పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి

  •  
  •  
  •  

3-436-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వభవస్థితిప్రళయ వేళల యందు వికారసత్త్వమున్
విశ్వము నీవ యై నిఖిల విశ్వము లోలి సృజింతు విందిరా
ధీశ్వర! యీశ! కేశవ! త్రయీమయ! దివ్యశరీర! దేవ! నీ
శాశ్వతలీల లిట్టి వని న్నుతిసేయఁగ మాకు శక్యమే?

టీకా:

విశ్వ = విశ్వమునకు; భవ = సృష్టి; స్థితి = స్థితి; ప్రళయ = లయ; వేళలు = సమయముల; అందున్ = లో; వికార = మార్పులు పొందు; సత్త్వమున్ = సామర్థ్యమును; విశ్వమున్ = విశ్వము; నీవ = నీవే; ఐ = అయి; నిఖిల = సమస్తమైన; విశ్వములు = భువనములును; ఓలిన్ = క్రమబద్ధముగ; సృజింతువు = సృష్టించెదవు; ఇందిరాధీశ్వర = విష్ణుమూర్తి {ఇందిరాధీశ్వరుడు - ఇందిర (లక్ష్మీదేవి) అధీశ్వర (భర్త) అయినవాడు, విష్ణువు}; ఈశ = విష్ణుమూర్తి {ఈశుడు - ప్రభావము చూపకల వాడు, విష్ణువు}; కేశవ = విష్ణుమూర్తి {కేశవుడు - మంచి కేశములు కలవాడు, విష్ణువు}; త్రయీమయిదివ్యశరీర = విష్ణుమూర్తి {త్రయీమయ దివ్యశరీర - త్రయి (వేద) మయమైన దివ్య దేహము కలవాడు, వరాహమూర్తి, విష్ణువు}; దేవ = విష్ణుమూర్తి; నీ = నీ యొక్క; శాశ్వత = శాశ్వతములైన; లీలలు = లీలలు; ఇట్టివి = ఇటువంటివి; అని = అని; సన్నుతిన్ = సంస్తుతి; చేయగన్ = చేయుటకు; మాకు = మాకు; శక్యమే = శక్యమా ఏమి.

భావము:

ఓ రమావల్లభా! ఈశ్వరా! కేశవా! వేదమయా! దివ్య స్వరూపా! దేవదేవా! ఈ ప్రపంచం సృష్టించేది, రక్షించేదీ, లయంచేసేదీ నీవే. సర్వమూ నీవే అయి ఈ సమస్త లోకాలనూ మళ్ళీమళ్ళీ సృష్టిస్తున్నావు. అంతులేని నీ లీలలు “ఇటువంటివి” అని వర్ణించడం మా వల్ల కాదు.