పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : రామావతారంబు

  •  
  •  
  •  

2-166-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత సీతా నిమిత్తంబునం ద్రిలోకకంటకుం డగు దశకంఠుం దునుమాడుటకునై కపిసేనాసమేతుండయి చనిచని ముందట నతి దుర్గమంబయిన సముద్రంబు పేర్చి తెరువు సూపకున్న నలిగి.

టీకా:

అంత = తరువాత; సీతా = సీత అను; నిమిత్తంబునన్ = వంకతో; త్రి = మూడు; లోకన్ = లోకములందు; కంటకుండు = బాధించువాడు; అగు = అయిన; దశ = పది; కంఠుండు = కంఠములు కలవాని (రావణుని); తునుమాడుట = చంపుట; కున్ = కు; ఐ = అయి; కపి = కపుల, కోతుల; సేనా = సేనలు; సమేతుండు = కూడిన వాడు; అయి = అయి; చనిచని = వెళ్తూ; ముందటన్ = ఎదురుగ; అతి = మిక్కిలి; దుర్గమము = దాటుటకు కష్టమైనది; అయిన = అయినట్టి; సముద్రంబున్ = సముద్రమును; పేర్చి = విజృంభించి; తెరవున్ = దారి; చూపక = చూపింపక; ఉన్న = ఉండగా; అలిగి = కోపించి;

భావము:

అటుపిమ్మట శ్రీరామచంద్రుడు సీత కొరకై ముల్లోకాలను బాధించేవాడైన రావణుణ్ణి సంహరింప దలచాడు. వానర సేనలను వెంటబెట్టుకొని లంకవైపు పయనించాడు. దక్షిణ సముద్రతీరం చేరాడు. దాటుటకు వీలుగాని ఆ సాగరం దారి చూపనందున ఆయనకు అగ్రహం వచ్చింది.