పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : విరాట్స్వరూపము తెలుపుట

  •  
  •  
  •  

2-16-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము; భగవంతుండైన హరి విరాడ్విగ్రహంబు నందు భూత భవిష్యద్వర్తమానం బైన విశ్వంబు విలోక్యమానం బగు ధరణీసలిల తేజస్సమీరణ గగనాహంకార మహత్తత్వంబు లనియెడి సప్తావ రణంబుల చేత నావృతం బగు మహాండకోశం బైన శరీరంబు నందు ధారణాశ్రయం బయిన వైరాజపురుషుండు దేజరిల్లు; నమ్మహాత్మునికిఁ బాదమూలంబు పాతాళంబు; పార్ష్ణిభాగ పాదాగ్ర భాగంబులు రసాతలంబు; గుల్ఫంబులు మహాతలంబు; జంఘలు తలాతలంబు; జానుద్వయంబు సుతలం; బూరువులు వితలాతలంబు; జఘనంబు మహీతలంబు; నాభీవివరంబు నభస్థ్సలంబు; వక్షంబు గ్రహతారకా ముఖ జ్యోతిస్సమూహ సమేతం బగు నక్షత్రలోకంబు; గ్రీవంబు మహర్లోకంబు; ముఖంబు జనలోకంబు; లలాటంబు తపోలోకంబు; శీర్షంబు సత్యలోకంబు; బాహుదండంబు లింద్రాదులు; గర్ణంబులు దిశలు; శ్రవణేంద్రియంబు శబ్దంబు; నాసాపుటంబు లశ్వనీదేవతలు; ఘ్రాణేంద్రియంబు గంధంబు; వదనంబు వహ్ని; నేత్రంబు లంతరిక్షంబు; చక్షురింద్రియంబు సూర్యుండు; రేయింబగళ్ళు ఱెప్పలు; భ్రూయుగ్మ విజృంభణంబు బ్రహ్మపదంబు; తాలువులు జలంబు; జిహ్వేంద్రియంబు రసంబు; భాషణంబులు సకల వేదంబులు; దంష్ట్రలు దండధరుండు; దంతంబులు పుత్రాది స్నేహకళలు; నగవులు జనోన్మాద కరంబు లయిన మాయావిశేషంబులు; కటాక్షంబుల నంత సర్గంబులు; పెదవులు వ్రీడాలోభంబులు; స్తనంబులు ధర్మంబులు; వె న్నధర్మమార్గంబు; మేఢ్రంబు ప్రజాపతి; వృషణంబులు మిత్రావరుణులు; జఠరంబు సముద్రంబులు; శల్య సంఘంబులు గిరులు; నాడీనివహంబులు నదులు; తనూరుహంబులు తరువులు; నిశ్వాసంబులు వాయువులు; ప్రాయంబు నిరవధికంబయిన కాలంబు; కర్మంబులు నానావిధజంతునివహ సంవృత సంసరణంబులు; శిరోజంబులు మేఘంబులు; కట్టు పుట్టంబులు సంధ్యలు; హృదయంబు ప్రధానంబు; సర్వవికారంబులకు నాశ్రయంబైన మనంబు చంద్రుండు; చిత్తంబు మహత్తత్త్వం; బహంకారంబు రుద్రుండు; నఖంబు లశ్వాశ్వత ర్యుష్ట్ర గజంబులు; కటిప్రదేశంబు పశుమృగాదులు; విచిత్రంబులైన యాలాప నైపుణ్యంబులు పక్షులు; బుద్ధి మనువు; నివాసంబు పురుషుండు; షడ్జాదులైన స్వరవిశేషంబులు గంధర్వ విద్యాధర చారణాప్సర స్సమూహంబులు; స్మృతి ప్రహ్లాదుండు; వీర్యంబు దైత్య దానవానీకంబై యుండు; మఱియు న మ్మాహావిభునకు ముఖంబు బ్రాహ్మణులును, భుజంబులు క్షత్రియులును, నూరులు వైశ్యులును, జరణంబులు శూద్రులును, నామంబులు నానా విధంబులయిన వసురుద్రాది దేవతాభి ధానంబులును; ద్రవ్యంబులు హవిర్భాగంబులునుఁ; గర్మంబులు యజ్ఞప్రయోగంబులును నగు; నిట్టి సర్వమయుండైన పరమేశ్వరుని విగ్రహంబు ముముక్షువయినవాడు మనంబున ననుసంధానంబు సేయవలయు" నని వక్కాణించి వెండియు నిట్లనియె.
