పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి

  •  
  •  
  •  

3-437.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దాసజనకోటి కతిసౌఖ్యదాయకములు
వితత కరుణాసుధాతరంగితము లైన
నీ కటాక్షేక్షణములచే నెఱయ మమ్ముఁ
జూచి సుఖులను జేయవో సుభగచరిత!"

టీకా:

పంకజోదర = విష్ణుమూర్తి {పంకజోదరుడు - పంకజము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; నీవు = నీవు; అపార = అపారమైన; కర్ముండవు = కర్మములు కలవాడవు; భవదీయ = నీ యొక్క; కర్మా = చేయుపనులు అను; అబ్ధిన్ = సముద్రము యొక్క; పారమున్ = అంతుదరి, అవధులు; అరయన్ = తరచిచూసి; ఎఱిగెదన్ = తెలియుదును; అని = అని; మదిన్ = మనసులోన; ఇచ్చగించినవాడు = అనుకొనువాడు; పరికింపగన్ = పరిశీలించినచో; మతిభ్రష్టు = మతిపోయినవాడు, పిచ్చివాడు; కాకన్ = కాకుండగా; విజ్ఞానియే = తెలివైనవాడా ఏమి; చూడన్ = తరచి చూసినచో; విశ్వంబున్ = విశ్వము; నీ = నీ యొక్క; యోగమాయ = యోగమాయ అను; పయోనిధిన్ = సముద్రములో {పయోధి - నీరు కి నిధి వంటిది, సముద్రము}; మగ్నము = మునిగినది; ఔటన్ = అగుట వలన; తెలిసియున్ = తెలుస్తున్నప్పటికిని; తమ = తమ; బుద్ధిన్ = మనసులో; తెలియని = తెలియని; మూఢులన్ = మూర్ఖులను; ఏమనన్ = ఏమనవలెను; అఖిలలోకేశ్వరేశ = విష్ణుమూర్తి {అఖిలలోకేశ్వరేశ్వరుడు - సమస్తమైన లోకపాలకును ప్రభువు యైనవాడు, విష్ణువు}; దాస = దాసులు అయిన; జన = జనుల; కోటి = సమూహమున; కున్ = కు; అతి = మిక్కిలి; సౌఖ్య = సౌఖ్యమును; దాయకములు = ఇచ్చునవి; వితత = విస్తారమైన; కరుణా = దయతో కూడిన; సుధా = అమృతపు; తరంగితములు = తొణుకుచున్నవి; ఐన = అయినట్టి; నీ = నీ; కటాక్షములన్ = కటాక్షముల; చేన్ = చేత; నెఱయన్ = నిండుగా; మమ్మున్ = మమ్ములను; చూచి = చూసి; సుఖులను = సుఖముగ ఉండువారను; చేయవో = చేయుము; సుభగచరిత = సౌభాగ్యకరమైన ప్రవర్తన కలవాడ.

భావము:

వరాహా! దామోదరా! అఖిల లోక పాలకులకు ఈశ్వరుడు అయిన వాడా! మంగళ చరిత్రా! లోక కల్యాణం కోసం నీవు చేసే కార్యాలు అనంతాలు. “మహాసముద్రంవంటి వాటి అంతు తెలుసుకుంటాను.” అని అనుకునేవాడు మతి లేనివాడూ, అజ్ఞానీ అవుతాడు గాని విజ్ఞాని కాడు. ఈ సమస్త ప్రపంచం నీ యోగమాయా సముద్రంలో విలీనం అయి ఉందన్న సంగతి తెలిసి కూడా నీ ప్రభావాన్ని తెలియని మందబుధ్దులను ఏమనాలి. నీ చరణ దాసులకు సర్వదా సమధిక సౌఖ్యాన్ని కలిగించేవి, అపారమైన కరుణ అనే అమృత తరంగాలు పొంగిపొరలే నీ కడగంటి చూపులతో మమ్మల్ని చక్కగా చూసి సుఖసంతోషాలను అనుగ్రహించు.”