పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మ మానస సర్గంబు

  •  
  •  
  •  

3-332-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని చెప్పిన మైత్రేయునిఁ
నుఁగొని విదురుండు పలికెఁ డు ముదమొప్పన్
"జనుత! నలినదళాక్షుఁడు
నినం బద్మజుఁడు దేహసంబంధమునన్.

టీకా:

అని = అని; చెప్పి = చెప్పి; మైత్రేయునిన్ = మైత్రేయుడిని; కనుగొని = చూసి; విదురుండు = విదురుడు; పలికెన్ = పలికెను; కడు = మిక్కిలి; ముదము = సంతోషము; ఒప్పన్ = ఒప్పునట్లు; జననుత = జనులచే కీర్తింపబడువాడ; నలినదళాక్షుడు = విష్ణుమూర్తి {నలినదళాక్షుడు - నలినము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; చనినన్ = వెళ్ళిన పిమ్మట; పద్మజుడు = బ్రహ్మదేవుడు {పద్మజుడు - పద్మమున పుట్టినవాడు}; దేహ = శరీరములకు; సంబంధమున్ = సంబంధించినదియును.

భావము:

ఇలా చెప్పిన మైత్రేయుడితో విదురుడు ఎంతో సంతోషంగా ఇలా చెప్పసాగాడు. “మైత్రేయా! నీవు సర్వ మానవజాతికి వందనీయుడవు. విష్ణువు అంతర్థానమైన అనంతరం బ్రహ్మదేవుడు దేహ సంబంధంతో ఎలా సృష్టి నడిపాడు.

3-333-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మాససంబంధంబును
బూనిన యీ సర్గ మెట్లు పుట్టించె దయాం
భోనిధివై నా కింతయు
మానుగఁ నెఱిఁగింప వయ్య హితవిచారా! "

టీకా:

మానస = మనసునకు; సంబంధంబునున్ = సంబంధించినదియును; పూనిన = ధరించిన; ఈ = ఈ; సర్గమున్ = సృష్టిని; ఎట్లు = ఏ విధముగ; పుట్టించెన్ = సృష్టించెను; దయా = దయకు; అంభోనిధివి = సముద్రము వంటి వాడవు {అంబోనిధి - నీటికి నిధివంటిది, సముద్రము}; ఐ = అయి; నాకున్ = నాకు; ఇంతయున్ = ఇదంతయును; మానుగన్ = మనోజ్ఞముగా; ఎఱిగింపు = తెలుపుము; అయ్య = తండ్రి; మహిత = మహిమాన్వతమైన; విచార = విచక్షణము కలవాడ.

భావము:

మరియు అమోఘమైన చింతనలు గలవాడా! దయాసముద్రుడా! మైత్రేయా! ఇంకా బ్రహ్మదేవుడు మానస సంబంధంతో ఈ సృష్టిని ఏవిధంగా చేసాడు. ఇదంతా నాకు చక్కగా వివరించి చెప్పు.”

3-334-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనవుడు, నమ్మునివరేణ్యుండు విదురున కిట్లనియెఁ "బుండరీకాక్ష వరదాన ప్రభావంబునం బంకజాసనుండు శత దివ్యవత్సరంబులు భగవత్పరంబుగాఁ దపంబుఁ గావించి, తత్కాలవాయువుచేఁ గంపితం బగు నిజనివాసం బయిన పద్మంబున వాయువును జలంబులను గనుంగొని, యాత్మీయ తపశ్ఛక్తిచేత నభివృద్ధిం బొందిన విద్యాబలంబున వాయువులు బంధించి తోయంబులతోడ నొక్క తోయంబు సమస్తంబునుం గ్రోలి, యంత గగనవ్యాప్తి యగు జలంబును గనుంగొని.

టీకా:

అనవుడున్ = అనగా; ఆ = ఆ; ముని = మునులలో; వరేణ్యుండు = శ్రేష్ఠుడు; విదురున = విదురుని; కున్ = కి; ఇట్లు = ఈవిధముగా; అనియెన్ = పలికెను; పుండరీకాక్ష = విష్ణుని {పుండరీకాక్షడు - పుండరీకము (పద్మము)ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; వర = వరము; దాన = ఇచ్చిన; ప్రభావంబునన్ = ప్రభావము వలన; పంకజాసనుండు = బ్రహ్మదేవుడు {పంకజాసనుడు - పంకజము (పద్మము)న ఆసీనుడు (ఉన్నవాడు), బ్రహ్మదేవుడు}; శత = నూరు; దివ్యవత్సరంబులు = దివ్యసంవత్సరములు; భగవత్ = విష్ణుమూర్తికి {భగవంతుడు - మహిమాన్వితుడు, విష్ణువు}; పరంబుగా = సమర్పణంబుగా; తపంబున్ = తపస్సును; కావించి = చేసి; తత్ = ఆ; కాల = సమయమందలి; వాయువు = వాయువు; చేన్ = చేత; కంపితంబు = కంపించునది; అగు = అయిన; నిజ = తన; నివాసంబున్ = నివసించుస్థలము; అయిన = అయిన; పద్మంబునన్ = పద్మములో; వాయువునున్ = వాయువును; జలంబునున్ = జలములను; కనుంగొని = కనుగొని; ఆత్మీయ = స్వంత; తపస్ = తపస్సు యొక్క; శక్తి = శక్తి; చేతన్ = చేత; అభివృద్ధిన్ = అభివృద్ధిని; పొందినన్ = సాధించిన; విద్యా = విద్య యొక్క; బలంబునన్ = బలముతో; వాయువులు = వాయువులు; బంధించి = బంధించి; తోయంబులన్ = తోయముల; తోడన్ = తోబాటు; ఒక్క = ఒక; తోయంబు = సారిగా; సమస్తంబునున్ = అంతటిని; క్రోలి = తాగి; అంతన్ = అంతట; గగన = ఆకాశమంతా; వ్యాప్తిన్ = వ్యాపించినది; అగు = అయిన; జలంబున్ = జలములను; కనుంగొని = చూసి.

భావము:

బ్రహ్మదేవుని మానస, దైహిక సృష్టుల గురించి అడిగిన విదురునితో మునిశ్రేష్ఠుడైన మైత్రేయుడు ఇలా అన్నాడు “పద్మాక్షుడు విష్ణువు ప్రసాదించిన వరాల ప్రభావము వల్ల, బ్రహ్మ వంద దివ్య సంవత్సరములు భగవంతుణ్ణి గూర్చి తపస్సు చేసాడు. అప్పుడు మహావాయువు వీచింది. ఆ గాలికి తన నివాసమైన పద్మం చలించింది. నీరు చలించింది. అది చూసి బ్రహ్మదేవుడు తన తపశ్శక్తిచేత వృధ్దిపొందిన విద్యాబలంతో వాయువును నిరోధించాడు. ఆ మహా జలాన్ని అంతా ఒక్క పర్యాయంగా త్రాగాడు. అనంతరం పైకి చూడగా ఆకాశమంతా నిండిన జలం కనిపించింది.

3-335-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారిజసంభవుండు బుధవంద్యుఁడు చిత్తమునం దలంచె దై
త్యారిఁ బయోవిహారి సముదంచితహారి నతాఖిలామృతా
హారి రమాసతీహృదయహారి నుదారి విదూరభూరిసం
సారి భవప్రహారి విలన్నుతసూరి నఘారి నయ్యెడన్.

