పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : సత్పురుష వృత్తి

  •  
  •  
  •  

2-30-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు, దేహత్యాగకాలంబున నింద్రియంబులతోడి సంగమంబు విడువని వాఁడు వానితోడన గుణసముదాయ రూపంబగు బ్రహ్మాండంబు నందు ఖేచర, సిద్ధ, విహార, యోగ్యంబును, నణిమాదిక సకలైశ్వర్య సమేతంబును నైన పరమేష్ఠి పదంబుఁ జేరు; విద్యాతపోయోగ సమాధి భజనంబు సేయుచుఁ బవనాంతర్గత లింగశరీరులైన యోగీశ్వరులకు బ్రహ్మాండ బహిరంతరాళంబులు గతి యని చెప్పుదురు; రేరికిం గర్మంబుల నట్టి గతిఁబొంద శక్యంబుగాదు; యోగి యగువాఁడు బ్రహ్మలోకంబునకు నాకాశ పథంబునం బోవుచు, సుషుమ్నానాడివెంట నగ్ని యను దేవతం జేరి, జ్యోతిర్మయంబైన తేజంబున నిర్మలుండై యెందునుం దగులువడక, తారామండలంబుమీఁద సూర్యాది ధ్రువాంత పదంబులఁ గ్రమక్రమంబున నతిక్రమించి, హరిసంబంధం బయిన శింశుమారచక్రంబుఁ జేరి, యొంటరి యగుచుఁ బరమాణుభూతం బైన లింగశరీరంబుతోడ బ్రహ్మవిదులకు నెలవైన మహర్లోకంబుఁ జొచ్చి, మహాకల్పకాలంబు క్రీడించుఁ గల్పాంతంబైన ననంతముఖానల జ్వాలా దందహ్యమానంబగు లోకత్రయంబు నీక్షించుచుఁ, దన్నిమిత్త సంజాతానల దాహంబు సహింపజాలక.

టీకా:

మఱియున్ = ఇంకను; దేహ = దేహమును; త్యాగ = త్యజించు, విడుచు; కాలంబునన్ = సమయములో; ఇంద్రియంబులున్ = ఇంద్రియములు; తోడిన్ = తో; సంగమంబున్ = సంగమమును, బంధనములను; విడువని = వదలని; వాఁడు = వాడు; వాని = వాటి; తోడన్ = తోపాటు; గుణ = గుణముల యొక్క; సముదాయ = సమూహముల; రూపంబున్ = స్వరూపమును; అగున్ = పొందును; బ్రహ్మాండంబున్ = బ్రహ్మాండము; అందున్ = లోపల; ఖేచర = ఖేచరులు, ఆకాశగమనులు; సిద్ధ = సిద్ధులు {సిద్ధులు - మాతృ గర్భస్థ శిశువును సిద్ధ పరచు దేవతల వంటివారు,}; విహార = విహరించుటకు; యోగ్యంబునున్ = అనువైనదియును, అర్హమైనదియు; అణిమ = అణిమ {అణిమాది - అష్టైశ్వర్యములు - అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, వశిత్వము, ఈశత్వము}; ఆదిక = మొదలగు; సకల = సమస్త; ఐశ్వర్య = ఐశ్వర్యములు; సమేతంబును = కూడి ఉన్నదియును; ఐన = అయినట్టి; పరమేష్టి = చతుర్ముఖ బ్రహ్మ {పరమేష్టి - అత్యున్నతమైన సంకల్పశక్తుడు}; పదంబున్ = లోకమును, స్థితిని; చేరున్ = చేరును, పొందును; విద్యా = నేర్పరత్వము కల; తపస్ = తపస్సు అను; యోగ = యోగము వలని; సమాధిన్ = సమాధిని; భజనంబున్ = సాధనను; చేయుచున్ = చేయుచు; పవన = ప్రాణవాయువు, ప్రాణాయామమున; అంతర్గత = లోపల ఇమిడిన, శరీరములోపల; లింగ = లింగ, వాయువులను; శరీరులు = శరీరముకలవారు, ధరించువారు; ఐన = అయినట్టి; యోగీ = యోగులలో; ఈశ్వరులు = శ్రేష్ఠులు; కున్ = కు; బ్రహ్మాండ = బ్రహ్మాండము యొక్క; బహిర్ = బయటను; అంతరాళంబులున్ = లోపటను ఉండు స్థానములు; గతి = మార్గము, ప్రాప్తించునది; అని = అని; చెప్పుదురు = (పెద్ధలు) చెప్పుతారు; ఏరికిన్ = ఎవరికైనసరే; కర్మంబులన్ = (ఎట్టి) కర్మకాండలతోనైను; అట్టి = అటువంటి; గతిన్ = మార్గము, ప్రాప్తించునది; పొందన్ = పొండుట, చేరుట; శక్యంబున్ = వీలగునది; కాదు = కాదు; యోగి = యోగి; అగు = అయినట్టి; వాఁడు = వాడు; బ్రహ్మ = బ్రహ్మ; లోకంబున్ = లోకమును, స్థానమును; కున్ = కు; ఆకాశ = ఆకాశపు, నిరామయ; పథంబునన్ = మార్గములో; పోవుచున్ = వెళ్ళుతూ; సుషుమ్నా = సుషుమ్న అను {సుషుమ్న, మనోజ్ఞమును ఇచ్చునది}; నాడి = నాడి, ఊర్థ్వగతాత్మక నాడి {నాడి - నరముల కూడలి స్థానము}; వెంటన్ = కూడా; అగ్ని = అగ్ని; అను = అనబడు; దేవతన్ = దేవుని; చేరి = చేరి, పొంది; జ్యోతిర్ = జ్యోతితో, వెలుగుతో; మయంబున్ = కూడినట్టిది; ఐన = అయినట్టి; తేజంబునన్ = తేజస్సు వలన; నిర్మలుండు = మలములు లేనివాడు; ఐ = అయి; ఎందునున్ = దేనికిని; తగులున్ = తగుల్కొనుటలో, బంధనములో; పడక = పడకుండగ, చిక్కుకొనక; తారా = తారల యొక్క; మండలంబున్ = మండలము, లోకము; మీఁదన్ = మీది, లోపలి; సూర్య = సూర్యమండలము; ఆది = మొదలు; ధ్రువ = ధ్రువుని; అంతన్ = వరకు; పదంబులన్ = లోకములను, స్థానములను; క్రమక్రమంబునన్ = వరుసగా; అతిక్రమించి = దాటి; హరిన్ = విష్ణువునకు {హరి - హకారముతో కూడిన నిశ్వాసము రేఫతో కూడిన కంఠనాదము - ఓంకారము}; సంబంధంబున్ = సంబంధిచినట్టి,; అయిన = అయినట్టి; శింశుమార = మొసలి రూప, సూర్యాదులు తిరుగు జ్యోతిర్మండల {శింశుమారచక్రము - హరిపథము, ఓంకారపథము}; చక్రంబున్ = నక్షత్రమండలం, నాభి, ఆధారభూతం; చేరి = చేరి, అందుకొని; ఒంటరిన్ = ఒంటరిగ, ఏకత్త్వమును; అగుచున్ = అగుతూ, పొంది; పరమాణు = పరమాణవు, అతిసూక్ష్మము; భూతంబున్ = వంటిది; ఐన = అయినట్టి; లింగ = లింగ, రూపముకల; శరీరంబున్ = శరీరము; తోడన్ = తో; బ్రహ్మ = పరబ్రహ్మము; విదులున్ = తెలిసినవారు; కున్ = కి; నెలవు = స్థానము, లోకము; ఐన = అయినట్టి; మహర్లోకంబున్ = మహర్లోకము, వెలుగులలోకము; చొచ్చి = ప్రవేశించి; మహాకల్ప = మహాకల్పాంత {మహాకల్పము - బ్రహ్మాండము సృష్టి నుండి ప్రళయము వరకు కల కాలము}; కాలంబున్ = సమయము వరకును; క్రీడించున్ = ఆనందముగ సంచరించును; కల్పాంతంబున్ = కల్పాంతము; ఐనన్ = అయిన తరువాత; అనంత = అనేకమైన, అనంతుడగు శేషుని; ముఖ = కీలలు కల ముఖముల నుండి వెడలు; అనల = అగ్ని; జ్వాలా = జ్వాలలలో; దందహ్య = దహింప; మానంబు = పడుతున్నవి; అగు = అయినట్టి; లోక = లోకముల; త్రయంబున్ = మూటిని, భూ భువ స్సువర్లోకంబులు; ఈక్షించుచున్ = చూచుచు; తత్ = ఆ; నిమిత్త = కారణముగ; సంజాత = పుట్టిన; అనల = అగ్ని; దాహంబు = దహించునది, వేడిమిని; సహింపన్ = భరించుటకు; చాలక = శక్తిలేక.

