పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల శాపంబు

  •  
  •  
  •  

3-524-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియు; సనకసనందనాదులు జయవిజయులం జూచి యిట్లనిరి "మీ మనంబుల స్వామి హితార్థం బై నిష్కపటవర్తనుల మైన మాబోఁటులఁ గుహకవృత్తి గల యితర జనంబులు భగవత్సదనంబుఁ బ్రవేశింతురో యను శంకం జేసి కొందఱం బ్రవేశింపఁజేయుటయుఁ; గొందఱ వారించుటయు; దౌవారిక స్వభావం బని వారింప దలఁచితిరేని బ్రశాంత దివ్యమంగళవిగ్రహుండును, గతవిగ్రహుండును, భగవంతుడును, విశ్వగర్భుండును నైన యీశ్వరుండు ప్రాప్యంబును, బ్రాపకంబును, బ్రాప్తియు నను భేదశూన్యుండు గావున మహాకాశంబు నందు ఘటపటాద్యాకాశంబులు వేఱులేక యేకంబై తోఁచు చందంబున విద్వాంసు లగు వా రమ్మహాత్ముని సకలాత్మ భేదరహితునింగాఁ బొడ గందురు; అదియునుంగాక లోకంబు నందు రాజులు సాపరాధులైన కింకర జనంబుల నాజ్ఞాపించు చందంబున నీశ్వరుండు దండించునో యను భయంబునం జేసి వారించితి మని తలంచితిరేని భూసురవేషధారుల మైన మాకును వైకుంఠనాయకుండైన సర్వేశ్వరునకును భేదంబు లేకుండుటం జేసి శంకసేయం బనిలేదు; ఇట్లగుట యెఱింగి మందబుద్దులరై మమ్ము వారించిన యనుచితకర్ములగు మీరలు మదీయశాపార్హు లగుదురు; గావున భూలోకంబునం గామ క్రోధ లోభంబులను శత్రువులు బాధింపం బుట్టుం" డని పలికిన.

టీకా:

అని = అని; మఱియున్ = మరల; సనకసనందనాదులు = సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు అను కుమారచతుష్కము; జయ = జయుడు {జయవిజయులు - వైకుంఠమున విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు}; విజయులన్ = విజయుడు అనువారలను; చూచి = చూసి; ఇట్లు = ఈవిధముగా; అనిరి = పలికిరి; మీ = మీ యొక్క; మనంబులన్ = మనసులలో; స్వామి = యజమాని; హిత = మేలు; ఆర్థంబు = కోసము; ఐ = అయ్యి; నిష్కపట = కపటములేని; వర్తనులము = ప్రవర్తన కలవారము; ఐన = అయిన; మా = మా; పోటులన్ = వలెనే; కుహక = మోసపూరిత; వృత్తిన్ = వర్తన; కల = కలిగిన; ఇతర = మిగతా; జనంబులు = జనులు; భగవత్ = భగవంతుని; సదనంబున్ = భవనమును; ప్రవేశింతురో = ప్రవేశిస్తారేమో; అను = అనే; శంకన్ = అనుమానము; చేసి = వలన; కొందఱన్ = కొందరను; ప్రవేశింపన్ = లోపలకు వెళ్లనిచ్చుట; చేయుటయున్ = చేయుటయు; కొందఱన్ = కొందరను; వారించుటయున్ = అడ్డుకొనుటయును; దౌవారిక = ద్వారపాలకుల; స్వభావంబున్ = స్వాభావిక లక్షణము; అని = అని; వారింపన్ = ఆపవలెనని; తలచితిరి = అనుకొంటిరి; ఏని = అయితే; ప్రశాంతదివ్యమంగళవిగ్రహుండును = విష్ణుమూర్తి {ప్రశాంత దివ్య మంగళ విగ్రహుండు - ప్రశాంతమైన దివ్యమైన మంగళ (శుభ) కరము ఐన విగ్రహుండు (స్వరూపము కలవాడు), విష్ణువు}; గతవిగ్రహుండును = విష్ణుమూర్తి {గతవిగ్రహుండు - గత (తొలగిన) విగ్రహము (విరోధము) కలవాడు, విష్ణువు}; భగవంతుడును = విష్ణుమూర్తి {భగవంతుడు - మహిమాన్వితుడు, విష్ణువు}; విశ్వగర్భుండును = విష్ణుమూర్తి {విశ్వగర్భుండు - విశ్వము తన గర్భమున (కడుపులో) ఉన్నవాడు, విష్ణువు}; ఐన = అయిన; ఈశ్వరుండును = విష్ణుమూర్తి {ఈశ్వరుడు - ప్రభుత్వము కలవాడు, విష్ణువు}; ప్రాప్యంబునున్ = పొందబడినది; ప్రాపకంబున్ = పొందుట; ప్రాప్తియున్ = పొందినది; అను = అనెడి; భేద = తేడాలు; శూన్యుండు = లేనివాడును; కావున = కనుక; మహాకాశంబున్ = మహాకాశము; అందున్ = లో; ఘట = కుండ; పట = బట్ట; ఆది = మొదలగువాని లోని; ఆకాశంబులున్ = ఆకాశములు; వేఱు = భేదము; లేక = లేకుండగా; ఏకంబున్ = ఒకటే; ఐ = అయ్యి; తోచు = తెలియు; చందంబునన్ = విధముగా; విద్వాంసులు = పండితులు; అగు = అయిన; వారు = వారు; ఆ = ఆ; మహాత్మునిన్ = గొప్పవానిని; సకల = సమస్తమైన; ఆత్మ = ఆత్మలనుండి; భేద = వేరు; రహితునింగా = కానివానిగా; పొడగందురు = చూచెదరు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; లోకంబున్ = ప్రపంచము; అందున్ = లో; రాజులు = రాజులు; సాపరాధులు = అపరాధముతోకూడినవారు; ఐన = అయినట్టి; కింకర = సేవక; జనంబులన్ = జనులను; ఆజ్ఞాపించు = శిక్షించు; చందంబునన్ = విధముగా; ఈశ్వరుండున్ = విష్ణువునూ; దండించునో = శిక్షించునో; అను = అనెడి; భయంబునన్ = భయము; చేసి = వలన; వారించితిమి = అడ్డితిమి; అని = అని; తలంచితిరి = అనుకొనిరి; ఏని = అయినట్లైతే; భూసుర = బ్రాహ్మణ {భూసుర - భూమికి సురలు (దేవతలు), బ్రాహ్మణులు}; వేష = వేషమును; ధారులము = ధరించినవారము; ఐన = అయినట్టి; మాకును = మావంటివారికిని; వైకుంఠ = వైకుంఠమునకు; నాయకుండున్ = ప్రభువు; ఐన = అయినట్టి; సర్వేశ్వరున్ = విష్ణుని {సర్వేశ్వరుడు - సర్వులకు (అందరకును) ఈశ్వరుడు (ఫ్రభువు), విష్ణుమూర్తి}; కున్ = కిని; భేదంబున్ = భేదమే; లేకుండుటన్ = లేకపోవుట; చేసి = వలన; శంకన్ = అనుమానము; చేయన్ = పడుటకు; పని = అవసరము; లేదు = లేదు; ఇట్లు = ఈవిధముగా; అగుటన్ = ఉండుట; ఎఱింగి = తెలిసి; మంద = మందగించిన; బుద్దులరు = బుద్ధికలవారు; ఐ = అయ్యి; మమ్మున్ = మమ్ములను; వారించినన్ = అడ్డగించిన; అనుచిత = తగని; కర్ములు = పనిచేసినవారు; అగు = అయిన; మీరలు = మీరు; మదీయ = మా యొక్క; శాప = శాపమునకు; అర్హులు = తగినవారు; అగుదురు = అయి ఉన్నవారు; కావునన్ = కనుక; భూలోకంబునన్ = భూలోకములో; కామ = కామము; క్రోధ = కోపము; లోభంబులు = లోభములు; అను = అనెడి; శత్రువులు = శత్రువులు; బాధింపన్ = బాధిస్తుండగా; పుట్టుండు = జన్మించండి; అని = అని; పలికిన = శపించిన.

