పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : పురాణానుక్రమణిక

  •  
  •  
  •  

12-30-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారలు ఋగ్యజు స్సామాధర్వంబు లనియెడు నాలుగు వేదంబుల వ్యాసోపదిష్టక్రమంబున లోకంబులం బ్రవర్తింపఁ జేసి” రని చెప్పిన, నా క్రమం బెట్లని శౌనకుం డడిగిన సూతుండు సెప్పందొడంగె;” నాదియందుఁ జతుర్ముఖుని హృదయంబున నొక నాదం బుద్భవించె; నది వృత్తి నిరోధంబువలన మూర్తీభవించి వ్యక్తంబుగాఁ గనుపట్టె; నట్టి నాదోపాసన వలన యోగిజనంబులు నిష్పాపులై ముక్తినొందుదు; రందు నోంకారంబు జనియించె; నదియె సర్వమంత్రోపనిషన్మూలభూత యగు వేదమాత యని చెప్పంబడు; నా యోంకారంబు త్రిగుణాత్మకంబై యకారోకార మకారంబు లనెడు త్రివర్ణరూపం బై ప్రకాశించుచుండె; నంత భగవంతుం డగు నజుండా ప్రణవంబువలన స్వరస్పర్శాంతస్థోష్మాది లక్షణ లక్షితం బగు నక్షర సమమ్నాయంబు గల్పించి, తత్సహాయ్యంబునం దన వదన చతుష్టయంబువలన వేదచతుష్టయంబు గలుగంజేసె; నంత నతని పుత్రు లగు బ్రహ్మవాదులా వేదంబులం దదుపదిష్ట ప్రకారంబుగా నభ్యసించి, యాక్రమంబున వారలు దమ శిష్యపరంపరలకు నుపదేశించి; రట్లు వేదంబులు సమగ్రంబుగాఁ బ్రతియుగంబున మహర్షులచే నభ్యసింపంబడియె; నట్టి వేదంబులు సమగ్రంబుగఁ బఠియింప నశక్తులగు వారలకు సాహాయ్యంబు సేయుటకై ద్వాపరయుగాది యందు భగవంతుండు సత్యవతీ దేవి యందుఁ బరాశర మహర్షికి సుతుండై యవతరించి, యా వేదరాశిం గ్రమమ్మున ఋగ్యజు స్సామాధర్వంబు లన నాలుగు విధంబులుగ విభజించి, పైల వైశంపాయన జైమిని సుమంతు లనియెడు శిష్యవరులకుఁ గ్రమంబుగనా వేదంబుల నుపదేశించె; నందు బైలమహర్షి సేకొన్న ఋగ్వేదం బనంతంబు లగు ఋక్కులతోఁ జేరి యుండుటం జేసి బహ్వృచశాఖ యని చెప్పంబడు; నంత నా పైలుం డింద్రప్రమితికి భాష్కలునకు నుపదేశించె; బాష్కలుం డా సంహితం జతుర్విధంబులుఁ గావించి శిష్యులగు బోధ్యుండు యాజ్ఞవల్క్యుండుఁ బరాశరుండు నగ్నిమిత్రుండు నను వారికి నుపదేశించె; నింద్రప్రమితి దనసంహిత మాండూకేయున కుపదేశించె; మాండూకేయుండు దేవమిత్రుం డనువానికిం జెప్పె; నతనికి సౌభర్యాది శిష్యులనేకులై ప్రవర్తిల్లి; రందు సౌభరిసుతుండు శాకల్యుండు దా నభ్యసించిన శాఖ నైదు విధంబులుగ విభజించి; వాత్స్యుండు మౌద్గల్యుండు శాలీయుండు గోముఖుండు శిశిరుం డనెడు శిష్యుల కుపదేశించె; నంత జాతుకర్ణి యనువానికి వా రుపదేశింప నతండు బలాకుండు పైంగుండు వైతాళుండు విరజుం డనువారి కుపదేశించె; నదియునుంగాక మున్ను వినిపించిన బాష్కలుని కుమారుండైన బాష్కలి వాలఖిల్యాఖ్యసంహితను బాలాయని గార్గ్యుండు కాసారుం డనువారలకుం జెప్పె; ని త్తెఱంగున బహ్వృచసంహిత లనేక ప్రకారంబులం బూర్వోక్త బ్రహ్మర్షులచే ధరియింపంబడె; యజుర్వేదధరుం డగు వైశంపాయనుని శిష్యసంఘంబు నిఖిల క్రతువుల నాధ్వర్యకృత్యంబుచేఁ దేజరిల్లరి; మఱియు నతని శిష్యుఁడగు యాజ్ఞవల్క్యుండు గుర్వపరాధంబు సేసిన, నా గురువు కుపితుం డై యధీతవేదంబుల మరలం దనకిచ్చి పొమ్మనిన నతండు దాను జదివిన యజుర్గణంబును దదుక్తక్రమంబునఁ గ్రక్క, నవి రుధిరాక్తంబగు రూపంబు దాల్చిన యజుర్గణాధిష్ఠిత శాఖాధిదేవతలు తిత్తిరిపక్షులై వానిని భుజియించిరి; దానంజేసి యా శాఖలు తైత్తిరీయంబు లయ్యె; నంత నిర్వేది యగునా యాజ్ఞవల్క్యుం డపరిమిత నిర్వేదంబు నొంది, యుగ్రతపంబున సూర్యుని సంతుష్టుం గావింప, నతండు సంతసిల్లి హయ రూపంబుఁ దాల్చి యజుర్గణంబు నతని కుపదేశించె; గావున నది వాజసనేయశాఖ యని వాక్రువ్వంబడె; నంత నా యజుర్గణంబు కాణ్వ మాధ్యందినాదులచే నభ్యసింపంబడె; నిట్లు యజుర్వేదంబు లోకంబునఁ బ్రవర్తిల్లె; సామ వేదాధ్వేత యగు జైమినిమహర్షి దన సుతుండగు సుమంతునికి నుపదేశించె; నతఁడు సుకర్ముండను తన సుతునకుఁ దెలిపె; నతం డా వేదమును సహస్రశాఖలుగా విభజించి, కోసలుని కుమారుండైన హిరణ్యనాభునికిని, దన కుమారుండగు పౌష్పంజి యనువానికి నుపదేశించె; నంత వారిరువురును బ్రహ్మవేత్తలగు నావంత్యులు నుదీచ్యులను నేనూర్గురికి నుపదేశించి, వారిని సామవేదపారగులంగాఁ జేసి; రిట్లు సామవేదంబు లోకంబున వినుతి నొందె; మఱియు నధర్వవేత్త యగు సుమంతు మహర్షి దానిం దన శిష్యున కుపదేశింప నతండు వేదదర్శుండు పథ్యుండను శిష్యుల కుపదేశించె; నందు వేదదర్శుఁడనువాఁడు శౌల్కాయని బ్రహ్మబలి నిర్దోషుండు పిప్పలాయనుండను వారలకును, బథ్యుం డనువాఁడు కుముదుండు శునకుండు జాబాలి బభ్రు వంగిరసుండు సైంధవాయనుం డనువారలకు నుపదేశించి ప్రకాశంబు నొందించె; నిత్తెఱంగున నధర్వవేదంబు వృద్ధినొందె నిట్లఖిల వేదంబుల యుత్పత్తి ప్రచార క్రమంబులెఱింగించితి; నింకం బురాణక్రమం బెట్టులనిన వినిపింతు, వినుము; లోకంబునఁ బురాణప్రవర్తకు లనం బ్రసిద్ధులగు త్రయ్యారుణి కశ్యపుండు సావర్ణి యకృతవ్రణుండు వైశంపాయనుండు హారితుం డను నార్గురు మజ్జనకుండును వ్యాసశిష్యుండును నగు రోమహర్షణునివలన గ్రహించి; రట్టి పురాణంబు సర్గాది దశలక్షణలక్షితంబుగా నుండు; మఱియు గొందఱా పురాణంబు పంచలక్షణ లక్షితం బనియుఁ బలుకుదు; రట్టి పురాణ నామానుక్రమంబుఁ బురాణవిదులగు ఋషులు సెప్పెడు తెఱంగున నెఱింగింతు; వినుము, బ్రాహ్మంబు, పాద్మంబు, వైష్ణవంబు, శైవంబు, భాగవతంబు, భవిష్యోత్తరంబు, నారదీయంబు, మార్కండేయం, బాగ్నేయంబు, బ్రహ్మకైవర్తంబు, లైంగంబు, వారాహంబు, స్కాందంబు, వామనంబు, కౌర్మంబు, మాత్స్యంబు, బ్రహ్మాండంబు, గారుడంబు, నని పదునెనిమిది మహాపురాణంబులు, మఱియు నుపపురాణంబులుం గలవు; వీనిం లిఖించినం జదివిన వినిన దురింతంబు లడంగు” నని సూతుండు శౌనకాదులకుం జెప్పిన వారు “నారాయణగుణ వర్ణనంబును దత్కథలును జెప్పితి; వింక దోషకారులుఁ బాపమతులు నెవ్విధంబున భవాబ్ధిం దరింతు, రా క్రమంబు వక్కాణింపవే” యని యడిగిన నెఱింగింపం దలంచి యిట్లనియె.

టీకా:

వారలు = వారు; ఋక్ = ఋగ్వేదము; యజుర్ = యజుర్వేదము; సామ = సామవేదము; అధ్వరంబులు = అధర్వణవేదములు; అనియెడు = అనెడు; నాలుగు = నాలుగు; వేదంబులన్ = వేదములను; వ్యాస = వ్యాసునిచే; ఉపదిష్ట = బోధించిన; క్రమంబునన్ = ప్రకారమే వరుసగా; లోకంబులన్ = లోకమునందు; ప్రవర్తింపన్ = ప్రచారమగునట్లు; చేసిరి = చేసారు; అని = అని; చెప్పినన్ = తెలుపగా; ఆ = ఆ; క్రమంబు = క్రమము; ఎట్లు = ఏవిధము; అని = అని; శౌనకుండు = శౌనకుడు; అడిగిన = ప్రశ్నించగా; సూతుండు = సూతుడు; చెప్పన్ = చెప్పుట; తొడంగె = మొదలిడెను; ఆది = మొట్టమొదట; అందున్ = లో; చతుర్ముఖుని = బ్రహ్మదేవుని {చతుర్ముఖుడు - నాలుగు ముఖములు కలవాడు, బ్రహ్మ}; హృదయంబునన్ = హృదయమునందు; ఒక = ఒకానొక; నాదంబు = నాదము, శబ్దము; ఉద్భవించెన్ = పుట్టింది; అది = అది; వృత్తి = వర్తనమును; నిరోధంబు = అడ్డగించుట; వలన = వల్ల; మూర్తీభవించి = రూపము ధరించి; వ్యక్తంబు = స్పష్టముగ; కన్ = అగునట్లు; కనుపట్టెన్ = గోచరించెను; అట్టి = అటువంటి; నాద = నాదమును, ధ్వనిని; ఉపాసన = ఉపాసించుట; వలన = వల్ల; యోగి = యోగులు; జనంబులు = ఐనవారు; నిష్పాపులు = పాపరహితులు; ఐ = అయ్యి; ముక్తిన్ = మోక్షమును; ఒందెదరు = పొందుతారు; అందున్ = దానిలోనే; ఓంకారంబు = ఓంకారము; జనియించెన్ = పుట్టినది; అదియె = అదె; సర్వ = అన్ని; మంత్ర = మంత్రాలకు; ఉపనిషత్ = ఉపనిషత్తులకు; మూలభూత = మూలాధారము; అగు = ఐన; వేదమాత = వేదములకుమాతృక; అని = అని; చెప్పంబడును = చెప్పబడింది; ఆ = ఆ; ఓంకారంబు = ఓంకారము; త్రిగుణాత్మకము = మూడుగుణాలు కలది; ఐ = అయింది; అకార = అకారము; ఉకార = ఉకారము; మకారంబులు = మకారము; అనెడు = అను; త్రివర్ణ = మూడు వర్ణములకల; రూపంబు = ఆకృతికలది; ఐ = అయ్యి; ప్రకాశించుచుండెన్ = ప్రకాశిస్తోంది; అంత = పిమ్మట; భగవంతుండు = భగవంతుడు; అగు = ఐన; అజుండు = బ్రహ్మదేవుడు {అజుడు - పుట్టుకలేనివాడు, బ్రహ్మ}; ఆ = ఆ; ప్రణవంబు = ఓంకారము; వలన = వలన; స్వర = స్వరములు {స్వరములు - అకారాది, అచ్చులు, అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ అరూ అలు అలూ ఏ ఓ ఐ ఔ ఇవి చతుర్దశ (14) స్వరాలు}; స్పర్శ = స్పర్శములు {స్పర్శములు - క నుండి మ వరకు కలవి ఇవి ఐదేసి చొప్పున ఐదు వర్గములుగా ఉంటాయి (1క ఖ గ ఘ ఙ 2చ ఛ జ ఝ ఞ 3ట ఠ డ ఢ ణ 4త థ ద ధ న 5ప ఫ బ భ మ)}; అంతస్థ = అంతస్థములు {అంతస్థములు - య ర ల వలు}; ఊష్మ = ఊష్మములు {ఊష్మములు - శ ష స హలు}; ఆది = మున్నగు; లక్షణ = లక్షణాలతో; లక్షితంబు = కూర్చబడినవి; అగు = ఐన; అక్షర = అక్షరముల; సమమ్నాయంబున్ = సమూహమును; కల్పించి = ఏర్పరచి; తత్ = వాని; సహాయ్యంబునన్ = సాయముతో; తన = అతని; వదనచతుష్టయంబు = నాలుగు ముఖముల; వలన = నుండి; వేదచతుష్టయంబున్ = చతుర్వేదములను {చతుర్వేదములు - 1ఋగ్వేదము 2యజుర్వేదము 3సామవేదము 4అధర్వణవేదము}; కలుగన్ = కలుగ; చేసెను = చేసెను; అంతన్ = పిమ్మట; అతని = అతని; పుత్రులు = కుమారులు; అగు = ఐన; బ్రహ్మవాదులు = బ్రహ్మర్షులు; ఆ = ఆ; వేదంబులన్ = వేదములను; తత్ = అలా; ఉపదిష్ట = ఉపదేశించిన; ప్రకారంబున్ = విధముగ; అభ్యసించి = అభ్యాసము చేసి; ఆ = ఆ; క్రమంబునన్ = విధముగనే; వారలు = వారు; తమ = వారి యొక్క; శిష్య = శిష్యుల; పరంపరల = వరుసల; కున్ = కి; ఉపదేశించిరి = బోధించారు; అట్ల = ఆ విధముగ; వేదంబులు = వేదములు; సమగ్రంబుగా = మొత్తం అంతా; ప్రతి = అన్ని; యుగంబునన్ = యుగమునందు; మహ = గొప్ప; ఋషులు = ఋషులు; చేన్ = చేత; అభ్యసింపబడియెను = అభ్యాసము చేయబడినవి; అట్టి = అటువంటి; వేదంబులు = వేదములు; సమగ్రంబుగా = అంతటిని; పఠియింప = చదువుటకు; అశక్తులు = సామర్థ్యము లేనివారు; అగు = ఐన; వారలు = వారి; కున్ = కి; సాహాయ్యంబు = సాయము; చేయుట = చేయుట; కై = కోసము; ద్వాపరయుగ = ద్వాపరయుగపు; ఆది = ప్రారంభము; అందున్ = లో; భగవంతుడు = భగవంతుడు; సత్యవతీదేవి = సత్యవతీదేవి; అందున్ = గర్భమున; పరాశర = పరాశర; మహ = గొప్ప; ఋషి = ఋషి; కిన్ = కి; సుతుండు = పుత్రుడు; ఐ = అయ్యి; అవతరించి = పుట్టి; ఆ = ఆ; వేద = వేదముల; రాశిన్ = కలిసి ఉన్న మొత్తమును; క్రమమ్మునన్ = వరుస ప్రకారముగా; ఋక్ = ఋగ్వేదము; యజుః = యజుర్వేదము; సామ = సామవేదము; అధర్వంబులు = అధర్వణవేదములు; అన = అనెడి; నాలుగు = నాలుగు (4); విధంబులుగ = విభాగములుగ; విభజించి = విడదీసి; పైల = పైలుడు; వైశంపాయన = వైశంపాయనుడు; జైమిని = జైమిని; సుమంతులు = సుమంతుడులు; అనియెడు = అనెడి; శిష్య = శిష్యులలో; వరులు = ఉత్తముల; కున్ = కు; క్రమంబునన్ = వరుసగా; ఆ = ఆ; వేదంబులన్ = వేదములను; ఉపదేశించెన్ = బోధించెను; పైల = పైలుడు అను; మహర్షి = మహర్షి; చేకొన్న = చేపట్టిన; ఋగ్వేదంబు = ఋగ్వేదము; అనంతంబులు = అపరిమితమైనట్టివి; అగు = ఐన; ఋక్కులు = ఋక్కులు {ఋక్కులు - ఋగ్వేదభాగవిశేషం}; తోన్ = తోటి; చేరి = కూడి; ఉండుటన్ = ఉండుట; చేసి = వలన; బహ్వృచశాఖ = బహ్వృచశాఖ; అని = అని; చెప్పంబడును = అంటారు; అంతన్ = పిమ్మట; ఆ = ఆ; పైలుండు = పైలుడు; ఇంద్రప్రమితి = ఇంద్రప్రమితి; కిన్ = కి; భాష్కలున్ = భాష్కలుని; కున్ = కి; ఉపదేశించెన్ = బోధించెను; భాష్కలుండు = భాష్కలుడు; ఆ = ఆ; సంహితన్ = వేదభాగమును; చతుర్ = నాలుగు (4); విధంబులున్ = భాగములుగ; కావించి = చేసి; శిష్యులు = శిష్యులు; అగు = ఐన; బోధ్యుండు = బోధ్యుడు; యాజ్ఞవల్క్యుండు = యజ్ఞవల్కుని కొడుకు; పరాశరుండున్ = పరాశరుడు; అను = అనెడి; వారి = వారల; కిన్ = కి; ఉపదేశించెన్ = బోధించెను; ఇంద్రప్రమితి = ఇంద్రప్రమితి; తన = అతని; సంహితన్ = వేదభాగమును; మాండూకేయున్ = మాండూకేయున; కున్ = కు; ఉపదేశించెన్ = బోధించెను; మాండూకేయుండు = మాండూకేయుడు; దేవమిత్రుండు = దేవమిత్రుడు; అను = అనెడి; వాని = అతని; కిన్ = కి; చెప్పెన్ = ఉపదేశించెను; అతని = అతని; కిన్ = కి; సౌభరి = సౌభరి; ఆది = మున్నగు; శిష్యులు = శిష్యులు; అనేకులు = చాలామంది; ఐ = ఉండి; ప్రవర్తిల్లిరి = ప్రవృద్ధిచెందిరి; అందున్ = వారిలో; సౌభరి = సౌభరి; సుతుండు = పుత్రుడు; శాకల్యుండు = శాకల్యుడు; తాన్ = అతను; అభ్యసించిన = నేర్చుకొన్న; శాఖన్ = భాగమును; ఐదు = ఐదు (5); విధంబులుగ = విభాగములుగ; విభజించి = విడదీసి; వాత్స్యుండు = వాత్స్యుడు; మౌద్గల్యుండు = మౌద్గల్యుడు; శాలీయుండు = శాలీయుడు; గోముఖుండు = గోముఖుడు; శిశిరుండు = శిశిరుడు; అనెడు = అను; శిష్యులు = శిష్యులు; కున్ = కు; ఉపదేశించెన్ = బోధించెను; అంత = పిమ్మట; జాతుకర్ణి = జాతుకర్ణుడు; అను = అనెడి; వాని = అతని; కిన్ = కి; వారు = వారు; ఉపదేశింపన్ = బోధించగా; అతండు = అతను; బలాకుండు = బలాకుడు; పైంగుండు = పైంగుడు; వైతాళుండు = వైతాళుడు; విరజుండు = విరజుడు; అను = అనెడి; వారి = వారల; కున్ = కు; ఉపదేశించెన్ = బోధించెను; అదియును = అంతే; కాక = కాకుండా; మున్ను = పూర్వము; వినిపించిన = చెప్పిన; బాష్కలుని = బాష్కలుని; కుమారుండు = పుత్రుడు; ఐన = అయిన; బాష్కలి = బాష్కలి; వాలఖిల్య = వాలఖిల్య; ఆఖ్య = పేరుగల; సంహితను = సంహితను; బాలాయని = బాలాయని; గార్గ్యుండు = గార్గ్యుడు; కాసారుండు = కాసారుడు; అను = అనెడి; వారల = వారి; కున్ = కి; చెప్పెన్ = బోధించెను; ఈ = ఈ; తెఱంగునన్ = విధముగ; బహ్వృచశాఖ = బహ్వృచశాఖ; సంహితలు = సంహితలు; అనేక = బహు; ప్రకారంబులన్ = ప్రకారములుగా; పూర్వ = ముందు; ఉక్త = చెప్పిన; బ్రహ్మర్షులు = బ్రహ్మర్షులు; చేన్ = చేత; ధరియింపంబడె = చేపట్టబడినవి; యజుర్వేద = యజుర్వేదము; ధరుండు = ఉపదేశంపొందినవాడు; అగు = ఐన; వైశంపాయనుని = వైశంపాయనుని; శిష్య = శిష్యులు; సంఘంబు = అందరు; నిఖిల = సర్వ; క్రతువుల = యాగముల; అధ్వర్య = తంత్రములునడపుట; కృత్యంబున్ = చేయించుట; చేన్ = ద్వారా; తేజరిల్లిరి = ప్రసిద్ధిపొందారు; మఱియును = మరియు; అతని = అతని యొక్క; శిష్యుడు = శిష్యుడు; అగు = ఐన; యాజ్ఞవల్క్యుండు = యాజ్ఞవల్క్యుడు; గురువు = గురువు పట్ల; అపరాధంబు = అపరాధము; చేసినన్ = చేయగా; ఆ = ఆ; గురువు = గురువు; కుపితుండు = కోపము వచ్చినవాడు; ఐ = అయ్యి; అధీతి = నేర్చుకొన్న; వేదంబులు = వేదములను; మరలన్ = వెనుకకి; తన = అతని; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చేసి; పొమ్ము = వెళ్ళుము; అనినన్ = చెప్పగా; అతండు = అతను; తాను = తాను; చదివిన = నేర్చుకొన్న; యజుర్గణంబునున్ = యజుస్సంహితలను; తత్ = ఆ; ఉక్త = చెప్పబడిన; క్రమంబునన్ = క్రమంలోనే; క్రక్కన్ = వమనంచేయగా; అవి = అవి; రుధిరాక్తంబు = రక్తసిక్తమైనవి; అగు = ఐన; రూపంబు = రూపమును; తాల్చినన్ = ధరించగా; యజుర్గణ = యజుర్మంత్రగణముల; అధిష్టిత = అధిష్టించి ఉండు; శాఖా = సంహితలకు; అధిదేవతలు = అధిష్టానదేవతలు; తిత్తిరిపక్షులు = తిత్తిరిపక్షులు; ఐ = రూపములు దరించి; వానిని = వాటిని; భజియించిరి = తిన్నారు; దానన్ = అందు; చేసి = వల్ల; ఆ = ఆ; శాఖలు = సంహితలు; తైత్తిరేయంబులు = తైత్తిరేయములు; అయ్యెన్ = అయినవి; అంత = పిమ్మట; నిర్వేది = వేదములేనివాడు; అగు = ఐన; ఆ = ఆ యొక్క; యాజ్ఞవల్క్యుండు = యాజ్ఞవల్క్యుడు; అపరిమిత = అంతులేని; నిర్వేదంబున్ = నిర్వేదమును {నిర్వేదము - తత్వఙ్ఞాన దుఃఖేర్ష్యాదుల చేతగలుగు హేయత్వ బుద్ధి}; ఒంది = పొంది; ఉగ్ర = భయంకరమైన; తపంబునన్ = తపస్సుచేత; సూర్యుని = సూర్యుడిని; సంతుష్టున్ = తృప్తిచెందినవాని; కావింపన్ = చేయగా; అతండు = అతను; సంతసిల్లి = సంతోషించి; హయ = అశ్వ; రూపంబున్ = రూపమును; తాల్చి = ధరించి; యజుర్గణంబున్ = యజుర్మంత్రసంహితలను; అతని = అతని; కిన్ = కి; ఉపదేశించెన్ = బోధించెను; కావున = అందుచేత; అది = అది; వాజసనేయశాఖ = వాజసనేయశాఖ; అని = అని; వాక్రువ్వంబడెన్ = పేరుబడెను; అంతన్ = పిమ్మట; ఆ = ఆ; యజుర్గణంబున్ = యజుస్సంహితలను; కాణ్వ = కాణ్వులు; మాధ్యందిన = మాధ్యందినులు; ఆదులు = మున్నగువారి; చేన్ = చేత; అభ్యసింపంబడెన్ = అభ్యసించారు; ఇట్లు = ఈ విధముగ; యజుర్వేదంబు = యజుర్వేదము; లోకంబునన్ = ప్రపంచమునందు; ప్రవర్తిల్లెన్ = ప్రవృద్ధిచెందినది; సామవేద = సామవేదమును; అధ్వేత = అభ్యసించినవాడు; అగు = ఐన; జైమిని = జైమిని; మహర్షి = మహర్షి; తన = అతని; సుతుండు = కొడుకు; అగు = ఐన; సుమంతుని = సుమంతుని; కిన్ = కి; ఉపదేశించెన్ = బోధించెను; అతండు = అతను; సుకర్ముండు = సుకర్ముడు; అను = అనెడి; తన = అతని; సుతున్ = కొడుకున; కున్ = కు; తెలిపెన్ = బోధించెను; అతండు = అతను; ఆ = ఆ; వేదమును = వేద సంహితలను; సహస్ర = వెయ్యి (1000), అనేక; శాఖలు = భాగములు; కాన్ = అగునట్లు; విభజించి = విడదీసి; కోసలుని = కోసలుని యొక్క; కుమారుండు = కొడుకు; ఐన = అగు; హిరణ్యనాభుని = హిరణ్యనాభుని; కిని = కి; తన = తన యొక్క; కుమారుండు = కొడుకు; అగు = ఐన; పౌష్పంజి = పౌష్పంజి; అను = అనెడి; వాని = వాని; కిని = కి; ఉపదేశించెన్ = బోధించెను; అంతన్ = పిమ్మట; వారు = వారు; ఇరువురును = ఇద్దరు (2); బ్రహ్మవేత్తలు = బ్రహ్మ ఙ్ఞానులు; అగు = ఐన; ఆవంత్యులును = ఆవంత్యులు{ఆవంత్యులు – అవంతీపురానికి చెందినవారు}; ఉదీచ్యులు = ఉదీచ్యులు {ఉదీచ్యులు – ఉత్తరదేశానికి చెందినవారు, పండితులు}; అను = అనెడి; ఏనూర్గురు = ఐదువందలమంది (500); కిన్ = కి; ఉపదేశించి = బోధించి; వారిని = వారిని; సామవేద = సామవేదమునందు; పారగులన్ = పారంగతుడు, బహునేర్పరి; కాన్ = అగునట్లు; చేసిరి = చేసిరి; అట్లు = అలా; సామవేదంబు = సామవేదము; లోకంబునన్ = లోకమంతట; వినుతి = ఖ్యాతి; ఒందెన్ = పొందినది; మఱియును = ఇంక; అధర్వవేత్త = అధర్వణవేదంనేర్చినవాడు; అగు = ఐన; సుమంత = సుమంతుడను; మహర్షి = మహర్షి; దానిన్ = దానిని; తన = అతని; శిష్యున = శిష్యుని; కున్ = కి; ఉపదేశింపన్ = బోధించగా; అతండు = అతను; వేదదర్శుండు = వేదదర్శుడు; పథ్యుండు = పథ్యుడు; అను = అనెడి; శిష్యులు = శిష్యుల; కున్ = కు; ఉపదేశించెన్ = బోధించెను; అందున్ = వారిలో; వేదదర్శుడు = వేదదర్శుడు; అను = అనే; వాడు = అతను; శౌల్కాయని = శౌల్కాయని; బ్రహ్మబలి = బ్రహ్మబలి; నిర్దోషుండు = నిర్దోషుడు; పిప్పలాయనుండు = పిప్పలాయనుడు; అను = అనే; వారల = వారి; కున్ = కి; పథ్యండు = పథ్యుడు; అను = అనే; వాడు = అతను; కుముదుండు = కుముదుడు; శునకుండు = శునకుడు; జాబాలి = జాబాలి; బభ్రువు = బభ్రువు; అంగిరసుండు = అంగిరసుడు; సైంధవాయనుండు = సైంధవాయనుడు; అను = అనెడి; వారలు = వారి; కున్ = కి; ఉపదేశించి = బోధించి; ప్రకాశంబు = ప్రాకటము; ఒందించెన్ = పొందించెను; ఈ = ఈ; తెఱంగునన్ = విధముగ; అధర్వవేదంబు = అధర్వణవేదము; వృద్ధిని = అభివృద్ధి; ఒందెన్ = చెందెను; ఇట్లు = ఈ విధముగ; అఖిల = సమస్తమైన; వేదంబులన్ = వేదములు యొక్క; ఉత్పత్తి = ఉత్పత్తిచెందుట; ప్రచార = వ్యాప్తిచెందుటల యొక్క; క్రమంబులున్ = విధానమును; ఎఱింగించితిని = తెలిపితిని; ఇంకన్ = ఇక; పురాణ = పురాణముల; క్రమంబు = విషయములు; ఎట్టులు = ఏవిధము; అనినన్ = అన్నచో; వినిపింతున్ = చెప్పెదను; వినుము = వినుము; లోకంబునన్ = లోకంలో; పురాణ = పురాణపఠనములు; ప్రవర్తకులు = చక్కగానడుపువారు; అనన్ = అనగా; ప్రసిద్ధులు = పేరుపొందినవారు; అగు = ఐన; త్రయ్యారుణి = త్రయ్యారుణి; కశ్యపుండు = కశ్యపుడు; సావర్ణి = సావర్ణి; అకృతవ్రణుండు = అకృతవర్ణుడు; వైశంపాయనుండు = వైశంపాయనుడు; హారితుండు = హారితుడు; అను = అనెడి; ఆర్గురున్ = ఆరుగురు (6); మత్ = మా యొక్క; జనకుండును = తండ్రి; వ్యాస = వ్యాసుని; శిష్యుండును = శిష్యుడు; అగు = ఐన; రోమహర్షణుని = రోమహర్షణుని; వలన = నుండి; గ్రహించిరి = నేర్చుకొన్నారు; అట్టి = అటువంటి; పురాణంబు = పురాణము; సర్గాది = సర్గమొదలగు {పురాణ దశలక్షణములు - సర్గాది - 1సర్గము 2విసర్గము 3స్థానము 4పోషణము 5ఊతులు 6మన్వంతరములు 7ఈశానుకథలు 8నిరోధము 9ముక్తి 10ఆశ్రయము}; దశ = పది (10); లక్షణ = లక్షణాలతో; లక్షితంబు = కూడియున్నది; కాన్ = అయ్యి; ఉండున్ = ఉండును; మఱియున్ = ఇంకా; కొందఱు = కొంతమంది; పురాణంబు = పురాణము; పంచ = ఐదు (5) {పురాణ పంచ లక్షణములు - సర్గాది - 1సర్గము 2ప్రతిసర్గము 3వంశము 4మన్వంతరము 5వంశానుచరితము}; లక్షణ = లక్షణాలతో; లక్షితంబు = నియమించబడినది; అనియున్ = అని; పలుకుదురు = చెప్తారు; అట్టి = అటువంటి; పురాణ = పురాణముల; నామ = పేర్ల; అనుక్రమంబున్ = వరుసను; పురాణ = పురాణములు చెప్పుటలో; విదులు = నేర్పరులు; అగు = ఐన; ఋషులు = మునులు; చెప్పెడు = చెప్పునట్టి; తెఱంగునన్ = విధముగా; ఎఱింగింతున్ = తెలిపెదను; వినుము = వినుము; బ్రహ్మంబు = బ్రహ్మపురాణము; పాద్మంబు = పద్మపురాణము; వైష్ణవంబు = విష్ణుపురాణము; శైవంబు = శివపురాణము; భాగవతంబు = శ్రీమద్భాగవతము; భవిష్యోత్తరంబు = భవిష్యోత్తరపురాణము; నారదీయంబు = నారదపురాణము; మార్కండేయంబు = మార్కండేయపురాణము; ఆగ్నేయంబు = అగ్నిపురాణము; బ్రహ్మకైవర్తంబు = బ్రహ్మకైవర్తపురాణము; లైంగంబు = లింగపురాణము; వారాహంబు = వరాహపురాణము; స్కాందంబు = స్కాందపురాణము; వామనంబు = వామనపురాణము; కౌర్మంబు = కూర్మపురాణము; మాత్స్యంబు = మత్స్యపురాణము; బ్రహ్మాండంబు = బ్రహ్మాండపురాణము; గారుడంబున్ = గరుడపురాణము; అను = అనెడి; పదునెనిమిది = పద్దెనిమిది (18); మహాపురాణంబులు = మహాపురాణములు; మఱియును = ఇంకా; ఉపపురాణంబులున్ = ఉపపురాణాలు కూడ; కలవు = ఉన్నాయి; వీనిన్ = వీటిని; లిఖించినన్ = వ్రాసిన; చదివిన = పఠించిన; వినినన్ = విన్నను; దురితంబులు = పాపములు; అడంగును = నశించిపోవును; అని = అని; సూతుండు = సూతుడు; శౌనక = శౌనకుడు; ఆదులన్ = మున్నగువారి; కున్ = కి; చెప్పిన = చెప్పగా; వారు = వారు; నారాయణ = హరి; గుణ = గుణములను; వర్ణనంబును = స్తుతించుట; తత్ = అతని; కథలును = కథలను; చెప్పితి = చెప్పావు; ఇంకన్ = మరి; దోషాకారులు = పాపంచేసినవారు; పాపమతులు = పాపబుద్ధికలవారు; ఏ = ఏ; విధంబునన్ = విధముగా; భవ = సంసార; అబ్దిన్ = సాగరమును; తరిందురు = దాటగలరు; ఆ = అట్టి; క్రమంబున్ = విధానమును; వక్కాణింపవే = తెలుయజేయుము; అని = అని; అడిగినన్ = అడుగగా; ఎఱింగింపన్ = తెలుపుదామని; తలంచి = అనుకొని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

