పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : బ్రహ్మ అధిపత్యం బొడయుట

  •  
  •  
  •  

2-81-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నానా స్థావరజంగమప్రకరముల్ నా యంత నిర్మింప వి
జ్ఞానం బేమియు లేక తొట్రుపడ నిచ్చన్ నాకు సర్వానుసం
ధానారంభ విచక్షణత్వము మహోదారంబు గా నిచ్చె ము
న్నే నా యీశ్వరు నాజ్ఞఁ గాక జగముల్ నిర్మింప శక్తుండనే?```

టీకా:

నానా = వివిధములైన; స్థావర = కదలని ప్రాణులు; జంగమ = కదుల ప్రాణులు; ప్రకరముల్ = సమూహములను; నా = నా; అంతన్ = అంతట (నేనే); నిర్మింపన్ = సృష్టించుటకు; విజ్ఞానంబున్ = నైపుణ్యము; ఏమియున్ = ఏ మాత్రమును; లేకన్ = లేక పోవుటచే; తొట్రుపడన్ = తడబాటు పడగ; ఇచ్చన్ = తన ఇష్టప్రకారము; నాకున్ = నాకు; సర్వ = సమస్తమైన; అనుసంధాన = జతపరచే; ఆరంభ = ప్రయత్నము యొక్క; విచక్షణత్వమున్ = వివేకమును, నేర్పరితనమును; మహా = గొప్ప; ఉదారంబుగాన్ = దయతో; ఇచ్చెన్ = ఇచ్చెను; మున్ను = పూర్వము; నేన్ = నేను; ఆ = ఆ; ఈశ్వరున్ = ప్రభువు యొక్క; ఆజ్ఞన్ = ఆనతిని; కాక = కాకుండగ; జగముల్ = లోకములను; నిర్మింపన్ = నిర్మించుటకు; శక్తుండనే = శక్తి కలవాడనా ఏమిటి.

భావము:

ఓ నారదా! విను. నానా రూపాలతో ఉన్న ఈ చరాచర ప్రపంచాన్ని నా అంతట నేనే సృజించటానికి చాలిన తెలివి ఏ కొంచెము లేక పూర్వం తబ్భిబ్బు పడుతున్నాను. ఆ స్థితిలో సమస్త సృష్టిని ప్రారంభించడానికి అవసరమైన విజ్ఞానాన్ని నా కా ప్రభువు ఎంతో ఉదారబుద్ధితో అనుగ్రహించాడు. అలాంటి పరమేశ్వరుని ఆనతి లేకపోతే ఈ లోకాలు నిర్మించే శక్తి నాకెక్కడిది నాయనా