పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : తాపసుని జీవయాత్ర

  •  
  •  
  •  

2-26-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు, హరి చరణ కమలగంధ రసాస్వాదనం బెఱుంగని వారలు నిజకర్మబంధంబుల దండధర మందిర ద్వార దేహళీ సమీప జాజ్వాల్యమాన వైతరణీ తరంగిణీ దహనదారుణ జ్వాలాజాల దందహ్యమాన దేహులం గూడి శిఖిశిఖావగాహంబుల నొందుచుండుదురు; మఱియు విజ్ఞానసంపన్నులై మను ప్రసన్నులు మాయాపన్నులు గాక విన్నాణంబునం దమతమ హృదయాంతరాళంబులం బ్రాదేశమాత్ర దివ్యదేహుండును, దిగిభరాజశుండాదండ సంకాశ దీర్ఘ చతుర్భాహుండును, కందర్పకోటి సమాన సుందరుండును, ధృతమందరుండును, రాకావిరాజమాన రాజమండల సన్నిభ వదనుండును, సౌభాగ్య సదనుండునుఁ, బ్రభాతకాల భాసమాన భాస్కరబింబ ప్రతిమానవిరాజిత పద్మరాగరత్నరాజీ విరాజమాన కిరీట కుండలుండును, శ్రీవత్సలక్షణ లక్షిత వక్షోమండలుండును, రమణీయ కౌస్తుభరత్నఖచిత కంఠికాలంకృత కంధరుండును, నిరంతరపరిమళమిళిత వనమాలికాబంధురుండును నానావిధ గంభీర హార, కేయూర, కటక, కంకణ, మేఖలాంగుళీయక, విభూషణవ్రాత సముజ్జ్వలుండును, నిటలతట విలంబమాన విమలస్నిగ్ధ నీలకుంచితకుంతలుండును, తరుణచంద్ర చంద్రికాధవళ మందహాసుండునుఁ, బరిపూర్ణ కరుణావలోకన భ్రూభంగ సంసూచిత సుభగ సంతతానుగ్రహ లీలావిలాసుండును, మహాయోగిరాజ వికసిత హృదయకమలకర్ణికామధ్య సంస్థాపిత విలసిత చరణకిసలయుండును, సంతతానందమయుండును, సహస్రకోటి సూర్య సంఘాతసన్నిభుండును, విభుండునునైన పరమేశ్వరుని మనోధారణావశంబున నిలిపికొని తదీయ గుల్ఫ, చరణ, జాను, జంఘాద్యవయవంబులం గ్రమంబున నొక్కొక్కటిని బ్రతిక్షణంబును ధ్యానంబు సేయుచు, నెంతకాలంబునకుఁ బరిపూర్ణ నిశ్చలభక్తియోగంబు సిద్ధించు నంతకాలంబునుం దదీయ చింతా తత్పరులై యుందు"రని మఱియు నిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకనూ; హరి = భగవంతుని; చరణ = పాద; కమల = పద్మముల; గంధ = వాసనల; రస = ఆనందమును; ఆస్వాదనంబున్ = అనుభవించుట; ఎఱుంగని = తెలియని; వారలు = వారు; నిజ = స్వంత; కర్మ = కర్మముల; బంధంబులన్ = బంధనములు వలన; దండధర = దండధరుని - యముని; మందిర = గృహము యొక్క; ద్వార = గుమ్మము; దేహళీ = గడప; సమీప = దగ్గరి; జాజ్వాల్య = పెద్దపెద్ద మంటలు; మాన = కూడిన; వైతరణీ = వైతరణి {వైతరణి - యమలోకపు దారిలో దాట వలసిన నది}; తరంగిణీ = నది యొక్క; దహన = మండుచున్; దారుణ = భయంకరమైన; జ్వాలా = మంటల - జ్వాలల; జాలన్ = సమూహములో, కీలలలో; దందహ్యమాన = దహింపబడుతున్న; దేహులన్ = దేహములు కలవారిని, జీవులను; కూడి = కలసి; శిఖి = నిప్పుల; శిఖా = మంటలలో; అవగాహంబున్ = మునుగుటలు, స్నానంచేయుట; ఒందుచున్ = పొందుచు; ఉండుదురు = ఉండుదురు; మఱియున్ = ఇంక; విజ్ఞాన = విజ్ఞానము అను; సంపన్నులు = సంపదలు కలవారు; ఐ = అయి; మను = ప్రవర్తించు; ప్రసన్నులు = ప్రశాంత మనస్కులు; మాయా = మాయచేత; ఆపన్నులున్ = ఆపదలు పొందినవారు; కాక = కాకుండగ; విన్నాణంబునన్ = నేర్పులతో; తమ = తమ; తమ = తమ; హృదయ = హృదయముల; అంతరాళంబులన్ = లోపలి