పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నరనారాయణావతారంబు

  •  
  •  
  •  

2-139-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియు "వృషభావతారంబు నెఱిఁగింతు; వినుము; ఆగ్నీంధ్రుండను వానికి "నాభి" యనువాఁ డుదయించె; నతనికి మేరుదేవి యను నామాంతరంబు గల "సుదేవి" యందు హరి వృషభావతారంబు నొంది జడస్వభావంబైన యోగంబు దాల్చి ప్రశాంతాంతఃకరణుండును, బరిముక్త సంగుండునునై పరమహంసాభిగమ్యం బయిన పదం బిది యని మహర్షులు వలుకుచుండం జరించె; మఱియు హయగ్రీవావతారంబు సెప్పెద వినుము.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంక; వృషభ = వృషభ; అవతారంబున్ = అవతారమును; ఎఱింగింతున్ = తెలిపెదను; వినుము = వినుము; అగ్నీంద్రుండు = అగ్నీంద్రుడు; అను = అను; వానికి = వానికి; నాభి = నాభి; అనువాఁడు = అనేవాడు; ఉదయించి = పుట్టి; అతనికిన్ = అతనికి; మేరుదేవి = మేరుదేవి; అను = అను; నామాంతరంబున్ = ఇంకొక పేరు; కల = కల; సుదేవి = సుదేవి; అందున్ = అందు; హరి = విష్ణువు {హరి - దుఃఖములను హరించువాడు, విష్ణువు}; వృషభ = వృషభుడు అను {వృషభము - ఎద్దు, ఋషభము (ప్రకృతి) - వృషభము (వికృతి), ఋషభము - రేఫ}; అవతారంబున్ = అవతారమును; పొంది = పొంది; జడ = జడ, చేతనారాహిత్యుడు {జడము X చైతన్యము}; స్వభావంబున్ = స్వభావము; ఐన = కల; యోగంబున్ = యోగమును; తాల్చి = చేపట్టి; ప్రశాంత = ప్రశాంతమైన; అంతఃకరణుండున్ = మనస్సు కలవాడును; పరి = సమస్తమును; ముక్త = విడిచిన; సంగుండును = బంధనములు కలవాడును; ఐ = అయి; పరమహంసన్ = ఉత్తమపదము నొందిన సన్యాసులచే; అభిగమ్యంబున్ = పొంద దగినది; అయిన = అయిన; పదంబు = స్థితి; ఇది = ఇదే; అని = అని; మహా = గొప్ప; ఋషులు = ఋషులు; పలుకుచుండన్ = అంటూ ఉండగ; చరించెన్ = తిరిగెను, ప్రవర్తించెను; మఱియున్ = ఇంక; హయగ్రీవ = హయగ్రీవుడు అను {హయగ్రీవడు - గుఱ్ఱము మెడ గలవాడు}; అవతారంబున్ = అవతారమును; చెప్పెదన్ = చెప్పుతాను; వినుము = వినుము.

భావము:

ఇలా చెప్పిన బ్రహ్మదేవుడు మళ్లీ నారదునికి ఇలా చెప్పసాగాడు. “ఇప్పుడు వృషభుని అవతారం తెలియపరుస్తాను. ఆలకించు. అగ్నీధ్రు డనే వాడికి నాభి అనే కొడుకు పుట్టాడు. నాభి భార్య సుదేవి. అమెకు మేరుదేవి అని మరో పేరు ఉంది. ఆమెకు హరి వృషభావతారుడై అవతరించాడు. అతడు జడశీలమైన యోగం పూనాడు. ప్రశాంతమైన చిత్తం పొంది ఇతరుల పొత్తు వదిలాడు. ఇది పరమహంసలు పొందదగిన స్థితి అని తన్ను గూర్చి మహర్షులు ప్రశంసించేటట్లు మెలగాడు. మరింక హయగ్రీవుని అవతార విశేషాలు చెప్తాను ఆలకించు.