టీకా:

వారిజసంభవుండు = బ్రహ్మదేవుడు {వారిజసంభవుండు - వారిజ (పద్మము)న పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు}; బుధవంద్యుడు = బ్రహ్మదేవుడు {బుధవంద్యుడు - బుధులచే నమస్కరింపబడువాడు, బ్రహ్మదేవుడు}; చిత్తమునన్ = మనసులో; తలంచెన్ = స్మరించెను; దైత్యారిన్ = విష్ణుని {దైత్యారి - రాక్షసులకు శత్రువు, విష్ణువు}; పయోవిహారిన్ = విష్ణుని {పయోవిహారి - జలములలో విహరించువాడు, విష్ణువు}; సముదంచితహారిన్ = విష్ణుని {సముదంచితహారి - చక్కగా ఒప్పుచున్న హారములు ధరించిన వాడు, విష్ణువు}; నతాఖిలామృతాహారిన్ = విష్ణుని {నతాఖిలామృతాహారి - నమస్కరిస్తున్న సమస్త దేవతలు (అమృతాహారులు) కలవాడు, విష్ణువు}; రమాసతీహృదయహారిన్ = విష్ణుని {రమాసతీహృదయహారి - రమాసతి (లక్ష్మీదేవి) హృదయమునకు మనోహరుడు, విష్ణువు}; ఉదారిన్ = విష్ణుని {ఉదారి - ఉదారమైన స్వభావము కలవాడు, విష్ణువు}; విదూరభూరిసంసారిన్ = విష్ణుని {విదూరభూరిసంసారి - మిక్కిలి దూరముగా ఉంచబడిన భయంకరమైన సంసారము కలవాడు, విష్ణువు}; భవప్రహారిన్ = విష్ణుని {భవప్రహారి - భవ (సంసార) బంధములను తెగగొట్టువాడు, విష్ణువు}; విలసన్నుతసూరిన్ = విష్ణుని {విలసన్నుతసూరిన్ - విలసత్ (చక్కగా) న్నుత (కీర్తించు) సూరి (జ్ఞానులు) కలవాడు, విష్ణువు}; అఘారిన్ = విష్ణుని {అఘారి - అఘము (పాపము)లను హరించువాడు, విష్ణువు}; ఆ = ఆ; ఎడన్ = సమయమున.

భావము:

పద్మసంభవుడు, జ్ఞానులకు వందనీయుడు అయిన బ్రహ్మ, అప్పుడు తన హృదయంలో రాక్షసులకు శత్రువైన వాడూ, జలాలలో విహరించువాడూ, అందమైన హారాలు ధరించువాడూ, సమస్త దేవతల చేత నమస్కరించబడేవాడూ, లక్ష్మీదేవి హృదయాన్ని పొందినవాడూ, బహు ఉదారుడూ, సంసారదుఃఖాలను దూరం చేసేవాడూ, భవబంధాలను త్రెంచువాడూ, విద్వాంసులు వినుతించేవాడు, పాపాలను పటాపంచలు గావించేవాడూ అయిన భగవంతుణ్ణి తన మనస్సులో ధ్యానించాడు.

3-336-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్లు దలఁచి సరోజజుం డంబుజమును
గనతలమునఁ జూచి యా మలకోశ
లీమై యున్న లోకవితాములను
నొయ్యఁ బొడఁగని హరిచే నియుక్తుఁ డైన.

టీకా:

అట్లు = ఆ విధముగ; తలచి = స్మరించి; సరోజజుండు = బ్రహ్మదేవుడు {సరోజజుడు - సరోజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; అంబుజమును = పద్మమును {అంబుజము - అప్పు (నీటి)లో పుట్టునది, పద్మము}; గగన = ఆకాశ; తలంబున్ = భాగమున; చూచి = చూసి; ఆ = ఆ; కమల = కమలము యొక్క; కోశ = మొగ్గ; లీనము = లోనిమిడినవి; ఐ = అయి; ఉన్న = ఉన్నట్టి; లోక = లోకముల; వితానములనున్ = సమూహములను; ఒయ్యన్ = అవశ్యము; పొడగని = చూసి; హరి = విష్ణుని {హరి - బాధలను హరించువాడు, విష్ణువు}; చేన్ = చే; నియుక్తుడు = నియమింపబడినవాడు; ఐన = అయిన.

భావము:

ఇలా ధ్యానించిన పద్మభవుడైన బ్రహ్మదేవుడికి ఆకాశంలో ఒక పద్మం కనిపించింది. ఆ తామర రేకులలో దాగి ఉన్న లోకాలన్నీ కనిపించాయి. అప్పుడు బ్రహ్మ తాను శ్రీహరిచే నియమింపబడినవాడ నని భావించాడు.

3-337-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వానిఁగాఁ దన్నుఁ దలఁచి యవ్వనరుహంబు
లోపలికిఁ బోయి మున్నందులోన నున్న
ముజ్జగంబులఁ జూచి యిమ్ముల సృజించె
ఱి చతుర్దశ భువనముల్ హిమఁ జేసి.

టీకా:

వానిగాన్ = వానిగా; తన్నున్ = తనను; తలచి = భావించి; ఆ = ఆ; వనరుహంబున్ = పద్మము {వనరుహము - వనము (నీటి) లో పుట్టినది, పద్మము}; లోపలి = లోపలి; కిన్ = కి; పోయి = వెళ్ళి; మున్ను = ముందే; అందులోనన్ = దానిలోపల; ఉన్న = ఉన్నట్టి; మూడు = మూడు {ముజ్జగములు - భూ భువర్ సువర్ లోకములు - భూమి ఊర్థ్వ అథో లోకములు మూడు}; జగంబులన్ = లోకములను; చూచి = చూసి; ఇమ్ములన్ = చక్కగా, ఇంపుగా; సృజించెన్ = సృష్టించెను; మఱి = మరి; చతుర్దశ = పద్నాలుగు (14) {చతర్దశభువనములు - 1 భూలోకము 2 భువర్లోకము 3 సువర్లోకము 4 మహర్లోకము 5 జనలోకము 6 తపోలోకము 7 సత్యలోకము (ఈ 7 ను ఊర్థ్వలోకములు) 1 అతలము 2 వితలము 3 సుతలము 4 రసాతలము 5 మహాకలము 6 తలాతలము 7 పాతాళము (ఈ 7 ను అధోలోకములు)}; భువనముల్ = లోకములను; మహిమన్ = మహిమ; చేసి = వలన.

భావము:

శ్రీ మహావిష్ణువు అనుజ్ఞ లభించినట్లు గ్రహించిన బ్రహ్మదేవుడు, మెల్లగా ఆ తామరపువ్వు లోనికి ప్రవేశించాడు. మొట్టమొదట అందులో ఉన్న మూడులోకాలనూ అవలోకించాడు. తర్వాత మహత్తరమైన తన శక్తి వినియోగించి, సులువుగా పద్నాలుగు భువనాలను చక్కగా సృష్టించాడు.

3-338-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రఁగ సుధాశన తిర్య
ఙ్న వివిధస్థావరాది నానాసృష్టి
స్ఫుణ నజుం డొనరించెం
రువడి నిష్కామధర్మలరూపమునన్.

