పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : హరిభక్తిరహితుల హేయత

  •  
  •  
  •  

2-47-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వాసుదేవశ్లోకవార్త లాలించుచుఁ-
గాల మే పుణ్యుండు డుపుచుండు
తని యాయువుఁ దక్క న్యుల యాయువు-
నుదయాస్తమయముల నుగ్రకరుఁడు
వంచించి గొనిపోవు; వాఁడది యెఱుఁగక-
జీవింతుఁ బెక్కేండ్లు సిద్ధ మనుచు
నంగనా, పుత్ర, గేహారామ, విత్తాది-
సంసారహేతుక సంగ సుఖముఁ

2-47.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గిలి వర్తింపఁ గాలంబు ఱి యెఱింగి
దండధరకింకరులు వచ్చి తాడనములు
సేసి కొనిపోవఁ బుణ్యంబు సేయ నైతిఁ
బాపరతి నైతి నని బిట్టు లవరించు.

టీకా:

వాసుదేవ = సమస్తాత్మల వసించు దేవుని; శ్లోక = కీర్తించు; వార్తలు = విశేషములను; ఆలించుచున్ = వినుచు; కాలమున్ = (తన) సమయమును; ఏ = ఏ; పుణ్యుండు = పుణ్యమూర్తి; గడుపుచుండున్ = గడుపుతుండునో; అతని = అతని; ఆయువున్ = ఆయుష్షును, జీవితకాలమును; తక్క = తప్పించి; అన్యుల = ఇతరుల; ఆయువున్ = ఆయుష్షును, జీవితకాలమును; ఉదయ = ఉదయించుటలోను; అస్తమయములన్ = అస్తమించుటలోను; ఉగ్ర = తీవ్రమైన; కరుండు = కిరణములు కలవాడు, సూర్యుడు; వంచించిన్ = మడిచిపెట్టేసి; కొనిపోవున్ = తీసుకొనిపోవును; వాఁడు = అతడు; అదిన్ = దానిని; ఎఱుఁగక = తెలియక; జీవింతున్ = జీవించెదను; పెక్కేండ్లు = చాల సంవత్సరములు; సిద్ధము = తప్పకుండగ; అనుచున్ = అనుకొనుచు; అంగనా = స్త్రీలు; పుత్ర = సంతానము; గేహ = ఇళ్ళు; ఆరామ = తోటలు; విత్త = ధనము; ఆదిన్ = మొదలగు; సంసార = సంసారమునకు; హేతుక = కారణభూత; సంగ = తగులముల, బంధనముల; సుఖమున్ = సుఖములకు; తగిలి = తగుల్కొని;
వర్తింపన్ = ప్రవర్తిల్లుతుండగ; కాలంబు = మరణకాల; తఱి = సమయము; ఎఱిగిన్ = తెలిసిన; దండ = దండమును; ధర = ధరించువాడు, యముని; కింకరులు = సేవకులు; వచ్చి = వచ్చి; తాడనములున్ = దెబ్బలుకొట్టుట; చేసిన్ = చేసి; కొనిపోవన్ = తీసుకొని పోవుచుండగ; పుణ్యంబున్ = పుణ్యమును; చేయన్ = చేయనివానిని; ఐతిన్ = అయితిని; పాపన్ = పాపములు ఎడ; రతిన్ = ప్రీతి కలవానిని; ఐతిన్ = అయితిని; అనిన్ = అనుకొనుచు; బిట్టు = మిక్కిలి, గట్టిగ; పలవరించున్ = విలపించును.

భావము:

భగవంతుని కథలు వింటూ కాలం గడిపెడి పుణ్యాత్ముడ ఆయుస్సు తప్ప, ఇతరుల ఆయుస్సును సూర్యుడు ఉదయాస్తమయ సమయాలలో మోసగించి లాక్కుపోతూ ఉంటాడు. ఆ సంగతి తెలియక మూఢుడు నేను తప్పక బహుకాలం జీవిస్తాను అనుకుంటాడు. సంసార కారణాలైన ఆలుబిడ్డలు, ఇల్లువాకిళ్లు, తోటలు దొడ్డు ధనము మొదలైన వాటి తగులంలో చిక్కువడతాడు. కాలం అయినప్పుడు, యమభటులు తోలుకుపోతుంటే, అతను అయ్యో. నేను పుణ్యం చేయలేదే, పాపం చేశానే అంటూ వాడు గోడుగోడున ఏడుస్తాడు.

