పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నరనారాయణావతారంబు

  •  
  •  
  •  

2-138-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వేనుఁడు విప్రభాషణ పవిప్రహతిచ్యుత భాగ్యపౌరుషుం
డై నిరయంబునం బడిన నాత్మ తనూభవుఁడై పృథుండు నాఁ
బూని జనించి తజ్జనకుఁ బున్నరకంబును బాపె; మేదినిన్
థేనువుఁ జేసి వస్తువితతిం బితికెన్ హరి సత్కళాంశుఁడై."

టీకా:

వేనుఁడు = వేనుడు (పృథు ఛక్రవర్తి తండ్రి); విప్ర = బ్రాహ్మణుల; భాషణ = మాటలు అను, శాపము అను; పవి = వజ్రాయుధపు; ప్రహతి = దెబ్బ వలన; చ్యుత = భ్రష్టుపడిన; భాగ్య = భాగ్యము; పౌరుషుండు = పౌరుషము కలవాడు; ఐ = అయి; నిరయంబునన్ = నరకములో; పడినన్ = పడిపోగా; ఆత్మ = తన; తనున్ = శరీరమున; భవుఁడు = పుట్టినవాడు; ఐ = అయి; పృథుండు = పృథుడు; నాన్ = పేరు; పూని = పొంది; జనించి = పుట్టి; తత్ = ఆ; జనకుఁన్ = తండ్రికి; పున్న = పున్నామ; నరకంబున్ = నరకమును; పాపెన్ = పోగొట్టెను; మేదినిన్ = భూమిని; ధేనువున్ = ఆవును; చేసిన్ = చేసి; వస్తు = వస్తువుల; వితతిన్ = సమూహమును; పితికెన్ = పితికెను; హరి = విష్ణువు యొక్క; సత్ = మంచి; కళా = కళల; అంశుఁడు = అంశలు కలవాడు; ఐ = అయి.

భావము:

వేను డనే భూపాలుడు భూసురుల శాపాలనే వజ్రాయుధం దెబ్బలు తిని, సిరిని పౌరుషాన్ని కోల్పోయాడు. తుదకు నరకం పాలయ్యాడు. అతనికి పృథుడనే కుమారుడు కలిగాడు. అతడు తండ్రిని పున్నామనరకం నుండి రక్షించాడు. శ్రీహరి కళాంశభవుడైన ఆ పృథుచక్రవర్తి భూమిని ధేనువుగా జేసి అమూల్యమైన అనేక వస్తువులను పిదికాడు.”
గమనిక:- వేనుడు పుత్రులులేక మమణించడంతో పున్నామనరకంలో పడ్డాడు, అతని శరీరాన్ని మథించగా జన్మించిన పృథువు గొప్ప చక్రవర్తి అయ్యాడు. తండ్రి పున్నామనరకం నుండి బయటపడ్డాడు