పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-667-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దలపడి; యన్యోన్య జయకాంక్షల నితరేతర తుంగతరంగ తాడితంబు లగు దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబునఁ బరస్పర శుండాదండ ఘట్టిత మదాంధ గంధసింధుర యుగంబు చందంబున రోషభీషణాటోపంబులం దలపడు బెబ్బులుల గబ్బున నతి దర్పాతిరేకంబున నెదిర్చి ఱంకెలు వైచు మదవృషభంబుల రభసంబున నసహ్యసింహపరాక్రమంబున విక్రమించి పోరునెడ; హిరణ్యాక్షుండు సవ్యమండల భ్రమణంబునం బరివేష్టించినం బుండరీకాక్షుండు దక్షిణ మండల భ్రమణంబునం దిరిగి విపక్షవక్షం బశనిసంకాశం బగు గదా దండంబునం బగిల్చిన; వాడు దెప్పఱి తెలివొంది లేచి; దనుజ పరిపంథి ఫాలంబు నొప్పించె; నప్పు డమ్మేటి వీరులు శోణితసిక్తాంగు లై పుష్పితాశోకంబులం బురుడించుచుం బాయుచు డాయుచు వ్రేయుచు రోయుచు నొండొరుల రుధిరంబు లాఘ్రాణించుచుఁ దిరస్కార పరిహసోక్తుల నిచ్చుచుఁ బోరు సమయంబున; నమ్మహాబలుల సమరంబుఁ జూచువేడ్కఁ బద్మసంభవుండు నిఖిల మునీంద్ర సిద్ద సాధ్య దేవ గణంబులతోడఁ జనుదెంచి; ధరిత్రీ నిమిత్తంబున నసురవరునితోడం బోరు యజ్ఞవరాహున కిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; తలపడి = కలబడి; అన్యోన్య = ఒకరినొకరు; జయ = జయించు; కాంక్షలన్ = కోరికలతో; ఇతరేతర = ఒకదాని నింకొకటి; తుంగ = ఎత్తైన; తరంగంబులన్ = కెరటములతో; తాడితంబులు = కొట్టబడినవి; అగు = అయిన; దక్షిణ = దక్షిణపు; ఉత్తర = ఉత్తరపు; సముద్రంబుల్ = సముద్రములు; అనన్ = అన్నట్లు; రోద్రంబునన్ = పరాక్రమముతో; పరస్పర = ఒకదానితో నొకటి; శుండా = తొండములు అను; దండ = దండములతో; ఘట్టిత = కొట్టబడిన; మద = మదముచేత; అంధ = కన్నుగానని; గంధసిధుర = ఏనుగుల; యుగళ = జంట; చందంబునన్ = వలె; రోష = రోషముతో; భీషణ = భయంకరమైన; ఆటోపంబులన్ = విజృంభణములతో; తలపడి = కలబడి; బెబ్బులుల = పెద్దపులుల యొక్క; గబ్బునన్ = పరాక్రమముతో; అతి = మిక్కిలి; దర్ప = గర్వము; అతిరేకంబునన్ = విజృంభణములతో; ఎదిర్చి = ఎదుర్కొనుచు; ఱంకెలు = రంకెలు; వైచు = వేసే; మద = మదించిన; వృషభంబుల = ఎద్దుల; రభసంబునన్ = వేగముతోను; అసహ్య = సహింపరాని; సింహ = సింహముల వంటి; పరాక్రమంబునన్ = శౌర్యముతోను; విక్రమించి = పరాక్రమించి; పోరున్ = యుద్ధము చేయు; ఎడన్ = సమయమున; హిరణ్యాక్షుండు = హిరణ్యాక్షుడు; సవ్యమండల = సవ్యమైన గుండ్రముగ; భ్రమణంబునన్ = తిరుగుటతో; పరివేష్టించినన్ = చుట్టుకొనిరాగా; పుండరీకాక్షుండు = ఆదివరాహుడు {పుండరీకాక్షుడు - పుండరీకములు (పద్మములు) వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; దక్షిణ = దక్షిణపు; మండల = గుండ్రముగ; భ్రమణుంబునన్ = తిరుగుటతో; తిరిగి = చుట్టుకొనివచ్చి; విపక్ష = శత్రుపక్షపువాని; వక్షంబున్ = వక్షస్థలమును; అశని = పిడుగుపాటు; సంకాశంబు = వంటిది; అగు = అయిన; గదాదండంబునన్ = గదతో; పగిల్చినన్ = పగులగొట్టగా; వాడున్ = వాడు; తెప్పఱి = తెప్పరిల్లి; తెలివొంది = తెలివితెచ్చుకొని; లేచి = లేచి; దనుజపరిపంథి = ఆదివరాహుని {దనుజపరిపంథి - దనుజు (రాక్షసు)లకు పరిపంథి (శత్రువు) , విష్ణువు}; ఫాలంబున్ = నుదిటిని; నొప్పించెన్ = దెబ్బకొట్టెను; అప్పుడు = అప్పుడు; ఆ = ఆ; మేటి = గొప్ప; వీరులు = శూరులు; శోణిత = రక్తముతో; సిక్త = తడసిన; అంగులు = అవయవములు కలవారు; ఐ = అయ్యి; పుష్పిత = పుష్పించిన; అశోకంబులన్ = అశోకవృక్షములను; పురుడించుచు = సాటియగుచు; పాయుచున్ = దూరమగుతూ; డాయుచున్ = దగ్గరగుతూ; వ్రేయుచున్ = కొట్టుతూ; రోయుచున్ = నిందిస్తూ; ఒండొరులన్ = ఒకరిదొకరు; రుధిరంబున్ = రక్తమును; ఆఘ్రాణించుచున్ = వాసనచూస్తూ; తిరస్కార = లెక్కచేయని; పరిహస = ఎగతాళిచేయు; ఉక్తులన్ = మాటలు; ఇచ్చుచున్ = ఆడుతూ; పోరు = యుద్ధము చేయు; సమయంబునన్ = సమయములో; ఆ = ఆ; మహా = గొప్ప; బలుల = బలశాలుల యొక్క; సమరంబున్ = యుద్ధమును; చూచు = చూసే; వేడ్కన్ = వేడుకతో; పద్మసంభవుండు = బ్రహ్మదేవుడు {పద్మసంభవుడు - పద్మమున సంభవించిన (పుట్టిన) వాడు, బ్రహ్మదేవుడు}; నిఖిల = సమస్తమైన; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠులు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; దేవ = దేవతల; గణంబుల = సమూహముల; తోడన్ = తోటి; చనుదెంచి = వచ్చి; ధరిత్రీ = భూమండలము, భూదేవి; నిమిత్తంబునన్ = కొరకు; అసుర = రాక్షసులలో {అసురుడు -సుర (దేవత) కానివాడు, రాక్షసుడు}; వరున్ = శ్రేష్ఠుని; తోడన్ = తోటి; పోరు = యుద్ధము చేయుచున్న; యజ్ఞవరాహున్ = ఆదివరాహుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఈ విధంగా తలపడి ఒకరినొకరు జయించాలనే కోరిక కలవారై ఆ ఇద్దరూ కోపంతో ఉవ్వెత్తుగా లేచే కెరటాలతో ఒకదాని నొకటి కొట్టుకొంటున్న ఉత్తర దక్షిణ సముద్రాల లాగా, పెద్ద తొండాలతో పరస్పరం ఢీకొంటున్న రెండు మత్తగజాల లాగా, రోషంతో భయంకరంగా గాండ్రిస్తూ తలపడుతున్న రెండు పెద్దపులుల్లా, పొగరుబోతుతనంతో రంకెలు వేస్తూ క్రుమ్ములాడుకుంటున్న ఆబోతుల జంటలాగా సహింపరాని సింహబలంతో పోరాటం చేస్తున్నప్పుడు హిరణ్యాక్షుడు ఎడమ వైపుకు గిఱ్ఱున తిరగగా, విష్ణువు కుడివైపు తిరిగి గదాదండంతో శత్రువు వక్షాన్ని పిడుగుపాటు వంటి దెబ్బతో పగులగొట్టాడు. వాడు తెలివి తప్పి తెప్పరిల్లి లేచి హరి నుదుటిపై కొట్టి నొప్పించాడు. అప్పుడు ఆ ఇద్దరు వీరులు తమ శరీరాలు రక్తంతో తడిసిపోగా పూచిన అశోకవృక్షాలవలె ఉన్నారు. ఒకరికొకరు దూరంగా వెళ్తూ, సమీపిస్తూ, కొడుతూ, అరుస్తూ, ఒకరు మరొకరి రక్తాన్ని వాసన చూస్తూ, తిరస్కారంతో కూడిన హేళనలు చేస్తూ యుద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో ఆ మహాబలుల యుద్ధాన్ని చూడాలనే కోరికతో బ్రహ్మ సమస్త మునీంద్రులను, సిద్ధులను, సాధ్యులను, దేవతల సమూహాన్ని వెంటబెట్టుకొని వచ్చి భూమి కొరకు రాక్షసునితో యుద్ధం చేస్తున్న యజ్ఞవరాహ స్వామితో ఇలా అన్నాడు.