పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : కల్క్యవతారంబు

  •  
  •  
  •  

12-11-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లుగాన జనంబులు లోభులై, జారత్వ చోరత్వాదులచేత ద్రవ్యహీనులై వన్యశాక మూల ఫలంబులు భుజించుచు, వన గిరి దుర్గంబులం గృశీభూతులై దుర్భిక్ష, శీత, వాతాతప, క్షుధా, తాపంబులచేత భయంపడి, ధనహీనులై యల్పాయుష్కులు, నల్పతరశరీరులునై యుండ రాజులు చోరులై సంచరించుచు, నధర్మప్రవర్తనులై వర్ణాశ్రమ ధర్మంబులు విడనాడి, శూద్రప్రాయులై యుండెద; రంత నోషధు లల్పఫలదంబులు, మేఘంబులు జలశూన్యంబులు, సస్యంబులు నిస్సారంబులు నగు; నిట్లు ధర్మమార్గంబు దక్కి యున్నయెడ ముకుందుండు దుష్టనిగ్రహ శిష్టపరిపాలనంబుల కొఱకు శంబల గ్రామంబున విష్ణుయశుం డను విప్రునకుఁ గల్క్యవతారుండై దేవతా బృందంబులు నిరీక్షింప, దేవదత్త ఘోటకారూఢుండై దుష్టమ్లేచ్ఛజనంబులం దన మండలాగ్రంబున ఖండీభూతులం జేయు; నప్పుడు ధాత్రీమండలంబు విగతక్రూరజన మండలంబై తేజరిల్లు; నంత నరులు విష్ణుధ్యాన వందన పూజాది విధానాసక్తులై నారాయణపరాయణు లయి వర్తిల్లెద; రిట్లు కల్క్యవతారంబున నిఖిల జనులు ధన్యు లయ్యెద; రంతటఁ గృతయుగ ధర్మంబయి నడచుచుచుండు; జంద్ర భాస్కర శుక్ర గురువులేక రాశి గతులయినం, గృతయుగం బయి తోఁచు; రాజేంద్రా! గత వర్తమాన భావికాలంబులు; భవజ్జన్మంబు మొదలు నందాభిషేక పర్యంతంబుఁ పంచదశాధికశతోత్తర సహస్ర హాయనంబులయి యుండు; నంతట నారాయణుం డఖిల దుష్ట రాజద్వంసంబు గావించి ధర్మంబు నిలిపి వైకుంఠనిలయం డగు;”నని చెప్పిన.

టీకా:

