పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మ జన్మ ప్రకారము

  •  
  •  
  •  

3-271-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు భగవత్ప్రోక్తంబును, ఋషిసంప్రదాయానుగతంబునుఁ, బురుషోత్తమ స్తోత్రంబునుఁ, బరమపవిత్రంబును, భవలతాలవిత్రంబును నయిన భాగవతకథాప్రపంచంబు శ్రద్ధాళుండవు భక్తుండవు నగు నీకు నుపన్యసించెద; వినుము.

టీకా:

ఇట్లు = ఈవిధముగ; భగవత్ = భగవంతునిచే; ప్రోక్తంబును = చెప్పబడినదియును; ఋషి = ఋషుల; సంప్రదాయ = సంప్రదాయమును {సంప్రదాయము - తరతరములుగా ఇవ్వబడుచున్నది}; అనుగతంబునున్ = అనుసరించునదియును; పురుషోత్తమ = విష్ణుని {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, విష్ణువు}; స్తోత్రంబునున్ = స్తుతించునదియును; పరమ = మిక్కిలి; పవిత్రంబునున్ = పవిత్రమైనదియును; భవ = సంసారము అను; లతా = తీగలకు; లవిత్రంబునున్ = కొడవలి వంటిదియును; అయిన = అయినట్టి; భాగవత = భాగవతము అను; కథా = కథల యొక్క; ప్రపంచమున్ = మిక్కిలి విస్తార రచనను; శ్రద్ధా ళుండవు = శ్రద్ధ కలవాడవు; భక్తుండవు = భక్తుడవు; అగు = అయినట్టి; నీకున్ = నీకు; ఉపన్యసించెద = వివరముగా చెప్పెదను; వినుము = వినుము.

భావము:

ఇలా భగవంతునిచే చెప్పబడినదీ, ఋషుల సంప్రదాయానుసారంగా అందుబాటులోకి వచ్చినదీ, పురుషోత్తముడైన పుండరీకాక్షుని స్తోత్రం కలదీ, పరమపావన మైనదీ, భవబంధాలను తెగటార్చేదీ ఐన భాగవత కథావిధానాన్ని భక్తుడవూ ఆసక్తుడవూ అయిన నీకు విశదీకరించుతాను. విను.