పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శుకుడు స్తోత్రంబు సేయుట

  •  
  •  
  •  

2-73-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"తురాస్యుండవు; వేల్పు బెద్దవు; జగత్సర్గానుసంధాయి; వీ
శ్రుతిసంఘాతము నీ ముఖాంబుజములన్ శోభిల్లు శబ్దార్థ సం
యుమై, సర్వము నీకరామలకమై యుండుంగదా; భారతీ
తి యిల్లాలఁట నీకు; నో జనక నా సందేహముం బాపవే.

టీకా:

చతుర = నాలుగు; అస్యుండవున్ = ముఖములు కలవాడవును; వేల్పున్ = దేవతలకి; పెద్దవున్ = పెద్దవాడవును; జగత్ = జగత్తును, లోకములను; సర్గన్ = సృష్టించటను; అనుసంధాయివి = కూర్చువాడవు, చేయువాడవు; ఈ = ఈ; శ్రుతి = వినబడినవి, వేద; సంఘాతమున్ = మొత్త మంతయు; నీ = నీ యొక్క; ముఖా = ముఖములు అను; అంబుజములన్ = పద్మములందు; శోభిల్లున్ = విలసిల్లును; శబ్ద = శబ్దములు; అర్థ = అర్థములు; సంయుతము = చక్కగా కూర్చబడిన; ఐ = అయి; సర్వమున్ = సమస్తమును; నీకున్ = నీకు; కరామలకము = చేత ఉసిరిక వలె, చక్కగ తెలియునది; ఐ = అయి; ఉండున్ = ఉండును; కదా = కదా; భారతీ = భారతీ; సతి = దేవి; ఇల్లాలు = భార్య; అఁట = అట; నీకున్ = నీకు; ఓ = ఓ; జనక = తండ్రీ; నా = నా యొక్క; సందేహమున్ = సందేహమును, అనుమానమును; పాపవే = పోగొట్టవా.

భావము:

“తండ్రీ! నీవు చతుర్ముఖుడవు. దేవతలలో పెద్దవాడవు. లోకాలకు సృష్టికర్తవు. వేదాలన్నీ నీ ముఖపద్మాలలోనే ప్రకాశిస్తుంటాయి. శబ్దార్థమయమైన విశ్వమంతా నీకు అరచేతిలోని ఉసిరికాయలా తేటతెల్లమై ఉంటుంది. పైగా నీకు సరస్వతీదేవి ఇల్లాలట. ఈ నా సందేహం తీర్చు తండ్రీ!