టీకా:

పరగన్ = ప్రసిద్ధి చెందునట్లు; సుధాశన = దేవతలు {సుధాశన - సుధ (అమృతము) ను ఆశన (తాగు) వారు, దేవతలు}; తిర్యక్ = జంతువులు {తిర్యక్ – చలనము కలవి, జంతువులు}; నర = నరులు; వివిధ = అనేక రకముల; స్థావర = వృక్షములు {స్థావరములు – చలనము లేనివి, వృక్షాదులు}; ఆది = మొదలగు; నానా = అనేక రకములుగ; సృష్టిన్ = సృష్టిని; స్పురణన్ = తెలియునట్లు, స్పృహతో; అజుండు = బ్రహ్మదేవుడు {అజుడు - జన్మములు లేనివాడు, బ్రహ్మదేవుడు}; ఒనరించెన్ = చేసెను; పరువడి = క్రమముగా; నిష్కామ = కోరికలు లేని; ధర్మ = ధర్మమునకు; ఫల = ఫలితము అయిన; రూపమునన్ = విధముగ.

భావము:

ప్రతిఫలం, ఆశించని తన పరమధర్మానికి, ఫల స్వరూపముగా, దేవతలు, పశు పక్ష్యాదులు, మానవులు ఇంకా అనేక రకాలైన స్ధావరాలు మొదలైన వాటితో కూడిన నానావిధాలైన సృష్టిని క్రమంగా బ్రహ్మదేవుడు కొనసాగించాడు.

3-339-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు భువనంబులఁ బద్మజుండు గల్పించె" నని మైత్రేయుండు విదురున కెఱింగించిన.

టీకా:

ఇట్లు = ఈవిధముగా; భువనంబులన్ = లోకములను; పద్మజుండు = బ్రహ్మదేవుడు {పద్మజుడు - పద్మమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; కల్పించెను = సృష్టించెను; అని = అని; మైత్రేయుండు = మైత్రేయుడు; విదురున్ = విదురుని; కిన్ = కి; ఎఱింగించినన్ = తెలుపగా.

భావము:

ఇలా కమలసంభవుడైన బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించా” డని మైత్రేయుడు విదురునకు చెప్పాడు.

3-340-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విదురుఁడు దురితావనిభృ
ద్భిదురుఁడు మునివరునిఁ జూచి ప్రియము మనమునం
దురఁగ నిట్లని పలికె "న
తి దురంతం బయిన విష్ణుదేవుని మహిమన్.

టీకా:

విదురుడు = విదురుడు; దురిత = పాపములు అను; అవనీభృత్ = పర్వతములను; భిదురుడు = భేదించు, వజ్రాయుధము వంటివాడు; ముని = మునులలో; వరులలో = శ్రేష్ఠుని; చూచి = చూసి; ప్రియము = ప్రేమ; మనమునన్ = మనసులో; కదురగన్ = కలుగగ; ఇట్లు = ఈ విధముగా; అని = అని; పలికెన్ = పలికెను; అతి = మిక్కిలి; దురంతంబున్ = అంతము లేనివి; అయిన = అయిన; విష్ణు = విష్ణువు అను; దేవుని = దేవుడి; మహిమన్ = మహిమతో.

భావము:

విదురుడు కొండలంతగా పేరుకుపోయిన పాపాలను అయినా వజ్రాయుధంలా ఖండించగల వాడు. అప్పుడు, ఆ విదురుడు హృదయంలో పొంగిపొరలే సంతోషంతో మైత్రేయుణ్ణి చూసి మెల్లగా ఇలా అన్నాడు “అంతుచిక్కనిది కదా మహావిష్ణువు మహిమ.

3-341-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మరె భువనంబు లతని కాలాఖ్యతయును
ణుతిసేయు తదీయ లక్షణము లర్థి
నాకు నెఱిఁగింపు మయ్య వివేచరిత!"
నిన మైత్రేయుఁ డవ్విదురుకు ననియె.

టీకా:

అమరెన్ = అమరినవి; భువనంబులు = లోకములు; అతని = అతనిచే సృష్టంపబడిన; కాల = కాలము యొక్క; ఆఖ్యాతయును = స్వభావమును; గణుతిసేయ = లెక్కించు విధానము; తదీయ = దాని; లక్షణముల్ = లక్షణములు; అర్థిన్ = కోరి; నాకున్ = నాకు; ఎఱిగింపుము = తెలుపుము; అయ్య = తండ్రి; వివేకచరిత = వివేకముతో వర్తించువాడ; అనిన = అనగా; మైత్రేయుడు = మైత్రేయుడు; ఆ = ఆ; విదురున్ = విదురుని; కున్ = కి; అనియెన్ = చెప్పెను.

భావము:

వివేకవంతుడవు అయిన మైత్రేయా! ఆ మహావిష్ణువు మహిమ వలననే కదా ఈ లోకాలన్నీ విలసిల్లాయి. అట్టి పరమాత్మ యొక్క కాలస్వరూపాన్నీ, దానిని గణించే విధానాన్ని, దాని లక్షణాలను నాకు విశదీకరించు” అని అడిగాడు. అప్పుడు విదురునితో మైత్రేయుడు ఇలా అన్నాడు.

3-342-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ద్యంతశూన్యంబు వ్యయం బై తగు-
త్త్వ మింతకు నుపాదాన మగుట
గుణవిషయములు గైకొని కాలమును మహ-
దాదిభూతములు దన్నాశ్రయింపఁ
గాలానురూపంబుఁ గైకొని యీశుండు-
న లీలకై తనుఁదా సృజించె
రమొప్ప నఖిల లోము లందుఁ దా నుండుఁ-
నలోన నఖిలంబుఁ నరుచుండుఁ

3-342.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గాన విశ్వమునకుఁ గార్యకారణములు
దాన యమ్మహాపురుషుని నువువలనఁ
బాసి విశ్వంబు వెలియై ప్రభాస మొందె
మానితాచార! యీ వర్తమానసృష్టి.

టీకా:

ఆది = మొదలు; అంత = తుది; శూన్యంబున్ = లేనిది; అవ్యంబున్ = క్షయములేనిది; ఐ = అయ్యి; తగు = తగిన; తత్త్వము = తత్త్వము; ఇంత = దీనంత; కునున్ = కును; ఉపాదానము = ప్రథానకారణము; అగుటన్ = అగుట వలన; గుణ = త్రిగుణముల; విషయములున్ = ఇంద్రియార్థములు; కైకొని = స్వీకరించి; కాలమును = కాలమును; మహత్ = మహత్తు; ఆదిభూతములు = పంచభూతములు; తన్నున్ = తనను; ఆశ్రయింపన్ = ఆశ్రయించగా; కాల = కాలము; అను = అను; రూపంబున్ = రూపమును; కైకొని = స్వీకరించి; ఈశుండు = ఈశ్వరుడు; తన = తన; లీలన్ = లీల; కై = కొరకు; తనున్ = తనను; తాన్ = తాను; సృజించెన్ = సృష్టించెను; కరము = అత్యుత్తమముగ; ఒప్పన్ = ఒప్పునట్లు; అఖిల = సమస్తమైన; లోకములన్ = లోకములు; అందున్ = లోపల; తాన్ = తాను; ఉండున్ = ఉండును; తన = తన; లోనన్ = లోపల; అఖిలంబున్ = సమస్తమును; తనరుచున్ = అతిశయించుచూ; ఉండున్ = ఉండును; కాన = కావున; విశ్వమున్ = భువనమున; కున్ = కు; కార్య = కార్యములును; కారణములున్ = కారణములును; తానన్ = తానేయైవాడు; ఆ = ఆ; మహా = గొప్ప; పురుషునిన్ = పురుషుని; తనువు = శరీరము; వలనన్ = నుండి; పాసి = బయటకువచ్చి; విశ్వంబున్ = విశ్వమునకు; వెలి = వెలుపల ఉండునది; ఐ = అయ్యి; ప్రభాసమున్ = విరాజిల్లుటను; ఒందెన్ = పొందెను; మానిత = మన్నింపదగు; ఆచార = ఆచరణలు కలవాడా; ఈ = ఈ; వర్తమాన = ప్రస్తుతపు; సృష్టిన్ = సృష్టిని.