అట్లు = అలా; కాన్ = అగుటచేత; జనంబులు = ప్రజలు; లోభులు = దురాశాపరులు; ఐ = అయ్యి; జారత్వ = వ్యభిచారము; చోరత్వ = దొంగతనము; ఆదుల = మోదలగువాని; చేత = ద్వారా; ద్రవ్యహీనులు = దరిద్రులు; ఐ = అయ్యి; వన్య = అడవి; శాక = కాయలు; మూల = దుంపలు; ఫలంబులు = పండ్లు; భుజించుచు = తింటూ; వన = అడవుల; గిరి = కొండల; దుర్గంబులన్ = దుర్గమప్రదేశములలో; కృశీభూతులు = చిక్కినవారు; ఐ = అయ్యి; దుర్భిక్ష = కరువుకాటకాలకు; శీత = చలికి; వాతా = గాలికి; ఆతప = ఎండకు; క్షుదాతాపంబుల = ఆకలిదప్పుల; చేత = కు; భయంపడి = భయపడిపోయి; ధనహీనులు = బీదవారు; ఐ = అయ్యి; అల్పా = తక్కువ; ఆయుష్కులు = ఆయుష్షుగలవారు; అల్పతర = మిక్కిలిచిన్న {అల్పము - అల్పతరము - అల్పతమము}; శరీరులు = దేహధారుడ్యముగలవారు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; రాజులు = పాలకులు; చోరులు = దొంగలు; ఐ = అయ్యి; సంచరించుచున్ = తిరుగుతూ; అధర్మ = ధర్మహీనమైన; ప్రవర్తనులు = నడచువారు; ఐ = అయ్యి; వర్ణ = చాతుర్వర్ణముల {చాతుర్వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర వర్ణములు}; ఆశ్రమ = చతురాశ్రమముల {చతురాశ్రమములు - 1బ్రహ్మచర్య 2గృహస్థ 3వానప్రస్థ 4సన్యాస ఆశ్రమములు}; ధర్మంబులున్ = ధర్మములను; విడనాడు = వదలిపెట్టి; శూద్ర = శూద్రులతో; ప్రాయులు = సమానమైనవారు; ఐ = అయ్యి; ఉండెదరు = ఉంటారు; అంతన్ = ఇంక; ఓషధుల్ = మొక్కలు {ఓషధులు - ఫలించుటతోడనే మరణించునవి, అరటి మున్నగుమొక్కలు}; అల్ప = చిక్కిన; ఫలదంబులు = ఫలవంతములగును; మేఘంబులున్ = మేఘములు; జలశూన్యంబులు = వట్టిపోయినవగును; సస్యంబులు = పంటలు; నిస్సారంబులు = పసలేనివి; అగున్ = అగును; ఇట్లు = ఈ విధముగ; ధర్మమార్గంబున్ = ధర్మమును; తక్కి = తగ్గి; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయమునందు; ముకుందుడు = విష్ణుమూర్తి {ముకుందుడు - మోక్షమునిచ్చువాడు, విష్ణువు}; దుష్టనిగ్రహ = దుష్టశిక్షణ; శిష్టపరిపాలనంబుల = శిష్టరక్షణల; కొఱకున్ = కోసము; శంబల = శంబల అనెడి, తీరప్రాంత; గ్రామంబునన్ = ఊరిలో; విష్ణుయశుండు = విష్ణుయశుడు; అను = అనెడి; విప్రున్ = బ్రాహ్మణున; కున్ = కు; కల్క్వవతారుండు = కల్క్యవతారము ధరించిన వాడు; ఐ = అయ్యి; దేవతా = దేవతల; బృందంబులున్ = సమూహములును; నిరీక్షింపన్ = చూస్తుండగా; దేవదత్త = దేవతలచేనివ్వబడిన; ఘోటక = గుఱ్ఱమును; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; దుష్ట = దుష్టులైన; మ్లేచ్ఛ = పాపరతులైన; జనంబులన్ = వారిని; తన = అతని యొక్క; మండలాగ్రంబునన్ = కత్తితో; ఖండీభూతులన్ = నరకబడినవారిగా; చేయున్ = చేస్తాడు; అప్పుడు = ఆ సమయమునందు; ధాత్రీమండలంబున్ = భూమండలము; విగత = తొలగిన; క్రూర = దుష్ట; జన = ప్రజలుకలిగిన; మండలంబు = దేశము; ఐ = అయ్యి; తేజరిల్లున్ = విలసిల్లును; అంతన్ = అప్పుడు; నరులు = మానవులు; విష్ణు = విష్ణుమూర్తిని; ధ్యాన = ధ్యానించుట; వందన = నమస్కరించుట; పూజన్ = పూజించుట; ఆది = మున్నగు; విధాన = విషయములందు; ఆసక్తులు = ఆసక్తులుకలవారు; ఐ = అయ్యి; నారాయణ = విష్ణువు ఎడల; పరాయణులు = భక్తిగలవారు; అయి = ఐ; వర్ధిల్లెదరు = వృద్ధిపొందుతారు; ఇట్లు = ఈ విధముగ; కల్క్యవతారంబునన్ = కల్క్యవతారమువలన; నిఖిల = సమస్తమైన; జనులున్ = వారు; ధన్యులు = కృతార్ధులు; అయ్యెదరు = ఔతారు; అంతటన్ = అటుపిమ్మట; కృతయుగ = కృతయుగపు; ధర్మంబున్ = ధర్మములు; అయి = కలిగి; నడచుచుండున్ = మెలగును; చంద్ర = చంద్రుడు; భాస్కర = సూర్యుడు; శుక్ర = శుక్రుడు; గురువులున్ = గురుగ్రహంబులు; ఏక = ఒకే; రాశిన్ = రాశిలో; గతులు = తిరుగువారు; అయినన్ = అయినచో; కృతయుగంబు = కృతయుగము; అయి = ప్రవేశించినట్లు; తోచున్ = తెలియును; రాజేంద్రా = మహారాజా; గత = భూత; వర్తమాన = వర్తమాన; భావి = భవిష్యత్తు; కాలంబులున్ = కాలములు; భవత్ = నీ; జన్మంబున్ = పుట్టుక; మొదలు = నుండి; నంద = నందరాజు; అభిషేక = రాజ్యాభిషేకము; పర్యంతంబు = వరకు; పంచదశాధికశతోత్తరసహస్ర = వెయ్యినూటయేభై; హాయనంబులు = సంవత్సరములు; అయి = జరిగి; ఉండున్ = ఉంటాయి; అంతట = ఆ పిమ్మట; నారాయణుండు = విష్ణుమూర్తి; అఖిల = సమస్తమైన; దుష్ట = దుర్మార్గపు; రాజ = రాజులను; ధ్వంశంబు = నాశనము; కావించి = చేసి; ధర్మంబున్ = ధర్మమును; నిలిపి = నిలబెట్టి; వైకుంఠనిలయుండు = వైకుంఠవాసుడుగా; అగును = ఔతాడు; అని = అని; చెప్పినన్ = చెప్పగా.