భాగములోని; ప్రాదేశమాత్ర = కాస్త ప్రదేశములోనే ఉండు {ప్రాదేశ - బొటకన వేలు చూపుడు వేలు చాపినంత పొడుగు, జాన పొడుగు}; దివ్య = దివ్యమైన; దేహుండునున్ = దేహము కలవాడు; దిగిభ = దిక్కు లందున్న ఏనుగుల; రాజ = శ్రేష్ఠముల, దిగ్గజముల; శుండా = తొండములు అను; దండ = దండములు; సంకాశ = వంటి; దీర్ఘ = పొడవైన; చతుర్ = నాలుగు (4); బాహుండునున్ = చేతులు కలవాడును; కందర్ప = మన్మథులు; కోటి = కోటిమందితో; సమాన = సమానమైన; సుందరుండునున్ = అందగాడును; ధృత = ధరింపబడిన - ఎత్తిన; మందరుండునున్ = మందరపర్వతము కలవాడు {ధృతమందరుడు - కూర్మావతారంలో మందర పర్వతమును ఎత్తినవాడు.}; రాకా = పూర్ణిమ నాడు; విరాజమాన = ప్రకాశిస్తున్న; రాజ = చంద్ర; మండల = మండల; సన్నిభ = సమానమైన; వదనుండునున్ = వదనము కలవాడును; సౌభాగ్య = శుభములకు; సదనుండునున్ = నివాసమైన వాడును; ప్రభాత = ఉదయపు; కాల = సమయ మందలి; భాసమాన = ప్రకాశిస్తున్న; భాస్కర = ప్రకాశించువాడు, సూర్యుని; బింబ = బింబము, మండలము; ప్రతిమాన = సరిపడు; విరాజిత = వెలుగొందువాడును; పద్మరాగ = పద్మరాగమణులు; రత్న = రత్నములతోను; రాజీ = కూడిన; విరాజమాన = ప్రకాశిస్తున్న; కిరీట = కిరీటములు; కుండలుండునున్ = కుండలములు కలవాడును; శ్రీవత్స = శ్రీవత్సము అను; లక్షణ = పుట్టుమచ్చ; లక్షిత = గుర్తు ఉన్న; వక్షస్ = వక్షస్థల; మండలుండునున్ = మండలము కలవాడును; రమణీయ = అందమైన; కౌస్తుభ = కౌస్తుభము అను; రత్న = రత్నము; ఖచిత = పొదగబడిన; కంఠి = కంటె చే - కంఠాభరణముచే; అలంకృత = అలంకరింప బడినవాడు; కంధరుండునున్ = మెడ కలవాడును; నిరంతర = నిత్యమైన; పరిమళ = సుగంధములు; మిళిత = కూడిన; వనమాలికా = పువ్వుల ఆకుల మాలలచేత; బంధురుండునున్ = అలంకృతుడును; నానా = రకరకముల; విధ = విధములైన; గంభీర = గంభీరమైన; హార = హారములు, దండలు; కేయూర = దండకడియాలు; కటక = కాలి కడియములు; కంకణ = కంకణములు, మురుగులు; మేఖలలు = నడుము పట్టీలు, వడ్డాణములు; అంగుళీయక = ఉంగరములు; విభూషణ = నగలు; వ్రాత = సమూహములతో; సమ = చక్కగా; ఉజ్జ్వలుండునున్ = ప్రకాశిస్తున్నవాడును; నిటల = నుదుటి; తల = తలమున, భాగమున; విలంబమాన = వ్రేలాడుచున్న; విమల = నిర్మలమైన; స్నిగ్ధ = మెరుస్తున్మ; నీల = నల్లని; కుంచిత = ఉంగరాల, నొక్కులున్న; కుంతలుండునున్ = వెంట్రుకలు ఉన్నవాడును; తరుణ = బాల, క్రొత్త; చంద్ర = చంద్రుని; చంద్రికా = వెన్నెలల వంటి; ధవళ = తెల్లని; మంద = చిరు; హాసుండునున్ = నవ్వు కలవాడును; పరిపూర్ణ = నిండైన; కరుణా = కరుణతో కూడిన; అవలోకన = చూపులు కల; భ్రూ = కనుబొమల; భంగ = కదలికలుచే; సంసూచిత = చక్కగా చూపబడిన; సుభగ = సౌభాగ్యవంతమైన; సంతత = ఎడతెగని; అనుగ్రహ = అనుగ్రహించు; లీలా = లీల తోకూడి; విలాసుండునున్ = శోభిల్లు వాడును; మహా = గొప్ప; యోగి = యోగులలో; రాజ = శ్రేష్ఠుల యొక్క; వికసిత = వికసించిన; హృదయ = హృదయములు అను; కమల = పద్మముల; కర్ణికా = బొడ్డుల; మధ్య = నడుమన; సం = చక్కగా; స్థాపిత = స్థాపింప బడిన వాడును; విలసిత = వెలుగుతున్న; చరణ = పాదముల; కిసలయుండును = పద్మములు కలవాడును; సంతత = ఎడతెగని; ఆనంద = ఆనందముతో; మయుండునున్ = కూడినవాడును; సహస్ర = వేల; కోటి = కోట్ల; సూర్య = సూర్యులతో; సంఘాత = సమూహమునకు; సన్నిభుండునున్ = సమానమైన కాంతి కలవాడను; విభుండునున్ = వైభవమునకు అధిపతియును; ఐనన్ = అయినట్టి; పరమేశ్వరుని = భగవంతుని {పరమేశ్వరుడు - అత్యుత్తమ ప్రభువు}; మనో = మనస్సు నందు; ధారణా = ధారణ సాధనలు; వశంబునన్ = వలన; నిలిపికొని = నిలిపికొని; తదీయ = అతని; గుల్ఫ = చీలమండలు; చరణ = పాదములు; జాను = నడుము; జంఘ = పిక్కలు; ఆది = మొదలగు; అవయవంబులన్ = అవయవములను; క్రమంబునన్ = వరుసగా; ఒక్కొక్కటిని = ఒక్కక్క దానిని; ప్రతి = ప్రతి; క్షణంబును = క్షణమును; ధ్యానమున్ = ధ్యానము; చేయుచున్ = చేస్తూ; ఎంత = ఎంత; కాలంబున్ = సమయము; కున్ = నకును; పరిపూర్ణ = సంపూర్ణమైన; నిశ్చల = చలించని; భక్తి = భక్తి; యోగంబున్ = యోగముచేత; సిద్ధించున్ = సిద్ధించునో; అంత = అంత; కాలంబునున్ = కాలమును; తదీయ = అతని; చింతా = స్మరించుట యందు; తత్పరులు = నిమగ్నులు; ఐ = అయి; ఉందురు = ఉంటారు; అని = అని; మఱియున్ = ఇంకనూ; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అంతేకాదు. శ్రీ గోవింద చరణారవింద మకరంద మాధుర్యానికి విముఖులైన వాళ్ళు తమతమ కర్మబంధాల్లో తగుల్కొంటారు. తత్ఫలితమూగా యమమందిర ద్వారం వద్ద ప్రవహించే వైతరణీనదిలో భగభగమండే భయంకరాగ్ని జ్వాలలలో కాలిపోతున్న వారితో జతగూడుతారు; విశేష జ్ఞానసంపన్నులై జీవించే శరణాగతులు మాయకు లోబడక నేర్పుతో తమతమ హృదయాలలో భగవంతుని ధ్యానిస్తారు; ఆ భగవంతుడు జానెడు కొలత గల దివ్యశరీరం కలవాడు; దిగ్గజాల తొండాలవలె పొడవైన నాలుగు చేతులు గలవాడు; చక్కదనంలో కోటి మన్మథులకు దీటైనవాడు; మందరగిరిని ధరించినవాడు; పున్నమనాటి చందమామ వంటి మోము కలవాడు; సౌభాగ్యానికి నెలవైనవాడు; ప్రాతఃకాలపు భానుబింబములాగా ప్రకాశించే పద్మరాగమణులు పొదిగిన కిరీటకుండలాలు తాల్చినవాడు; వక్షస్థలంలో శ్రీవత్సమనే పుట్టుమచ్చ కలవాడు; కమనీయ కౌస్తుభరత్నం తాపిన కంఠాభరణం మెడలో అలంకరించుకొన్నవాడు; ఎప్పుడూ సువాసనలీనే వనమాలికతో ఒప్పారేవాడు; పలువిధాలైన పెద్దపెద్ద హారాలూ; భుజకీర్తులూ, కడియాలూ, మురుగులూ, మొలనూలూ, ఉంగరాలూ మొదలైన సొమ్ములతో శోభిల్లేవాడు; నొసట ముసురుకొన్న నిగనిగలాడే నీలి ముంగురులు గలవాడు; కరుణామయమైన కడగంటి చూపులతోడి భ్రూవిలాసాలతో భక్తులపై పరమానుగ్రహం ప్రసరింప జేసేవాడు; మహా యోగీశ్వరుల హృదయపద్మాలలో చివుళ్లవంటి తన చరణాలు మోపిన వాడు; సదా ఆనందస్వరూపుడు; వేయి కోట్ల సూర్యులతో సమానమైన ప్రకాశము కలవాడు; లోకాధిపుడు. అట్టి పరమేశ్వరుణ్ణి విజ్ఞానసంపన్నులు ధారణతో చిక్కబట్టి ఆయన చీలమండలు, పాదాలు, మోకాళ్ళు, పిక్కలు మొదలైన అవయవాలలో ఒక్కొక్క దానిని క్రమంగా అనుక్షణం ధ్యానిస్తారు. అచంచలమైన పూర్ణభక్తియోగం సిద్ధించేవరకు ఆ పరమాత్ముని ధ్యానంలో నిమగ్నులై ఉంటారు.” ఇలా చెప్పి శుకుడు మళ్ళీ ఈ విధంగా అన్నాడు.