పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : సత్పురుష వృత్తి

  •  
  •  
  •  

2-28-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము; పరమాత్మ యైన బ్రహ్మంబునకుఁ దక్క కాల దేవ సత్త్వ రజస్తమోగుణాహంకార మహత్తత్త్వ ప్రధానంబులకుఁ బ్రభుత్వంబు లేదు; కావునం బరమాత్మ వ్యతిరిక్తంబు లేదు; దేహాదుల యం దాత్మత్వంబు విసర్జించి యన్య సౌహృదంబు మాని, పూజ్యంబైన హరిపదంబుం బ్రతిక్షణంబును హృదయంబున నాలింగనంబు సేసి, వైష్ణవంబైన పరమపదంబు సర్వోత్తమం బని సత్పురుషులు దెలియుదు; రివ్విధంబున విజ్ఞానదృగ్వీర్యజ్వలనంబున నిర్దగ్ధవిషయవాసనుండయి; క్రమంబున నిరపేక్షత్వంబున.

టీకా:

వినుము = విను; పరమాత్మ = పరమాత్మ {పరమాత్మ - అత్యున్నతమైన ఆత్మ, విశ్వము అంతటకిని ఐన జీవుడు}; ఐన = అయినట్టి; బ్రహ్మంబున్ = బ్రహ్మమున; కున్ = కు; తక్క = తప్పించి; కాల = కాలము; దేవ = దేవతలు; సత్త్వ = సత్త్వము; రజస్ = రజస్సు; తమో = తమస్సు అను; గుణా = గుణములు; అహంకార = అహంకారము; మహత్తత్త్వ = మహత్తత్త్వము; ప్రధానంబులు = సృష్టి హేతుభూతమైన ప్రధానములు; కున్ = కు; ప్రభుత్వంబు = సామర్థ్యము, అధికారము; లేదు = లేదు; కావునన్ = అందువలన; పరమాత్మ = పరమాత్మ; వ్యతిరిక్తంబు = పరాయిది, కానిది; లేదు = లేదు; దేహ = దేహము; ఆదులు = మొదలగు వారు; అందు = లోపల; ఆత్మత్త్వంబున్ = తన దను భావము; విసర్జించి = వదలివేసి; అన్య = ఇతరము లందును; సౌహృదంబున్ = స్నేహము, ఆసక్తి; మాని = విడిచిపెట్టి; పూజ్యంబున్ = పూజింపదగినది; అయిన = అయినట్టి; హరి = భగవంతుని; పదంబున్ = పాదములను; ప్రతి = ప్రతి ఒక్క; క్షణంబునున్ = క్షణమునందును; హృదయంబునన్ = మనస్సులోను; ఆలింగనంబున్ = నిండి నిలుచునట్లుగ; చేసి = చేసుకొని; వైష్ణవంబు = విష్ణువుది; అయిన = అయినట్టి; పరమ = పరములకే పరమైన, అత్యున్నమైన; పదంబున్ = పదమును, స్థితిని; సర్వ = అన్నికంటెను; ఉత్తమంబున్ = ఉత్కృష్టంబు; అని = అని; సత్ = సత్యము తెలిసిన, మంచి; పురుషులున్ = మానవులు; తెలియుదురు = తెలిసికొని ఉందురు; ఈ = ఈ; విధంబునన్ = ప్రకారమైన; విజ్ఞాన = విశిష్ట జ్ఞానము తోకూడిన; దృక్ = దృష్టి యొక్క; వీర్యన్ = శక్తి అను; జ్వలనంబునన్ = జ్వలింపజేయుదానితో, మంటతో; నిర్దగ్ధ = పూర్తిగ కాల్చివేయబడిన; విషయ = ఇంద్రియ విషయముల; వాసనుండు = వాసన మాత్రమైనను కలవాడు; ఐ = అయి; క్రమంబున = క్రమముగ; నిరపేక్షత్త్వంబునన్ = (దేని యందును) అసల్లేని ఆసక్తితో.

భావము:

రాజశేఖరుడా! విను. పరమాత్మయైన బ్రహ్మమునకు తప్ప కాలానికి, కాలప్రభావానికీ లోబడ్డ బ్రహ్మాది దేవతలకూ, సత్త్వరజస్తమస్సులనే త్రిగుణాలకూ, అహంకారానికీ, మహత్తత్త్వానికి, సమస్త సృష్టికీ హేతు భూతమై ప్రధాన మనబడే ప్రకృతికీ ఆధిపత్యం లేదు. అందుచేత పరమాత్మకు భిన్నమైన పదార్థమంటు ఏదీ లేదు. సత్పురుషులు శరీరాదులపై ఆత్మభావన వదులుతారు. ఇతర విషయాల మీద వ్యామోహం విడుస్తారు. మహనీయములైన మాధవుని చరణారవిందాలను మనస్సులో అనుక్షణమూ నిల్పుకుంటారు. విష్ణుసంబంధ మగు పరమపదమే అన్నింటికంటె ఉత్తమస్థానమని గ్రహిస్తారు. ఈ రీతిగా శాస్త్ర జ్ఞాన బలము అనే మంటలో విషయవాసనలను తగులబెట్టి వారు దేని మీదా అపేక్ష లేకుండా ఉంటారు.