పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : విదేహ హర్షభ సంభాషణ

  •  
  •  
  •  

11-35-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ యాగ్నీధ్రునకు నాభి యను ప్రాజ్ఞుం డగు తనూభవుం డుదయించి బలిచక్రవర్తితో మైత్రింజేసి ధారుణీభారంబు పూని యాజ్ఞా పరిపాలనంబున నహితరాజన్య రాజ్యంబులు స్వవశంబులు గావించుకొని యుండె; నంతట నాభికి సత్పుత్రుం డయిన ఋషభుండు పుట్టె; నతండు హరిదాసుండై సుతశతకంబుఁ బడసె; నందగ్రజుండయిన భరతుం డను మహానుభావుఁడు నారాయణపరాయణుండై యిహలోకసుఖంబులం బరిహరించి, ఘోరతపం బాచరించి జన్మ త్రితయంబున నిర్వాణసుఖపారవశ్యంబున సకలబంధ విముక్తుం డై వాసుదేవపదంబు నొందె; నాతని పేర నతం డేలిన భూఖండంబు భారతవర్షం బను వ్యవహారంబున నెగడి జగంబులఁ బ్రసిద్ధం బయ్యె; మఱియు నందుఁ దొమ్మండ్రు కుమారులు బల పరాక్రమ ప్రభావ రూప సంపన్నులయి నవఖండంబులకు నధిష్ఠాతలైరి; వెండియు వారలలో నెనుబది యొక్కండ్రు కుమారులు నిత్య కర్మానుష్ఠాన పరతంత్రులై విప్రత్వం బంగీకరించి; రందుఁ గొందఱు శేషించిన వారులు కవి హర్యంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయ నావిర్హోత్ర ద్రమిళ చమస కరభాజను లనం బరఁగు తొమ్మం డ్రూర్ధ్వరేతస్కు లయి బ్రహ్మవిద్యావిశారదు లగుచు, జగత్త్రయంబును బరమాత్మ స్వరూపంబుగాఁ దెలియుచు ముక్తులై యవ్యాహతగమను లగుచు, సుర సిద్ధ సాధ్య యక్ష గంధర్వ కిన్నర కింపురుష నాగలోకంబు లందు స్వేచ్ఛావిహారంబు సేయుచు నొక్కనాఁడు.

టీకా:

ఆ = ఆ ప్రసిద్ధుడైన; ఆగ్నీధ్రున్ = ఆగ్నీధ్రుని; కున్ = కి; నాభి = నాభి; అను = అనెడి; ప్రాఙ్ఞుండు = మహాపండితుడు; అగు = ఐన; తనూభవుండు = పుత్రుడు {తనూభవుడు - తనువున పుట్టినవాడు, కొడుకు}; ఉదయించి = పుట్టి; బలి = బలి అనెడి; చక్రవర్తి = చక్రవర్తి; తోన్ = తోటి; మైత్రిన్ = స్నేహము; చేసి = వలన; ధారుణీ = రాజ్య; భారంబు = బాధ్యత; పూని = స్వీకరించి; ఆఙ్ఞాపరిపాలనంబున = ఆఙ్ఞాబలంచేత; అహిత = శత్రు; రాజన్య = రాజశ్రేష్ఠుల; రాజ్యంబులున్ = దేశములను; స్వ = తనకి; వశంబులు = పాలనలోనివిగా; కావించుకొని = చేసుకొని; ఉండెన్ = ఉండెను; అంతట = అప్పుడు; నాభి = నాభి; కిన్ = కి; సత్ = మంచి; పుత్రుండు = కుమారుడు; అయిన = ఐన; ఋషభుండు = ఋషభుడు; పుట్టెన్ = జన్మించెను; అతండు = అతను; హరి = విష్ణు; దాసుండు = భక్తుడు; ఐ = అయ్యి; సుత = పుత్రులు; శతకంబున్ = నూరుమందిని (100); పడసెన్ = పొందెను; అందున్ = వారిలో; అగ్రజుండు = పెద్దవాడు; అయిన = ఐన; భరతుండు = భరతుడు; అను = అనెడి; మహానుభావుడు = గొప్పవాడు; నారాయణ = విష్ణు; పరాయణుండు = భక్తి కలవాడు; ఐ = అయ్యి; ఇహలోక = భౌతిక; సుఖంబులన్ = సుఖములను; పరిహరించి = వదలివేసి; ఘోర = భీకరమైన; తపంబున్ = తపస్సు; ఆచరించి = చేసి; జన్మ = జన్మలు; త్రితయంబునన్ = మూటిలో; నిర్వాణ = మోక్ష; సుఖ = సౌఖ్యమువలని; పారవశ్యంబునన్ = పరవశత్వముచేత; సకల = సమస్తమైన; బంధ = బంధనాలనుండి; విముక్తుండు = విముక్తిపొందినవాడు; ఐ = అయ్యి; వాసుదేవపదంబున్ = పరమపదాన్ని, వైకుంఠం; ఒందెన్ = పొందెను; ఆతని = అతని యొక్క; పేరన్ = పేరుతోనే; అతండు = అతను; ఏలిన = పరిపాలించిన; భూఖండంబున్ = భూమిభాగమును; భారతవర్షంబు = భరతవర్షము; అను = అనెడి; వ్యవహారంబున = నామముతో; నెగడి = అతిశయించి; జగంబులన్ = లోకములో; ప్రసిద్ధంబు = పేరుపొందినది; అయ్యెన్ = అయినది; మఱియున్ = ఇంకను; అందున్ = వారిలో; తొమ్మండ్రు = తొమ్మిదిమంది (9); కుమారులు = పుత్రులు; బల = బలాలతో; పరాక్రమ = శౌర్యములతో; ప్రభావ = ప్రభావములతో; రూప = అందాలతో; సంపన్నులు = సమృద్ధిగాకలవారు; అయి = ఐ; నవఖండంబుల్ = తొమ్మిదిద్వీపములకు; అధిష్టాతలు = సంస్థాపకులు; ఐరి = అయ్యారు; వెండియున్ = ఇంకను; వారలు = వారి; లోనన్ = అందు; ఎనుబదియొక్కండ్రు = ఎనభైఒక్కమంది (81); కుమారులు = పుత్రులు; నిత్య = నిత్య; కర్మ = కర్మలందు; అనుష్టాన = అనుష్టానములందు; పరతంత్రులు = ఆసక్తి కలవారు; ఐ = అయ్యి; విప్రత్వంబున్ = బ్రాహ్మణత్వాన్ని; అంగీకరించిరి = స్వీకరించారు; కొందఱు = కొంతమంది; శేషించిన = మిగిలిన; వారలు = వారు; కవి = కవి; హరి = హరి; అంతరిక్ష = అంతరిక్షుడు; ప్రబుద్ధ = ప్రబుద్ధుడు; పిప్పలాయన = పిప్పలాయనుడు; అవిర్హోత్ర = అవిర్హోత్రుడు; ద్రమిళ = ద్రమీళుడు; చమస = చమసుడు; కరభాజనులు = కరభాజనుడు {[1. హరి, 2. కవి, 3. అంతరిక్షుడు, 4. ప్రబుద్ధుడు, 5. పిప్పలాహ్వయుడు, 6. అవిర్హోత్రుడు, 7. ద్రమిళుడు, 8. చమనుడు, 9. కరభాజనుడు యను వీరు వృషభరాజు నూఱుగురి కుమారులలో ఆకాశగమనాది సిద్ధులను పొందిన చివరివారు}; అనన్ = అనగా; పరగు = ప్రసిద్ధులైన; తొమ్మండ్రు = తొమ్మిదిమంది (9); ఊర్థ్వరేతస్కుల = ఋషులుగా; అయి = అయ్యి; బ్రహ్మవిద్యా = వేదాంతఙ్ఞానమునందు; విశారదులు = గొప్పపండితులు; అగుచు = ఔతూ; జగత్రయంబునున్ = ముల్లోకములు; పరమాత్మ = పరమాత్మ యొక్క; స్వరూపంబు = స్వరూపము; కాన్ = ఐ ఉండుట; తెలియుచు = తెలిసికుంటు; ముక్తులు = ముక్తి చెందినవారు; ఐ = అయ్యి; అవ్యాహత = అడ్డులేక; గమనులు = వెళ్ళువారు; అగుచు = ఔతు; సుర = దేవతల యొక్క; సిద్ధ = సిద్ధుల యొక్క; సాధ్య = సాధ్యుల యొక్క; యక్ష = యక్షుల యొక్క; గంధర్వ = గంధర్వుల యొక్క; కిన్నర = కిన్నరుల యొక్క; కింపురుష = కింపురుషుల యొక్క; నాగ = నాగుల యొక్క; లోకంబులు = లోకములు అందు; స్వేచ్ఛా = ఇష్ఠానువర్తనమున; విహారంబున్ = తిరుగుట; చేయుచు = చేస్తూ; ఒక్క = ఒకానొక; నాడు = దినమున.

