పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : రామావతారంబు

  •  
  •  
  •  

2-171-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్మ సంరక్షకత్వప్రభావుం డయ్యు-
ర్మవిధ్వంసకత్వమునఁ బొదలి
రదండనాభిముఖ్యముఁ బొంద కుండియు-
రదండ నాభిముఖ్యమున మెఱసి
బుణ్యజనావన స్ఫూర్తిఁ బెంపొందియుఁ-
పుణ్యజఁనాంతక స్ఫురణఁ దనరి
సంతతాశ్రిత విభీణుఁడు గాకుండియు-
సంతతాశ్రిత విభీణత నొప్పి

2-171.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మించెఁ దనకీర్తిచేత వాసించె దిశలు;
రమె నుతియింప జగతి నెవ్వరికినైనఁ
జారుతరమూర్తి నవనీశక్రవర్తిఁ
బ్రకటగుణసాంద్రు దశరథరామచంద్రు.

టీకా:

ధర్మ = ధర్మమును; సంరక్షకత్వ = రక్షించులక్షణముతో; ప్రభావుండు = ప్రభావశాలి; అయ్యున్ = అయ్యినప్పటికిని; ధర్మ = విల్లు (శివధనుస్సు); విధ్వంసకత్వమునఁన్ = విరుచుటలో; పొదలి = విజృంభించి; ఖర = తీవ్రమైన; దండన = దండించుట యందు; అభిముఖ్యముఁన్ = ఇష్టపడుటను; పొందక = లేకపోవుట; ఉండియున్ = కలిగియు; ఖర = ఖరుడు అను రాక్షసుని; దండన = దండించుట యందు; నాభిముఖ్యమునన్ = ఇష్టపడుటలో; మెఱసి = అతిశయించి; పుణ్యజనా = పుణ్యాత్ముల; ఆవన = రక్షించు; స్ఫూర్తిఁన్ = సంకల్పముతో; పెంపొందియుఁన్ = అతిశయించియు; పుణ్యజనా = రాక్షసులను; అంతకన్ = సంహరించు; స్ఫురణఁన్ = సంకల్పముతో; తనరి = అతిశయించి; సంతత = ఎల్లప్పుడును; ఆశ్రిత = ఆశ్రయించిన వారికి; విభీషణుండున్ = భయంకరుడు; కాకన్ = అవ్వక పోయు; ఉండియున్ = ఉండియు; సంతత = ఎల్లప్పడును; ఆశ్రిత = ఆశ్రయించిన; విభీషణతన్ = విభీషణుడు ఉండుట అందు; ఒప్పి = చక్కగ ఉండి;
మించెన్ = అతిశయించెను; తనరి = తన; కీర్తిచే = కీర్తి; చేతన్ = వలనన్; వాసించెన్ = ప్రకాశించెను; దిశలు = దిక్కులు; తరమె = తరమా ఏమిటి; నుతియింపన్ = స్తుతించుటకు; జగతిన్ = లోకముల; ఎవ్వరికిని = ఎవరికి; ఐనన్ = అయినను; చారుతర = సందరమైన; మూర్తిన్ = స్వరూపుడు; అవని = భూమికి; ఈశ = ప్రభువులకి, రాజులకి; చక్రవర్తిన్ = చక్రవర్తి; ప్రకట = ప్రసిద్దమైన; గుణ = గుణములు; సాంద్రున్ = దట్టముగ ఉన్న వానిని; దశరథ = దశరథు పుత్రుడు; రామచంద్రున్ = రామచంద్రుని {రామచంద్రుడు - రాముడు అను చక్కటి (చల్లటి) వాడు}.

భావము:

ఆయన ధర్మాన్ని రక్షించినవాడు అనే మహత్వం కలిగి కూడ ధర్మవిధ్వంసకుడై ప్రకాశించాడు, అనగా శివధనుర్భంగం చేశాడన్నమాట. ఖరదండనలో అభిముఖుడు కాకపోయినా ఖరదండనలో అభిముఖుయ్యాడు, అంటే కఠినశిక్షలు విధించడానికి విముఖుడైన ఆ రాముడు ఖరుడనే రాక్షసుణ్ణి దండించడానికి సుముఖు డయ్యాడు. పుణ్య జనరక్షకుడై కూడ పుణ్యజనులను హతమార్చాడు, అనగా పుణ్యాత్యులను రక్షించి రక్కసులను శిక్షించాడన్నమాట. ఆశ్రితవిభీషణుడు కాకపోయినా ఆశ్రితవిభీషణుడయ్యాడు, అనగా ఆశ్రయించిన వారిపట్ల భయంకరుడు కాడు, కాని విభీషణుని కాశ్రయం ఇచ్చినవాడయ్యాడు. తన విశాల యశస్సును దశదిశల వ్యాపింపజేసి సుప్రసిద్ధు డయ్యాడు. మహాసుందరుడూ, మహారాజులలో మేటి, సుగణాభిరాముడూ అయిన ఆ దశరథ రాముణ్ణి కీర్తించడానికి లోకంలో ఎవరికిని సాధ్యం కాదు.