^విరాడ్విగ్రహము

టీకా:

వినుము = వినుము; భగవంతుడు = మహిమాన్వితుడు; ఐన = అయినట్టి; హరి = విష్ణుమూర్తి; విరాట్ = విరాట్టు - విశ్వరూపముగల; విగ్రహంబున్ = స్వరూపము; అందున్ = లో; భూత = జరిగిపోయినట్టివి; భవిష్యత్ = జరుగపోవునట్టివి; వర్తమానంబు = జరుగుచున్నట్టివి; ఐన = అయినట్టి; విశ్వంబున్ = మొత్తము విశ్వము; విలోక్యమానంబు = కనబడునది; అగున్ = అయి ఉండును; ధరణీ = భూమి; సలిల = నీరు; తేజః = నిప్పు; సమీరణ = గాలి; గగన = ఆకాశము; అహంకార = అహంకారము; మహత్ = మహత్తు; తత్త్వంబున్ = తత్త్వములు; అనియెడి = అనబడు; సప్త = ఏడు (7); ఆవరణంబులు = ఆవరణలు - పొరలు; చేతన్ = చేత; ఆవృతంబున్ = ఆవరింపబడినది; అగు = అయినట్టి; మహా = గొప్ప, మిక్కిలి పెద్దవైన; అండ = అండ(గ్రుడ్డు) రూప గోళముల; కోశంబు = దివ్యభాండాగారము; ఐన = అయినట్టి; శరీరంబు = స్వరూపము; అందున్ = లో; ధారణ = ధారణను; ఆశ్రయంబు = ఆశ్రయముగా కలది; అయిన = అయినట్టి; వైరాజ = పరబ్రహ్మ స్వరూప, వేదరూప, విరాట్; పురుషుండు = పూరుషుడు; తేజరిల్లున్ = ప్రకాశించును; ఆ = ఆ; మహాత్ముడు = గొప్పఆత్మ కలవాడు; కిన్ = కి; పాద = కాలి; మూలంబు = పాదములు; పాతాళంబు = పాతాళము; పార్ష్ణ = మడమ; భాగ = భాగములు; పాదాగ్ర = కాలి వేళ్ళు కల; భాగంబులు = భాగములు; రసా = రసా; తలంబు = తలము; గుల్ఫంబులు = చీలమండలు; మహా = మహా; తలంబు = తలము; జంఘలు = పిక్కలు; తలా = తలా; తలంబు = తలము; జాను = మోకాళ్ళ; ద్వయంబు = జంట; సు = సు; తలంబు = తలము; ఊరువులు = తొడలు; వితలా = వితలా; అతలంబు = అతలము; జఘనంబు = మొల; మహీ = మహీ, భూ; తలంబు = తలము; నాభీ = బొడ్డు యొక్క; వివరంబు = రంధ్రము; నభః = ఆకాశము; స్థలంబు = స్థలము; వక్షంబు = రొమ్ము; గ్రహ = గ్రహములు; తారకా = నక్షత్రములు; ఆముఖ = మొదలగు వానితో కూడిన; జ్యోతిః = జ్యోతిర్మండలముల; సమూహ = సమూహముల; సమేతంబు = కూడినది; అగు = అయిన; నక్షత్ర = నక్షత్ర; లోకంబు = లోకము; గ్రీవంబు = మెడ; మహః = మహా; లోకంబు = లోకము; ముఖంబు = ముఖము; జన = జన; లోకంబు = లోకము; లలాటంబు = నుదురు; తపః = తపో; లోకంబు = లోకము; శీర్షంబు = తల; సత్య = సత్య; లోకంబు = లోకము; బాహుదండంబులు = చేతులు; ఇంద్ర = ఇంద్రుడు; ఆదులు = మొదలగువారు; కర్ణంబులు = చెవులు; దిశలు = దిక్కులు; శ్రవణ = వినునట్టి; ఇంద్రియంబులు = ఇంద్రియములు, చెవిరంధ్రములు; శబ్దంబు = చప్పుడు; నాసా = ముక్కు; పుటంబులు = పుటములు; అశ్వనీ = అశ్వనీ; దేవతలు = దేవతలు; ఘ్రాణ = వాసనచూసు; ఇంద్రియంబు = ఇంద్రియము; గంధంబు = వాసన; వదనంబు = నోరు; వహ్ని = అగ్ని; నేత్రంబులు = కళ్ళు; అంతరిక్షంబు = అంతరిక్షము {అంతరిక్షంబు - అంతర్ + ఈక్షంబు - రెండు వస్తువుల మధ్యన చూడబడునది, ఆకాశము, space}; చక్షుస్ = చూచునట్టి; ఇంద్రియంబు = ఇంద్రియము; సూర్యుడు = సూర్యుడు; రేయిన్ = రాత్రి; పగళ్ళు = పగళ్ళు; ఱెప్పలు = కనురెప్పలు; భ్రూ = కనుబొమల; యుగ్మ = జంట; విజృంభణము = వికాశము; బ్రహ్మ = బ్రహ్మ; పదంబు = లోకము; తాలువులు = దౌడలు; జలంబు = నీరు; జిహ్వ = రుచిచూచునట్టి, నాలుక; ఇంద్రియంబు = ఇంద్రియము; రసంబు = రుచి; భాషణంబులు = పలుకులు; సకల = సమస్త; వేదంబులు = వేదములు; దంష్ట్రలు = కోరలు; దండధరుండు = యముడు; దంతంబులు = పలువరుస; పుత్ర = పుత్రులు; ఆది = మొదలగు; స్నేహ = స్నేహము యొక్క; కళలు = విలాసములు; నగవులు = నవ్వులు; జన = జనములకు; ఉన్మాద = వెఱ్ఱెక్కించ; కరంబులు = కలిగినవి; అయిన = అయినట్టి; మాయా = మాయ యొక్క; విశేషంబులు = లక్షణములు; కటాక్షంబులు = కడగంటిచూపులు, దయ; అనంత = అనంతమైన; సర్గంబులు = సృష్టులు; పెదవులు = పెదవులు; వ్రీడా = సిగ్గులు మరియు; లోభంబులు = లోభములు; స్తనంబులు = వక్షోజములు; ధర్మంబులు = ధర్మములు; వెన్ను = వెన్నెముక; అధర్మంబులు = అధర్మము యొక్క; మార్గంబు = ప్రవర్తన; మేఢ్రంబు = మేఢ్రము - పురుష జననేంద్రియము; ప్రజాపతి = ప్రజాపతి; వృషణంబులు = వృషణములు; మిత్రా = మిత్రుడు మరియు; వరుణులు = వరుణులు; జఠరంబు = జీర్ణకోశంబు; సముద్రంబులు = సముద్రములు; శల్య = ఎముకల; సంఘంబులు = గూడు; గిరులు = పర్వతములు; నాడీ = నాడీ; నివహంబులు = సమూహములు; నదులు = నదులు; తనుస్ = శరీరము పై; ఊరుహంబులు = మొలచునవి, రోమములు; తరువులు = చెట్లు; నిశ్వాసంబులు = ఊపిరులు; వాయువులు = గాలులు; ప్రాయంబు = వయస్సు; నిరవధికంబు = అంతులేనిది; అయిన = అయినట్టి; కాలంబు = కాలము; కర్మంబులు = చేసికొను పనులు, వృత్తి; నానా = అన్ని; విధ = రకముల; జంతు = జంతువుల; నివహ = సమూహముల; సంవృత = గుంపు; సంసరణంబులు = సంసారములు; శిరోజంబులు = తలవెంట్రుకలు; మేఘంబులు = మేఘములు; కట్టు = కట్టుకొను; పుట్టంబులు = వస్త్రములు; సంధ్యలు = సంధ్యలు; హృదయంబు = గుండె, హృదయము; ప్రధానంబు = మూలప్రకృతి; సర్వ = సమస్తమైన; వికారంబులు = వికారములు; కున్ = కి; ఆశ్రయంబు = ఆశ్రయము; ఐన = అయినట్టి; మనంబు = మనస్సు; చంద్రుండు = చంద్రుడు; చిత్తంబు = ఇంద్రియములతో కూడిన మనస్సు {చిత్తము - ఇంద్రియములతో కూడిన మనస్సు, సంశయ రూపము}; మహత్ = మహత్తు అను; తత్త్వంబు = తత్త్వము; అహంకారంబు = అహంకారము; రుద్రుండు = రుద్రుడు; నఖంబులు = గోర్లు; అశ్వ = గుఱ్ఱములు; అశ్వతరి = ఆడు కంచర గాడిదలు; ఉష్ట్ర = ఒంటెలు; గజములు = ఏనుగులు; కటి = నడుము; ప్రదేశము = భాగము; పశు = పశువులు {పశువులు - 1. పాశబద్ధమగునవి, పెంపుడు జంతువులు, ఆవులు మొదలగునవి. 2. సంసార బంధనాలచే బద్దులు, జీవులు, వ్యు, పశ్+కు, పాశ్యతే బధ్యతే అసౌ, బంధింపబడినది. గ్రామ్య పశువు.}; మృగ = మృగములు {మృగములు - అడవిజంతువులు}; ఆదులు = మొదలగునవి; విచిత్రంబులు = విచిత్రములు - ప్రత్యేకములు; ఐన = అయినట్టి; ఆలాప = రాగ; నైపుణ్యంబులు = నేర్పరితనములు; పక్షులు = పక్షులు; బుద్ధి = బుద్ధి; మనువు = మనువు యొక్క; నివాసంబు = నివాసము; పురుషుండు = (పరమ) ఆత్మ; షడ్జ = షడ్జమము (ని); ఆదులు = మొదలగునవి; ఐన = అయిన; స్వర = (సప్త) స్వరములలోని; విశేషంబులు = రకములు; గంధర్వ = గంధర్వులు; విద్యాధర = విద్యాధరులు; చారణ = చారణలు; అప్సరస = అప్సరసలు యొక్క; సమూహంబులు = గుంపులు; స్మృతి = స్మరణలు; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; వీర్యంబు = వీరత్వము; దైత్య = రాక్షసులు; దానవా = దానవులు యొక్క; అనీకంబు = సేన; ఐ = అయి; ఉండున్ = ఉండును; మఱియున్ = ఇంకనూ; ఆ = ఆ; మహా = గొప్ప; విభునకున్ = ప్రభువునకు; ముఖంబు = ముఖము; బ్రాహ్మణులునున్ = బ్రాహ్మణులును; భుజంబులు = భుజములు; క్షత్రియులునున్ = రాజులును; ఊరులు = తొడలు; వైశ్యులునున్ = వర్తకులును; చరణంబులు = పాదములు; శూద్రులునున్ = శూద్రులును; నామంబులు = పేర్లు; నానా = వివిధ; విధంబులు = విధములు; ఐన = అయిన; వసు = వసువులు; రుద్ర = రుద్రులు; ఆది = మొదలగు; దేవత = దేవతల; ఆభిదానంబులు = పేర్లు; ద్రవ్యంబులు = వస్తువులు; హవిర్భాగంబులును = హవిర్భాగములును {హవిర్భాగములు - హవిస్సులు (యజ్ఞకుండమున దేవతలకై వేల్చబడిన అన్నము నెయ్యి) అందలి దేవతల వారివారి భాగములు}; కర్మంబులు = కర్మలు, పూజనములు; యజ్ఞ = యజ్ఞములు; ప్రయోగంబులును = కార్యములును; అగున్ = అగును; ఇట్టి = ఇటువంటి; సర్వ = సర్వమును; మయుండు = నిండినవాడు - సర్వమయుడు; ఐన = అయినట్టి; పరమ = పరమమైన; ఈశ్వరుని = ప్రభువు యొక్క; విగ్రహంబు = విగ్రహమును - స్వరూపమును; ముముక్షువు = మోక్షమును కోరువాడు; ఐన = అయినట్టి; వాడు = మానవుడు; మనంబునన్ = మనస్సులో; అనుసంధానంబున్ = లగ్నముచేసికొనుట; చేయన్ = చేసి; వలయును = తీరవలెను; అని = అని; వక్కాణించి = చెప్పి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