2-48-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదిగావున.

టీకా:

అదిన్ = ఆ; కావునన్ = కారణముచేత.

భావము:

అందుచేత.

2-49-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లరు జొంపములతో భ్రంకషంబులై-
బ్రదుకవే వనములఁ బాదపములు?
ఖాదన మేహనాకాంక్షలఁ బశువులు-
జీవింపవే గ్రామసీమలందు?
నియతిమై నుచ్ఛ్వాస నిశ్శ్వాస పవనముల్-
ప్రాప్తింపవే చర్మస్త్రికలును?
గ్రామసూకరశునశ్రేణు లింటింటఁ-
దిరుగవే దుర్యోగదీనవృత్తి?

2-49.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుష్ట్రఖరములు మోయవే యురుభరములఁ?
బుండరీకాక్షు నెఱుఁగని పురుషపశువు
డవులందు, నివాసములందుఁ బ్రాణ
విషయభరయుక్తితో నుంట విఫల మధిప!

టీకా:

అలరు = పుష్ప; జొంపములన్ = గుత్తులు; తోన్ = తో; అభ్రంకషములు = మిన్నుముట్టుతున్నవి; ఐ = అయ్యి; బ్రతుకవే = బతుకవా ఏమి; వనములన్ = అడవులలో; పాదపములున్ = చెట్లు; ఖాదన = తిను; మేహన = సంభోగ; ఆకాంక్షలన్ = అమితాసక్తితో; పశువులు = పశువులు {పశువులు - నాలుగు కాళ్ళ జంతువులు}; జీవింపవే = బతుకవా ఏమి; గ్రామ = ఊరి; సీమలున్ = పొలిమేరలు; అందున్ = లో; నియతిము = నియమ ప్రకారము ప్రవర్తించునవి; ఐన్ = అయ్యి; ఉచ్ఛ్వాస = పీల్చు; నిశ్వాస = విడుచు; పవనముల్ = గాలులను; ప్రాప్తించవే = పొందవా ఏమి; చర్మభస్త్రికలును = కొలిమితిత్తులుమాత్రము; గ్రామ = ఊర; సూకర = పందులు; శునక = కుక్కలు; శ్రేణుల్ = గుంపులు; ఇంటింటన్ = ఇళ్ళల్లో; తిరిగవే = తిరుగుతుండవా ఏమి; దుర్యోగ = దురాయువుతో; దీనన్ = దీనమైన; వృత్తిన్ = విధముగా; ఉష్ట్ర = ఒంటెలు; ఖరములు = గాడిదలు;
మోయవే = మోయుటలేదా ఏమి; ఉరు = మిక్కిలి; భరములు = బరువులు; పుండరీకాక్షున్ = భగవంతుని {పండరీకాక్షుడు - పుండరీకముల వంటి కన్నులు కల వాడు - విష్ణువు}; ఎఱుగని = తెలియని; పురుష = మానవ; పశువులు = మృగములు; అడవులు = అడవులు; అందున్ = లోపలను; నివాసములు = ఇళ్ళు; అందున్ = లోపలను; ప్రాణ = ప్రాణమములు; విషయ = ఇంద్రియ అర్థములందలి ఆసక్తుల; భర = బరువులు; యుక్తి = కూడుకొనుట; తోన్ = తో; ఉంటన్ = ఉండుట; విఫలము = వ్యర్థము; అధిప = రాజా.

