పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : సృష్టి క్రమంబు

  •  
  •  
  •  

2-34-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము; నీ వడిగిన సద్యోముక్తియుఁ గ్రమముక్తియు ననియెడు నీ రెండు మార్గంబులు వేదగీతలందు వివరింపబడియె; వీనిం దొల్లి భగవంతుం డైన వాసుదేవుండు బ్రహ్మచేత నారాధితుండై చెప్పె; సంసార ప్రవిష్టుండైన వానికిఁ దపోయోగాదు లయిన మోక్షమార్గంబులు పెక్కులు గల; వందు భక్తిమార్గంబు కంటె సులభంబు లేదు.

టీకా:

వినుము = వినుము; నీవున్ = నీవు; అడిగినన్ = అడిగినట్టి; సద్యోముక్తియున్ = సద్యోముక్తి, వెంటనేకలుగు ముక్తి; క్రమముక్తియున్ = క్రమముక్తి; అనియెడిన్ = అనబడు; ఈ = ఈ; రెండు = రెండు (2); మార్గంబులున్ = మార్గములును; వేద = వేదము యొక్క; గీతలు = గానముచేయు మంత్రములు; అందున్ = లో; వివరింపపడియెన్ = వివరముగ చెప్పపడినవి; వీనిన్ = వీనిని; తొల్లి = పూర్వము; భగవంతుండు = భగవంతుడు, మహిమాన్వితుడు; ఐన = అయినట్టి; వాసుదేవుండు = వాసుదేవుడు; బ్రహ్మ = బ్రహ్మ; చేతన్ = చే; ఆరాధితుండు = ప్రార్థింపబడ్డవాడు; ఐ = అయి; చెప్పెన్ = తెలియజెప్పెను; సంసార = సంసారము నందు; ప్రవిష్టుండున్ = ప్రవేశము; ఐన = అయినట్టి; వాని = వాడి; కిన్ = కి; తపో = తపస్సు; యోగ = యోగము; ఆదులు = మొదలగునవి; అయిన = అయినట్టి; మోక్ష = మోక్షమునకు; మార్గంబులున్ = మార్గములు, విధానములు; పెక్కులున్ = అనేకములు; కలవు = ఉన్నవి; అందున్ = వానిలో; భక్తి = భక్తి; మార్గంబున్ = మార్గము, విధానము; కంటెన్ = కంటె; సులభంబున్ = సులభమైనది; లేదు = లేదు.

భావము:

సద్యోముక్తి, క్రమముక్తి అనే రెండు మార్గాలు నీవు అడిగావు. ఇవి రెండూ వేదగీతలలో వివరింప బడ్డాయి. పూర్వం బ్రహ్మ తనను ఆరాధింపగా భగవంతుడైన విష్ణువు ఆయనకు వీటిని బోధించాడు. సంసారంలో ప్రవేశించిన వానికి తపస్సు, యోగం మొదలైన మోక్ష మార్గాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటి కంటే సులభమైంది భక్తిమార్గం.