పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : బ్రహ్మ అధిపత్యం బొడయుట

  •  
  •  
  •  

2-84-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు దేహంబునకు ద్రవ్యంబులైన మహాభూతంబులును జన్మనిమిత్తంబులైన కర్మంబులునుఁ, గర్మక్షోభకంబైన కాలంబునుఁ, గాలపరిణామ హేతువైన స్వభావంబును, భోక్త యైన జీవుండును, వాసుదేవుండ కా నెఱుంగుము; వాసుదేవ వ్యతిరిక్తంబు లేదు; సిద్ధంబు నారాయణ నియమ్యంబులు లోకంబులు దేవతలు నారాయణశరీరసంభూతులు; వేద యాగ తపోయోగ విజ్ఞానంబులు నారాయణ పరంబులు జ్ఞానసాధ్యం బగు ఫలంబు నారాయణు నధీనంబు; కూటస్థుండును సర్వాత్మకుండును సర్వద్రష్టయు నయిన యీశ్వరుని కటాక్ష విశేషంబున సృజియింపంబడి ప్రేరితుండనై సృజ్యంబైన ప్రపంచంబు సృజించుచుండుదు; నిర్గుణుండైన యీశ్వరుని వలన రజస్సత్త్వతమోగుణంబులు ప్రభూతంబులై యుత్పత్తి స్థితిలయంబులకుం బాలుపడి కార్య కారణ కర్తృత్వ భావంబు లందు ద్రవ్యంబులైన మహాభూతంబులును జ్ఞానమూర్తు లయిన దేవతలును గ్రియారూపంబు లయిన యింద్రియంబులును నాశ్రయంబులుగా నిత్యముక్తుం డయ్యును మాయాసమన్వితుండైన జీవుని బంధించు; జీవునకు నావరణంబులయి యుపాధిభూతంబు లయిన మూఁడు లింగంబులు సేసి పరులకు లక్షితంబుగాక తనకు లక్షితంబైన తత్వంబుగల యీశ్వరుం డివ్విధంబున గ్రీడించుచుండు.

టీకా:

మఱియున్ = ఇంకనూ; దేహంబున్ = శరీరము; కున్ = కి; ద్రవ్యంబులున్ = మూలపదార్థములు, ఖనిజములు {నవద్రవ్యములు - పృథివి, అప్పు (నీరు), తేజము, వాయువు, ఆకాశము, కాలము, దిక్కు (ప్రదేశము), ఆత్మ, మనస్సు}; ఐన = అయినట్టి; మహాభూతంబులును = మహాభూతములును {మహాభూతములు - భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశము, మనస్సు}; జన్మ = జన్మలకు; నిమిత్తంబులున్ = కారణభూతములు; ఐన = అయినట్టి; కర్మంబులునున్ = కర్మలును; కర్మ = కర్మలుకు; క్షోభకంబు = ప్రవృత్తికారణము; ఐనన్ = అయినట్టి; కాలంబునున్ = కాలమును; కాల = కాలానుగుణ; పరిమాణ = మార్పులకు; హేతువు = కారణభూతములు; ఐనన్ = అయినట్టి; స్వభావంబునున్ = స్వభావములును; భోక్త = అనుభవించువాడు; ఐనన్ = అయినట్టి; జీవుండునున్ = జీవుడును; వాసుదేవుండ = వాసుదేవుడే, భగవంతుడే {వాసుదేవుడు - సర్వాత్మల వసించు దేవుడు}; కాన్ = అగును అని; ఎఱుంగుము = తెలియుము; వాసుదేవ = వాసుదేవునికి, భగవంతునికి; వ్యతిరిక్తము = కానిది; లేదు = లేదు; సిద్ధంబున్ = నిశ్చయముగా; నారాయణ = భగవంతుని {నారాయణ – నీట నుండు వాడు}; నియమ్యంబులున్ = ఏర్పాటు చేయబడివి; లోకంబులున్ = లోకములు; దేవతలు = దేవతలు; నారాయణ = భగవంతుడు; శరీర = దేహము నుండి; సంభూతులు = పుట్టినవారు {సంభూతులు - సంభవించినవారు, భూతకాలము కలవారు}; వేద = వేదములు; యాగ = యజ్ఞములు; తపస్ = తపస్సు; యోగ = యోగమార్గములు; విజ్ఞానంబులు = విజ్ఞానములు; నారాయణ = భగవంతుని; పరంబులు = చెందునవి, ఉద్దేశించినవి; జ్ఞాన = జ్ఞనము వలన; సాధ్యంబున్ = సాధ్యము; అగున్ = అయ్యే; ఫలంబున్ = ఫలితము; నారాయణున్ = భగవంతుని; ఆధీనంబున్ = ఆధీనమున ఉండును; కూటస్థుండునున్ = నిర్వికారుడు {కూటస్థుడు - కూటస్థుడై ఉండి వికారముల కతీతముగ ఉండువాడు, నిర్వికారుడు}; సర్వాత్మకుండునున్ = సర్వాంతర్యామి {సర్వాత్మకుడు - సమస్తమునందు ఆత్మగ ఉండువాడు - సర్వాంతర్యామి}; సర్వద్రష్టయున్ = సర్వదర్శనుడును {సర్వద్రష్ట - సర్వమును సరిగ చూచువాడు}; అయిన = అయిన; ఈశ్వరునిన్ = భగవంతుని; కటాక్ష = దయాదృష్టి; విశేషంబునన్ = గొప్పతనమువలన; సృజియింపంబడి = సృష్టిచేయబడి; ప్రేరితుండను = ప్రేరణ పొందినవాడను; ఐ = అయి; సృజ్యంబున్ = సృష్టింపబడవలసినవి; ఐన = అయినట్టి; ప్రపంచంబున్ = విశ్వమంతటిని; సృజించుచున్ = సృష్టిస్తూ; ఉండుదున్ = ఉంటాను; నిర్గుణుండు = గుణములులేనివాడు, గుణాతీతుడు; ఐన = అయినట్టి; ఈశ్వరుని = భగవంతుని; వలనన్ = వలననే; రజస్ = రజస్సు; సత్త్వ = సత్వ; తమస్ = తమస్సు; గుణంబులున్ = గుణములును; ప్రభూతంబులున్ = పుట్టిపెరుగునవి; ఐ = అయి; ఉత్పత్తి = సృష్టి; స్థితి = స్థితి; లయంబులున్ = లయములకు; పాలుపడి = పాల్పడి, పూనుకొని; కార్య = కార్యభావము; కారణ = కారణభావము; కర్తృత్వ = కర్తృత్వభావము; భావంబులున్ = అను భావములు; అందున్ = లోపల; ద్రవ్యంబులు = మూలపదార్థములు; ఐన = అయినట్టి; మహాభూతంబులును = పృథివ్యాది మహాభూతములును {మహాభూతములు - పంచభూతములు, మనస్సు}; జ్ఞాన = జ్ఞానము యొక్క; మూర్తులు = స్వరూపములు; అయిన = అయినట్టి; దేవతలును = దేవతలును; క్రియా = క్రియ యొక్క; రూపంబులు = రూపములు; అయిన = అయినట్టి; ఇంద్రియంబులునున్ = ఇంద్రియములును; ఆశ్రయంబులు = ఆశ్రయించునవి; కాన్ = వలె; నిత్య = నిత్యమైన, ఎల్లప్పుడును; ముక్తుండు = ముక్తుడు, నిర్భంధనుడు; అయ్యును = అయినప్పటికిని; మాయా = మాయతో; సమన్వితుండు = కూడి ఉండువాడు; ఐన = అయిన; జీవునిన్ = జీవుడుని; బంధించున్ = బంధిస్తాయి; జీవున్ = జీవున; కున్ = కి; ఆవరణంబులు = ఆవరణలు, పొరలు; అయి = అయి, కమ్మి; ఉపాధిభూతంబులున్ = ఆధారమైనవి, కారణమైనవి; అయిన = అయినట్టి; మూఁడు = మూడు; లింగంబులున్ = శరీరములు, రూపాలు {త్రిలింగములు - స్థూల సూక్ష్మ కారణ అను మూడు శరీరములు, త్రిగుణములు పంచభూతములు ఇంద్రియాదులు}; సేసి = వలన; పరులకున్ = ఇతరులకు; లక్షితంబులు = అందునవి, గోచరించునవి; కాక = కాకుండగ; తనకున్ = తనకు (మాత్రము); లక్షితంబున్ = గోచరించునవి; ఐన = అయినట్టి; తత్త్వంబున్ = తత్వము, లక్షణము; కల = కలిగిన; ఈశ్వరుండు = భగవంతుడు; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; క్రీడించుచున్ = క్రీడించుచు, వినోదిస్తూ; ఉండున్ = ఉండును.