భావము:

అలాగే ఓ మహారాజా! పూలగుత్తులతో ఆకసమంటుతు అడవులలో చెట్లు జీవించడం లేదా. ఆహారమైథునాది వాంఛలతో పశువులు పల్లె పట్టుల్లో బ్రతకడం లేదా. కొలిమితిత్తులు కూడ ఎడతెరిపి లేకుండా ఉచ్ఛ్యాస నిశ్వ్యాసలు సాగిస్తున్నాయి కదా. ఊరపందులు, కుక్కలు గుంపులు గుంపులుగా ఇల్లిల్లు తిరుగుతు దిక్కుమాలినవై దీనంగా తిరగటం లేదా. ఒంటెలు, గాడిదలు పెద్దపెద్ద బరువులు మోస్తున్నాయి కదా. అదే విధంగా పద్మాక్షుని తెలియనేరని నరపశువులు అడవులలోనో, గృహాలలోనో సంసారభారాన్ని మోస్తూ జీవిస్తున్నారు. వాళ్ల బ్రతుకు వ్యర్థం.

2-50-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విష్ణుకీర్తనములు వినని కర్ణంబులు-
కొండల బిలములు కువలయేశ!
క్రిపద్యంబులఁ దువని జిహ్వలు-
ప్పల జిహ్వలు కౌరవేంద్ర!
శ్రీమనోనాథు నీక్షింపని కన్నులు-
కేకిపింఛాక్షులు కీర్తిదయిత!
మలాక్షు పూజకుఁ గాని హస్తంబులు-
వము హస్తంబులు త్యవచన!

2-50.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిపద తులసీ దళామోద రతి లేని
ముక్కు పందిముక్కు మునిచరిత్ర!
రుడగమను భజనతి లేని పదములు
పాదపముల పాదటల మనఘ!

టీకా:

విష్ణు = భగవంతుని; కీర్తనములు = కీర్తనలు; వినని = వినని; కర్ణంబులు = చెవులు; కొండల = కొండలందలి; బిలములు = గుహలు; కువలయ = భూమికి; ఈశ = ప్రభువా; చక్రి = చక్రధారి యొక్క, విష్ణుని; పద్యంబులు = కీర్తించు పద్యములు; చదువని = చదువకుండని; జిహ్వలు = నాలుకలు; కప్పల = కప్పల యొక్క; జిహ్వలు = నాలుకలు; కౌరవ = కౌరవ వంశపు; ఇంద్ర = రాజా; శ్రీ = లక్ష్మీదేవి యొక్క; మనో = మనస్సునకు; నాథునిన్ = ప్రభువును; ఈక్షింపని = చూడని; కన్నులు = కన్నులు; కేకి = నెమలి యొక్క {కేకి - కేకవేయునది - నెమలి}; పింఛ = పింఛమునందలి; అక్షులు = కన్నులు; కీర్తి = కీర్తికి; దయిత = భర్తా; కమలాక్షున్ = పద్మాక్షుని, విష్ణుని; పూజ = పూజించుట; కున్ = కు; కాని = కానట్టి; హస్తంబులున్ = చేతులు; శవము = శవము యొక్క; హస్తంబులున్ = చేతులు; సత్య = సత్యమునే; వచన = వచనుడా, పలుకువాడా;
హరి = విష్ణువు యొక్క; పద = పాదములందలి; తులసీ = తులసీ; దళ = దళముల యొక్క; ఆమోద = వాసనలందు; రతి = ఆసక్తి; లేని = లేనట్టి; ముక్కు = ముక్కు; పంది = పంది యొక్క; ముక్కు = ముక్కు; ముని = మునులవంటి; చరిత = ప్రవర్తన కలవాడా; గరుడ = గరుడుని; గమను = వాహనముగ కలవాని; భజన = కీర్తించుటకు; గతి = వెళ్లుటకు; లేని = రానట్టి; పదములు = కాళ్ళు; పాదపముల = చెట్ల యొక్క; పాద = వేళ్ళ; పటలము = గుంపులు; అనఘ = పాపరహితుడా.

