పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : హరిముని సంభాషణ

  •  
  •  
  •  

11-48-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సర్వసంగపరిత్యక్తుండై, నిఖిలాంతరాత్ముండై, పరమేశ్వరు డరుణగభస్తి కిరణ సహస్రంబుల లోకత్రయంబుం బావనంబు సేయు చందంబునం దన చరణారవింద రజఃపుంజంబు చేతం బవిత్రంబు సేయుచు, సురాసురజేగీయమానసేవ్యం బైన జనార్దన పాదారవిందంబులకు వందనాభిలాషుఁడై, భక్తియు లవమాత్రంబునుం జలింపనీక సుధాకరోదయంబున దివాకరజనితతాపనివారణం బయిన భంగి నారాయణాంఘ్రినఖమణిచంద్రికా నిరస్త హృదయతాపుండై, యాత్మీయభక్తిరశనానుబంధబంధురంబైన వాసుదేవ చరణసరోరుహ ధ్యానానందపరవశుం డగు నతండు భాగవతప్రధానుం” డని యెఱింగించిన విని విదేహుం డిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సర్వ = సమస్తమైన; సంగ = తగులములను; పరిత్యక్తుండు = వదలివేసినవాడు; ఐ = అయ్యి; నిఖిల = సర్వభూతముల; అంతరాత్ముండు = లోని ఆత్మయైనవాడు; ఐ = అయ్యి; పరమేశ్వరుడు = భగవంతుడు; అరుణగభస్తి = సూర్యుడు {అరుణగభస్తి - ఎఱ్ఱని కిరణములు కలవాడు, సూర్యుడు}; కిరణ = కిరణములు; సహస్రంబులు = వేలకొలదితో; లోకత్రయంబున్ = ముల్లోకములను {లోకత్రయము - భూలోకము స్వర్గలోకము పాతాళలోకము, భూఃభువస్సువర్లోకములు}; పావనంబు = పుణ్యవంతము; చేయున్ = చేసెడి; చందంబునన్ = విధముగా; తన = తన యొక్క; చరణ = పాదములనెడి; అరవింద = పద్మముల; రజః = ధూళి; పుజంబు = సమూహము; చేతన్ = వలన; పవిత్రంబు = పుణ్యవంతము; చేయుచు = చేస్తు; సుర = దేవతలు; అసుర = రాక్షసులు చేతను; జేగీయమాన = స్తోత్రములు చేయదగ్గ; సేవ్యంబు = కొలువబడినవాడు; ఐన = అయిన; జనార్దన = విష్ణుమూర్తి; పాద = పాదములనెడి; అరవిందంబుల = పద్మముల; కున్ = కు; వందన = నమస్కరించెడి; అభిలాషుడు = ఆసక్తిగలవాడు; ఐ = అయ్యి; భక్తియు = భక్తి; లవమాత్రంబునున్ = రవ్వంత; చలింపనీక = సడలనీయక; సుధాకర = చంద్ర; ఉదయంబునన్ = ఉదయించుటవలన; దివాకర = సూర్యునివలన; జనిత = కలిగిన; తాప = ఎండబాధ; నివారణంబు = తగ్గుట, నివృత్తి; అయిన = జరిగిన; భంగిన్ = వలె; నారాయణ = హరి; అంఘ్రి = కాలి; నఖ = గోర్లు అనెడి; మణి = రత్నాలకాంతులనెడి; చంద్రికా = వెన్నెలలచే; నిరస్త = పోగొట్టబడిన; హృదయతాపుండు = మనస్తాపముకలవాడు; ఐ = అయ్యి; ఆత్మీయ = తన యొక్క; భక్తి = భక్తి అనెడి; రశన = తాళ్ళచే, బంధాలచే; అనుబంధ = కట్టబడుటచే; బంధురంబు = చిక్కనైనది; ఐన = అయిన; వాసుదేవ = శ్రీకృష్ణుని; చరణ = పాదములనెడి; సరోరుహ = పద్మములందు; ధ్యాన = ధ్యానించుటలోని; ఆనంద = ఆనందముచేత; పరవశుండు = పరవశముచెందినవాడు; అగు = ఐన; అతండు = అతను; భాగవత = భాగవతులలో; ప్రధానుండు = ముఖ్యుడు; అని = అని; ఎఱిగించినన్ = తెలుపగా; విని = విని; విదేహుండు = విదేహుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

భాగవతోత్తముడు ఈ విధంగా సకల బంధాలను త్రెంపుకుని అన్నింటిలో పరమాత్మను గుర్తించినవాడై మెలగుతాడు. మహాప్రభువైన సూర్యుడు తన సహస్ర కిరణాలచేత మల్లోకాలనూ పావనం చేయునట్లు, తన పాదధూళి చేత జగత్రయాన్నీ పవిత్రం చేస్తూ ఉంటాడు. దేవదానవులకు కూడా సేవింపదగిన జనార్ధునుని చరణారవిందాలకు నమస్కరించా లనే అభిలాష కలిగి ఉంటాడు. తన భక్తిని రవ్వంత కూడ చలించనీయక చంద్రుడు ఉదయించడంతో ఎండ బాధ పోయినట్లు నారాయణుని చరణకాంతుల వెన్నెలలచే భాగవతుడు హృదయతాపం పోగొట్టుకుంటాడు. ఉత్తమ భాగవతుడు తన భక్తి అనే బంధాలతో వాసుదేవుని చరణపద్మాలకు బంధించుకుని ధ్యానానందంలో పరవశిస్తూ ఉంటాడు.” ఈ విధంగా మహాముని తెలుపగా రాజు విదేహుడు ఇలా అన్నాడు.