పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : కృష్ణావతారంబు

  •  
  •  
  •  

2-174-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పుండరీకాక్షుం డగు నారాయణుండు సమస్త భూభార నివారణంబు సేయం దన మేనికేశద్వయంబ చాలునని యాత్మ ప్రభావంబు దెలుపుకొఱకు నిజకళాసంభవులైన రామకృష్ణుల దేహవర్ణంబులు శ్వేతకృష్ణం బని నిర్దేశించుకొఱకు సితాసితకేశద్వయ వ్యాజంబున రామకృష్ణాఖ్యల నలరి యవతరించె నందు భగవంతుడును సాక్షాద్విష్ణుండును నైన కృష్ణుండు జనమార్గవర్తి యయ్యును నతిమానుష్యకర్మంబుల నాచరించుటం జేసి కేవల పరమేశ్వరుం డయ్యె; నమ్మహాత్ముం డాచరించు కార్యంబులు లెక్కపెట్ట నెవ్వరికి నలవిగాదు అయినను నాకు గోచరించిన యంత యెఱింగించెద వినుము.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పుండరీకాక్షుండు = విష్ణువు {పుండరీకాక్షుడు - పుండరీకములు (తామరాకుల) వంటి కన్నులు ఉన్న వాడు - భగవంతుడు}; అగు = అయిన; నారాయణుండు = విష్ణువు; సమస్త = సమస్తమైన; భూ = భూమి యొక్క; భార = భారములను; నివారణంబున్ = తొలగ; చేయన్ = చేయుటకు; తన = తన; మేని = శరీరము నందలి; కేశ = రోమముల; ద్వయంబ = జంట మాత్రము; చాలును = సరిపోవును; అని = అని; ఆత్మ = తన; ప్రభావంబున్ = ప్రభావమును; తెలుపు = తెలియజేయు; కొఱకున్ = కోసము; నిజ = తన; కళా = అంశ యందు; సంభవులు = పుట్టినవారు; ఐన = అయినట్టి; రామ = బలరామ; కృష్ణుల = కృష్ణుల యొక్క; దేహ = శరీరపు; వర్ణంబులున్ = రంగులను; శ్వేత = తెలుపు; కృష్ణంబు = నలుపు; అని = అని; నిర్దేశించు = నిర్ధారముగ చూపుట; కొఱకున్ = కోసము; సిత = తెల్ల; అసిత = నల్ల; కేశ = రోమముల; ద్వయ = జంటను; వ్యాజంబునన్ = వంకతో; రామ = బలరామ; కృష్ణా = కృష్ణులు అను; ఆఖ్యలన్ = పేర్లతో; అలరి = ప్రసిద్ధుడై; అవతరించెన్ = అవతరించెను; అందున్ = వారిలో; భగవంతుడును = భగవంతుడును {భగవంతుడు - మహిమాన్వితుడు, వీర్యవంతుడు, సమర్థుడు}; సాక్షాత్ = స్వయముగ; విష్ణుండును = విష్ణుమూర్తియును; ఐన = అయినట్టి; కృష్ణుండు = కృష్ణుడు; జన = జనులు, సాధారణ మానవులు; మార్గ = నడచు మార్గమున; వర్తి = నడచువాడు; అయ్యున్ = అయినప్పటికిని; అతిమానుష్య = మానవాతీత, మానవులు చేయలేని; కర్మంబులున్ = కార్యములు, పనులు; ఆచరించుటన్ = చేయుట; చేసి = వలన; కేవల = కేవలము; పరమేశ్వరుండు = పరమేశ్వరుడే {పరమేశ్వరుడు - పరమమైన ఈశ్వరుడు, అత్యున్నత ప్రభువు}; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; మహాత్ముండు = గొప్పవాడు; ఆచరించున్ = చేసిన; కార్యంబులున్ = లీలలు; లెక్కపెట్టన్ = లెక్కించుట; ఎవ్వరికిన్ = ఎవరికైనా; అలవిన్ = శక్యము; కాదు = కాదు; అయినను = అయినప్పటికిని; నాకున్ = నాకు; గోచరించినన్ = చూడగలిగిన; అంత = అంత; ఎఱింగించెదన్ = తెలిపెదను; వినుము = వినుము.

భావము:

ఈ విధంగా పద్మాక్షుడైన శ్రీమన్నారాయణుడు భూభార మంతా నివారించడానికి తన రెండు వెంట్రుకలే చాలనుకున్నాడు. తన ప్రభావం తెలపడానికి తన అంశలతో పుట్టిన రామకృష్ణుల శరీరకాంతులు తెలుపు నలుపులుగా చేసాడు. ధవళమూ, నీలమూ అయిన రెండువెంట్రుకల నెపంతో రాముడు, కృష్ణుడు అను పేర్లతో అవతరించాడు. వారిలో షడ్గుణైశ్వర్య సంపన్నుడు, సాక్షాద్విష్ణు స్వరూపుడు అయిన కృష్ణుడు ఇతర జనులు నడిచిన మార్గంలో నడిచినను మానవాతీతమైన కార్యాలెన్నో చేసాడు. అందువల్ల పరమేశ్వరుడుగానే ప్రసిద్ధి చెందాడు. ఆ మహనీయు డొనర్చిన కార్యాలు గణించడం ఎవరికీ సాధ్యం కాదు. అయినా నాకు తెలిసినంత వరకూ తెలుపుతాను, విను.