పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : చతుర్యుగ పరిమాణంబు

  •  
  •  
  •  

3-361-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పూర్వార్ధాదినిం గలిగిన బ్రహ్మకల్పంబుఁ జెప్పితి; ఇంక ద్వితీయ పరార్ధంబు మొదల నెన్నఁ డేని హరి సూకరాకారంబు దాల్చె నది వరాహకల్పం బనం దగు; అట్టి వరాహకల్పం బిపుడు వర్తమానం బగుచున్నది; వెండియు.

టీకా:

పూర్వార్థ = పూర్వార్థము యొక్క; ఆదినిన్ = మొదటి కాలమున; కలిగినన్ = ఏర్పడిన; బ్రహ్మకల్పంబున్ = బ్రహ్మకల్పమును; చెప్పితిన్ = చెప్పతిని; ఇంక = ఇంక; ద్వితీయపరార్థంబున్ = ద్వితీయపరార్థమును; మొదలన్ = మొదటగా; ఎన్నడున్ = ఏనాడు; ఏనిన్ = అయితే; హరి = విష్ణుమూర్తి; సూకర = (ఆది) వరాహము {సూకరము - వరాహము, పంది}; ఆకారంబున్ = ఆకారమును, అవతారమును; తాల్చెన్ = ధరించెనో, అవతరించెనో; అది = అది; వరాహకల్పంబున్ = వరాహకల్పము; అనన్ = అనుటకు; తగున్ = తగును; అట్టి = అటువంటి; వరాహకల్పంబున్ = వరాహకల్పము; ఇపుడు = ఇప్పుడు; వర్తమానంబునన్ = వర్తమానకాలమున; అగుచున్ = జరుగుతూ; ఉన్నది = ఉన్నది; వెండియున్ = ఇంకనూ.

భావము:

పూర్వపరార్ధం ఆది లోని బ్రహ్మ కల్పాన్ని గూర్చి చెప్పాను విన్నావు కదా; ఇక ద్వితీయపరార్ధం సంగతి విను. ఈ ద్వితీయపరార్ధం మొదట్లో హరి వరాహ రూపాన్ని ఎప్పుడు ధరిస్తాడో అది వరాహకల్పం అంటారు. అటువంటి వరాహకల్పం ఇప్పుడు జరుగుతూ ఉంది.