పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : భాగవతపురాణ వైభవంబు

  •  
  •  
  •  

2-7-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ద్వైపాయనుఁడు నాదు తండ్రి, ద్వాపరవేళ-
బ్రహ్మసమ్మితమైన భాగవతముఁ
ఠనంబు జేయించె; బ్రహ్మతత్పరుఁడనై-
యుత్తమ శ్లోకలీలోత్సవమున
నాకృష్ట చిత్తుండనై పఠించితి; నీవు-
రి పాద భక్తుఁడ గుటఁ జేసి
యెఱిఁగింతు వినవయ్య; యీ భాగవతమున-
విష్ణుసేవాబుద్ధి విస్తరిల్లు;

2-7.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మోక్షకామునకును మోక్షంబు సిద్ధించు;
వభయంబు లెల్లఁ బాసిపోవు;
యోగిసంఘమునకు నుత్తమవ్రతములు
వాసుదేవనామర్ణనములు.

టీకా:

ద్వైపాయనుండు = వ్యాసుడు; నాదు = నా యొక్క; తండ్రి = తండ్రి; ద్వాపర = ద్వాపర; వేళన్ = యుగమునందు; బ్రహ్మ = బ్రహ్మ; సమ్మితము = సమానమైన పరిమితి కలది; ఐన = అయినట్టి; భాగవతమున్ = భాగవతమును; పఠనంబున్ = అధ్యయనము; చేయించెన్ = చేయించెను; బ్రహ్మ = పరబ్రహ్మమునందు; తత్పరుండన్ = మనస్సు లగ్నమైన వానిని; ఐ = అయ్యి; ఉత్తమశ్లోక = కృష్ణుని {ఉత్తమశ్లోకుడు - ఉత్తములచే కీర్తింపబడువాడు, కృష్ణుడు}; లీలా = విలాసముల - లీలల; ఉత్సవమునన్ = వేడుకచేతను - సంతోషముతో; ఆకృష్ట = ఆకర్షింపబడిన; చిత్తుండన్ = మనస్సుగల వాడను; ఐ = అయ్యి; పఠించితిన్ = అధ్యయనము చేసితిని; నీవున్ = నీవుకూడ; హరి = విష్ణువు యొక్క; పాద = పాదములందు; భక్తుఁడవు = భక్తుడవు; అగుటన్ = అగుట; చేసి = చేత; ఎఱిఁగింతున్ = తెలియజేయుదును; విను = వినుము; అయ్య = తండ్రి; ఈ = ఈ; భాగవతమున = భాగవతములో; విష్ణు = హరిని; సేవా = సేవించవలెనను; బుద్ధి = ఆలోచనలు - బుద్ధి; విస్తరిల్లున్ = వృద్ధిచెందును;
మోక్ష = మోక్షము; కామునకున్ = కోరువానికి; మోక్షంబు = మోక్షము; సిద్ధించున్ = లభించును; భవ = జన్మజన్మల - మృత్యు; భయంబుల్ = భయములు; ఎల్లన్ = అన్నియును; పాసి = తొలగి; పోవున్ = పోవును; యోగి = యోగుల; సంఘమునకున్ = సమూహమునకు; ఉత్తమ = ఉత్తమమైన; వ్రతములు = ఆచరించవలసినవి - పూజనములు; వాసుదేవ = హరి యొక్క {వాసుదేవుడు - సమస్తమందు వసించు దేవుడు}; నామ = నామముల; వర్ణనములు = కీర్తించుటలు.

భావము:

నా తండ్రి యైన వ్యాసభగవానుడు ద్వాపరయుగంలో వేదతుల్యమైన భాగవతం నా చేత చదివించాడు. పరబ్రహ్మమందు లగ్నచిత్తుడనైన నేను భగవంతుని అవతారలీలలు నన్నాకర్షించడంవల్ల దీనిని పఠించాను. నీవు పంకజాక్షుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తుడివి. అందువల్ల నీకు భాగవతతత్త్వం తెలియపరుస్తాను. మహారాజా! వినవయ్యా! భాగవత శ్రవణం వల్ల విష్ణువును సేవించాలనే బుద్ధి విశాల మవుతుంది. మోక్షం కాంక్షించువాడికి ముక్తి లభిస్తుంది. జన్మము, జర, మరణాది సంసార భయాలన్నీ సమసిపోతాయి. వాసుదేవ నామ సంకీర్తనలే యోగిసత్తములకు ఉత్తమ వ్రతాలు.