పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితికశ్యప సంవాదంబు

  •  
  •  
  •  

3-459-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నీవు చెప్పిన యట్ల పురుషులకు నంగనలవలన ధర్మార్థకామంబులు సిద్ధించు; కర్ణధారుఁడు నావచేతం బయోధిఁ గడచు చందంబున వ్యసనార్ణవంబు దరియింపం జేయు భార్య పురుషునందు నర్దంబు; భార్యయందు సకల గృహకార్య భారంబునుం జేర్చి పురుషుండు నిశ్చింతుండై సుఖియించుచుండు; మఱియు నితరాశ్రమ దుర్జయంబు లైన యింద్రియ శత్రువర్గంబుల భార్యాసమేతుం డైన గృహస్థుండు దుర్గాధిపతి యైన రాజు శత్రు సంఘంబుల జయించు చందంబున లీలామాత్రంబునం జయించు; ఇట్టి కళత్రంబునకుం బ్రత్యుపకారంబు సేయ సకలగుణాభిరాము లగు సత్పురుషులు నూఱేండ్లకును జన్మాతరంబులకు నైన సమర్థులుగారు; అనిన మము బోటివారలు సేయ నోపుదురే? ఐన నీ మనంబుంనం గల దుఃఖంబు దక్కు" మని, యిట్లనియె.

టీకా:

నీవున్ = నీవు; చెప్పిన = చెప్పిన; అట్ల = విధముగనే; పురుషుల్ = పురుషుల; కున్ = కు; అంగనల = భార్యల; వలనన్ = వలన; ధర్మ = ధర్మము; అర్థ = అర్థము; కామంబులున్ = కామములు; సిద్ధించున్ = కలుగును; కర్ణధారుడు = పడవ నడుపువాడు {కర్ణధారుడు - కర్ణము (చుక్కాని) ధారుడు (పట్టువాడు), పడవ నడుపు వాడు, మార్గదర్శి}; నావ = పడవ; చేతన్ = చేత; పయోధిన్ = సముద్రమును {పయోధి - నీరు కి నిధి వంటిది, సముద్రము}; కడచు = దాటు; చందంబునన్ = విధముగనే; వ్యసన = వ్యసనములు అను; ఆర్ణవమున్ = సముద్రమును; తరియింపన్ = దాటునట్లు; చేయున్ = చేసెడి; భార్య = భార్య, పెండ్లాము; పురుషున్ = పురుషుని; అందున్ = లో; అర్థంబున్ = సగము; భార్య = పత్ని; అందున్ = అందు; సకల = సమస్తమైన; గృహ = ఇంటి; కార్య = పనుల; భారంబునున్ = బరువును; చేర్చి = పెట్టి; పురుషుండు = పురుషుడు; నిశ్చింతుడు = ఏ బాధ లేనివాడు; ఐ = అయి; సుఖియించుచున్ = సుఖపడుతూ; ఉండున్ = ఉండును; మఱియున్ = ఇంకనూ; ఇతర = ఇతరమైన; ఆశ్రమ = ఆశ్రమములలో {ఆశ్రమములు - చతురాశ్రమములు, 1 బ్రహ్మచర్య 2 గార్హస్థ 3 వానప్రస్థ 4 సన్యాస ఆశ్రమములు}; దుర్జయంబులు = జయింపరానివి; ఐన = అయిన; ఇంద్రియ = ఇంద్రియములు అను; శత్రు = శత్రువుల; వర్గంబులన్ = సమూహములను; భార్యా = పత్నితో; సమేతుండు = కూడినవాడు; ఐన = అయిన; గృహస్థుండు = గృహస్థుడు; దుర్గా = కోటకు; అధిపతి = అధిపతి; ఐన = అయిన; రాజు = రాజు; శత్రు = శత్రువుల; సంఘంబులన్ = సమూహములను; జయించున్ = జయించే; చందంబునన్ = విధముగా; లీలామాత్రంబునన్ = సుళువుగా; జయించున్ = జయించును; ఇట్టి = ఇటువంటి; కళత్రంబునన్ = భార్య; కున్ = కి; ప్రత్యుపకారము = బదులు ఉపకారము; చేయన్ = చేయుట; సకల = సమస్తమైన; గుణ = సుగుణములతో; అభిరాములు = ప్రకాశించువారు; అగు = అయిన; సత్ = మంచి; పురుషులు = పురుషులు; నూఱు = వంద (100); ఏండ్లు = సంవత్సరముల; కున్ = కును; జన్మ = జన్మలకొద్దీ; అంతరములు = సమయములు; కున్ = కును; ఐనన్ = అయినను; సమర్థులు = సరిపడువారు; కారు = కాలేరు; అనిన = అంటే యింక; మమున్ = మా; బోటి = లాంటి; వారలు = వారు; చేయన్ = చేయుటకు; ఓపుదురే = సమర్థులా ఏమి; ఐనన్ = అయినప్పటికిని; నీ = నీ యొక్క; మనంబునన్ = మనసులో; కల = ఉన్నట్టి; దుఃఖంబున్ = దుఃఖమును; తక్కుము = వదులుము; అని = అని; ఇట్లు = ఈవిధముగా; అనియెన్ = పలికెను.

భావము:

“నీవు చెప్పినట్లే, పురుషులకు స్త్రీల వలన ధర్మార్ధ కామ మోక్షాలు సిద్ధిస్తాయి. నావికుడు తన నావతో సముద్రాన్ని తాను దాటటమే కాకుండా ఇతర ప్రయాణీకులను కూడా దాటించినట్లు, గృహస్ధు తన గృహస్ధాశ్రమం ద్వారా తాను తరిస్తూ ఇతర ఆశ్రమవాసులను కూడా తరింపచేస్తూ ఉంటాడు. అటువంటి గృహస్థుడిలో భార్య అర్థభాగం, అటువంటి అర్థాంగియందు తన గృహకృత్యాల భారమంతా ఉంచి పురుషుడు నిర్విచారంగా సుఖం అనుభవిస్తాడు. అంతేకాకుండా, మిగిలిన ఆశ్రమవాసులు జయించలేని ఇంద్రియాలనే శత్రువులను (అరిషడ్వర్గాలను) సతీ సమేతుడైన గృహస్థుడు కోటలో ఉన్న రాజు శత్రు సమూహాలను జయించినట్లు అవలీలగా జయిస్తాడు. అటువంటి భార్యకు ప్రత్యుపకారం చేసి ఋణం తీర్చుకోవడానికి సమస్త సుగుణాలతో కూడి ఉన్న సత్పురుషులకు సైతం నూరేళ్ళకు గానీ, జన్మజన్మలకు గానీ సాధ్యంకాదు. అటువంటప్పుడు మావంటివాళ్లకు ఎలా సాధ్యమౌతుంది. ఇక నీ మనస్సులోని దుఃఖాన్ని విడిచిపెట్టు” అని చెప్పి కశ్యపుడు ఇలా అన్నాడు.