పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితి గర్భంబు ధరించుట

  •  
  •  
  •  

3-471-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సేసిన భార్యా నిర్బంధంబునకుం దొలంగ నేరక, యీశ్వరునకు నమస్కారం బొనరించి యేకాంతంబున నిజకాంతాసంగమంబు దీర్చి సంగమానంతరంబున వార్చి స్నాతుం డై ప్రాణాయామం బొనర్చి విరజంబును సనాతనంబును నైన బ్రహ్మగాయత్రి జపియించె నంత.
^ బ్రహ్మ గాయత్రి

టీకా:

ఇట్లు = ఈ విధముగా; చేసిన = చేయగా; భార్యా = భార్య; నిర్భందంబున్ = చేసిన వత్తిడి; కున్ = కి; తొలగన్ = తప్పించుకొన; నేఱక = లేక; ఈశ్వరున్ = భగవంతుని; కున్ = కి; నమస్కారంబున్ = నమస్కారము; ఒనరించి = చేసి; ఏకాంతంబునన్ = ఒంటరి తావు నందు; నిజ = తన; కాంతా = భార్య యొక్క; సంగమంబు = కలయిక, సంభోగము; తీర్చి = పూర్తిచేసి; సంగమ = కలయిక, సంభోగము; అనంతరంబునన్ = తరువాత; వార్చి = ప్రక్షాళనము చేసికొని; స్నాతుండు = స్నానము చేసినవాడు; ఐ = అయి; ప్రాణాయామంబున్ = ప్రాణాయామము {ప్రాణాయామము - ప్రాణము (ముక్కుపుటముల యందు సంచరించెడి వాయువు) ద్వారా పంచప్రాణములను నియమించుట}; ఒనర్చి = చేసికొని; విరజంబునున్ = సాత్వికమైనదియును {విరజము - రజస్తమో గుణులు లేనిది, సాత్వికము}; సనాతనంబున్ = మిక్కిలి పురాతనమైనదియును; బ్రహ్మగాయత్రి = ఓంకారమును ఉచ్చరించుట {బ్రహ్మగాయత్రిన్ = ప్రణవమును అని మహాపండితులు బ్రహ్మశ్రీ విద్వాన్ కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులువారి శ్రీమదాంధ్ర మహాభాగవతము నందలి టిప్పణి లో వ్రాసినది.}; జపియించెన్ = జపించెను; అంతన్ = అంతట;

భావము:

ఇలా చేస్తున్న ఇల్లాలు నిర్భందాన్ని వదిలించుకోలేక, కశ్యపప్రజాపతి ఈశ్వరునకు నమస్కారం చేసి ఏకాంతంగా తన కాంత కోరిక తీర్చాడు. వెంటనే కాళ్ళు చేతులు కడుగుకొని స్నానంచేసి ప్రాణాయామ పూర్వకంగా, శాశ్వతమూ, పరమ పవిత్రమైన బ్రహ్మ గాయత్రీ మంత్రాన్ని జపించాడు.