భావము:

ఇంకా ఆ పైన. శరీరనిర్మాణానికి ఉపయోగపడే పృథివ్యాది పంచ మహాభూతాలు, పుట్టుకకు హేతువులైన కర్మలు, కర్మ ప్రవృత్తికి హేతువైన కాలము, కాల మార్పులకు కారణమైన స్వభావము, వీటిన అనుభవించే జీవుడు సమస్తము ఆ శ్రీమన్నారాయణుడే. అన్యమైనది ఏది లేదు. ఇది నిజం. ఈ లోకాన్ని నియమించే వాడు వాసుదేవుడే. వేల్పులు నారాయణుని శరీరంనుండి పుట్టినవారే; వేదాలు, యాగాలు, తపస్సులు, ప్రాణాయామాది యోగాలు, విజ్ఞానము సమస్తం నారాయణుని ఆరాధనా రూపమైనవే; జ్ఞానం వల్ల సాధించే ఫలం కూడా నారాయణుని అధీనంలోనే వుంది. నిర్వికారుడు, సర్వాంతర్యామి, సర్వదర్శనుడు అయిన భగవంతుని క్రీగంటిచూపుచే ప్రేరేపింపబడి, గుణరహితుడైన ఈశ్వరుని నుండి రజస్సు, సత్త్వము, తమస్సు అనే మూడు గుణాలు పుడుతున్నాయి. అవి ఉత్పత్తికి, స్థితికి, లయాలకి హేతువు లవుతున్నాయి. కార్యభావంలోనూ, కారణభావంలోనూ, కర్తృభావంలోనూ ద్రవ్యాలైన పృథివ్యాది పంచ మహాభూతాలనూ, జ్ఞానరూపాలైన బ్రహ్మాది దేవతలనూ, క్రియారూపాలైన ఇంద్రియాలనూ ఆశ్రయిస్తున్నాయి. జీవుడు సదా ముక్తుడే అయినా మాయతో కూడి ఉండడం వల్ల ఆ త్రిగుణాలు అతణ్ణి బంధిస్తున్నాయి. జీవుణ్ణి కప్పివేసే ఉపాధులైన ఈ మూడు గుణాలను కల్పించి తద్ద్వారా ఈశ్వరుడు ఇతరులకు ఏ మాత్రం గోచరించక తనకు మాత్రం గోచరించే తత్త్వంతో ఈ విధంగా వినోదిస్తూ ఉంటాడు.