పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : పూర్ణి

 •  
 •  
 •  

11-125-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రాజీవసదృశనయన! వి
రాజితసుగుణా! విదేహరాజవినుత! వి
భ్రాజితకీర్తి సుధావృత
రాజీవభవాండభాండ! ఘుకులతిలకా!

టీకా:

రాజీవసదృశనయన = శ్రీరామా {రాజీవసదృశనయనుడు - రాజీవ (పద్మముల) సదృశ (వంటి) నయన (కన్నులు కలవాడు), రాముడు}; విరాజితసుగుణా = శ్రీరామా {విరాజితసుగుణుడు - విరాజిత (ప్రకాశించెడి) సుగుణుడు (సుగుణాలు కలవాడు), రాముడు}; విదేహరాజవినుత = శ్రీరామా {విదేహరాజవినుత - విదేహ దేశపు రాజు (జనకుని)చే వినుత (స్తుతింపబడినవాడు), రాముడు}; విభ్రాజితకీర్తిసుధావృతరాజీవభవాండభాండ = శ్రీరామా {విభ్రాజితకీర్తిసుధావృతరాజీవభవాండభాండ - విభ్రాజిత (ప్రకాశించెడి) కీర్తి అనెడి సుధ (అమృతము)చేత ఆవృత (ఆవరింపబడిన) రాజీవభవ అండభాండ (బ్రహ్మాండభాండము కలవాడు), రాముడు}; రఘుకులతిలకా = శ్రీరామా {రఘుకులతిలకుడు - రఘు కుల (వంశానికి) తిలకుడు (శోభాకరమైన వాడు), రాముడు}.

భావము:

పద్మములవంటి కన్నులు కలవాడ! ప్రకాశించే సుగుణాలు కలవాడా జనక మహారాజుచే పొగడబడినవాడ! ప్రకాశించే కీర్తి అనే అమృతంతో ఆవరించబడిన బ్రహ్మాండభాండం కలవాడ! రఘువంశానికి తిలకం వంటివాడ! శ్రీరామచంద్ర ప్రభు!

11-126-మాలి.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ణిదుహితృరంతా! ర్మమార్గానుగంతా!
నిరుపమనయవంతా! నిర్జరారాతిహంతా!
గురుబుధసుఖకర్తా! కోసలక్షోణిభర్తా!
సుభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా!

టీకా:

ధరణిదుహితృరంతా = శ్రీరామా {ధరణిదుహితృరంత - ధరణిదుహితృ (భూదేవిపుత్రికతో) రంత (క్రీడించు వాడు), రాముడు}; ధర్మమార్గానుగంతా = శ్రీరామా {ధర్మమార్గానుగంత - ధర్మమార్గమును అనుగంత (అనుసరించువాడు), రాముడు}; నిరుపమనయవంతా = శ్రీరామా {నిరుపమనయవంత - నిరుపమ (సాటిలేని) నయవంత (నీతి కలవాడు), రాముడు}; నిర్జరారాతిహంతా = శ్రీరామా {నిర్జరారాతిహంత - నిర్జర అరాతి (రాక్షసులను) హంత (సంహరించినవాడు), రాముడు}; గురుబుధసుఖకర్తా = శ్రీరామా {గురుబుధసుఖకర్త - గురువులకు బుధ (పండితులకు) సుఖమును కర్త (కలిగించు వాడు), రాముడు}; కోసలక్షోణిభర్తా = శ్రీరామా {కోసలక్షోణిభర్త - కోసల అనెడి క్షోణి (రాజ్యాని)కి భర్త (రాజు), రాముడు}; సురభయపరిహర్తా = శ్రీరామా {సురభయపరిహర్త -సుర (దేవతల) భయమును పరిహర్త (పోగొట్టువాడు), రాముడు}; సూరిచేతోవిహర్తా = శ్రీరామా {సూరిచేతోవిహర్త - సూరి (పండితుల) చేతస్ (హృదయాల)లో విహర్త (విహరించేవాడు), రాముడు}.

భావము:

భూదేవి పుత్రిక యైన సీతాదేవిని ఆనందింప జేయు వాడా! ధర్మమార్గాన్ని సదా అనుసరించిన వాడా! సాటిలేని నీతిమంతుడా! దేవతల శత్రువు లైన రాక్షసులను సంహరించిన వాడా! కోసల దేశ రాజ! దేవతల భయమును పోగొట్టిన వాడ! పండితుల హృదయాలలో విహరించు వాడ! శ్రీరామ!

11-127-గ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇది శ్రీ పరమేశ్వరకరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్త్ర సహజపాండిత్య పోతనామాత్యప్రియశిష్య వెలిగందల నారయ నామధేయ ప్రణీతంబైన శ్రీమహాభాగవతంబను మహాపురాణంబు నందుఁ గృష్ణుండు భూభారంబు వాపి యాదవుల కన్యోన్య వైరానుబంధంబుఁ గల్పించి, వారల హతంబు గావించుటయు, విదేహర్షభ సంవాదంబును, నారాయణ ముని చరిత్రంబును, నాలుగు యుగంబుల హరి నాలుగువర్ణంబులై వర్తించుటయు, బ్రహ్మాది దేవతలు ద్వారకానగరంబునకుం జని కృష్ణుం బ్రార్థించి నిజపదంబునకు రమ్మనుటయు, నవధూత యదు సంవాదంబును, నుద్ధవునకుఁ గృష్ణుం డనేకవిధంబు లైన యుపాఖ్యానంబు లెఱింగించుటయు, నారాయణప్రకారం బంతయు దారకుం డెఱింగివచ్చి ద్వారకానివాసులకుం జెప్పుటయుఁ, గృష్ణుండు దన దివ్యతేజంబుతోఁ బరమాత్మం గూడుటయు నను కథలు గల యేకాదశ స్కంధము.

