పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : భాగవత వైభవంబు

  •  
  •  
  •  

2-203-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియును సంసారమగ్నులయి దివసంబులు ద్రోఁచియు నంతంబున శునక సృగాల భక్షణంబులైన కాయంబులందు మమత్వంబు సేయక భగవదర్పణంబు సేసిన పుణ్యాత్ములుం గొందఱు గల రెఱింగింతు; వినుము; నేను నీ బ్రహ్మత్వంబునం జెందు రాజసంబు విడిచి యమ్మహాత్ముని పాదారవిందంబుల భక్తినిష్ఠుండ నయి శరణాగతత్వంబున భజియించు నప్పుడు దెలియుదు రాజసగుణుండనై యున్న వేళం దెలియంజాలఁ; గావున శాస్త్రంబులు ప్రపంచింపక కేవల భక్తిజ్ఞానయోగంబున సేవింతు; మఱియు సనకాదులగు మీరును, భగవంతుండైన రుద్రుండును, దైత్యపతియైన ప్రహ్లాదుండును, స్వాయంభువమనువును, నతని పత్ని యగు శతరూపయుఁ, దత్పుత్రులగు ప్రియవ్రతోత్తానపాదులునుం, దత్పుత్రికలగు దేవహూత్యాదులునుం, బ్రాచీనబర్హియు, ఋభువును, వేనజనకుం డగు నంగుండును, ధ్రువుండును గడవంజాలుదురు వెండియు.

టీకా:

మఱియును = ఇంక; సంసార = సంసారములో; మగ్నులు = మునిగినవారు; అయి = అయి; దివసంబులున్ = రోజులు; తోఁచియున్ = గడపేసి; అంతంబునన్ = చివరకి (చనిపోయాక); శునక = కుక్కలు; సృగాల = నక్కలుకి; భక్షణంబున్ = తినదగినవి; ఐన = అయిన; కాయంబులున్ = శరీరములు; అందున్ = వలని; మమత్వంబున్ = నాది అను భావించుట {మమత్వము - మమకారము, ఇది నాది అను అభాస భావము యొక్క బంధనములు}; సేయక = చేయకుండా; భగవత్ = భగవంతునకు; అర్పణంబున్ = సమర్పించుకొనుట; చేసిన = చేసినట్టి; పుణ్యాత్ములున్ = పుణ్యాత్ములును; కొందరు = కొంతమంది; కలరు = ఉన్నారు; ఎఱింగింతున్ = చెప్తాను; వినుము = వినుము; నేనున్ = నేను (బ్రహ్మదేవుడు); ఈ = ఈ; బ్రహ్మత్వంబునన్ = సృష్ట్యాధికారము వలన; చెందు = కలుగు; రాజసంబున్ = రజోగుణమును; విడిచి = వదలి; ఆ = ఆ; మహాత్మునిన్ = గొప్పవాని; పాద = పాదములు అను; అరవిందంబులన్ = పద్మములను; భక్తిన్ = భక్తి; నిష్ఠుండన్ = నిష్ఠ కలవాడను; అయి = అయి; శరణాగత = శరణాగతము యొక్క; తత్వంబున = భావముతో; భజియించున్ = సేవించు; అప్పుడు = సమయమున; తెలియుదున్ = తెలిసికొనగలను; రాజస = రజో; గుణుండన్ = గుణములు కలవాడను; ఐ = అయి; ఉన్న = ఉన్నట్టి; వేళన్ = సమయములో; తెలియన్ = తెలిసికొనుటకు; చాలఁన్ = సరిపోను; కావునన్ = అందుచేత; శాస్త్రంబులున్ = శాస్త్రములను; ప్రపంచింపక = విస్తరింపచేసుకొనక; కేవల = కేవలము; భక్తి = భక్తి; ఙ్ఞాన = ఙ్ఞాన; యోగంబునన్ = యోగము వలన; సేవింతున్ = సేవింతును; మఱియున్ = ఇంక; సనక = సనకసనందనులు; ఆదులున్ = మొదలగువారు; అగు = అయిన; మీరునున్ = మీరును; భగవంతుండు = మహిమాన్వితుడు; ఐన = అయిన; రుద్రుండును = శివుడును; దైత్య = రాక్షసుల; పతి = ప్రభువు; ఐన = అయిన; ప్రహ్లాదుండునున్ = ప్రహ్లాదుడును; స్వాయంభువ = స్వాయంభువ అను; మనువునున్ = మనువును; అతని = అతని; పత్ని = భార్య; అగు = అయిన; శతరూపయున్ = శతరూప యును; తత్ = వారి; పుత్రులు = కుమారులు; అగు = అయిన; ప్రియవ్రత = ప్రియవ్రతుడు; ఉత్తనపాదులునున్ = ఉత్తానపాదుడును; తత్ = వారి; పుత్రికలు = కుమాఱ్ఱెలు; అగు = అయిన; దేవహూతి = దేవహూతి; ఆదులునుం = మున్నగువారు; తత్ దత్పుత్రికలగు దేవహూత్యాదులు, ప్రాచీనబర్హియున్ = ప్రాచీనబర్హియును; ఋభువునున్ = ఋభువును; వేన = వేనుని; జనకుండు = తండ్రి; అగు = అయిన; అంగుండునున్ = అంగుడును; ధ్రువుండునున్ = ధ్రువుడును; కడవన్ = దాట; చాలుదురున్ = కలరు; వెండియున్ = ఇంక.

భావము:

ఇంతేకాదు. ఇంక కొందరు పుణ్యాత్ము లున్నారు. వాళ్ల సంగతి వివరిస్తాను విను. వాళ్లు సంసారంలో మునగి తేలుతూ దినాలు గడిపిన చివరకి కుక్కలు, నక్కలు పీక్కొని తినే ఈ శరీరాలపై మమకారం పెట్టుకోలేదు. తమ దేహాలను పూర్తిగా భగవంతునికే అర్పించారు. నేను బ్రహ్మదేవుడిని గదా అన్న గర్వంతో ఒక్కొక్కసారి రజోగుణం నన్ను ఆక్రమిస్తుంది. ఆ సందర్భంలో నే నా మహాత్ముని తత్త్వం ఇలాంటి దని తెలుసుకోలేను. రజోగుణం వదలి భక్తియుక్తుడనై ఆయన పాదపద్మాలను శరణాగతి భావంతో సేవించేటప్పుడు మాత్రమే ఆ భగవన్మహిమ తెలుసుకోగలుగుతున్నాను. అందుచేతనే శాస్త్రాలపై ఆధారపడక భక్తి జ్ఞానయోగాలతో మాత్రమే నేను ఆ పరమాత్మను సేవిస్తాను. నేను కాదు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, నీవు మొదలైన వాళ్లు, భగవంతుడైన శివుడు, దైత్యులను పాలించే ప్రహ్లాదుడు, స్వాయంభువుడనే మనువు, అతని భార్య శతరూప అనే సతీమణి, వాళ్ల కుమారులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, పుత్రికలైన దేవహూతి మొదలైనవారు, ప్రాచీనబర్హి అనే రాజేంద్రుడు, ఋభువు అనే మహర్షి, వేనుని తండ్రి అయిన అంగుడు, ఉత్తానపాదుని కుమారుడగు ధ్రువుడు భగవన్మాయను తరింపగల్గినవారే. ఇంకా విను.