పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

  •  
  •  
  •  

3-205-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు విశ్వనిర్మాణనిపుణత్వంబు నెఱుంగం జూపుచు నన్నింటికి నన్యోన్యతం గల్పించి తన యనుగ్రహంబునం బ్రేరితంబై కానంబడి క్రియాసామర్థ్యంబునం జెన్నొందిన తత్త్వవితానంబు దేవప్రేరితంబయి స్వకీయంబులగు నంశంబులచేతం బుట్టించిన విరాడ్విగ్రహంబై తత్త్వవితతి దమ యందుఁ జెందిన పుండరీకాక్షుని కళాంశంబున నొకటి కొకటికి నైక్యంబు వాటిల్లి పరిణతంబై రూపాంతరంబునుం జెందె; నే తత్త్వంబునఁ జరాచరలోక పుంజంబులు నిండి యుండు, నా హిరణ్మయంబైన విరాడ్విగ్రహంబు నొందిన పురుషుండు సర్వజీవసమేతుండై యుండె; నంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; విశ్వ = విశ్వమును; నిర్మాణ = నిర్మించు; నిపుణత్వంబున్ = నైపుణ్యము; ఎఱుగన్ = తెలియునట్లు; చూపుచున్న = చూపిస్తున్న; అన్నింటి = అన్నింటి; కిన్ = కి; అన్యోన్యతన్ = సహకారము {అన్యోన్యత - వానిలో అవి అనుకూలించుట, సహాయపడుట}; కల్పించి = ఏర్పరచి; తన = తన యొక్క; అనుగ్రహంబు = అనుగ్రహమువలని; ప్రేరితంబు = ప్రేరింపబడినది; ఐ = అయి; కానంబడి = కనబడి, ఏర్పడి; క్రియా = పనిచేయగల; సామర్థ్యంబునన్ = సామర్థ్యముతో; చెన్నొందిన = ప్రకాశించిన; తత్త్వ = తత్త్వముల; వితానము = సమూహము; దేవ = దేవునిచే; ప్రేరితంబు = ప్రేరింపబడినవి; అయి = అయి; స్వ = తనచేత; కీయంబులు = చేయబడినవి; అగు = అయిన; అంశంబులన్ = విషయముల; చేతన్ = చేత; పుట్టించినన్ = పుట్టించగా; విరాట్విగ్రహంబు = విశ్వరూపము; ఐ = అయి; తత్త్వ = తత్త్వముల; వితతి = గుంపు; తమ = తమ; అందున్ = లో; చెందిన = చెందగా; పుండరీకాక్షుని = విష్ణుని {పుండరీకాక్షుడు - పుండరీకములు (పద్మములు) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; కళా = కళ యొక్క; అంశంబున్ = అంశములలో; ఒకటి = ఒకటి; కిన్ = కి; ఒకటి = ఇంకొకటి; కిన్ = కి; ఐక్యంబున్ = సహకారము, ఐకమత్యము; వాటిల్లి = సంభవించి; పరిణతంబు = పక్వము చెందినవి; ఐ = అయి; రూప = రూపమునందు; అంతరంబునున్ = మార్పును; చెందెన్ = చెందెను; ఏ = ఏ; తత్త్వంబున్ = తత్త్వమునను; ఏనియున్ = అయినదో; చరా = కదలగలవియును; అచర = కదలలేనివియును; లోక = లోకముల; పుంజంబులు = సమూహములు; నిండి = నిండి; ఉండు = ఉండునట్టి; హిరణ్మయంబు = బంగారమయము; ఐన = అయిన; విరాట్విగ్రహంబు = విరాట్స్వరూపము; ఒందిన = పొందిన; పురుషుండు = పురుషుడు; సర్వ = సమస్తమైన; జీవ = జీవములతోను; సమేతుండు = కూడినవాడు; ఐ = అయి; ఉండె = ఉండెను; అంత = అంత.

భావము:

అలా ప్రపంచాన్ని నిర్మించడంలో వాటికి నేర్పు కలగజేస్తూ శ్రీహరి క్రమానుసారంగా అన్నింటికీ పరస్పరమైత్రి కల్పించాడు. ఇలా శ్రీహరి అనుగ్రహంచేత ప్రేరేపింపడి సృష్టిక్రియకు సమర్థమైన తత్త్వసమూహం, తమ తమ అంశలతో విరాడ్విగ్రహంగా రూపొందింది. విష్ణుదేవుని కళాంశలతో ఒకటి మరొక్కదానితో ఏకీభావం పొంది, పరిపక్వమై ఇంకొక రూపం ధరించింది. ఏ తత్త్వం ఈ జగత్తంతా నిండి ఉందో హిరణ్మయమైన ఆ విరాట్ స్వరూపం ధరించిన పరమాత్మ సమస్త జీవులలో నిండి యున్న వాడయ్యాడు.