పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మ మానస సర్గంబు

  •  
  •  
  •  

3-335-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారిజసంభవుండు బుధవంద్యుఁడు చిత్తమునం దలంచె దై
త్యారిఁ బయోవిహారి సముదంచితహారి నతాఖిలామృతా
హారి రమాసతీహృదయహారి నుదారి విదూరభూరిసం
సారి భవప్రహారి విలన్నుతసూరి నఘారి నయ్యెడన్.

టీకా:

వారిజసంభవుండు = బ్రహ్మదేవుడు {వారిజసంభవుండు - వారిజ (పద్మము)న పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు}; బుధవంద్యుడు = బ్రహ్మదేవుడు {బుధవంద్యుడు - బుధులచే నమస్కరింపబడువాడు, బ్రహ్మదేవుడు}; చిత్తమునన్ = మనసులో; తలంచెన్ = స్మరించెను; దైత్యారిన్ = విష్ణుని {దైత్యారి - రాక్షసులకు శత్రువు, విష్ణువు}; పయోవిహారిన్ = విష్ణుని {పయోవిహారి - జలములలో విహరించువాడు, విష్ణువు}; సముదంచితహారిన్ = విష్ణుని {సముదంచితహారి - చక్కగా ఒప్పుచున్న హారములు ధరించిన వాడు, విష్ణువు}; నతాఖిలామృతాహారిన్ = విష్ణుని {నతాఖిలామృతాహారి - నమస్కరిస్తున్న సమస్త దేవతలు (అమృతాహారులు) కలవాడు, విష్ణువు}; రమాసతీహృదయహారిన్ = విష్ణుని {రమాసతీహృదయహారి - రమాసతి (లక్ష్మీదేవి) హృదయమునకు మనోహరుడు, విష్ణువు}; ఉదారిన్ = విష్ణుని {ఉదారి - ఉదారమైన స్వభావము కలవాడు, విష్ణువు}; విదూరభూరిసంసారిన్ = విష్ణుని {విదూరభూరిసంసారి - మిక్కిలి దూరముగా ఉంచబడిన భయంకరమైన సంసారము కలవాడు, విష్ణువు}; భవప్రహారిన్ = విష్ణుని {భవప్రహారి - భవ (సంసార) బంధములను తెగగొట్టువాడు, విష్ణువు}; విలసన్నుతసూరిన్ = విష్ణుని {విలసన్నుతసూరిన్ - విలసత్ (చక్కగా) న్నుత (కీర్తించు) సూరి (జ్ఞానులు) కలవాడు, విష్ణువు}; అఘారిన్ = విష్ణుని {అఘారి - అఘము (పాపము)లను హరించువాడు, విష్ణువు}; ఆ = ఆ; ఎడన్ = సమయమున.

భావము:

పద్మసంభవుడు, జ్ఞానులకు వందనీయుడు అయిన బ్రహ్మ, అప్పుడు తన హృదయంలో రాక్షసులకు శత్రువైన వాడూ, జలాలలో విహరించువాడూ, అందమైన హారాలు ధరించువాడూ, సమస్త దేవతల చేత నమస్కరించబడేవాడూ, లక్ష్మీదేవి హృదయాన్ని పొందినవాడూ, బహు ఉదారుడూ, సంసారదుఃఖాలను దూరం చేసేవాడూ, భవబంధాలను త్రెంచువాడూ, విద్వాంసులు వినుతించేవాడు, పాపాలను పటాపంచలు గావించేవాడూ అయిన భగవంతుణ్ణి తన మనస్సులో ధ్యానించాడు.