పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవమనుష్యాదుల సృష్టి

  •  
  •  
  •  

3-743-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వరతపోయోగవిద్యాసమాధి యుక్తుం డగుచు ఋషివేషధరుండును హృషీకాత్ముండును నై ఋషిగణంబులం బుట్టించి సమాధి యోగైశ్వర్య తపోవిద్యా విరక్తి యుక్తం బగు నాత్మీయ శరీరాంశంబు వారికిం గ్రమంబున నొక్కొక్కనికి నిచ్చె" నని మైత్రేయుండు సెప్పిన విని విదురుండు పరమానందంబునం బొంది గోవిందచరణారవిందంబులు డెందంబునం దలంచి వెండియు మైత్రేయునిం జూచి యిట్లనియె.

టీకా:

వర = శ్రేష్ఠమైన; తపస్ = తపస్సు; యోగ = యోగము; విద్యా = జ్ఞానము; సమాధి = సమాధి అను వానితో; యుక్తుండు = కూడినవాడు; అగుచున్ = అవుతూ; ఋషి = ఋషి యొక్క; వేష = వేషమును; ధరుండున్ = ధరించినవాడును; హృషీక = ఇంద్రియములు; ఆత్ముండును = కలిగినవాడును; ఐ = అయ్యి; ఋషి = ఋషుల; గణంబులన్ = సమూహములను; పుట్టించి = సృష్టించి; సమాధి = సమాధి; యోగ = యోగము; ఐశ్వర్య = ఐశ్వర్యము; తపస్ = తపస్సు; విద్యా = జ్ఞానము; విరక్తి = వైరాగ్యము లతో; యుక్తంబున్ = కూడినది; అగున్ = అయిన; ఆత్మీయ = తన; శరీర = శరీరము యొక్క; అంశంబున్ = అంశను, భాగమును; వారి = వారి; కిన్ = కి; క్రమంబునన్ = వరుసగా; ఒక్కొక్కని = ఒక్కొక్కరి; కిన్ = కి; ఇచ్చెన్ = ఇచ్చెను; అని = అని; మైత్రేయుండు = మైత్రేయుడు; చెప్పినన్ = చెప్పగా; విని = విని; విదురుండు = విదురుడు; పరమ = అత్యధికమైన; ఆనందంబునన్ = ఆనందమును; పొంది = పొంది; గోవింద = నారాయణుని {గోవిందుడు - గో (జీవుల)కు ఒడయుడు, విష్ణువు}; చరణ = పాదములు అనెడి; అరవిందంబులున్ = పద్మములను; డెందంబునన్ = మనసులో; తలంచి = తలచుకొని; వెండియున్ = మరల; మైత్రేయునిన్ = మైత్రేయుని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

బ్రహ్మ శ్రేష్ఠమైన తపస్సు, యోగం, విద్య, సమాధి వీటితో కూడినవాడై ఋషివేషాన్ని ధరించి, ఇంద్రియాలతో కలిసిన ఆత్మస్వరూపుడై ఋషిగణాలను సృష్టించి, వారికి తన శరీరాంశాలైన సమాధి, యోగం, ఐశ్వర్యం, తపస్సు, విద్య, వైరాగ్యం అనే వాటిని క్రమంగా ఒక్కొక్కరికి సంక్రమింపచేసాడు” అని మైత్రేయుడు తెలియజేయగా విని విదురుడు మహానందం పొంది గోవిందుని పాదారవిందాలను తన మనస్సులో స్మరించి, మళ్ళీ మైత్రేయునితో ఈ విధంగా అన్నాడు.