టీకా:

ఇది = ఇది; శ్రీ = శుభకరమైన; పరమేశ్వర = భగవంతుని; కరుణా = దయచేత; కలిత = లభించిన; కవితా = కవిత్వమును; విచిత్ర = విశేషముగ చిత్రించువాడు; కేసనమంత్రి = కేసనమంత్రి యొక్క; పుత్త్ర = కుమారుడు; సహజ = సహజసిద్ధముగ; పాండిత్య = పాండిత్యము కలవాడు; పోతనామాత్య = పోతనామాత్యునికి; ప్రియ = ఇష్టమైన; శిష్య = శిష్యుడు; వెలిగందల = వెలిగందల వంశపు; నారయ = నారయ అనెడి; నామధేయ = పేరుకలవానిచే; ప్రణీతంబు = రచింపబడినది; ఐన = అయిన; శ్రీ = శ్రీమంతమైన; మహాభాగవతంబు = మహాభాగవతము; అను = అనెడి; మహా = గొప్ప; పురాణంబున్ = పురాణము; అందున్ = లో; కృష్ణుండు = కృష్ణుడు; భూ = భూమిమీది; భారంబున్ = భారమును; వాపి = పోగొట్టి; యాదవుల = యదువుల; కిన్ = కి; అన్యోన్య = పరస్పర; వైర = శత్రుత్వపు; అనుబంధంబున్ = భావములను; కల్పించి = ఏర్పరచి; వారలన్ = వారిని; హతంబు = నాశనము; కావించుటయు = చేయుట; విదేహ = విదేహుడు; ఋషభ = ఋషభుడుల; సంవాదంబును = సంభాషణము; నారాయణ = నారాయణుడు అను; ముని = ముని యొక్క; చరిత్రంబును = కథ; నాలుగు = నాలుగు (4); యుగంబుల = యుగములలోను; హరి = విష్ణుమూర్తి; నాలుగు = నాలుగు (4); వర్ణంబులు = వర్ణములు కలవాడు; ఐ = అయ్యి; వర్తించుటయున్ = ఉండుట; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలైన; దేవతలున్ = దేవతలు; ద్వారకానగరంబున్ = ద్వారకానగరమున; కున్ = కు; చని = వెళ్ళి; కృష్ణున్ = కృష్ణుని; ప్రార్థించి = వేడి; నిజ = తన; పదంబున్ = స్థానమున; కున్ = కు; రమ్ము = విచ్చేయుము; అనుటయున్ = అనుట; అవధూత = అవధూత; యదు = యదుల; సంవాదంబును = సంభాషణము; ఉద్దవున్ = ఉద్దవున; కున్ = కు; కృష్ణుండు = కృష్ణుడు; అనేక = పలు; విధంబులు = రకములు; ఐన = అయినట్టి; ఉపాఖ్యానంబులు = ఇతిహాసములను; ఎఱింగించుటయు = తెలుపుట; నారాయణ = కృష్ణుని; ప్రకారంబు = విషయము; అంతయున్ = అంతా; దారుకుండు = దారుకుండు; ఎఱింగి = తెలిసికొని; వచ్చి = వచ్చి; ద్వారకా = ద్వారకానగరమున; నివాసుల = నివసించెడివారి; కున్ = కు; చెప్పుటయున్ = చెప్పుట; కృష్ణుండు = కృష్ణుడు; తన = తన యొక్క; దివ్య = దైవికమైన; తేజంబు = తేజస్సు; తోన్ = తోటి; పరమాత్మన్ = పరమాత్మను; కూడుటయున్ = కలియుట; అను = అనెడి; కథలు = కథనములు; కల = ఉన్నట్టి; ఏకాదశ = పదకొండవ; స్కంధము = స్కంధము.

భావము:

ఇది పరమేశ్వరుని దయచేత లభించిన విచిత్రమైన కవిత్వము కలవాడు కేసనమంత్రి కుమారుడు సహజపాండిత్యుడు అయిన పోతనామాత్యుని ప్రియశిష్యుడు వెలిగందల నారయ అను నామధేయునిచే రచించబడిన శ్రీ మహాభాగవత మనే పురాణంలో కృష్ణుడు భూభారం పోగొట్టి, యాదవులకు పరస్పర శత్రుత్వాలు కల్పించి, వాళ్ళను నాశనం చేయటం; విదేహ ఋషభ సంవాదం; నారాయణమహర్షి చరిత్ర; నాలుగు యుగాలలో హరి నాలుగు వర్ణాలై వర్తించటం; బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు ద్వారకానగరానికి వెళ్ళి శ్రీకృష్ణుని తన స్థానానికి రమ్మని ప్రార్థించడం; అవధూత యదు సంవాదం; ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు అనేకమైన ఉపాఖ్యానాలు తెలపటం; కృష్ణుడి విషయమంతా తెలుసుకుని దారుకుడు వచ్చి ద్వారకలోని వారికి చెప్పటం; శ్రీకృష్ణుడు తన తేజస్సుతో పరమాత్మను కలవటం అనే కథలు కల పదకొండవ స్కంధము.


ఓం నమో భగవతే వాసుదేవాయ!!
ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వే జనా స్సుఖినో భవతు!!