భావము:

అలా కావడంతో ఆ కాలంలోని ప్రజలు దురాశ, వ్యభిచారము, దొంగతనము మున్నగు దుర్గుణాలకు లొంగి, ధనహీనులు అవుతారు. అడవులందు కూరలు, దుంపల, పళ్ళు తింటూ; కొండగుహలలో మెసలుతూ, కృశించి, కరువు కాటకాలకు, చలికి, గాలికి ఎండకు ఆకలికి భయపడిపోతారు. వారి ఆయుర్ధాయం తరిగిపోతుంది. వారి శరీరాలు కూడ చిక్కి చిక్కి చిన్నవైపోతాయి. ఇంక రాజులు తామే దొంగలై తిరుగుతారు. అధర్మంగా సంచరిస్తూ, వర్ణాశ్రమ ధర్మాలను విడచిపెట్టి, శూద్ర సమానులై తిరుగుతారు.
ఆ కాలంలో, ఓషధులు ఫలించడం కూడ తగ్గిపోతుంది. మబ్బులు వట్టిపోయి వర్షాలు కురవవు. పండిన పంటలలో పస ఉండదు. ఈ మాదిరిగా లోకం ధర్మమార్గాన్ని తప్పి ఉన్నప్పుడు విష్ణుమూర్తి దుష్టశిక్షణకోసం శంబల గ్రామంలో విష్ణు యశుడనే విప్రుడికి కొడుకు అయి విష్ణుమూర్తి కల్కి పేర అవతారిస్తాడు. దేవతలు అందరూ చూస్తుండగా దేవదత్తం అనే అశ్వాన్ని అధిరోహించి కల్కి భగవానుడు దుష్టులు అయిన మ్లేచ్ఛులను తన కత్తితో తుత్తునియలు చేస్తాడు.
అప్పుడు భూమండలం దుష్టజన రహితం కావడంతో, ప్రకాశిస్తుంది. ప్రజలలో విష్ణుభక్తి కుదురుకుంటుంది ధ్యానవందనార్చనాదు లందు ఆసక్తి కలిగి ప్రజలు నారాయణ భక్తిపరాయణులై మెలగుతారు. అలా కల్క్యావతారుని వలన సకల జనులు ధన్యులు అవుతారు. సర్వత్రా కృతయుగ ధర్మమే నడుస్తూ ఉంటుంది. చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, బృహస్పతి ఒకే రాశిలో ప్రవేశించి నప్పుడు కృతయుగం ఆరంభం అవుతుంది. ఓ పరీక్షిన్మహారాజా! నీవు పుట్టింది మొదలుకొని నందాభిషేకంవరకూ జరిగిన జరుగుతున్న జరుగబోవు కాలం వెయ్యినూటపదిహేను సంవత్సరములు. మిగిలిన కాలాన్ని నువ్వే గణించవచ్చు. ఆ తరువాత నారాయణుడు దుష్టరాజులను అందరినీ సంహరించి, ధర్మాన్ని నిలబెట్టి, మళ్ళా వైకుంఠానికి వెళ్ళిపోతాడు.” అని శుకమహాముని చెప్పాడు...