పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : మత్స్యావతారంబు

  •  
  •  
  •  

2-152-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు న ప్పరమేశ్వరుండు నారదా! హంసావతారంబు నొంది యతిశయ భక్తియోగంబున సంతుష్టాంతరంగుం డగుచు నీకు నాత్మతత్త్వప్రదీపకంబగు భాగవతమహాపురాణం బుపదేశించె; మన్వవతారంబు నొంది స్వకీయ తేజఃప్రభావంబున నప్రతిహతంబైన చక్రంబు ధరియించి దుష్టవర్తనులైన రాజుల దండించుచు శిష్ట పరిపాలనంబు సేయుచు నాత్మీయ కీర్తిచంద్రికలు సత్యలోకంబున వెలింగించె; మఱియు ధన్వంతరి యన నవతరించి తన నామస్మరణంబున భూజనంబునకు సకలరోగ నివారణంబు సేయుచు నాయుర్వేదంబుఁ గల్పించె నింకఁ బరశురామావతారంబు వినుము.

టీకా:

మఱియున్ = ఇంక; ఆ = ఆ; పరమేశ్వరుండు = భగవంతుడు {పరమేశ్వరుడు - అత్యుత్తమమైన ప్రభువు}; నారదా = నారదుడా; హంసా = హంస; అవతారంబున్ = అవతారమును; ఒంది = పొంది; అతిశయ = మిక్కిలిన; భక్తి = భక్తి; యోగంబునన్ = యోగముతో; సంతుష్ట = సంతోషముతో కూడిన; అంతరంగుండు = అంతరంగము కలవాడు; అగుచున్ = అగుచు; నీకున్ = నీకు; ఆత్మ = ఆత్మ; తత్త్వ = తత్వమును; ప్రదీపకంబున్ = మిక్కిలి ప్రకాశింప జేయునది; అగు = అయిన; భాగవత = భాగవతము అను; మహా = గొప్ప; పురాణంబున్ = పురాణమును; ఉపదేశించెన్ = ఉపదేశించెను; మన్వు = మనువు అను; అవతారంబున్ = అవతారమును; ఒందిన్ = పొంది; స్వకీయ = తన; తేజస్ = తేజస్సు యొక్క; ప్రభావంబునన్ = ప్రభావముతో, మహిమతో; అప్రతిహతము = ఎదురు లేనిది; ఐన = అయినట్టి; చక్రంబున్ = చక్రమును; ధరియించి = చేపట్టి; దుష్ట = చెడ్డ; వర్తనులు = ప్రవర్తన కలవారు; ఐన = అయినట్టి; రాజులన్ = రాజులను; దండించుచున్ = శిక్షించుచు; శిష్ట = శిష్టులను, మంచివారిని; పరిపాలనంబున్ = కాపాడుట; చేయుచున్ = చేస్తూ; ఆత్మీయ = తన యొక్క; కీర్తి = కీర్తి అను; చంద్రికలు = వెన్నెలలు; సత్య = సత్య; లోకంబునన్ = లోకములో; వెలిగించెన్ = ప్రకాశింపజేసెను; మఱియున్ = ఇంక; ధన్వంతరి = ధన్వంతరి; అనన్ = అనే పేరుతో; అవతరించి = అవతరించి; తన = తన యొక్క; నామన్ = పేరును; స్మరణంబునన్ = తలచగానే; భూ = భూలోకపు; జనంబున్ = జనమున; కున్ = కు; సకల = సమస్తమైన; రోగ = రోగములు; నివారణంబున్ = పోగొట్టుట; సేయుచున్ = చేస్తూ; ఆయుర్వేదంబుఁన్ = ఆయుర్వేదమును; కల్పించెన్ = పుట్టించెను; ఇంకఁన్ = ఇంక; పరాశుర = పరాశురుని; అవతారంబున్ = అవతారమును; వినుము = వినుము.

భావము:

ఓ నారద! అంతేకాదు. ఆ పరమేశ్వరుడు హంసావతార మెత్తాడు. అతిశయమైన భక్తి యోగంతో సంతసించిన వాడు అయ్యాడు. నీకు, ఆత్మతత్త్వం తెలయపరచే భాగవత, మనే మహాపురాణం ఉపదేశించాడు. మనువుగా అవతరించి తన తేజోమహిమతో అమోఘమైన చక్రం చేబూని దుర్జనులైన రాజులను శిక్షించాడు, సజ్జనులను రక్షించాడు. తన కీర్తిచంద్రికలు సత్యలోకంలో ప్రకాశింప జేశాడు. ఇంకా ధన్వంతరిగా అవతారం దాల్చాడు. తన నామస్మరణతోనే భూమిమీది జనానికి రోగాలన్నీ పోగొట్టుచు ఆయుర్వేదం కల్పించాడు. ఇక పరశురామావతారం ఎలా జరిగిందో వివరిస్తాను, ఆకర్ణించు.