పరీక్షిత్తు విభుడా! విను, భగవంతుడైన విష్ణుని విరాటస్వరూపంలో జరిగిన, జరగనున్న, జరుగుతున్న ప్రపంచమంతా గోచరిస్తుంది. భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్త్వము అనే ఆవరణాలు ఏడూ మహాండకోశమైన విరాట్పురుషుని శరీరమే అయి ఉన్నాయి. ఆ శరీరంలో ధారణకు నెలవై విరాట్పురుషుడు ప్రకాశిస్తున్నాడు. ఆ మహాత్ముడికి పాతాళం అరికాలు; రసాతలం కాలిమడమ మునివ్రేళ్ళు; మహాతలం చీలమండలు; తలాతలం పిక్కలు; సుతలం మోకాళ్ళు రెండు; వితలము అతలము తొడలు; భూతలం పిరుదు; ఆకాశం బొడ్డు; గ్రహాలూ తారకలూ మొదలైన జ్యోతిస్సమూహంతో కూడిన నక్షత్రలోకం వక్షస్థలం; మహర్లోకం మెడ; జనలోకం ముఖం; తపోలోకం నొసలు; సత్యలోకం శిరస్సు; ఇంద్రుడు మొదలైనవారు భుజదండాలు; దిక్కులు చెవులు; శబ్దం శ్రోత్రేంద్రియం; అశ్వినీ దేవతలు ముక్కుపుటాలు; గంధం ఘ్రాణేంద్రియం; అగ్ని నోరు; అంతరిక్షం కళ్లు; సూర్యుడు నేత్రేంద్రియం; రేయింబవళ్ళు కనురెప్పలు; బ్రహ్మపదం కనుబొమలు; జలాలు దవడలు; రసం జిహ్వేంద్రియం; సమస్త వేదాలు భాషణాలు; తుదిలేని సృష్టులే కడగంటి చూపులు; సిగ్గు లోభం పెదవులు; ధర్మ మార్గాలు కడుపు; కొండలు ఎముకలు; నదులు నాడులు; చెట్లు రోమాలు; వాయువు నిట్టూర్పులు; కడలేని కాలమే ప్రాయం; పలువిధాలైన ప్రాణులతో గూడిన సంసారాలు కర్మలు; మబ్బులు శిరోజాలు; సంధ్యలు కట్టుబట్టలు; ప్రధానం హృదయం; చంద్రుడు వికారాలన్నింటికీ నెలవైన మనస్సు; మహత్తత్త్వం చిత్తం; రుద్రుడు అహంకారం; గుఱ్ఱాలు, కంచరగాడిదలు, ఒంటెలు, ఏనుగులు గోళ్ళు; పశువులు, మృగాదులు కటిప్రదేశం; పక్షులు చిత్రమైన మాటల నేర్పులు; మనువు బుద్ధి; పురుషుడు నివాసం; దానవులు వీర్యం. అంతేకాదు. ఆ మహాప్రభువునకు బ్రాహ్మణులు ముఖం; క్షత్రియులు బాహువులు; వైశ్యులు తొడలు; శూద్రులు పాదాలు; వసువులు రుద్రులు మొదలైన పెక్కు దేవతల పేర్లే నామాలు; హవిర్భాగాలు ద్రవ్యాలు; యజ్ఞప్రయోగాలు కర్మలు అవుతున్నాయి. ఇటువంటి విశ్వమయుడైన విరాట్పురుషుని విగ్రహాన్ని మోక్షార్థి అయినవాడు తన మనస్సులో అనుసంధానం చేసుకోవాలి.” అంటూ చెప్పి, ఇంకా ఈ విధంగా చెప్పసాగాడు శుకముని.