భావము:

ఆ అగ్నీధ్రుడికి నాభి అనే కుమారుడు జన్మించాడు ప్రాజ్ఞుడైన అతడు బలిచక్రవర్తితో స్నేహంచేసి భూభారాన్ని వహించి ప్రజలను పాలించాడు. తన ఆజ్ఞాపాలన చేయ అంగీకరించని సకల శత్రురాజుల రాజ్యాలను తన వశం చేసుకున్నాడు. ఆ నాభికి సత్పుత్రుడైన ఋషభుడు పుట్టాడు హరిభక్తుడైన ఋషభుడు వందమంది కొడుకులను కన్నాడు. వారిలో పెద్దవాడు భరతుడు అనే మహానుభావుడు. అతడు నారాయణభక్తుడై ఈ లోకపు సుఖాలను వదలి భయంకరమైన తపస్సుచేసి మూడు జన్మలలో సకలబంధాల నుండి విముక్తిచెంది నిర్వాణ సుఖపారవశ్యంతో పరమపదాన్ని అందుకోగలిగాడు. భరతుడు పాలించిన భూఖండానికి “భరతవర్షము” అనే పేరు జగత్ప్రసిద్ధంగా వచ్చింది. ఋషభుని వందమందిలో
తొమ్మిదిమంది కుమారులు బలం పరాక్రమం ప్రభావం రూపసంపద కలిగినవారై తొమ్మిది భూఖండాలకు ఏలికలయ్యారు. ఇంకా వారిలో ఎనభైఒక్కమంది కుమారులు నిత్యకర్మలలోను అనుష్ఠానములలోను ఆసక్తికలవారై బ్రాహ్మణత్వాన్ని గ్రహించారు. మిగిలినవారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రమీళుడు, చమసుడు, కరభాజనుడు అనే పేర్లు కలగిన తొమ్మిదిమంది ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మవిద్యా విశారదులై మూడులోకాలు పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటూ ముక్తులై అడ్డులేని గమనాలతో సురల, సిద్ధుల, యక్షుల, గంధర్వుల, కిన్నరుల, కింపురుషుల, నాగుల యొక్క లోకములందు తమ ఇచ్చానుసారంగా విహరింప సాగారు. అలా విహరిస్తూ ఒకనాడు...
[1. హరి, 2. కవి, 3. అంతరిక్షుడు, 4. ప్రబుద్ధుడు, 5. పిప్పలాహ్వయుడు, 6. అవిర్హోత్రుడు, 7. ద్రమిళుడు, 8. చమనుడు, 9. కరభాజనుడు యను వీరు వృషభరాజు నూఱుగురి కుమారులలో ఆకాశగమనాది సిద్ధులను పొందిన చివరివారు].