పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : బ్రహ్మకు ప్రసన్ను డగుట

  •  
  •  
  •  

2-248-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవా! సర్వభూతాంతర్యామివై భగవంతుండవైన నీకు నమస్కరించి మదీయవాంఛితంబు విన్నవించెద నవధరింపు; మవ్యక్తరూపంబులై వెలుంగు భవదీయ స్థూలసూక్ష్మ రూపంబులును నానా శక్త్యుపబృంహితంబులైన బ్రహ్మాది రూపంబులును నీ యంత నీవే ధరించి జగదుత్పత్తిస్థితిలయంబులం దంతుకీటకంబునుం బోలెఁ గావించుచు నమోఘ సంకల్పుండవై లీలావిభూతిం గ్రీడించు మహిమంబు దెలియునట్టి పరిజ్ఞానంబుఁ గృప సేయుము; భవదీయశాసనంబున జగన్నిర్మాణంబు గావించు నపుడు బ్రహ్మాభిమానంబునం జేసి యవశ్యంబును మహదహంకారంబులు నామదిం బొడముం గావునఁ దత్పరిహారార్థంబు వేడెద; నన్నుం గరుణార్ద్రదృష్టి విలోకించి దయసేయు;" మని విన్నవించిన నాలించి పుండరీకాక్షుం డతని కిట్లనియె.

టీకా:

దేవ = దేవుడు; సర్వ = సమస్తమైన; భూత = జీవులలోను; అంతర్యామివిన్ = అంతర్యామివి, లోన ఉండేవాడవు {అంతర్యామి - అతరమందు (లోపల) యామి వ్యాపించి ఉండువాడు, అంతరాత్మ, భగవంతుడు}; ఐ = అయి; భగవంతుడవున్ = భగవంతుడవు {భగవంతుడు - సమస్త మహిమలు కలవాడు}; ఐన = అయినట్టి; నీకున్ = నీకు; నమస్కరించి = మొక్కి; మదీయ = నా యొక్క; వాంఛితంబున్ = కోరికను; విన్నవించెదన్ = వినిపించెదను; అవధరింపుము = ఆలకించి ధరించు; అవ్యక్త = అవ్యక్తమైన; రూపంబులున్ = స్వరూపాలు; ఐ = అయి; వెలుంగు = ప్రకాశించే; భవదీయ = నీ; స్థూల = స్థూలమైన; సూక్ష్మ = సూక్ష్మమైన; రూపంబులునున్ = స్వరూపములును; నానా = అనేక; శక్తి = శక్తులు; ఉపబృంహితంబున్ = పెంపొందినవి; ఐన = అయిన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగు; రూపంబులునున్ = స్వరూపములును; నీ యంత నీవే = నీ యంత నీవే; ధరించి = ధరించి, స్వీకరించి; జగత్ = లోకములను; ఉత్పత్తిన్ = సృష్టి; స్థితి = స్థితి; లయంబులన్ = లయములను; తంతుకీటకంబునున్ = పట్టుపురుగు; పోలెన్ = వలె; కావించుచున్ = చేయుచు; అమోఘ = అమోఘమైన, తిరుగులేని; సంకల్పుండవు = సంకల్పము కలవాడవు; ఐ = అయి; లీలన్ = లీలల {లీల - ప్రయత్నరహితముగను, లేనిది ఉన్నట్లనిపింప జేయు}; విభూతిన్ = వైభవములలో; క్రీడించు = క్రీడించెడి; మహిమంబున్ = మహిమను; తెలియున్ = తెలిసికొనగల; అట్టి = సరిపడునట్టి; పరిజ్ఞానమున్ = నేర్పును; కృపన్ = దయ; చేయుము = చేయుము; భవదీయ = నీ యొక్క; శాసనంబునన్ = ఆఙ్ఞానుసారము; జగత్ = లోకములను; నిర్మాణంబున్ = నిర్మాణమును; కావించున్ = చేయుచున్న; అపుడు = అప్పుడు; బ్రహ్మా = బ్రహ్మను అను; అభిమానంబునన్ = అహంకారము; చేసి = వలన; అవశ్యంబునున్ = తప్పక; మహత్ = గొప్పతన; అహంకారంబులున్ = అహంకారములు; నా = నా; మదిన్ = మనసున; పొడమున్ = పుట్టును; కావునన్ = అందచేత; తత్ = వాని; పరిహారాన్ = విరుగుడు, తొలగుట; అర్థంబున్ = కోసము; వేడెదన్ = ప్రార్థించెదను; నన్నున్ = నన్ను; కరుణ = దయతో; ఆర్ద్ర = ఆర్ద్రమైన, మెత్తబడ్డ; దృష్టిన్ = దృష్టితో; విలోకించి = చూచి; దయసేయుము = ప్రసాదించుము; అని = అని; విన్నవించినన్ = వేడుకొనిన; ఆలించి = విన్నవాడై; పుండరీకాక్షుండున్ = పుండరీకాక్షుడు {పుండరీకాక్షుడు - పుండరీకముల (తెల్లతామరల) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; అతనిన్ = అతనికి (బ్రహ్మదేవుని); కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;

భావము:

ఓ దేవా! నీవు సకల భూతాల అంతరాత్మవు అయి ఉండేవాడవు, భగవంతుడవు. నీకు నమస్కరించి నా కోరిక విన్నవించుకుంటాను. అనుగ్రహించు. అవ్యక్త స్వరూపాలలో ప్రకాశించే నీ యొక్క స్థూల సూక్ష్మ రూపాలను; సకల శక్తులతో కూడిన బ్రహ్మదేవుడు మున్నగు రూపములును సమస్తం సృష్టి స్థితి లయములను సాలెపురుగు గూడు అల్లినట్లు నీ అంతట నీవె ధరించి నిర్వహించుచు ఉంటావు. అమోఘ స్వసంకల్పశక్తితో లీలావిభూతితో క్రీడిస్తు ఉంటావు. అట్టి నీ మహిమను నాకు విశదీకరించు. నీ ఆజ్ఞానువర్తిని అయి జగత్తు నిర్మించే సమయంలో బ్రహ్మదేవుడను అనే మోహం అహంకారం తప్పక జనిస్తాయి కదా. దానికి పరిహారం అనుగ్రహించ మని వేడుకుంటున్నాను. నన్ను కృపాదృష్టితో కటాక్షించి అనుగ్రహించు" అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. అది విన్న పద్మాక్షుడు ఇలా చెప్పసాగాడు.