పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితికశ్యప సంవాదంబు

  •  
  •  
  •  

3-453-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక నా తోడిసవతు లెల్లను భవత్కృపావిశేషంబున గర్భాదానంబులు వడసి నిర్భరానందంబున నుండం జూచి శోకవ్యాకులితచిత్త నై యున్న నన్ను రక్షించుట పరమ ధర్మంబు నీవు విద్వాంసుడవు నీ యెఱుంగని యర్థంబు గలదే? నీ వంటి మహానుభావు లయిన సత్పురుషు లార్తులైన వారి కోర్కులు వ్యర్థంబులు గాకుండఁ దీర్చుట ధర్మం" బని; వెండియు నిట్లనియె.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగా; నా = నా యొక్క; తోడి = తోటి; సవతులు = సపత్నులు; ఎల్లను = అందరును; భవత్ = నీ యొక్క; కృపా = దయ యొక్క; విశేషంబునన్ = విశేషము వలన; గర్భా = గర్భమును; దానంబులున్ = చేయబడుటను; పడసి = పొంది; నిర్భర = పట్టరాని; ఆనందమునన్ = ఆనందము నంది; ఉండన్ = ఉండగా; చూచి = చూసి; శోక = దుఃఖముతో; వ్యాకులిత = చీకాకుపడిన; చిత్తను = మనసు కలదానను; ఐ = అయి; ఉన్న = ఉన్నట్టి; నన్నున్ = నన్ను; రక్షించుట = రక్షించుట; పరమ = ఉత్తమమైన; ధర్మము = ధర్మము; నీవున్ = నీవు; విద్వాంసుడవు = పండితుడవు; నీ = నీకు; ఎఱుంగని = తెలియని; అర్థంబున్ = విషయము; కలదే = ఉందా ఏమి; నీవంటి = నీలాంటి; మహానుభావులు = గొప్పవారు; అయిన = అయినట్టి; సత్ = మంచి; పురుషులు = పురుషులు; ఆర్తులు = బాధ చెందినవారు; ఐనవారి = అయినవారి; కోర్కులు = కోరికలు; వ్యర్థంబులు = వ్యర్థము; కాకుండగ = అయిపోకుండగ; తీర్చుటన్ = తీర్చుట; ధర్మంబు = ధర్మము; అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఈవిధముగా; అనియెన్ = పలికెను.

భావము:

అంతేకాకుండా నా సవతులు అందరు నీ కృపవల్ల గర్భవతులై ఎంతో సంతోషంతో ఉన్నారు. నేనే శోకంతో వ్యాకులమైన మనస్సుతో అలమటిస్తున్నాను. ఆర్తురాలనైన నన్ను రక్షించటం నీకు పరమ ధర్మము. నీవు విద్వాంసుడవు, నీకు తెలియని విషయాలు ఏమీ లేవు. నీ వంటి సత్పురుషులైన మహానుభావులకు నా వంటి ఆర్తులను, రక్షించి వారి కోరికలు సఫలం చేయటం పరమ ధర్మం కదా.” అని మళ్ళీ ఇలా అన్నది.