పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-69-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున నమ్మహాత్ముని వికారవిదూరుని సర్వమోహమా
యావిలమానసుండ నగుప్పుడు సంసృతిదుఃఖినౌదు న
ద్ధేవుని సత్కృపామహిమఁ దేలినవేళ సుఖింతు నేనకా
దా విధిశంకరప్రభృతు వ్విభుమాయఁ దరింపనేర్తురే.

టీకా:

కావునన్ = అందుచేత; ఆ = ఆ; మహాత్మునిన్ = మహాత్ముని; వికార = సర్వవికారములకు; విదూరునిన్ = బాగా దూరముగ నుండు వాని; సర్వ = అందరను; మోహ = మోహింపజేయు; మాయా = మాయచే; అవిల = కలత నొందిన; మానసుండన్ = మనసు కలవాడను; అగున్ = అయిన; అప్పుడు = సమయము లందు; సంసృతి = సంసారమువలన; దుఃఖిన్ = దుఃఖము కలవాడను; ఔదున్ = అగుదును; ఆ = ఆ; దేవుని = దేవుడి; సత్ = మంచి; కృపా = దయ యొక్క; మహిమన్ = ప్రభావములో; తేలిన = తేలుతుండే; వేళన్ = సమయము లందు; సుఖింతున్ = సుఖిస్తుంటాను; నేన = నేనే; కాదు = కాదు; ఆ = ఆ; విధి = బ్రహ్మదేవుడు; శంకర = శివుడు; ప్రభృతులున్ = మొదలైన గొప్పవారైన; ఆ = ఆ; విభు = ప్రభువు యొక్క; మాయన్ = మాయను; తరింపన్ = దాట; నేర్తురే = గలరా, లేరు;

భావము:

కాబట్టి, ఎలాంటి వికారాలూ లేనివాడూ, మహాత్ముడూ అయిన ఆ శ్రీమన్నారాయణుని మాయావ్యామోహాలకు నా మనస్సు లోనైనపుడు సంసార సంబంధమైన ఈ దుఃఖాలు అనుభవిస్తాను. అలాకాక ఆ దేవదేవుని అపారకృపారసం ప్రసరించిననాడు సుఖంగా ఉంటాను. నేనే కాదు, ఆ బ్రహ్మరుద్రాదులు కూడా ఆ పరాత్పరుని మాయాజాలం నుంచి తప్పించుకొని బయటపడలేరు.