పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-213-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇత్తెఱంగున నీశుం డగు నధోక్షజుండు మహదాదితత్త్వంబుల మనంబుల ఘనంబులగు తలంపులు దానెఱింగి యట్టి తత్త్వంబుల వివిధ వృత్తిలాభంబునకై స్వకీయచిచ్ఛక్తిచే నిటు లొనర్తు నని చింతించి నిజకళాకలితం బగు విరాడ్విగ్రహంబు నందు నగ్ని ప్రముఖం బగు దేవతావళి కెల్ల నివాసం బగుచుఁ గానంబడిన వైరాజపురుషుని యాస్యాద్యవయవంబుల వినిపింతు దత్తావధానుండవై వినుము.

టీకా:

ఇత్తెఱంగునన్ = విధముగ; ఈశుడు = విష్ణువు {ఈశుడు - ప్రభావము కలవాడు, విష్ణువు}; అగు = అయిన; అధోక్షజుండు = విష్ణువు {అధోక్షజుండు - వ్యు. అక్షజం – ఇంద్రియ జ్ఞానమ్, అధి – అధరమ్, అధి+అక్షజం యస్య – అధోక్షజః, బహువ్రీహి, వేనిని తెలియుటకు ఇంద్రియజ్ఞానము అసమర్థమైనదో అతడు, విష్ణువు, సంసార ధర్మ స్పర్శ రహితుడు, నిజరూపజ్ఞానము కలవాడు, విష్ణుసహస్రనామాలు శ్రీశంకరభాష్యం 415వ నామం}; మహత్ = మహత్తు; ఆది = మొదలగు; తత్త్వంబులన్ = తత్త్వముల; మనంబులన్ = మనసులలోని; ఘనంబులు = పెద్ద పెద్దవి; అగు = అయిన; తలంపులు = ఆలోచనలను; తాన్ = తాను; ఎఱింగి = తెలిసికొని; అట్టి = అట్టి; తత్త్వంబులన్ = తత్త్వములను; వివిధ = రకరకాల; వృత్తి = వర్తనలలోని; లాభంబున = సార్థక్యమున; కై = కొరకు; స్వ = తనచేత; కీయ = చేయబడిన; చిత్ = చైతన్య స్వరూప; శక్తి = సామర్థ్యము; చేన్ = చేత; ఇటుల = ఈ విధముగ; ఒనర్తును = చేయుదును; అని = అని; చింతించి = భావించి; నిజ = తన యొక్క; కళా = అంశలతో; కలితంబున్ = కూడినది; అగు = అయిన; విరాట్విగ్రహంబున్ = విరాట్విగ్రహము; అందున్ = లో; అగ్ని = అగ్నిదేవుడు; ప్రముఖంబు = మొదలగు ముఖ్యము; అగు = అయిన; దేవతా = దేవతల; ఆవళి = సమూహముల; కిన్ = కి; ఎల్లన్ = అంతటికిని; నివాసంబు = తన అంశ కలవానిగ; అగుచున్ = అవుతూ; కానంబడిన = ఏర్పడగా; వైరాజపురుషుని = విరాట్పురుషుని {వైరాజపురుషుడు - (విశ్వముగ) విరాజిల్లుతున్న సామర్థ్య రూపుడు (పురుషుడు), విష్ణువు}; ఆస్య = ముఖము; ఆది = మొదలగు; అవయవంబులన్ = అవయవములను; వినిపింతు = వినిపించెదను; దత్త = ధరించిన; అవధానుండవు = శ్రద్ద కలవాడవు; ఐ = అయి; వినుము = విను.

భావము:

సర్వేశ్వరుడైన పరాత్పరుడు అలా మహదాది తత్త్వాల మనస్సులలోని గొప్ప ఆలోచనలన్నీ తెలుసుకున్న వాడై. ఆ తత్త్వాల ప్రవర్తనలన్నీ సఫలం కావటానికి తన చైతన్యం శక్తిని ఉపయోగించాలని నిశ్చయించాడు. తన కళలతో కూడిన విరాట్టు స్వరూపంలో అగ్ని మొదలైన దేవత లందరికీ నివాసాలు కల్పించాడు. విరాట్ పురుషుని ముఖం మొదలైన అవయవాల స్వరూపాలను వినిపిస్తాను. ఏకాగ్రమైన భావంతో ఆకర్ణించు.