పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శ్రీహరి నిత్యవిభూతి

  •  
  •  
  •  

2-280-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రహ్మసంబంధి యగు నీ కల్పప్రకారం బవాంతరకల్పంబుతోడ సంకుచిత ప్రకారంబున నెఱింగిచింతి; నిట్టి బ్రహ్మకల్పంబున నొప్పు ప్రాకృత వైకృత కల్పప్రకారంబులునుఁ, దత్పరిమాణంబులును, కాలకల్పలక్షణంబులును, నవాంతరకల్ప మన్వంతరాది భేదవిభాగ స్వరూపంబును నతి విస్తారంబుగ నెఱిగింతు విను; మదియునుం బద్మకల్పం బనందగు" నని భగవంతుండైన శుకుండు బరీక్షిత్తునకు జెప్పె" నని సూతుండు మహర్షులకు నెఱింగిచిన.

టీకా:

బ్రహ్మ = బ్రహ్మకు; సంబంధి = సంబంధించినది; అగు = అయిన; ఈ = ఈ; కల్ప = కల్పముల; ప్రకారంబున్ = విధానములు; అవాంతరకల్పంబున్ = కల్పాంతర ప్రళయము; తోడన్ = తో; సంకుచిత = సంగ్రహ; ప్రకారంబునన్ = రూపముగ; ఎఱింగించితిన్ = తెలిపితిని; ఇట్టి = ఇటువంటి; బ్రహ్మకల్పంబునన్ = బ్రహ్మకల్పములో; ఒప్పు = అమరు; ప్రాకృత = ప్రకృతి యొక్క; వైకృత = జీవుల యొక్క; కల్ప = సృష్టి; ప్రకారంబులునున్ = విధానములును; తత్ = వాని; పరిమాణంబులునున్ = పరిమాణములు; కాల = కాలముల; కల్ప = కల్పముల; లక్షణంబులునున్ = లక్షణాలు; అవాంతరకల్పము = ప్రళయము; మన్వంతర = మన్వంతరములు; ఆది = మొదలైన; భేద = భేదముల; విభాగ = విభాగముల; స్వరూపంబునున్ = స్వరూపములును; అతి = మిక్కిలి; విస్తారంబుగన్ = విస్తారముగ; ఎఱిగింతున్ = తెలిపెదను; వినుము = వినుము; అదియునున్ = దానిని; పద్మకల్పంబున్ = పద్మకల్పము; అనన్ = అనుట; తగున్ = తగును; అని = అని; భగవంతుండు = భగవంతుడు {భగవంతుడు - గొప్ప మహిమ కలవాడు}; ఐనన్ = అయిన; శుకుండున్ = శుకుడు; పరీక్షితున్ = పరీక్షితున; కున్ = కు; చెప్పెన్ = చెప్పెను; అని = అని; సూతుండు = సూతుడు; మహర్షులున్ = మహర్షుల; కున్ = కు; ఎఱింగించినన్ = తెలిపిన;

భావము:

పరబ్రహ్మకు సంబంధించిన ఈ కల్ప స్వరూపాన్ని అవాంతర కల్పంతో సహా సంగ్రహంగా చెప్పాను. ఇలాంటి ప్రాకృతాలు, వైకృతాలు అయిన కల్పాల విధానాలు, వాటి పరిమాణాలు, కాల లక్షణాలు, కల్పాల లక్షణాలు, అవాంతర కల్పాలు, మన్వంతరాలు మొదలైన వాని భేదాలు, విభాగాలు విపులంగా వివరిస్తాను, వినుము. దాన్ని “పద్మకల్ప” మని కూడ అంటారు. అని భగవంతుడైన శుకయోగి పరీక్షిత్తునకు చెప్పినట్లు సూతుడు శౌనకాది మహర్షులకు వెల్లడించాడు.