పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-244-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని చెప్పిన విదురుండు మైత్రేయుం గనుంగొని ముకుళిత హస్తుండును వినమిత మస్తకుండును నగుచుఁ దన మనంబున శ్రీహరిం దలంచుచు వినయవచనరచనుండై యిట్లనియె "మునీంద్రా! భవదీయ వాక్యములచేత నామనంబున నారాయణుండు లోకైకనాథుం డెట్లయ్యె ననియు, శరీరధారి యైన జీవునికిఁ గర్మబంధంబు లేరీతి సంభవించె ననియునుం బొడమిన సంశయంబు నేఁడు నివృత్తం బయ్యె; ఎట్లనిన లోకంబున కీశ్వరుండు హరి యనియు, జీవుండు పరతంత్రుం డనియునుఁ దలంపుదు; నారాయణ భక్తి ప్రభావంబు ప్రాణిగోచరం బైన యవిద్యకు నాశనకారణం బనం దనరుచుండు; నారాయణుండు దనకు నాధారంబు లేక సమస్తంబునకుం దాన యాధారభూతుం డై విశ్వంబుం బొదివి యందుఁ దా నుండు తెఱం గెట్లు; శరీరాభిమానంబును బొంది యెవ్వఁడు మూఢతముం డై సంసారప్రవర్తకుం డగు; నెవ్వండు భక్తిమార్గంబునఁ బరమాత్ముం డైన పుండరీకాక్షునిఁ జెందు; వీర లిద్దఱును సంశయ క్లేశంబులు లేమింజేసి సుఖానంద పరిపూర్ణులై యభివృద్ధి నొందువార లగుదురు; ఎవ్వండు సుఖదుఃఖాను సంధానంబుచే లోకానుగతుం డగుచుం బ్రమోద వేదనంబుల నొందు నతండు దుఃఖాశ్రయుండగు; నారాయణభజనంబున సమస్త దుఃఖనివారణం బగు నని భవదీయచరణసేవా నిమిత్తంబునం గంటి; ప్రపంచంబు ప్రతీతి మాత్రంబు గలిగియున్న దైన నందులకుఁ గారణంబు లేకుండుటంజేసి తెలియని వాడనై వర్తింతు" నని వెండియు.

టీకా:

అని = అని; చెప్పినన్ = చెప్పగా; విదురుండు = విదురుడు; మైత్రేయున్ = మైత్రేయుని; కనుంగొని = చూసి; ముకుళిత = నమస్కరిస్తున్న; హస్తుండును = చేతులు కలవాడును; వినమిత = నమ్రతతో వంగిన; మస్తకుండును = శిరస్సు కలవాడును; అగుచున్ = అవుతూ; తన = తన; మనంబునన్ = మనసులో; శ్రీహరిన్ = విష్ణుని; తలంచుచు = ధ్యానిస్తూ; వినయ = వినయపూర్వకమైన; వచన = సంభాషణములు; రచనుండు = చేయువాడు; ఐ = అయి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠుడా; భవదీయ = నీ యొక్క; వాక్యముల = మాటల; చేతన్ = చేత; నా = నా; మనంబునన్ = మనసులో; నారాయణుండు = విష్ణువు {నారాయణుండు - నారముల (నీటిలో) వసించువాడు, విష్ణువు}; లోకైకనాథుండు = విష్ణువు {లోకైకనాథుడు - లోకమునకు ఒకడే ఐన ప్రభువు, విష్ణువు}; ఎట్లు = ఏవిధముగ; అయ్యెను = ఆయెను; అనియున్ = అనియు; శరీరధారి = దేహమును ధరించిన వాడు; ఐన = అయిన; జీవున్ = జీవుని; కిన్ = కి; కర్మ = కర్మములందలి; బంధంబులు = బంధనములు; ఏరీతిన్ = ఏ విధముగ; సంభవించెన్ = కలుగెను; అనియునున్ = అనియు; పొడమిన = కలిగిన; సంశయంబు = అనుమానములు; నేడు = ఈరోజు; నివృత్తంబు = తీరినవి; అయ్యెన్ = ఆయెను; ఎట్లు = ఏ విధముగ; అనినన్ = అనగా; లోకంబున్ = లోకమున; కున్ = కి; ఈశ్వరుండు = ఈశ్వరుడు; హరి = విష్ణువు; అనియు = అనియును; జీవుండు = జీవుడు; పరతంత్రుండు = పరతంత్రుడు {పరతంత్రుడు - పరులచే నడపబడువాడు}; అనియున్ = అనియును; తలంపుదు = అనుకొనెదను; నారాయణ = విష్ణుని; భక్తి = భక్తి యొక్క; ప్రభావంబు = ప్రభావము; ప్రాణి = జీవులకు; గోచరంబు = కనిపించునది; ఐన = అయిన; అవిద్య = అవిద్య; కున్ = కు; నాశన = నాశనమున; కారణంబు = కారణము; అనన్ = అగుచు; తనరుచున్ = తెలియబడుచు; ఉండు = ఉండే; నారాయణుండు = విష్ణువు; తనకున్ = తనకు; ఆధారంబు = ఆధారము; లేక = లేక; సమస్తంబున్ = సమస్తమున; కున్ = కు; తాన = తాను; ఆధారభూతుండు = ఆధార వస్తువు; ఐ = అయి; విశ్వంబున్ = విశ్వమును; పొదవి = రూపొందించి; అందున్ = అందులో; తాన్ = తాను; ఉండు = ఉండెడి; తెఱంగు = విధము; ఎట్లు = ఏలాగ; శరీర = దేహమందలి; అభిమానంబున్ = అభిమానమును; పొంది = పొంది; ఎవ్వడు = ఎవరు; మూఢతముండు = అతిమిక్కిలి మూఢుడు {మూఢుడు - మూఢతరుడు - మూఢతముడు}; ఐ = అయి; సంసార = సంసారమందు; ప్రవర్తకుండు = తిరుగువాడు; అగు = అగును; ఎవ్వండు = ఎవరు; భక్తి = భక్తి; మార్గంబునన్ = మార్గములో; పరమాత్ముడు = పరబ్రహ్మ; ఐన = అయిన; పుండరీకాక్షునిన్ = విష్ణుని; చెందు = చెందునట్టి; వీరలు = వీరు; ఇద్దఱును = ఇద్దరును; సంశయ = అనుమానపు; క్లేశము = బాధలు; లేమిన్ = లేకపోవుట; చేసి = చేత; సుఖ = సుఖమును; ఆనంద = ఆనందములతో; పరిపూర్ణులు = సంతృప్తులు; ఐ = అయి; అభివృద్దిన్ = అభివృద్దిని; ఒందు = పొందు; వారలు = వారు; అగుదురు = అవుతారు; ఎవ్వండు = ఎవరు; సుఖ = సుఖమును; దుఃఖ = దుఃఖములను; అనుసంధానంబు = కలుగుట; చే = చేత; లోక = లోకమును; అనుగతుండు = బట్టి; ప్రమోద = సంతోషమును; వేదనంబులన్ = బాధలను; ఒందు = పొందునో; అతండు = అతడు; దుఃఖ = దుఃఖములను; ఆశ్రయుండు = ఆశ్రయించినవాడు; అగు = అగును; నారాయణ = భగవంతుని; భజనంబున = సేవించుటవలన; సమస్త = సమస్తమైన; దుఃఖ = దుఃఖములను; నివారణంబు = పోగొట్టబడుట; అగున్ = అగును; అని = అని; భవదీయ = నీ యొక్క; చరణ = పాదములను; సేవ = సేవించు; నిమిత్తంబునన్ = కారణము వలన; కంటి = తెలుసుకొంటి; ప్రపంచంబు = ప్రపంచము {ప్రపంచము - 1 పంచభూతములు 2 పంచకర్మేంద్రియములు 3 పంచజ్ఞానేంద్రియములు 4పంచతన్మాత్రలు 5 పంచవాయువులు (పంచ పంచముల) ఐదింటిచే ఏర్పడిన సృష్టి}; ప్రతీతి = ఉన్నదనిపించుటకు; మాత్రంబున్ = మాత్రమే; కలిగి = ఉండి; ఉన్నది = ఉన్నది; ఐనందులకు = అవుటకు; కారణంబు = కారణము; లేకుండుటన్ = లేకపోవుట; చేసి = వలన; తెలియని = తెలియని; వాడను = వాడిని; ఐ = అయి; వర్తింతును = ప్రవర్తింతును; అని = అని; వెండియు = మరల.