భావము:

శరీరం విసర్జించేటప్పుడు ఇంద్రియాలతో సంబంధం వదలనివాడు వాటితో సహా గుణమయమైన బ్రహ్మాండంలో ఖేచరులు, సిద్ధులు, విహరించడానికి అనువైనది, అణిమాదులైన ఐశ్వర్యాలన్నింటితో కూడినట్టి బ్రహ్మలోకం చేరుతాడు. విద్య, తపస్సు, యోగం, సమాధులను అనుష్ఠించి లింగశరీరాన్ని వాయులీనం చేసిన యోగీశ్వరులు బ్రహ్మాండం లోపల, వెలుపల సంచరిస్తుంటారని పెద్దల మాట. కర్మలతో ఎవ్వరు అలాంటి స్థానం పొందలేరు. బ్రహ్మలోకాభిముఖుడైన యోగి సుషుమ్నానాడీ ద్వారం నుండి బయలుదేరి ఆకాశమార్గంలో పయనిస్తూ అగ్ని దేవతను చేరుకుంటాడు. అక్కడ జ్యోతిర్మయమైన ప్రకాశంతో పుణ్యపాపాలు నశింపజేసుకొని నిర్ములుడై భాసిస్తాడు. అతడు దేనిలోనూ తగుల్కొనడు. నక్షత్రపథం గడచిపోతాడు. ఆ పై సూర్యమండలం మొదలు ధ్రువమండలం వరకు మండలాలన్నీ వరుసగా దాటుకుంటాడు. తుదకు విష్ణు సంబంధమైన శింశుమార చక్రం చేరుతాడు. అక్కడ ఒంటరిగా పరమాణు స్వరూపమైన లింగశరీరంతో బ్రహ్మవేత్తలు నివసించే మహర్లోకం ప్రవేశిస్తాడు. మహాకల్పకాలం వరకు అందే క్రీడిస్తాడు. కల్పాంతంలో అనంతుని వదనమునుండి వెలువడే కరాళాగ్ని జ్వాలల్లో దగ్ధమయి పోతున్న త్రిలోకాలను చూస్తాడు. అందువల్ల జనించే అగ్ని దాహం సహించలేక అక్కడనుండి బ్రహ్మలోకం చేరుకుంటాడు, అక్కడే నివసిస్తాడు.