భావము:

“సదాచారసంపన్నుడవు అయిన విదురా! మొదలు తుది లేనిదీ, తరిగిపోనిదీ అయిన తత్వమే ఈ సృష్టికంతటికి ప్రధాన కారణం. అందువల్ల గుణాలూ, ఇంద్రియార్థాలూ మహత్తూ, పంచభూతాలూ, తన్ను ఆశ్రయించగా, ఈశ్వరుడు కాలానికి అనురూపమైన రూపం ధరించిన వాడై వినోదానికై తనను తాను సృష్టించుకున్నాడు. ఈవిధంగా సృష్టించిన సమస్త లోకాలందూ ఈశ్వరుడు ఉంటాడు. ఆ ఈశ్వరుని యందు సమస్త లోకాలూ ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి విశ్వానికి కార్యము కారణమూ రెండూ తానే. ఆ పరమపురుషుని శరీరంనుండి విడివడి ఈ విశ్వం విరాజిల్లుచున్నది. ఈవిధంగా వర్తమానసృష్టి ఏర్పడింది.

3-343-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తెఱఁ గొప్ప నఖిల విశ్వముఁ
బురుషోత్తము మాయచేతఁ బుట్టుం బెరుఁగున్
వితింబొందుచు నుండుం
మర్థిన్ భూతభావికాలము లందున్.

టీకా:

తెఱగున్ = చక్కని క్రమత్వము; ఒప్పన్ = ఒప్పునట్లు; అఖిల = సమస్త; విశ్వమున్ = విశ్వము; పురుషోత్తమున్ = పురుషోత్తముని; మాయ = మాయ; చేతన్ = చేత; పుట్టున్ = పుట్టును; పెరుగున్ = పెరుగును; విరతిన్ = నాశమును, మరణమును; పొందుచున్ = పొందుతూ; ఉండున్ = ఉండును; కరము = మిక్కిలి; అర్థిన్ = కుతూహలముగా; భూత = జరిగిపోయిన; భావి = జరుగబోవు; కాలములున్ = కాలములు; అందున్ = లోనను.

భావము:

పురుషోత్తముని మాయ వలన, ఈ జగత్తు అంతా ఒక క్రమంలో పుట్టి, పెరిగి నశిస్తూ ఉంటుంది. ఇలాగే పూర్వకాలంలో జరిగింది. భవిష్యత్కాలంలో కూడ ఇదే విధంగా జరుగుతుంది.

3-344-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి సర్గంబు నవవిధం; బందుఁ బ్రాకృత వైకృతంబులు గాల ద్రవ్య గుణంబులను త్రివిధం బగు భేదంబుచేఁ బ్రతిసంక్రమంబు లగుచు నుండు; అందు మహత్తత్త్వంబు ప్రథమసర్గంబు; అది నారాయణ సంకాశంబున గుణవైషమ్యంబునం బొందు; ద్రవ్య జ్ఞాన క్రియాత్మకంబైన యహంకారతత్త్వంబు ద్వితీయసర్గంబు; శబ్ద స్పర్శ రూప రస గంధంబు లను పంచతన్మాత్ర ద్రవ్యశక్తి యుక్తియుక్తంబైన పృథివ్యాది భూతసర్గంబు మూడవది యై యుండు; జ్ఞానేంద్రియంబు లైన త్వక్చక్షుశ్శ్రోత్ర జిహ్వాఘ్రాణంబులుఁ, గర్మేంద్రియంబు లైన వాక్పాణి పాద పాయూపస్థములు నను దశవిధేంద్రియ జననంబు చతుర్థసర్గంబు; సాత్వికాహంకార జనితం బైన సుమనోగణసర్గం బైదవ సర్గం బై యొప్పు; అది మనోమయంబై యుండు; జీవలోకంబునకు నబుద్ధికృతంబు లైన యావరణవిక్షేపంబులం జేయు తామససర్గం బాఱవ దై యుండు; ఇయ్యాఱు నీశ్వరునకు లీలార్థంబు లయిన ప్రాకృతసర్గంబు లయ్యె; ఇంక వైకృతసర్గంబు లేడవది మొదలుగాఁ గలుగు నవి వినిపింతు వినుము; పుష్పోత్పత్తి రహితంబు లై ఫలించెడు నశ్వత్థోదుంబర పనస న్యగ్రోధాదు లైన వనస్పతులును, బుష్పితంబు లైన ఫలపాకాంతంబు లయిన వ్రీహి యవ ముద్గా ద్యోషధులును, నారోహణానపేక్షంబు లయిన మాలతీ మల్లి కాది లతలును, ద్వక్సారంబు లైన వేణ్వాదులును, గఠినీభూత మూలంబులును, శిఖావిస్తృతంబులు నగు లతా విశేషరూపంబు లైన వీరుధంబులును, బుష్పవంతంబు లయి ఫలప్రాప్తంబు లగు చూతాది ద్రుమంబులును, నవ్యక్తచైతన్యంబులు నూర్ధ్వస్రోతంబులు నంతస్స్సర్గంబులుఁ దమఃప్రాయంబులు నై స్థావరంబు లయిన యీ యాఱు నేడవ సర్గం బయ్యె; ఎనిమిదవ సర్గం బిరువదియెనిమిది భేదంబులు గలిగి శ్వస్తనాది జ్ఞానశూన్యంబు లై యాహారాది జ్ఞానమాత్ర నిష్ఠంబు లయి ఘ్రాణంబువలన నెఱుంగం దగినవాని నెఱుంగుచు హృదయంబున దీర్ఘానుసంధాన రహితంబు లై వర్తించు ద్విశఫంబులు గల వృషభ మహిషాజ కృష్ణ సూకరోష్ట్ర గవయ రురు మేష ముఖర నవకంబును, నేక శఫంబు గల ఖరాశ్వశ్వతర గౌర శరభ చమర్యాది షట్కంబును, బంచనఖంబులు గల శునక సృగాల వృక వ్యాఘ్ర మార్జాల శశ శల్యక సింహ కపి గజ కూర్మ గోధా ముఖ భూచర ద్వాదశకంబును, మకరాది జలచరంబులును, గంక గృధ్ర బక శ్యేన భాస భల్లూక బర్హి హంస సారస చక్రవాక కాకోలూ కాది ఖేచరంబులును, మొదలుగాఁ గలది తిర్యక్సర్గం బయ్యె; అర్వాక్స్రోతం బై యేకవిధం బగు మానుషసర్గంబు రజోగుణ ప్రేరితంబై కర్మకరణదక్షంబై దుఃఖం బందును సుఖంబు గోరును; ఇది తొమ్మిదవ సర్గం బనం దగు; ఈ త్రివిధసర్గంబులు వైకృతసర్గంబు లనంబడు; ఇంక దేవసర్గంబు వినుము; అదియు నెనిమిది తెఱంగులు గలిగి యుండు; అందు విబుధ పితృ సురాదులు మూఁడును, గంధర్వాప్సరస లొకటియు, యక్ష రక్షస్సు లేకంబును, భూత ప్రేత పిశాచంబు లొకటియు, సిద్ధ చారణ విద్యాధరు లేకంబును, కిన్నర కింపురుషు లొకటియుంగా దేవసర్గం బయ్యె; ఇట్టి బ్రహ్మనిర్మితంబు లైన దశవిధసర్గంబులు నెఱింగించితి; ఇంక మనువులం దదంతరంబుల నెఱింగించెద; కల్పాదుల యందు నీ ప్రకారంబున స్వయంభూతుండును, నమోఘసంకల్పుండును నగు నప్పుండరీకాక్షుండు రజోగుణయుక్తుం డై స్రష్ట యగుచు స్వస్వరూపం బయిన విశ్వంబు నాత్మీయ సామర్థ్యంబునం గల్పించె; అ య్యీశ్వరుని మాయావ్యాపారంబులచే నీ సృష్టి యందు నద్యావర్తంబులం బడి భ్రమించుచున్న మహీరుహంబులుం బోలెఁ, బూర్వాపరాభావంబు లెఱుంగంబడకుండ నీ కల్పంబు నందుండు దేవాసురాదులు ప్రతి మన్వంతరంబు నందును నిట్ల నామరూపంబులచే నిర్దేశింపబడుదురు; మఱియు నిందొక్క విశేషం బెఱింగించెదఁ; గౌమారసర్గం బను నది దేవసర్గాంతర్భూతం బయ్యును బ్రాకృత వైకృతోభయాత్మకం బై దైవత్వ మనుష్యత్వ రూపం బైన సనత్కుమారాది సర్గం బనంబడె; అమోఘసంకల్పుం డైన పుండరీకాక్షుండు తనుఁదాన యిట్లు విశ్వభేదంబును గల్పించె;" అని మైత్రేయుండు విదురునకుఁ జెప్పి కాలలక్షణం బెఱింగించువాఁ డై యిట్లనియె.