తమ గురువైన వ్యాసుడు బోధించిన క్రమంలో ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని అధర్వవేదాన్ని ఆ నలుగురూ లోకంలో ప్రచారం చేశారు.” అనగా, శౌనకుడు “ఆ క్రమము ఏమిటి?” అని ప్రశ్నించాడు. సూతుడు ఇలా చెప్పసాగాడు. “మొట్టమొదట బ్రహ్మ హృదయంలో ఒక నాదం పుట్టింది. చిత్తవ్యాపారాన్ని నిరోధించటం వలన అది రూపం ధరించి స్పష్టంగా గోచరించింది. అటువంటి ధ్వనిని ఉపాసించడం వలన యోగులు పాప రహితులై ముక్తిని పొందుతారు. ఆ నాదంలోనే ఓంకారం పుట్టింది. ఓంకారం మంత్రాలు అన్నింటికీ మూలం కావడంవల్ల, ఉపనిషత్తులకన్నింటికీ మూలం కావడం వల్ల వేదమాత అన్న విఖ్యాతిని గడించింది. ఓంకారంలో మూడు గుణాలున్నాయి. ఆ విధంగానే ఆకారమూ ఉకారమూ మకారమూ అనే మూడు వర్ణాలు ఉన్నాయి. ఆ గుణాలతోనూ వర్ణాలతోనూ ఓంకారం ప్రకాశిస్తూ ఉంది. ప్రణవంవల్ల భగవంతుడైన బ్రహ్మదేవుడు స్వరాలు, స్పర్శాలు, అంతస్థాలు ఊష్మములు మున్నగు లక్షణాలతో కలసి ఉన్నట్టి అక్షరమాల కల్పించాడు. ఆ అక్షర మాల తోడ్పాటుతో తన నాలుగు ముఖాల నుంచీ నాలుగు వేదాలను కలుగచేసాడు. బ్రహ్మచారులు అయిన తన పుత్రులకు ఒక క్రమంలో వాటిని ఉపదేశించాడు. అతని పుత్రులు తమ తండ్రి తమకు బోధించిన క్రమంలోనే శిష్యులకు బోధించారు. ఆ విధంగా వేదాలు ప్రతీ యుగంలోనూ సమగ్రంగా ఋషివర్యులచేత అభ్యాసం చేయబడుతూ వచ్చాయి.
వేదములను సమగ్రంగా చదువలేని శక్తిహీనులకు వీలు కల్పించడానికి భగవంతుడు ద్వాపర యుగ ప్రారంభంలో సత్యవతీదేవి యందు పరాశర మహర్షికి వ్యాసుడు అనే కుమారుడై అవతరించాడు. వ్యాసుడు సమగ్రమైన వేదరాశిని క్రమముగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగు విధాలుగా విడదీసి క్రమముగా వాటిని పైల మహర్షికి, వైశంపాయన మహర్షికి, జైమిని మహర్షికి, సుమంతు మహర్షికి బోధించాడు.
ఆ వరుసలో పైల మహర్షి ఋగ్వేదాన్ని నేర్చుకున్నాడు. ఋగ్వేదం అనంతంగా ఋక్కులు ఉండడంవలన బహ్వ్రచ శాఖ అన్న ప్రసిద్ధిని పొందింది. పైలుడు తాను నేర్చుకున్న వేదాన్ని ఇంద్ర ప్రమితికి, భాష్కలునికి ఉపదేశించాడు. భాష్కలుడు తను నేర్చుకున్న సంహితను చతుర్విధంబులు చేసి భోధ్యుండు, యాఙ్ఞవల్క్యుడు, అగ్నిమిత్రుడు అను తన శిష్యులకు ఉపదేశించాడు. ఇంద్రప్రమితి తను నేర్చుకున్న సంహితను మాండూకేయుడికి ఉపదేశించాడు. అతడు దేవమిత్రుడికి ఉపదేశించాడు దేవమిత్రునికి సౌభరి మున్నగు చాలామంది శిష్యులు ఉన్నారు. అందులో ఒకడు సౌభరి కుమారుడైన శాకల్యుడు. శాకల్యుడు తను నేర్చుకొనిన శాఖను ఐదు భాగాలు చేసి తన శిష్యులు వాత్స్యుడు, మౌద్గల్యుడు, శాలీయుడు, గోముఖుడు, శిశురుడు అయిదుగురుకి బోధించాడు. ఆ అయిదుగురూ జాతుకర్ణికి ఉపదేశించారు. జాతుకర్ణి బలాకుడు, పైంగుడు, వైతాళుడు, విరజుడు అనే నలుగురికి ఉపదేశించాడు. అంతే కాక ముందు చెప్పిన బాష్కలుని కుమారుడు బాష్కలి అతడు వాలఖిల్య సంహితను బాలాయని, గార్గ్యుడు, కాసారుడు అనే ముగ్గురికి బోధించాడు. ఈ విధంగా బహ్వృవ సంహితలు అనగా ఋగ్వేద సంహితలు అనేక విధములై యింతకు ముందు చెప్పిన మహర్షులచేత ధరింపబడి నిల్చి ఉన్నాయి.