భావము:

భాగవతం అంటే భగవంతుడు, భగవద్భక్తి, భక్తుడు కదా. అట్టి భాగవత విశిష్టత పరమ భాగవతుడు, భాగవత ప్రయుక్త, బ్రహ్మర్షి, అవధూతోత్తముడు, వ్యాసపుత్రుడు అయిన శుకుడు పరమ పావనుడు, నిర్మల భక్తుడు, పాండవ పౌత్రుడు అయిన పరీక్షిన్మహారాజుకి వివరిస్తున్నాడు – భూమండలేశ! కురువంశోత్తమ! యశోనాథ! సత్యం పలికేవాడ! రాజర్షి! పాపరహితుడా! విష్ణుమూర్తి నామ కీర్తనలు వినని చెవులు కొండ గుహలు. చక్రధారుడిమీద స్తోత్రాలు చదవని నాలుకలు కప్పల నాలుకలు. లక్ష్మీపతి మీద దృష్టిలేని కళ్ళు నెమలిపింఛాల మీది కళ్ళు. నారాయణుని చరణాలపై పూజింపబడే తులసీ దళాల సువాసన ఆఘ్రాణించని నాసిక పంది ముక్కు. పక్షివాహనుని స్తుతిస్తు అడుగులు వేయని కాళ్ళు అచరము లైన చెట్ల వేళ్ళు.

2-51-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నారాయణుని దివ్యనామాక్షరములపైఁ-
రఁగని మనములు ఠినశిలలు
మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ-
మిళితమై యుండని మేను మొద్దు
క్రికి మ్రొక్కని డుని యౌదల నున్న-
నక కిరీటంబు ట్టెమోపు
మాధవార్పితముగా నని మానవు సిరి-
నదుర్గ చంద్రికా వైభవంబు

2-51.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కైటభారిభజన లిగి యుండని వాఁడు
గాలిలోన నుండి దలు శవము,
మలనాభుపదముఁ నని వాని బ్రతుకు
సిఁడికాయలోని ప్రాణి బ్రతుకు."

టీకా:

నారాయణుని = విష్ణువు యొక్క; దివ్య = దివ్యమైన; నామ = నామములందలి; అక్షరములన్ = అక్షరములు; పైన్ = అందు; కరఁగని = కరిగిపోని; మనములున్ = మనస్సులు; కఠిన = బండ; శిలలు = రాళ్ళు; మురవైరి = విష్ణుని {మురవైరి - ముర అను దానవుని శత్రువు}; కథలున్ = కథలు; కున్ = కి; ముదిత = ఆనంద; అశ్రు = భాష్పములు, కన్నీరు; రోమాంచ = గగుర్పాటుతో; మిళితమున్ = కూడినది; ఐ = అయ్యి; ఉండని = ఉండని; మేను = శరీరము; మొద్దు = కట్టెమొద్దు, బండబారినశరీరము; చక్రిన్ = చక్రధారి, హరి {చక్రి - చక్రము ఆయుధముగ కలవాడు}; కిన్ = కి; మ్రొక్కని = మొక్కనట్టి, పూజింపని; జడుని = మూర్ఖుని; ఔదలన్ = నెత్తిని; ఉన్న = ఉన్నట్టి; కనక = బంగారు; కిరీటంబున్ = కిరీటము; కట్టె = కఱ్ఱల; మోపు = మోపు {మోపు - కట్టెలు, గడ్డి మొదలగు వాని పెద్ద కట్ట}; మాధవ = లక్ష్మీపతికి {మాధవుడు - మనస్సును ద్రవింపజేయువాడు - మాధవి భర్త}; అర్పితముగాన్ = సమర్పంచబడి; మనని = బతుకకనుండు; మానవున్ = మానవుని; సిరి = శోభ, సిరిసంపదలు; వన = అడవి; దుర్గ = చిక్కగా నుండుచోటున; చంద్రికా = విరిసిన వెన్నెల; వైభవము = వైభవము వంటిది;
కైటభారిన్ = విష్ణుని {కైటభారి - కైటభాసురుని శత్రువు}; భజనన్ = భక్తి; కలిగి = కలిగి; ఉండని = ఉండనట్టి; వాఁడు = వాడు; గాలి = ఊపిరి, ప్రాణవాయువు; లోనన్ = లోపల; ఉండి = ఉండి; కదలు = కదలుతుండే; శవము = శవమువంటివాడు, మెదడులేనివాడు; కమలనాభున్ = విష్ణుని {కమలనాభుడు - కమలము బొడ్డున కలవాడు - విష్ణువు}; పదమున్ = పాదములను; కనని = చూడని; వాని = వాడియొక్క; బ్రతుకు = బతుకు, జీవితము; పసిడి = ఉమ్మెత్త, పొత్తినూలికాయ; కాయ = కాయ; లోనిన్ = లోపలి; ప్రాణి = పురుగు; బ్రతుకు = బతుకులాంటిది.