సర్గ / సృష్టి భేదములు

టీకా:

అట్టి = అటువంటి; సర్గంబున్ = సృష్టిని; నవ = తొమ్మిది; విధంబున్ = విధములు {నవవిధసృష్టి - ప్రాకృతసృష్టి (1 మహత్తు 2 అహంకారము 3 భూతసృష్టి 4 ఇంద్రియసృష్టి 5 దేవగణ 6 తామససృష్టి) మరియు వైకృతసృష్టి (7 స్ఠావరములు 8 తిర్యక్కులు 9 ఆర్వాక్ స్రోతము (నరులు))}; అందున్ = అందు; ప్రాకృత = ప్రాకృతములు (6రకములు); వైకృతంబులున్ = వైకృతములును (3రకములు); కాల = కాలము; ద్రవ్య = ద్రవ్యము; గుణంబులు = గుణములు; అను = అనే; త్రి = మూడు; విధంబున్ = విధములు {త్రివిధసృష్టి - 1 కాలము 2 ద్రవ్యము 3 గుణము అను ఒకదాని పైనొకటి ఆధారపడు మూడు విధములు అయిన సృష్టి}; అగు = అయిన; భేదంబున్ = భేదముల; చేన్ = చేత; ప్రతి = ఒకదాని యందొకటి; సంక్రమంబులు = సంక్రమించునవి; అగుచున్ = అవుతూ; ఉండున్ = ఉండును; అందు = అందు; మహతత్త్వంబు = మహతత్త్వము; ప్రథమ = ఒకటవ; సర్గంబున్ = సృష్టి; అది = అది; నారాయణ = విష్ణుని {నారాయణుడు - నారములు (నీరు) యందు ఉండువాడు, విష్ణువు}; సంకాశంబునన్ = ప్రకాశమున; గుణ = గుణములలో; వైషమ్యంబునున్ = భేదములను; పొందున్ = పొందును; ద్రవ్య = ద్రవ్యము; జ్ఞాన = జ్ఞానము; క్రియా = క్రియలు అనెడి; ఆత్మకంబున్ = రూపములు కలది; ఐన = అయిన; అహంకార = అహంకారము కల; తత్త్వంబున్ = తత్త్వము; ద్వితీయ = రెండవ; సర్గంబున్ = సృష్టి; శబ్ద = శబ్దము; స్పర్శ = స్పర్శము; రూప = రూపము; రస = రుచి; గంధంబులు = వాసనలు; అను = అను; పంచతన్మాత్రలు = ఐదుతన్మాత్రలు; ద్రవ్య = ద్రవ్యము; శక్తి = శక్తి; యుక్తి = యుక్తి, నేర్పు; యుక్తంబున్ = కూడినది; ఐన = అయిన; పృథివి = భూమి {పృథివ్యాది - పంచభూతములు - పృథివి నీరు వాయువు ఆకాశము తేజస్సు}; ఆది = మొదలగు; భూత = భూతముల; సర్గంబున్ = సృష్టి; మూడవది = మూడవది; ఐ = అయి; ఉండున్ = ఉండును; జ్ఞానేంద్రియంబులు = (పంచ) జ్ఞానేంద్రియములు; ఐన = అయిన; త్వక్కు = చర్మము; చక్షు = కళ్ళు; శ్రోత్ర = చెవులు; జిహ్వ = నాలుక; ఘ్రాణంబులున్ = ముక్కు లును; కర్మేంద్రియంబులు = (పంచ) కర్మేంద్రియములు; ఐన = అయిన; వాక్ = నోరు; పాణి = చేతులు; పాద = పాదములు; పాయు = గుదము; ఉపస్థములున్ = మర్మావయవము లును; అను = అను; దశ = పది; విధ = విధములైన; ఇంద్రియ = ఇంద్రియముల; జననంబున్ = సృష్టి; చతుర్థ = నాలుగవ; సర్గంబున్ = సృష్టి; సాత్వికాహంకార = సాత్వికాహంకారముచే; జనితంబు = పుట్టినవి; ఐన = అయిన; సుమనస్ = దేవ {సుమనోగణములు - దేవగణములు - ఇవి ఇంద్రియ అధిదేవతలు మొదలగునవి}; గణ = గణముల; సర్గంబున్ = సృష్టి; ఐదవ = అయిదవ; సర్గంబున్ = సృష్టి; ఐ = అయి; ఒప్పున్ = ఒప్పి ఉన్నది; అది = అది; మనోమయంబు = మనసున నిండినది; ఐ = అయి; ఉండున్ = ఉండును; జీవ = జీవులు; లోకంబున్ = సమస్తముల; కున్ = కు; అబుద్ధి = అప్రయత్నముగ {అబుద్ధి - బుద్ధికి తెలియకుండగ, అప్రయత్నముగ}; కృతంబులు = చేయబడునవి; ఐన = అయిన; ఆవరణ = ఆచ్ఛాదముల; విక్షేపంబులన్ = కదలికలను; చేయు = చేసెడి; తామస = తమోగుణ పూరిత; సర్గంబున్ = సృష్టి; ఆఱవది = ఆరవది; ఐ = అయి; ఉండున్ = ఉండును; ఈ = ఈ; ఆఱున్ = ఆరును; ఈశ్వరున్ = ఈశ్వరున; కున్ = కు; లీలా = లీలల; అర్థంబున్ = కోసము; అయిన = అయిన; ప్రాకృత = ప్రాకృత; సర్గంబులున్ = సృష్టులు; అయ్యెన్ = అయ్యెను; ఇంక = ఇంక; వైకృత = వైకృత; సర్గంబులున్ = సృష్టులు; ఏడవది = ఏడవది; మొదలుగా = మొదటిదిగా; కలుగునవి = కలుగునవి; వినిపింతు = వినిపించెదను; వినుము = వినుము; పుష్ప = పువ్వులు; ఉత్పత్తి = ఏర్పడుట; రహితంబులు = లేనివి; ఐ = అయి; ఫలించెడు = పండ్లు పండే; అశ్వత్థ = రావిచెట్టు; ఔదంబర = అత్తిచెట్టు, మేడిచెట్టు; పనస = పనసచెట్టు; న్యగ్రోధ = జువ్విచెట్టు; ఆదులు = మొదలగునవి; ఐన = అయిన; వనస్పతులును = వనస్పతులును; పుష్పితంబులు = పువ్వులు పూచునవి; ఐ = అయి; ఫలపాక = పంటకు రాగానే; అంతంబులు = నశించునవి; అయిన = అయిన; వ్రీహి = వరి; యవ = గోధుమ; ముద్గ = పెసలు; ఆది = మొదలగు; ఓషధులును = ఓషధులును; ఆరోహణ = ఎక్కుటకు; అనపేక్షతంబులు = ఆవశ్యకత లేనివి; అయిన = అయినట్టి; మాలతీ = మాలతి; మల్లిక = మల్లిక; ఆది = మొదలగు; లతలునున్ = లతలును; త్వక్ = చర్మము, బెరడు; సారంబులు = గట్టిపడినవి; ఐన = అయిన; వేణువు = వెదురు; ఆదులునున్ = మొదలగునవి; కఠినీభూత = గట్టిపడిన; మూలంబులును = వేళ్ళుకలవియును; శిఖా = శిఖరమున, పైన; విస్తృతంబులును = మిక్కిలి వ్యాపించునవియును; లతా = లతలకు; విశేష = విశేష; రూపంబులు = రూపములు; ఐన = అయిన; వీరుధంబులును = దుబ్బుతీగలును; పుష్పవంతంబులు = పుష్పించునవి; అయి = అయి; ఫల = ఫలములను; ప్రాప్తంబులు = ఇచ్చునవి; అగు = అయిన; చూత = మామిడి; ఆది = మొదలగు; ధ్రుమంబులునున్ = చెట్లును; అవ్యక్త = కనిపించని; చైతన్యంబులున్ = చైతన్యము కలవియును; ఊర్థ్వ = పైవైపునకు; స్రోతంబులు = ప్రాణవాహినులు కలవి; అనంత = అనంతమైన; సర్గంబులున్ = సృజనములు; తమః = తమోగుణ పూరిత; ప్రాయంబులున్ = స్వభావములు కలవి; ఐ = అయి; స్థావరంబులు = స్థావరములు {స్థావరములు – చలనము లేనివి, ఒకే స్థలమున ఉండునవి, వృక్షాదులు}; అయిన = అయిన; ఈ = ఈ; ఆఱున్ = ఆరును; ఏడవ = ఏడవదైన; సర్గంబున్ = సృష్టి; అయ్యెన్ = అయ్యెను; ఎనిమిదవ = ఎనిమిదవ; సర్గంబున్ = సృష్టి; ఇరువదియెనిమిది = ఇరవైఎనిమిది (28); భేదంబులున్ = రకములుగ; కలిగి = ఉండి; శ్వస్తన = రేపు అనే, భవిష్యత్తు; ఆది = మొదలగు; జ్ఞాన = వివేకము; శూన్యంబులు = లేనివి; ఐ = అయి; ఆహార = ఆహారము; ఆది = మొదలగువాని యందలి; జ్ఞాన = వివేకము; మాత్ర = మాత్రమే; నిష్ఠంబులున్ = స్థిరపడినవి; అయి = అయి; ఘ్రాణంబున్ = వాసనలు; వలనన్ = వలన; ఎఱుంగ = తెలుసుకొన; తగినవానిన్ = తగినవానిని; ఎఱుంగుచున్ = తెలియుచూ; హృదయంబునన్ = హృదయములో; దీర్ఘ = ఎక్కువ కాలము; అనుసంధాన = ఒక విషయమును ధరించ గలుగుట; రహితంబులున్ = లేనివి; ఐ = అయి; వర్తించు = తిరుగు; ద్విశఫంబులు = రెండుగా చీలిన గిట్టలు; కల = కలిగిన; వృషభ = ఎద్దు; మహిష = దున్న; అజ = గొఱ్ఱె; కృష్ణ = కృష్ణజింక; సూకర = పంది; ఉష్ట్ర = ఒంటె; గవయ = అడవి ఎద్దు; రురు = నల్లచారలదుప్పి; మేష = మేక; ముఖ = మొదలగు; నవకంబును = తొమ్మిదియును; ఏకశఫంబు = ఏకగిట్ట, చీలనిగిట్ట; కల = కలిగిన; ఖర = గాడిద; అశ్వ = గుఱ్ఱము; అశ్వతర = కంచరగాడిద; గౌర = గౌరమృగము; శరభ = శరభమృగము; చమర = చమరీమృగము; ఆది = మొదలగు; షట్కంబునున్ = ఆరును; పంచ = ఐదు (5); నఖంబులు = గోర్లు; కల = కలిగిన; శునక = కుక్క; సృగాల = నక్క; వృక = తోడేలు; వ్యాఘ్ర = పులి; మార్జాల = పిల్లి; శశ = కుందేలు; శల్యక = ఏదుపంది; సింహ = సింహము; కపి = కోతి; గజ = ఏనుగు; కూర్మ = తాబేలు; గోదా = ఉడుము; ముఖ = మొదలగు; భూచర = భూచరములైన; ద్వాదశకంబును = పండ్రెండును (12); మకర = మొసలి; ఆది = మొదలగు; జలచరంబులును = జలచరములును; కంక = రాబందు; గృధ = గ్రద్ధ; బక = కొంగ; శ్యేన = డేగ; భాస = తెల్లపిట్ట; భల్లూక = ఎలుగు పిట్ట లేక పెద్ద గబ్బిలము; బర్హి = నెమలి; సారస = బెగ్గరు పిట్ట; చక్రవాక = చక్రవాకము, జక్కవపిట్ట; కాక = కాకి; ఉలూక = గుడ్లగూబ; ఆది = మొదలగు; ఖేచరంబులును = పక్షులు {ఖేచరములు - ఆకాశమున తిరుగునవి, పక్షులు}; మొదలుగా = మొదలైనవి; కలది = కలిసి ఉన్నది; తిర్యక్ = జంతువులు {తిర్యక్ - చలనము కలవి, తిరుగునవి, జంతువులు}; సర్గంబు = సృష్టి; అయ్యెన్ = అయ్యెను; అర్వాక్స్రోతంబు = తరువాతిజీవరాశి; ఐ = అయి; ఏకవిధంబున్ = ఒకేరకము; అగు = కలిగిన; మనుష = నరుల; సర్గంబున్ = సృష్టి; రజో = రజస్సు; గుణ = గుణముచే; ప్రేరితంబున్ = ప్రేరింపబడినది; ఐ = అయి; కర్మ = పనులు; కరణ = చేయు; దక్షంబు = సామర్థ్యము కలది; ఐ = అయి; దుఃఖంబున్ = దుఃఖమును; అందున్ = పొందును; సుఖంబున్ = సుఖమును; కోరునున్ = కోరును; ఇది = ఇది; తొమ్మిదవ = తొమ్మిదవ(9); సర్గంబున్ = సృష్టి; అనన్ = అనుటకు; తగు = తగును; ఈ = ఈ; త్రి = మూడు; విధ = రకములగు; సర్గంబులున్ = సృష్టివిధములు; వైకృత = వైకృత; సర్గంబులున్ = సృష్టులు; అనంబడున్ = అనబడుతాయి; ఇంక = ఇంక; దేవసర్గంబున్ = దేవసర్గమును; వినుము = వినుము; అదియునున్ = అదికూడ; ఎనిమిది = ఎనిమిది (8); తెఱంగులు = రకములు; కలిగి = కలిగి; ఉండున్ = ఉండును; అందు = అందు; విబుధ = జ్ఞానదేవతలు; పితృ = పితృదేవతలు; సుర = స్వర్గలోకదేవతలు; మూడును = మూడు (3); గంధర్వ = గంధర్వులు; అప్సరసలు = అప్సరసలు; ఒకటియున్ = ఒకటి (1); యక్ష = యక్షులు; రక్షసులు = రాక్షసులు; ఏకంబునున్ = ఒకటి (1); భూత = భూతములు; ప్రేత = ప్రేతములు; పిశాచంబులున్ = పిశాచములు; ఒకటియున్ = ఒకటి (1); సిద్ధ = సిద్ధులు; చారణ = చారణులు; విధ్యాధరులు = విధ్యాధరులు; ఏకంబునున్ = ఒకటి (1); కిన్నెర = కిన్నెరలు; కింపురుషులు = కింపురుషులు; ఒకటియున్ = ఒకటి (1); దేవసర్గంబున్ = దేవసర్గమును; అయ్యెన్ = అయ్యెను; ఇట్టి = ఇటువంటి; బ్రహ్మ = బ్రహ్మదేవునిచే; నిర్మితంబులు = నిర్మింపబడినవి; ఐన = అయిన; దశ = పది (10); విధ = రకముల; సర్గంబున్ = సృష్టిని; ఎఱింగించితి = తెలియజేసితిని; ఇంక = ఇంక; మనువులన్ = మనువులను; తత్ = వారిలోని; అంతరంబులన్ = భేదములను; ఎఱింగించెదన్ = తెలిపెదను; కల్ప = కల్పముల; ఆదులు = ప్రారంభ సమయములు; అందున్ = అందు; ఈ = ఈ; ప్రకారంబునన్ = విధముగ; స్వయం = స్వయముగా; భూతుండునున్ = పుట్టినవాడును; అమోఘ = తిరుగులేని, వ్యర్థముకాని; సంకల్పుండునున్ = సంకల్పము కలవాడును; అగు = అయిన; ఆ = ఆ; పుండరీకాక్షుండు = విష్ణుమూర్తి {పుండరీకాక్షడు - పుండరీకము (పద్మము)ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; రజోగుణ = రజోగుణముతో; యుక్తుండు = కూడినవాడు; ఐ = అయి; స్రష్ట = సృష్టించువాడు; అగుచున్ = అవుతూ; స్వ = తన; స్వరూపంబున్ = స్వరూపము; అయిన = అయినట్టి; విశ్వంబున్ = భువనములను; ఆత్మీయ = తన యొక్క; సామర్థ్యంబునన్ = సమర్థతతో; కల్పించెన్ = సృష్టించెను; ఆ = ఆ; ఈశ్వరుని = విష్ణుమూర్తి; మాయా = మాయతో కూడిన; వ్యాపారంబునన్ = వ్యవహారములు; చేన్ = చేత; ఈ = ఈ; సృష్టిన్ = సృష్టి; అందున్ = అందు; అద్యావర్తంబులన్ = సుడిగుండములలో; పడి = పడి; భ్రమించుచున్న = తిరుగుచున్న; మహీరుహంబులన్ = వృక్షంబులన్ {మహీరుహంబులు - భూమిన పుట్టునవి, వృక్షములు}; పోలెన్ = వలె; పూర్వా = ముందు; పరంబులు = వెనుకలు; ఎఱుంగంబడకుండన్ = తెలుపబడకుండగ; ఈ = ఈ; కల్పంబున్ = కల్పముల; అందున్ = అందు; ఉండున్ = ఉండే; దేవ = దేవతలు; అసురలు = రాక్షసులు; ఆదులు = మొదలగువారు; ప్రతి = ప్రతి; మన్వంతరంబున్ = మన్వంతరంబు; అందును = లోనూ; ఇట్లు = ఈ విధముగా; నామ = పేర్లు; రూపంబులన్ = రూపముల; చేన్ = చేతనూ; నిర్దేశింపబడుదురు = నిర్ణయింపబడుదురు; మఱియున్ = ఇంకనూ; ఇందు = దీనిలో; ఒక్క = ఒక్క; విశేషంబున్ = విశేషమును; ఎఱింగించెదన్ = తెలిపెదను; కౌమారసర్గంబు = కౌమారసర్గంబు; అనునది = అనునది; దేవసర్గ = దేవసర్గము; అంతర్ = లోని; భూతంబున్ = భాగము; అయ్యును = అయినప్పటికిని; ప్రాకృత = ప్రాకృత; వైకృత = వైకృత; ఉభయ = రెంటిలోను; ఆత్మకంబున్ = కూడినది; ఐ = అయి; దైవత్వ = దేవతల లక్షణములు; మనుష్యత్వ = మనషుల లక్షణములు; రూపంబు = స్వరూపముగా, తమ లక్షణముగా; ఐన = కలిగిన; సనత్కుమారాదిసర్గంబు = సనత్కుమారాదిసర్గంబు; అనంబడెన్ = అనబడును; అమోఘ = వ్యయము కాని, తిరుగులేని; సంకల్పుండు = సంకంల్పము కలవాడు; ఐన = అయిన; పుండరీకాక్షుండు = విష్ణుమూర్తి {పుండరీకాక్షుడు - పుండరీకముల (పద్మముల) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; తనున్ = తనను; తాన = తానే; ఇట్లు = ఈవిధముగా; విశ్వ = విశ్వము యొక్క; భేదంబునున్ = భాగములను; కల్పించెన్ = ఏర్పరచెను; అని = అని; మైత్రేయుండు = మైత్రేయుడు; విదురున్ = విదురున; కున్ = కు; చెప్పి = చెప్పి; కాల = కాలముయొక్క; లక్షణంబున్ = లక్షణములు; ఎఱిగించు = తెలియజేయు; వాడు = వాడు; ఐ = అయి; ఇట్లు = ఈ విధముగా; అనియెన్ = అనెను.

