పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : గోవర్థనగిరి ధారణంబు

  •  
  •  
  •  

2-187-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్తాబ్దంబుల బాలుఁడై నిజభుజాస్తంభంబునన్ లీలమై
ప్తాహంబులు శైలరాజము లసచ్ఛత్త్రంబుగాఁ దాల్చి, సం
గుప్తప్రాణులఁ జేసె మాధవుఁడు గోగోపాలకవ్రాతమున్
ప్తాంభోధి పరీతభూధరున కాశ్చర్యంబె చింతింపఁగన్.

టీకా:

సప్త = ఏడు; అబ్దంబులన్ = సంవత్సరాల (వయసున్న); బాలుఁడు = బాలకుడు; ఐ = అయి; నిజ = తన; భుజ = భుజము అను; స్తంభంబునన్ = స్తంభము మీద; లీలమై = లీలతో; సప్త = ఏడు; అహంబులున్ = దినములు; శైల = పర్వతములలో; రాజమున్ = గొప్పదానిని; లసత్ = తళుకుల; ఛత్రంబు = గొడుగు; కాన్ = అయినట్లు, వలె; తాల్చి = ధరించి; సంగుప్త = బాగుగా దాచబడిన; ప్రాణులఁన్ = జీవులను; చేసెన్ = చేసెను; మాధవుఁడు = కృష్ణుడు {మాధవుడు - మాధవి భర్త, భగవంతుడు}; గో = గోవుల; గోపాలక = గోపకుల; వ్రాతమున్ = సమూహములను; సప్త = ఏడు; అంభోధిన్ = సముద్రముల; పరీత = పర్యంతమైన; భూ = భూమిని; ధరున్ = ధరించువాని; కిన్ = కి; ఆశ్చర్యంబె = ఆశ్చర్యకరమైన పనా; చింతింపగన్ = ఆలోచించి చూస్తే.

భావము:

శ్రీకృష్ణుడు ఏడేళ్ళ బాలుడై ఉన్నా ఏడు రోజుల పాటు స్తంభములాంటి తన భుజముపై అలవోకగా శ్రేష్ఠమైన శైలము గోవర్థనగిరిని ఓ ప్రకాశించే గొడుగులాగ ఎత్తి పట్టుకున్నాడు. గోవులను గోపాలకులను దాని మరుగున దాచి అందరి ప్రాణాలను రక్షించాడు. సప్తసముద్రాలతో చుట్టబడి ఉండే భూమి నంతటిని ధరించిన ఆ పరమపురుషునికి ఇది వింత పనేం కాదు.