భావము:

అని మైత్రేయ మహాముని చెప్పగా వింటున్న విదురుడు ఒక్కమాటు తలయెత్తి మైత్రేయుణ్ణి చూసాడు. చేతులు జోడించి, శిరస్సు వంచి నమస్కరించాడు. తన మనస్సుతో శ్రీహరిని స్మరిస్తూ వినయమొలుకు పలుకులతో ఇలా అన్నాడు. మునిముఖ్యా! నారాయణుడు లోకానికి ఏకైక ప్రభువు ఎలా అయ్యాడు? శరీరాన్ని ధరించిన జీవునకు కర్మబంధాలు ఏ విధంగా కలిగాయి? అనే అనుమానాలు ఇప్పుడు మీ మాటలవల్ల తొలగిపోయాయి. సమస్త లోకాలకు ఈశ్వరుడైన శ్రీహరి సర్వస్వతంత్రుడనీ, జీవుడు అస్వతంత్రుడనీ తెలుసుకొన్నాను. నారాయణుని మీద భక్తి గల్గి ఉండటం ఒక్కటే జీవులోని అవిద్యను తొలగించడానికి మూలం అవుతుంది. అని భావిస్తున్నాను.
నారాయణుడు తనకు తాను ఏ ఆధారం లేకుండానే సమస్త లోకాలకి తానే ఆధారమైన ఈ విశ్వాన్నంతా పొదివి పట్టుకొని ఆ విశ్వంలోనే తానుండటం ఎలా కుదురుతుంది? ఎవడు కేవలం శరీరంపై అభిమానం పెంచుకొని పరమ మూర్ఖుడై సంసారాన్ని సాగిస్తూ ఉంటాడో, ఎవడు భక్తిమార్గంలో ప్రవర్తించి పరబ్రహ్మమైన శ్రీహరిని చేరుకుంటాడో వీళ్లిద్దరూ సంశయమూ క్లేశమూ లేనివారవటం వల్ల సుఖమూ ఆనందమూ అతిశయించినవారై అభివృద్ధి పొందుతారు. ఎవరు గొప్పవాడు ఎవడు సుఖిస్తాడు అనే సంశయ తర్కాలు దుఃఖాలు లేకుండడంవల్ల సుఖానందాల్ని సమృద్ధిగా పొందిన వారవుతారు. ఎవడు సుఖ దుఃఖాలలో మనస్సు నిలిపి లోకాన్ని అనుసరిస్తాడో వాడు సుఖదుఃఖాలు అనుభవిస్తూ చివరకు చిక్కులపాలవుతాడు.
నారాయణ సంసేవనంవల్ల సకలదుఃఖాలూ పటాపంచ లౌతాయని మీ పాదసేవవల్ల తెలుసుకొన్నాను. ఈ ప్రపంచం సమస్తం ఉన్నట్లుగా మనకు గోచరిస్తున్నది. అటువంటి ప్రతీతి కల్గి ఉండటానికి కారణం మాత్రం తెలియడం లేదు.