భావము:

{[సంక్షిప్తంగా సృష్టి రకాలు :- బ్రహ్మదేవుడు చేసిన నవ విధ సర్గలుతోపాటు దేవసర్గ కలిసి దశవిధ సర్గలు / సృష్టులు. అందులో నవవిధ సర్గ (1) ప్రాకృత సృష్టులు ఆరు (అవి 1.మహత్తత్వం మొదటి సృష్టి. 2.అహంకారం తత్త్వం రెండవ సృష్టి. 3.పంచభూతాల సృష్టి మూడవది. 4.ఇంద్రియాల పుట్టుక నాలుగవ సృష్టి. 5.ఇంద్రియాధిదేవతల సృష్టి అయిదవది. 6.తామస సృష్టి ఆరవది.) మఱియు (2)వైకృత సృష్టులు మూడు (అవి 7.స్థావరములసృష్టి ఏడవది. 8.తిర్యక్కుల సృష్టి ఎనిమిదవది. 9- ఆర్వాక్ స్రోతము (మానవ) సృష్టి తొమ్మిదవది). ఇవి కాక 10.దేవ సర్గ పదవది)}} అటువంటి సృష్టి తొమ్మిది విధాలు. వాటిలో ప్రాకృతాలు, వైకృతాలు అనేవి రెండు రకాలు. కాలం, ద్రవ్యం, గుణం అనే రకాలు మూడు భేదాలతో ఉంటాయి. అవి పరస్పరం సంకరం అవుతూ ఉంటాయి. వాటిలో మహత్తత్వం మొదటి సృష్టి. ఆది నారాయణుని సమీపంలో గుణభేదాన్ని పొందుతుంది. ద్రవ్య జ్ఞాన క్రియాత్మకమైన అహంకారం తత్త్వం రెండవ సృష్టి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనే పంచ తన్మాత్రల ద్రవ్యశక్తితో కూడిన పృథివి మున్నగు పంచభూతాల సృష్టి మూడవది. జ్ఞానేంద్రియాలైన చర్మం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు మరియు కర్మేంద్రియాలైన నోరు, చేతులు, కాళ్ళు, పాయువు, జననేంద్రియం కలిసి ఈ పది ఇంద్రియాల పుట్టుక నాలుగవ సృష్టి. సాత్వికాహంకారం వలన పుట్టిన దేవతాగణాల సృష్టి అయిదవది. అది కేవలం మనోమయమై ఉంటుంది. సకల ప్రాణులకు అజ్ఞాన కృత్యాలైన ఆవరణ విక్షేపాలు కలిగించే తామస సృష్టి ఆరవది. ఈ ఆరూ భగవంతుని లీలా విలాసాలయిన ప్రాకృత సృష్టులు. ఇక ఏడవదాని నుండి వైకృత సృష్టులను వినిపిస్తాను. విను, పూలు పూయకుండానే ఫలించే రావి, మేడి, పనస, మఱ్ఱి మొదలైన వనస్పతులు, పూచి ఫలించిన వెంటనే నశించే వడ్లు(బియ్యం), యవలు (గోధుమలు), పెసలు మున్నగు ఓషధులు, పైకి ఎగపాకడానికి అవకాశం లేని మాలతి, మల్లె, మొదలైన తీగలు, గట్టి బెరడు కలిగిన వెదుళ్ళు మొదలైనవి, నేలలో దృఢమైన వేళ్ళు కలిగి నేలపై బాగా విస్తరించే లతా విశేషాలైన దుబ్బులు, పొదలూ, పుష్పించి ఫలాలను ఇచ్చే మామిడి మొదలైన వృక్షాలు, అవ్యక్తమైన చైతన్యంతో పైకి పెల్లుబుకుతూ తమోమయాలై లోపల మాత్రమే స్పర్శ జ్ఞానం కలిగినవై కదలి పోలేని ఈ ఆరూ ఏడవ సృష్టి. ఇక ఎమిమిదవ సృష్టితో ఇరవై ఎనిమిది రకాల భేదాలు ఉన్నాయి. రేపు అనే జ్ఞానం లేనివై, ఆహారం మొదలైన వాటి యందు మాత్రమే ఆసక్తి కలవై, వాసన చూసి తెలుసుకోదగిన వాటిని తెలుసుకుంటూ, మనస్సులో పెద్దగా ఆలోచన చేయలేనివై, చీలిన గిట్టలు కలవైన ఎద్దు, ఎనుము, మేక, జింక, పంది, ఒంటె, గురుపోతు, నల్లచారల దుప్పి, పొట్టేలు ఈ తొమ్మిది; చీలని గిట్టలు గలవైన గాడిద, గుఱ్ఱం, కంచరగాడిద, గౌరమృగం, శరభమృగం, చమరీమృగం ఈ ఆరూ; అయిదు గోళ్ళు గలవైన కుక్క, నక్క, తోడేలు, పులి, పిల్లి, కుందేలు, ఏదు పంది, సింహం, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము ఈ పన్నెండు (ఇవన్నీ భూచరాలు) మొసలి మొదలైన జలచరాలూ, రాబందు, గ్రద్ద, కొంగ, డేగ, తెల్లపిట్ట, గబ్బిలం, నెమలి, హంస, బెగ్గురు పక్షి, జక్కవ పిట్ట, కాకి, గుడ్లగూబ, మొదలైన ఆకాశాన సంచరించేవి తిర్యక్కుల సృష్టి ఎనిమిదవది. ఇక తొమ్మిదవది మానవ సృష్టి. ఇది రజోగుణంతో పురికొల్పబడి కర్మలు చేయటంలో నేర్పు కలిగి ఉంటుంది. దుఃఖంలో కూడా సుఖాన్నే కోరుతుంది. ఈ మూడు విధాలైన సృష్టులు వైకృత సృష్టులు. ఇక దేవ సర్గాన్ని గురించి చెప్తాను విను. అది కూడా ఎనిమిది విధాలు. అందులో విబుధులు, పితృదేవతలు,సురాదులు మూడు భేదాలు; గంధర్వులు, అప్సరసలూ, ఒకటీ; యక్షులు, రాక్షసులు, ఒకటీ; భూత, ప్రేత, పిశాచాల ఒకటీ, సిద్ధ చారణ విద్యాధరులు ఒకటీ, కిన్నర కింపురుషులు ఒకటీ; ఈ ఎనిమిది కలిసి దేవ సర్గం అయింది. ఇక మనువులనూ, మన్వంతరాలనూ తెలియజెప్తాను. కల్పారంభంలలో ఇదే విధంగా తన్ను తాను సృజించుకునే వాడూ, మొక్కవోని తలంపు కలవాడూ అయిన మహావిష్ణువు రజోగుణంతో కూడిన వాడై సృష్టికర్త అయి తన స్వరూపమే అయిన విశ్వాన్ని తన సామర్థ్యం వలన కల్పించాడు. ఆ ఈశ్వరుని మాయా విశేషం వలన ఈ సృష్టిలో నదులలోని నీటి సుడులలో పడి తిరిగే చెట్లలాగే ముందు వెనుకలు తెలియకుండా ఉంటాయి. ఈ కల్పంలో ఉన్న దేవతలూ, రాక్షసులూ మొదలైనవారు ఇలాగే ప్రతి మన్వంతరంలోనూ ఆయా నామ రూపాలతో వ్యవహరించబడతారు. ఇందులో మరో విశేషం ఉంది. అదేమిటంటే, కౌమారసర్గం అనేది దేవ సర్గంలో ఒక భాగమే అయినా ప్రాకృత వైకృతాలు రెంటి స్వభావమూ కలది. అందులో దైవత్వం మానుషత్వం కలిసి ఉంటాయి. ఇదే సనత్కుమారాది సర్గం. సఫల సంకల్పుడైన పురుషోత్తముడు తనకు తానే ఈ విధంగా వివిధ భేదాలతో కూడిన విశ్వాన్ని కల్పించాడు.” అని మైత్రేయుడు విదురునికి చెప్పి కాల స్వభావం వివరించాలి అనుకున్నవాడై ఇలా అన్నాడు.