పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శుకుడు స్తోత్రంబు సేయుట

  •  
  •  
  •  

2-59-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు సజ్జనదురితసంహారకుండును, దుర్జన నివారకుండును సర్వరూపకుండునుఁ, బరమహంసాశ్రమ ప్రవర్తమాన మునిజన హృదయకమల కర్ణికామధ్య ప్రదీపకుండును, సాత్వతశ్రేష్ఠుండును, నిఖిల కల్యాణ గుణ గరిష్ఠుండునుఁ, బరమ భక్తియుక్త సులభుండును, భక్తిహీనజన దుర్లభుండును, నిరతిశయ నిరుపమ నిరవధిక ప్రకారుండును, నిజస్వరూపబ్రహ్మవిహారుండును నైన యప్పరమేశ్వరునకు నమస్కరించెద.

టీకా:

మఱియున్ = ఇంకనూ; సజ్జనత్ = మంచివారియొక్క; దురిత = కలతలను; సంహారకుండునున్ = పోగొట్టువాడును; దుర్జన = దుర్జనులను; నివారకుండునున్ = నిలువరించువాడును; సర్వ = సమస్తమైన; రూపకుండునున్ = రూపములు తనే అయినవాడును; పరమహంస = ఉన్నతమైన ఆత్మైకస్థితి సన్యాసుల; ఆశ్రమ = ధర్మమార్గమున; ప్రవర్త = నడచు; మాన = లక్షణములు కల; ముని = మునుల; జన = సమూహముల; హృదయ = మనస్సు అను; కమల = పద్మముల; కర్ణికా = బొడ్డుల; మధ్య = నడుమలందు; ప్రదీపకుండునున్ = వెలుగులు ఇచ్చువాడును; సాత్వత = సాత్వత వంశస్థులలో {సాత్వతులు - కృష్ణుడు సాత్వత వంశములో పుట్టెను}; శ్రేష్ఠుండును = శ్రేష్ఠమైనవాడును; నిఖిల = సమస్తమైన; కల్యాణ = శోభనకరమైన; గుణ = లక్షణములు; గరిష్ఠుండునున్ = అత్యధికముగ ఉన్నవాడును; పరమ = గొప్ప; భక్తి = భక్తితో; యుక్త = కూడినవారలకు; సులభుండును = తేలికగా అందువాడును; భక్తి = భక్తి; హీన = లేనట్టి; జన = జనులకు; దుర్లభుండునున్ = అందనివాడును; నిరతిశయ = అతిశయించవీలుకాని; నిరుపమ = సాటిలేని {నిరుపమ - ఉపమానము లేనట్టి, సాటిలేని}; నిరవధిక = అవధి (మేర) లేని; ప్రకారుండునున్ = విధానము కలవాడును; నిజ = స్వ, తనయొక్క; స్వరూప = స్వరూపమైన; బ్రహ్మ = బ్రహ్మగను; విహారుండును = విహరించువాడును; ఐన = అయినట్టి; ఆ = ఆ; పరమేశ్వరున్ = అత్యున్నత ప్రభువు; కున్ = కి; నమస్కరించెదన్ = ప్రణమిల్లుతున్నాను.

భావము:

సత్పురుషుల పాపాలను పరిహరించెడివాడు, దుర్జనులను శిక్షించే వాడు, అసమసత్మైన రూపులు తన రూపమే అయినవాడు, పరమహంసాశ్రమములో ఉండే మునుల హృదయ కమల మధ్యంలో వెలుగొందెడివాడు, సాత్వత వంశస్థులలో శ్రేష్ఠుడు, సమస్తకల్యాణ గుణాలతో శోభిల్లేవాడు, ఉత్తములైన భక్తులకు సులువుగా లభించేవాడు, భక్తి లేనివారికి ప్రాప్తించనివాడు, అత్యుత్తమము, అనుపమానము, అనంతము అయిన ప్రవర్తన గలవాడు, స్వస్వరూపమైన బ్రహ్మములో విహరించేవాడు అయిన పరమేశ్వరునకు ప్రణమిల్లుతున్నాను.