ = కొరకు; కాని = కాని; మదీయ = నా యొక్క; కామంబు = కోరికలు; కొఱకున్ = కోసము; కాదు = కాదు; భవదీయ = నీ యొక్క; మాయా = మాయచేత; వినిర్మితంబును = చక్కగా నిర్మింపబడినదియును; కాల = కాలము యొక్క; ఆత్మక = స్వరూపము అయిన; భూరి = అతి మిక్కిలి; వేగ = వేగముతో; సమాయుక్తంబునున్ = కూడినదియును; అధి = అధిక; మాస = మాసముతో; సమేత = కలిసి; త్రయోదశ = పదమూడు (13); మాసారంబునున్ = మాసములుకలదియును; షష్ట్యుత్తరశతత్రయా = మూడువందలఅరవై (360); అహో = పగళ్ళు; రాత్ర = రాత్రులు; మయ = నిండిన; పర్వంబునున్ = విభాగములు కలదియును; ఋతు = ఋతువుల; షట్క = ఆరింటి (6); సమాకలిత = కూడినదియైన; నేమియున్ = వలయమును; చాతుర్మాస్య = చాతుర్మాస్యముల {చాతుర్మాస్యము - చతుః (నాలుగు, 4) చొప్పున మాస్యము (నెలలుకలది)}; త్రయంబునున్ = మూటితో; విరాజిత = విరాజిల్లు; నాభియున్ = కేంద్రకము కలదియును; అపరిమిత = పరిమితి లేనట్టి; క్షణ = క్షణములు; లవ = లవము; ఆది = మొదలగువానితో; పరికల్పిత = విభజింపబడిన; పత్ర = విభాగములుతో; శోభితంబునున్ = శోభించుచున్నదియును; కాల = కాలము యొక్క; ఆత్మక = స్వభావమైన; భూరి = అతిమిక్కిలి; వేగ = వేగముతో; సమాయుక్తంబునున్ = కూడినదియును; ఐన = అయినట్టి; కాల = కాలము అనెడి; చక్రంబున్ = చక్రము; సకల = సమస్తమైన; జీవ = ప్రాణుల; నికర = సమూహముల; ఆయుర్ = ఆయువును; గ్రసన = సంగ్రహిచుటయందు; తత్పరంబున్ = లగ్నమైనది; అగున్ = అగును; కాని = కాని; కామా = కామములచేత; అభిభూత = అపహతులైన, దెబ్బతిన్నట్టి; జన = జనులను; అనుగత = అనుసరించువారైన; పశు = పశువుల {పశువు - పాశములచే కట్టబడునది}; ప్రాయులు = వంటివారు; అగు = అయినట్టి; లోకులన్ = లోకులను; విడిచి = వదలిపెట్టి; భవ = సంసారము యొక్క; పరితాప = అధికమైన బాధలను; నివారణ = నివారింపబడుటకు; కారణంబున్ = కారణము; అయిన = అయినట్టి; భవదీయ = నీ యొక్క; చరణ = పాదములు అను; అతపత్ర = గొడుగు యొక్క; ఛాయ = నీడన; సమా = చక్కగా; ఆశ్రయులు = ఆశ్రయించినవారు; ఐ = అయ్యి; తావకీన = నీ యొక్క; గుణ = గుణములు; కథన = కథలు అను; సుధా = అమృతమును; ఆస్వాదన = ఆసక్తిగా తీసుకొను; రుచిర = మనోహరములైన; లహరీ = తరంగములచే; నిరసిత = తిరస్కరింపబడిన; సకల = సమస్తమైన; దేహ = శరీర; ధర్ములు = ధర్మములు కలవారు; ఐన = అయినట్టి; భగవత్ = భగవంతుని {భగవంతుడు - పూజ్యుడు, మహాత్యముకలవాడు, వీర్యవంతుడు, ఐశ్వర్యవంతుడు, విష్ణువు}; భక్త = భక్తులు అయిన; జన = జనుల; ఆయుస్ = ఆయుష్షును; హరణ = హరించుటకు; సమర్థంబు = సామర్థ్యము కలది; కాకుండున్ = కాకుండును; అని = అని; వెండియు = మరల.

భావము:

అంతేకాక దేవా! నీ మాయవల్ల సమ్మోహితులై మతిమాలినవారై సంసార సముద్రాన్ని దాటించే నీ చరణకమలాలను తుచ్ఛమైన కోరికలతో ఆరాధించి, నరకపు దారి పట్టే కాముకుల కోరికలను కూడ నీవు తీర్చుతూ ఉంటావు. అటువంటి కాముకులను నిందించే నేనుకూడ గృహయజ్ఞ నిర్వహణలో గోవువలె ఉపకరించేదీ, అన్నింటికీ మూలమైనదీ, ధర్మార్థకామములకు నెలవైనదీ, అనుగుణమైన నడవడి గలదీ అయిన భార్యను పెండ్లాడాలని కోరి కల్పవృక్షమూలాల వంటి నీ పాదపద్మాలను సేవించాను. అయినా ఒక విశేషం ఉంది. విన్నవిస్తాను విను. పరబ్రహ్మ స్వరూపుడవైన నీ వాక్కులు అనే త్రాళ్ళతో బంధింపబడిన ప్రజలు కామోపహతులైనారట. నేను కూడా వారిని అనుసరించడం కాలాత్మకుడవైన నీకు ఇష్టమైన విధంగా కర్మమయమైన నీ ఆజ్ఞాచక్రాన్ని అనుసరించడానికే కాని కామం కోసం కాదు. నీ మాయచేత నిర్మించ బడినదీ, కాలాత్మకమైన మహావేగం కలదీ, అక్షర పరబ్రహ్మాన్ని అనుసరించి తిరిగేదీ, అధిక మాసంతో కలిసి పదమూడు నెలలు అనే ఆకులు గలదీ, మూడువందల అరవై అహోరాత్రాలు అనే కణుపులు గలదీ, ఆరు ఋతువు అనే చుట్టు పట్టా కలదీ, మూడు చాతుర్మాస్యాలు అనే నడిమిబొడ్డు కలది. అపరిమితాలైన క్షణాలు అనే ఆకులతో విరాజిల్లేదీ, అయిన కాలచక్రం సమస్త జీవుల ఆయుస్సును మ్రింగివేయటానికి ఆసక్తి కలదై కామోపహతులైన వారిని అనుసరించే పశుప్రాయులైన లోకులను విడిచి, సంసార తాపాన్ని శాంతింపచేసే నీ పాదాలనే గొడుగుల నీడలను ఆశ్రయించిన వారినీ, నీ గుణవర్ణనమనే అమృతరసాన్ని అస్వాదిస్తూ దేహధర్మాలను లెక్కచేయని నీ భక్తులైనవారి ఆయుస్సును హరించడానికి సమర్థం కాదు” అని పలికి…