భావము:

ఇలా పలికి సనక సనందనాదులు ద్వారపాలకులైన జయవిజయులను చూచి ఇలా అన్నారు. “మీరు మనస్సులలో మీ స్వామి మేలు కోరుకొనేవారై మోసగాళ్ళైన ఇతరులు భగవంతుని మందిరంలోకి ప్రవేశిస్తారేమో అనే అనుమానంతో కొందరిని రానివ్వడం, కొందరిని అడ్డగించడం ద్వారపాలకుల ధర్మంగా భావించి కపటం లేని మమ్మల్ని అడ్డగించారు. ప్రశాంతమూ, దివ్యమూ, శుభకరమూ అయిన ఆకారం కలిగినవాడూ, ఎవరితోనూ విరోధం లేనివాడూ, సమస్త విశ్వం తనలో ఇమిడి ఉన్నవాడూ అయిన భగవంతుడు ప్రాప్యం, ప్రాపకం, ప్రాప్తి అనే భేదాలు లేనివాడు కనుక మహాకాశంలో ఘటాకాశం, పటాకాశం వేరు వేరుగా కాక లీనమై ఉన్నట్లు తోచే విధంగా విద్వాంసులు ఆ మహాత్ముని అందరిలోనూ ఆత్మరూపంలో అభేదంగా దర్శిస్తారు. అంతేకాక లోకంలో రాజులు దోషులైన సేవకులను దండించినట్లు భగవంతుడు మిమ్మల్ని దండిస్తాడేమో అనే భయంతో మమ్మల్ని అడ్డగించామని భావించారేమో. భూసురులమైన మాకూ, వైకుంఠాధిపతి ఐన భగవంతునికీ భేదం లేదు కనుక అనుమానించవలసిన పని లేదు. ఇది తెలిసికూడ మందబుద్ధులై మమ్మల్ని అడ్డగించి చేయరాని పని చేసి మా శాపానికి అర్హు లయ్యారు. కావున కామక్రోధలోభాలనే శత్రుగుణాలతో (అరిషడ్వర్గాలు - కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం ) భూలోకంలో పుట్టండి.”