భావము:

శ్రీమన్నారాయణుని పవిత్ర నామాక్షర స్మరణతో ద్రవించనివి మనస్సులే కావు. అవి కరకు బండలు. పద్మనాభుని కథలకు ఆనందబాష్పాలు రాలగా, పొంగి పులకించనిది శరీరమే కాదు, అది వట్టిమొద్దు. పరమాత్మునకు ప్రణమిల్లని మూఢుని తలమీదిది బంగారు కిరీటం కాదు, అది కట్టెలమోపు, భగవంతునికి అర్పణంగాని మానవుని ఐశ్వర్యం ఐశ్వర్యం కాదు, అడవిగాసిన వెన్నెల, వాసుదేవుని సేవింపనివాడు ప్రాణవాయువులోపల ఉండంవల్ల కదిలే శవం. పద్మనాభుని పాదములు ఆశ్రయింపనివాని జీవితం పొత్తి నూలికాయలోని పురుగు జీవితం."

2-52-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు పలికిన వైయాసి వచనంబుల కౌత్తరేయుండు కందళిత హృదయుండై నిర్మలమతి విశేషంబున.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలికిన = చెప్పిన; వైయాసి = శుకుని {వైయాసి - వ్యాసుని పుత్రుడు, శుకుడు}; వచనంబులన్ = పలుకులు; కున్ = కి; ఔత్తరేయుండు = పరీక్షితు {ఔత్తరేయుండు – ఉత్తర యొక్క కుమారుడు, పరీక్షితు}; కందళిత = చిగురించిన, వికసించిన; హృదయుండు = మనస్సు కలవాడు; ఐ = అయిఅయి; నిర్మల = నిర్మలమైన; మతి = బుద్ధి; విశేషంబునన్ = విశిష్టత వలన.

భావము:

ఇలా పలికిన వ్యాస పుత్రుడైన శుకుని పలుకులకు ఉత్తర కుమారుడైన పరీక్షిత్తు హృదయం వికసించింది. అతడు నిర్మలమైన బుద్ధి విశేషం కలవాడైనాడు.

2-53-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుతుల హితుల విడిచి, చుట్టాల విడిచి, యి
ల్లాలి విడిచి, బహు బలాళి విడిచి
రాజు హృదయ మిడియె రాజీవనయనుపై
నము విడిచి, జడ్డుఁనము విడిచి.

టీకా:

సుతులన్ = సంతానమును; హితులన్ = సన్నిహితులను; విడిచి = విడిచిపెట్టి; చుట్టాలన్ = బంధువులను; విడిచి = విడిచిపెట్టి; ఇల్లాలిన్ = భార్యను; విడిచి = విడిచిపెట్టి; బహు = అనేకమైన; బల = బలగముల, పరిజన; ఆళిన్ = సమూహములను; విడిచి = విడిచిపెట్టి; రాజు = రాజు, పరీక్షిన్మహారాజు; హృదయము = మనసు; ఇడియెన్ = పెట్టెను; రాజీవనయనున్ = పద్మనేత్రుని, విష్ణుని; పైన్ = మీద; ధనమున్ = సంపదలను; విడిచి = విడిచిపెట్టి; జడ్డున్ = మందత్వము; తనమున్ = కలిగి ఉండుటను; విడిచి = విడిటిపెట్టి.

భావము:

ఆ రాజు పరీక్షిత్తు బిడ్డలను, హితులను, బంధువులను, భార్యను, ఇతర పరిజనాన్ని, ధనాన్ని, జడత్వాన్ని వదలిపెట్టి పద్మాక్షుడైన భగవంతుని మీద మనస్సు నిలిపాడు.