యజుర్వేద ఉపదేశం పొందిన వైశంపాయన మహర్షి, ఆయన శిష్యులు అందరూ యజ్ఞములు అన్నింటిలో పాల్గొంటూ అధ్వర్వులుగా ఉంటూ ప్రసిద్ధి పొందారు. వైశంపాయనుని శిష్యులలో ఒకడు యాజ్ఞవల్క్యుడు. అతడు గురువుపట్ల అపరాధం చెయ్యడం మూలంగా, నేర్చుకున్న వేదములను తనకు ఇచ్చి పొమ్మని కోపగ్రస్తుడై వైశంపాయనుడు అనగా యజుస్సంహితలను యఙ్ఞవల్క్యుడు తాను నేర్చుకున్నవాటిని నేర్చుకున్న క్రమంలోనే వమనం చేసాడు. అవి రక్తసిక్తమైన రూపు దాల్చాయి. అంతట యజుర్మంత్ర గణముల అధిష్టానదేవతలు తిత్తిరిపక్షుల రూపంలో వచ్చివాటిని తినేశారు. అందువల్లనే ఆ శాఖలకు తైత్తిరీయశాఖలు అనే పేరు వచ్చింది. తను నేర్చిన యజుర్వేద విద్యపోవడంచేత యజ్ఞవల్క్య మహర్షి నిర్వేది అయ్యాడు. అందువల్ల బాగా నిర్వేదం పొంది తీవ్రతపస్సు చేసి సూర్యుని సంతృప్తిని చేసాడు. సూర్యుడు యజుర్మంత్ర సంహితలను అశ్వరూపం ధరించి అతనికి బోధించాడు. అందువల్లనే వాటికి వాజసనేయశాఖ అన్నపేరు కలిగింది. ఈ శాఖలో ఉండే యజుస్సంహితలను కాణ్వులు, మాధ్యందినులు మొదలయినవారు స్వీకరించి అభ్యసిస్తున్నారు. ఈ విధంగా లోకంలో యజుర్వేదం వ్యాపించింది.
సామవేదాన్ని అభ్యసించిన జైమినిమహర్షి తన కుమారుడైన సుమంతునికి బోధించాడు. అతను తన శిష్యుడు సుకర్మునకు ఉపదేశించాడు. సుకర్ముడు సామవేదమును వెయ్యి శాఖలుగా విడదీసి ఇద్దరికి బోధించాడు. ఒకడు కోసలుని పుత్రుడైన హిరణ్యనాభుడు. రెండవవాడు తన కుమారుడైన పౌష్పంజి. వారిద్దరూ బ్రహ్మవేత్తలయిన అవంత్యులూ ఉదీచ్యులూ అనే అయిదువందల మందికి ఉపదేశించి వారిని సామవేదపారగులుగా తీర్చిదిద్దారు. ఈ విధంగా సామవేదం లోకంలో ప్రసిద్ధి పొందింది.
అధర్వవేదాన్ని అభ్యసించిన సుమంతు మహర్షి దానిని తన శిష్యునికి బోధించాడు. ఆ శిష్యుడు వేదదర్శుడు, పథ్యుడు అనే తన ఇద్దరు శిష్యులకు ఉపదేశించాడు. వేదదర్శుడు శౌల్కాయని, బ్రహ్మబలి, నిర్దోషుడు, పిప్పలాయనుడు అనే నలుగురికి బోధించాడు. కుముదుడు, శునకుడు, జాబాలి, బభ్రువు, అంగిరసుడు, సైంధవాయునుడు అనే ఆరుగురికి పథ్యుడు బోధించాడు. ఈ విధంగా అధర్వవేదం వృద్ధి గాంచింది.
ఈవిధంగా నాలుగువేదముల ఉత్పత్తినీ, వ్యాప్తిని తెలియజెప్పాను. ఇప్పుడు ఇంక పురాణాల గురించి వినిపిస్తాను, విను. మా తండ్రి రోమహర్షణుడు వ్యాసుల వారి శిష్యుడు. మా తండ్రి వద్ద త్రయ్యారుణి, కశ్యపుడు, సావర్ణి, అకృతవ్రణుడు, వైశంపాయనుడు, హరీతుడు అనే ఆరుగురు నేర్చుకుని, పురాణ ప్రవక్తలుగా ప్రసిద్ధులు అయ్యారు. పురాణం అనేది సర్గ మున్నగు పది లక్షణాలు కలిగి ఉంటుంది. కొందరు పురాణానికి ఐదు లక్షణాలు ఉంటాయని అంటారు. పెద్దలు పూర్వ సంగతులు తెలిసిన అనుభవజ్ఞులు చెప్పిన పద్ధతిని అనుసరించి పురాణాలను క్రమంగా చెప్తాను, విను. బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణుపురాణం, శివపురాణం, భాగవతం, భవిష్యోత్తరపురాణం, నారదపురాణం, మార్కండేయపురాణం, అగ్నిపురాణం, బ్రహ్మకైవర్తపురాణం, లింగపురాణం, వరాహపురాణం, స్కాందపురాణం, వామనపురాణం, కూర్మపురాణం, మత్స్యపురాణం, బ్రహ్మాండపురాణం, గరుడపురాణం అని పద్దెనిమిది మహపురాణాలు. ఇవి కాక ఇంకా ఉపపురాణాలు ఉన్నాయి. వీటిని వ్రాసినా చదివినా వినినా పాపాలు నశించి పోతాయి.”
అని సూతుడు శౌనకాదిమహర్షులకు చెప్పాడు. వారు “నీవు నారాయణుని గుణాలను వర్ణించావు, ఆయన కథలను వినిపించావు, పాపంచేసినవారూ పాపబుద్ధికలవారు, సంసారసముద్రాన్ని తరించే మార్గం కూడ చెప్పు.” అని అడిగారు. అప్పుడు ఆ విషయం చెప్పడానికి సిద్ధపడిన సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు.