పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : శ్రీకృష్ణ నిర్యాణంబు

 •  
 •  
 •  

11-118-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అనిన రాజునకు శుకుం డిట్లనియె “నట్లు వాసుదేవుం డన్యాయ ప్రవర్తకులగు దుష్టుల సంహరించి, న్యాయప్రవర్తకులగు శిష్టులఁ బరిపాలనంబు సేసి, బలరామ సమేతంబుగా ద్వారకానగరంబు వెడలినం గని యాదవులు దమలోఁ దాము మదిరాపానమత్తులై మత్సరంబున నుత్సాహకలహంబునకుం గమకించి, కరి తురగ రథ పదాతిబలంబులతో ననర్గళంబుగా యుద్ధసన్నద్ధులై, యుద్ధంబునకుం జొచ్చి మునిశాపకారణంబున నుత్తుంగంబు లయిన తుంగ సమూహంబుల బడలుపడంగఁ బొడుచుచు, వ్రేయుచుం దాఁకు నప్పుడు నవియును వజ్రాయుధ సమానంబులై తాఁకిన భండనంబునం బడి ఖండంబులై యొఱగు కబంధంబులును, వికలంబులైన శరీరంబులును, విభ్రష్టంబులైన రథంబులును, వికటంబులైన శకటంబులును, వ్రాలెడు నశ్వంబులును, మ్రొగ్గెడి గజంబులునై, యయ్యోధనంబున నందఱుం బొలియుటకు నగి నగధరుండును రాముండునుం జనిచని; యంత నీలాంబరుం డొక్క త్రోవంబోయి యోగమార్గంబు నననంతునిం గలసె; నప్పరమేశ్వరుండు మఱియొక మార్గంబునం జని యొక్క నికుంజపుంజంబు చాటున విశ్రమించుటంజేసి చరణంబు వేఱొక చరణంబు మీఁద సంఘటించి చంచలంబుగా వినోదంబు సలుపు సమయంబున నొక్క లుబ్ధకుండు మృగయార్థంబుగా వచ్చి దిక్కులు నిక్కి నిరీక్షించుచుండ, వృక్షంబు చాటున నప్పరమపురుషుని చరణ కమలంబు హరిణకర్ణంబు గాఁబోలునని దానిం గని శరంబు శరాసనంబునందు సంధానంబు సేసి యేసిన నతండు హాహారవంబునం గదలుచుండ నప్పరమేశ్వరుని సన్నిధానంబునకు వచ్చి జగన్నాథుంగాఁ దెలిసి, భయంబున “మహాపరాధుండను; బాపచిత్తుం డను; గుటిలప్రచారుండ” నని యనేకవిధ దీనాలాపంబులం బలుకుచు బాష్పజలధారాసిక్తవదనుండైన, సరోజనేత్రుండు వానిం గరుణించి యిట్లనియె; “నీ వేల జాలింబడెదు? పూర్వజన్మ కర్మంబు లెంత వారికైన ననుభావ్యంబులగుం గాని యూరక పోవనేరవు; నీవు నిమిత్తమాత్రుండ; వింతియ కాని” యని వానికిం దెలిపిన వాఁడును “మహాపరాధులైన వారూరక పోవరు; దేవ గురు వైష్ణవ ద్రోహులకు నిలువ నెట్లగు” నని పవిత్రాంతఃకరణుండై ప్రాయోపవేశంబునం బ్రాణంబులు వర్జించి వైకుంఠపదప్రాప్తుండయ్యె నప్పుడు.

టీకా:

అనినన్ = అనగా; రాజున్ = రాజున; కున్ = కు; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; అట్లు = ఆ విధముగ; వాసుదేవుండు = కృష్ణుడు; అన్యాయ = అన్యాయపు; ప్రవర్తకులు = నడవడికగలవారు; అగు = ఐన; దుష్టులన్ = దుర్మార్గులను; సంహరించి = చంపి; న్యాయ = న్యాయపు; ప్రవర్తకులు = నడవడికగలవారు; అగు = ఐన; శిష్టులన్ = సన్మార్గులను; పరిపాలనంబు = కాపాడుట; చేసి = చేసి; బలరామ = బలరామునితో; సమేతంబుగా = కలిసి; ద్వారకానగరంబున్ = ద్వారకానగరము; వెడలినన్ = బయటకురాగా; కని = చూసి; యాదవులు = యాదవులు; తమలోతాము = వాళ్ళలోవాళ్ళే; మదిరాపాన = మధ్యపానమువలన; మత్తులు = మత్తిల్లినవారు; ఐ = అయ్యి; మత్సరంబునన్ = ఈర్ష్యతో; ఉత్సాహ = సరదా; కలహంబున = పోట్లాట; కున్ = కు; గమకించి = మొదలిడి; కరి = ఏనుగులు; తురగ = గుఱ్ఱములు; రథ = రథములు; పదాతి = కాల్బంట్ల; బలంబుల = సైన్యముల; తోన్ = తోటి; అనర్గళంబుగా = అడ్డులేకుండ; యుద్ధ = యుద్ధముచేయుటకు; సన్నద్ధులు = సిద్ధపడినవారు; ఐ = అయ్యి; యుద్ధంబున్ = యుద్ధమున; కున్ = కు; చొచ్చి = ప్రారంభించి; ముని = మునుల యొక్క; శాప = శాపము; కారణంబుననున్ = కారణంగా; ఉత్తుంగంబులు = ఎత్తుగాపెరిగినవి; ఐన = అయిన; తుంగ = తుంగబెత్తముల; సమూహంబులన్ = సమూహములతో; బడలుపడంగ = అలసిపోయేలా; పొడుచుచున్ = కొట్టుకొంటు; వ్రేయుచున్ = బాదుతు; తాకు = తగిలెడి; అప్పుడు = సమయమునందు; అవియును = అవి; వజ్రాయుధ = వజ్రాయుధముతో; సమానంబులు = సమానమైనవి; ఐ = అయ్యి; తాకినన్ = తగులుటచేత; భండనంబునన్ = యుద్ధరంగంలో; పడి = పడిపోయి; ఖండంబులు = ముక్కలుముక్కలు; ఐ = అయ్యి; ఒఱగు = పడిపోయెడి; కబంధంబులును = మొండెములు; వికలంబులు = విరిగిపోయినవి; ఐన = అయిన; శరీరంబులును = దేహములు; విభ్రష్టంబులు = మిక్కిలి చెడిపోయినవి; ఐన = అయిన; రథంబులును = రథాలు; వికటంబులు = చెడిపోయినవి; ఐన = అయిన; శకటంబులును = బళ్ళు; వ్రాలెడు = కూలిపోతున్న; అశ్వంబులును = గుఱ్ఱములు; మ్రొగ్గెడి = వాలిపోతున్న; గజంబులును = ఏనుగులు కలది; ఐ = అయ్యి; ఆ = ఆ యొక్క; యోధనంబునన్ = యుద్ధమునందు; అందఱున్ = అందరు; పొలియుటకు = చనిపోవుటకు; నగి = నవ్వి; నగధరుండును = కృష్ణుడు {నగధరుడు - నగ (గోవర్దనగిరి) ధరుడు, కృష్ణుడు}; రాముండునున్ = బలరాముడు; చనిచని = కొంతదూరంవెళ్ళిన; అంత = తరువాత; నీలాంబరుండు = బలరాముడు; ఒక్క = ఒకానొక; త్రోవన్ = దారిలో; పోయి = వెళ్ళి; యోగమార్గంబున = యోగవిధానముతో; అనంతునిన్ = ఆదిశేషుని యందు; కలసెన్ = లీనమయ్యెను; ఆ = ఆ; పరమేశ్వరుండు = కృష్ణుడు; మఱియొక = ఇంకొక; మార్గంబునన్ = దారిలో; చని = వెళ్ళి; ఒక్క = ఒకానొక; నికుంజ = పొదల; పుంజంబు = సమూహముల; చాటునన్ = చాటున; విశ్రమించుటన్ = విశ్రాంతిగాపరుండుట; చేసి = వలన; చరణంబున్ = కాలును; వేఱొక = ఇంకొక; చరణంబున్ = కాలు; మీదన్ = పైన; సంఘటించి = పెట్టి; చంచలంబుగా = ఆడిస్తూ; వినోదంబు = వినోదములు; సలుపు = చేయుచున్న; సమయంబునన్ = సమయమునందు; లుబ్దకుండు = బోయవాడు; మృగయార్థంబుగా = వేటకై; వచ్చి = వచ్చి; దిక్కులు = నలుదిక్కులు; నిక్కి = సాగి, నిక్కి; నిరీక్షించుచుండన్ = చూస్తుండగా; వృక్షంబు = చెట్ల; చాటునన్ = చాటునందు; ఆ = ఆ; పరమపురుషుని = కృష్ణుని; చరణ = పాదములనెడి; కమలంబున్ = పద్మమును; హరిణ = లేడి; కర్ణంబు = చెవి; కాబోలును = ఐ ఉంటుంది; అని = అని; దానిన్ = దానిని; కని = (గురి) చూసి; శరంబు = బాణము; శరాసనంబున్ = విల్లు; అందున్ = అందు; సంధానంబు = ఎక్కుపెట్టుట; చేసి = చేసి; ఏసినన్ = కొట్టగా; అతండు = అతడు; హాహా = హాహా అనెడి; రవంబునన్ = శబ్దముతో; కదలుచుండన్ = కదులుతుండగా; ఆ = ఆ; పరమేశ్వరుని = కృష్ణుని; సన్నిధానంబున్ = సమీపమున; కున్ = కు; వచ్చి = వచ్చి; జగన్నాథున్ = కృష్ణుని; కాన్ = ఐనట్లు; తెలిసి = తెలిసికొని; భయంబునన్ = భయముతో; మహా = గొప్ప; అపరాధుండను = తప్పుచేసినవాడను; పాపచిత్తుండను = పాపాత్ముడను; కుటిల = వక్ర; ప్రచారుండను = వర్తనకలవాడను; అని = అని; అనేక = పలు; విధ = విధములైన; దీనా = దీనమైన; ఆలాపంబులు = దుఃఖపుమాటలు; పలుకుచున్ = పలుకుతు; బాష్పజల = కన్నీటి; ధారా = ధారలతో; సిక్త = తడుపబడిన; వదనుండు = ముఖము కలవాడు; ఐన = అయిన; సరోజనేత్రుండు = పద్మాక్షుడు కృష్ణుడు; వానిన్ = అతనిని; కరుణించి = దయచేసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; నీవు = నీవు; ఏలన్ = ఎందుకు; జాలింబడెదు = దుఃఖించెదవు; పూర్వజన్మ = పూర్వజన్మలలోచేసుకొన్న; కర్మంబులు = కర్మలు; ఎంతన్ = ఎంతటి; వారి = వారల; కిన్ = కు; ఐననున్ = అయినప్పటికి; అనుభావ్యంబులు = అనుభవింపదగినవి; అగున్ = ఔతాయి; కాని = అంతేతప్పించి; ఊరక = ఉరకనే; పోవనేరవు = పోలేవు; నీవు = నీవు; నిమిత్తమాత్రుండవు = నిమిత్తమాత్రుడవు; అంతియ = అంతే; కాని = కాని; అని = అని; వాని = అతని; కిన్ = కి; తెలిపినన్ = తెలియజెప్పిన; వాడును = అతడు; మహా = గొప్ప; అపరాధులు = అపరాధముచేసినవారు; ఐన = అయినట్టి; వారు = వారు; ఊరకపోవరు = ఊరకేపోగూడదు; దేవ = దైవానికి; గురు = గురువుకి; వైష్ణవ = విష్ణుభక్తునికి; ద్రోహులు = ద్రోహంచేసినవాడి; కున్ = కి; నిలువన్ = బతికి ఉండుట; ఎట్లు = ఏవిధముగ; అగును = కుదురును; అని = అని; పవిత్ర = పావనమైన; అంతఃకరణుండు = మనసుకలవాడు; ఐ = అయ్యి; ప్రాయోపవేశంబునన్ = ప్రాయోపవేశమార్గమున; ప్రాణంబులున్ = ప్రాణాలు; వర్జించి = వదలి; వైకుంఠపద = వైకుంఠములో స్థానము; ప్రాప్తుండు = లబించినవాడు; అయ్యెన్ = అయ్యెను; అప్పుడు = పిమ్మట.

భావము:

ఇలా అడిగిన రాజుతో శుకుడు ఇలా చెప్పాడు. “అలా శ్రీకృష్ణుడు అన్యాయమార్గంలో నడిచే దుర్మార్గులను చంపి, న్యాయమార్గంలో నడిచే సజ్జనులను కాపాడి బలరాముడు తాను ద్వారకనుండి వెళ్ళిపోయారు. పిమ్మట యాదవులు తమలో తాము మద్యపానంచేసి మత్తిల్లి, ఈర్ష్యతో పరిహాసంగా పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది నిజమైన పోట్లాటగా మారింది. ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు, కాల్బలములు తోకూడి అడ్డు ఆపు లేకుండా వారిలో వారే యుద్ధాలు మొదలుపెట్టారు. మునిశాపం కారణంగా ఎత్తుగా పెరిగిన తుంగ బెత్తాలతో అలసిపోయేలా కొట్టుకుంటూ బాదుకుంటూ యుద్ధాలు చేయసాగారు. ఆ తుంగబెత్తాలు వజ్రాయుధంతో సమానమైన ఆయుధాలవలె తాక సాగాయి. అలా ఒకరినొకరు పొడుచుకుంటూ భయంకరంగా యుద్ధం చేశారు. రణరంగమంతా ముక్కలు ముక్కలై చెదరిన మొండెములతో, వికలమైన దేహాలతో, విరిగిన రథాలతో, కూలిన గుఱ్ఱాలతో, వాలిన ఏనుగులతో నిండిపోయింది. యాదవులు అందరూ ఆ సమరంలో చచ్చిపోయారు. ఇదంతా చూసి నవ్వుకుంటూ శ్రీకృష్ణుడు బలరాముడు ఎటో వెళ్ళిపోయారు. కొంతదూరం వెళ్ళిన తరువాత బలరాముడు ఒక్కడు వేరు మార్గాన పోయి యోగమార్గంతో అనంతునిలో కలిశాడు. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు మరో మార్గంలో వెళ్ళి ఒక గుబురు పొద చాటున విశ్రాంతిగా పడుకుని ఒక కాలు మీద మరొక కాలు పెట్టి వినోదంగా ఆడిస్తున్నాడు. ఆ సమయంలో, ఒక బోయవాడు వేటకు వచ్చి అన్ని ప్రక్కలకు నిక్కి చూస్తూ ఉంటే, ఆ చెట్టుచాటున ఆ పరమపురుషుని కదలుతున్న కాలు లేడి చెవిలాగా కనిపించింది. అది చూసి, అంబులపొది నుంచి బాణం తీసి విల్లెక్కుపెట్టి గురిచూసి కొట్టాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు హాహాకారం చేయసాగాడు. వాడు దగ్గరకు వచ్చి చూసి జగదీశ్వరుడైన కృష్ణుడని తెలుసుకుని భయంతో, “అపరాధం చేసాను పాపాత్ముడిని వక్రబుద్ధిని.” అని రకరకాలుగా దీనంగా ఏడుస్తూ కన్నీరు కార్చసాగాడు. వానిని చూసి కృష్ణుడు దయతో ఇలా అన్నాడు. “నీవు దుఃఖిచనక్కర లేదు. పూర్వజన్మల కర్మలు అనుభవించక ఎంతటి వారికి అయినా తప్పవు. వాటి ఫలితాల ఊరకే పోవు. నీవు నిమిత్రమాత్రుడివి మాత్రమే.” ఇలా వాడికి నచ్చ చెప్పినా వాడు, “ఇంత పెద్ద తప్పు చేసాక ఊరకే పోదు. దైవానికి, గురువులకు, వైష్ణవులకు, ద్రోహం చేసినవాడు ధరణిపై నిలువరాదు.” అని పలికి, పవిత్రమైన మనస్సుతో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలి వైకుంఠానికి వెళ్ళాడు.

11-119-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దారుకుఁడు గనియె నంతటఁ
జారు నిరూఢావధాను ర్వజ్ఞు హరిన్‌
మేరునగధీరు దనుజవి
దారుని నేకాంతపరునిఁ ద్దయు నెమ్మిన్‌.

టీకా:

దారుకుడు = దారుకుడు (రథసారథి); కనియెన్ = చూచెను; అంతటన్ = ఆసమయమునందు; చారు = చక్కటి; నిరూఢ = ప్రసిద్ధికెక్కిన; అవధానున్ = ఎచ్చరిక కలవానిని; సర్వఙ్ఞున్ = కృష్ణుని; హరిన్ = కృష్ణుని; మేరునగ = మేరుపర్వతమంత; ధీరున్ = ధీరత్వము కలవానిని; దనుజ = రాక్షసులను; విదారునిన్ = సంహరించినవానిని; ఏకాంతపరునిన్ = ఒంటరిగానున్నవానిని; దద్దయున్ = మిక్కిలి; నెమ్మిన్ = ప్రేమముతో.

భావము:

ఆ సమయంలో రథసారథి అయిన దారుకుడు వచ్చి సర్వజ్ఞుడు, మేరుపర్వతధీరుడు, దనుజ సంహారుడు అయిన శ్రీకృష్ణుడు ఒంటరిగా ఉండటం చూసాడు.

11-120-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కని యత్యంతభయభక్తితాత్పర్యంబుల ముకుళిత కరకమలుండై యిట్లనియె.

టీకా:

కని = చూసి; అత్యంత = మిక్కిలి; భయ = భయముతో; భక్తి = భక్తితో; తాత్పర్యంబులన్ = సాభిప్రాయముతో; ముకుళిత = జోడించిన; కర = చేతులు అనెడి; కమలుండు = పద్మములు కలవాడు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా చూసి మిక్కిలి భయ భక్తులతో చేతులు జోడించి దారుకుడు ఇలా అన్నాడు.

11-121-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నిన్నుఁజూడని కన్నులు నిష్ఫలములు
నిన్ను నొడువని జిహ్వదా నీరసంబు
నిన్నుఁ గానని దినములు నింద్యము లగుఁ
న్నులను జూచి మమ్మును గారవింపు.

టీకా:

నిన్నున్ = నిన్ను; చూడని = చూడలేని; కన్నులు = కళ్ళు; నిష్ఫలములు = పనికిరానివి; నిన్నున్ = నిన్ను; నొడువని = స్తుతించలేని; జిహ్మ = నాలుక; తాన్ = అది; నీరసంబు = రసహీనమైనది; నిన్నున్ = నిన్ను; కానని = చూడలేని; దినములు = రోజులు; నింద్యములు = నిందింపదగినవి; అగున్ = అగును; కన్నులను = కళ్ళు ఎత్తి; చూచి = చూసి; మమ్మును = మమ్ములను; గారవింపు = దయచూడుము.

భావము:

“నిన్ను చూడని కన్నులు నిష్ఫల మైనవి; నిన్ను వర్ణించని నాలుక నీరసమైనది; నిన్ను కనుగొనని దినాలు నిందింపదగినవి; స్వామీ! నీ కనులెత్తి మమ్ము దయతో చూడు.”

11-122-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అనుచు నా దారుకుండు నిర్వేదనపరుండై యిట్లని విన్నవించె; “యాదవసముద్రం బడంగె; బంధు గురు మిత్ర జనంబు లక్కడక్కడం బోయిరి; ద్వారకకుం బోయి సుహృజ్జనంబులతోడ నేమందు?” నని పలుకునవసరంబున దివ్యాయుధంబులును, దివ్య రథరథ్యంబులు నంతర్ధానంబు నొందె; నారాయణుండు వానితో“ నక్రూరవిదురులకు నీవృత్తాంతం బంతయుఁ జెప్పుము; సవ్యసాచిం గని స్త్రీ బాల గురు వృద్ధ జనంబులఁ గరిపురంబునకుం గొనిచను మనుము; పొ” మ్మనిన వాఁడును మరలి చని కృష్ణుని వాక్యంబులు సవిస్తరంబుగాఁ జెప్పె; నట్లు సేయు నాలోన ద్వారకానగరంబు పరిపూర్ణజలంబై మునింగె; నంత నెవ్వరికిం జనరాకయుండె నప్పరమేశ్వరుండును శతకోటి సూర్యదివ్యతేజో విభాసితుండై వెడలి నారదాది మునిగణంబులును, బ్రహ్మరుద్రాదిదేవతలును, జయజయశబ్దంబులతోడం గదలిరా నిజపదంబున కరిగె; నన్నారాయణ విగ్రహంబు జలధి ప్రాంతంబున జగన్నాథస్వరూపంబై యుండె” నని శుకుండు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పె" నని చెప్పి.

టీకా:

అనుచున్ = అనుచు; ఆ = ఆ యొక్క; దారుకుండు = దారుకుడు; నిర్వేదన = దుఃఖములో; పరుండు = మునిగినవాడు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అని = అని; విన్నవించెన్ = అనెను; యాదవ = యాదవసైన్యము అనెడి; సముద్రంబు = సముద్రము; అడంగె = నశించినది; బంధు = బంధువులు; గురు = గురువులు; మిత్ర = మిత్రులు ఐన; జనంబులు = వారు; అక్కడక్కడన్ = చెల్లాచెదురై; పోయిరి = పోయారు; ద్వారక = ద్వారకానగరము; కున్ = కు; పోయి = వెళ్ళి; సుహృత్ = హితులైన; జనంబులు = వారి; తోడన్ = తోటి; ఏమందును = ఏమిచెప్పను; అని = అని; పలుకు = అనుచున్న; సమయంబునన్ = సమయమునందు; దివ్య = దివ్యమైన; ఆయుధంబులును = ఆయుధాలు; దివ్య = భవ్యమైన; రథ = రథము; రథ్యంబులు = గుఱ్ఱములు; అంతర్ధానంబునొందెన్ = మాయమైపోయెను; నారాయణుండు = కృష్ణుడు; వాని = అతని; తోన్ = తోటి; అక్రూర = అక్రూరుడు; విదురుల = విదురుడుల; కున్ = కు; ఈ = ఈ; వృత్తాంతంబు = విషయము; అంతయున్ = సమస్తము; చెప్పుము = తెలుపుము; సవ్యసాచిన్ = అర్జునుని {సవ్యసాచి - రెండు చేతులతో బాణములు వేయగలవాడు, అర్జునుడు}; కని = కలిసి; స్త్రీ = స్త్రీలను; బాల = పిల్లలను; గురు = పెద్దలను; వృద్ద = ముసలి ఐన; జనంబులన్ = వారిని; కరిపురంబు = హస్తినాపురమున; కున్ = కు; కొని = తీసుకొని; చనుము = పొమ్ము; అనుము = అనిచెప్పు; పొమ్ము = ఇకనీవు వెళ్ళు; అనినన్ = అని చెప్పగా; వాడును = అతను; మరలి = వెనుదిరిగి; చని = వెళ్ళి; కృష్ణుని = కృష్ణుని; వాక్యంబులున్ = మాటలను; సవిస్తారంబుగా = వివరముగా; చెప్పెన్ = చెప్పెను; అట్లు = అలా; చేయున్ = చేసెడి; ఆలోనన్ = సమయమునకు; ద్వారకానగరంబున్ = ద్వారకానగరము; పరిపూర్ణ = పూర్తిగా నిండిన; జలంబు = నీరు కలది; ఐ = అయ్యి; మునింగెన్ = ములిగిపోయెను; అంతన్ = తరువాత; ఎంతవారికి = ఎంతటివారికైనను; చనన్ = వెళ్లుటకు; రాక = శక్యముకాకుండ; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ యొక్క; పరమేశ్వరుండును = కృష్ణుడు; శతకోటి = నూరుకోట్ల; సూర్య = సూర్యులకుసమానమైన; దివ్య = దివ్యమైన; తేజః = తేజస్సుతో; విభాసితుండు = ప్రకాశించువాడు; ఐ = అయ్యి; వెడలి = బయలుదేరి; నారద = నారదుడు; ఆది = మొదలగు; ముని = మునుల; గణంబులును = సమూహములు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = శివుడు; ఆది = మున్నగు; దేవతలును = దేవతలు; జయజయ = జయజయ అనెడి; శబ్దంబులన్ = రవములతో; తోడన్ = కూడా; కదిలి = బయలుదేరి; రాన్ = రాగా; నిజ = తన; పదంబున = లోకమున; కున్ = కు; అరిగెన్ = వెళ్ళెను; ఆ = ఆ ప్రసిద్ధుడైన; నారాయణ = కృష్ణుని; విగ్రహంబు = స్వరూపము; జలధి = సముద్రపు; ప్రాంతంబునన్ = ప్రదేశమునందు; జగన్నాథున్ = జగన్నాథుని; స్వరూపంబు = స్వరూపముకలది; ఐ = అయ్యి; ఉండెను = ఉండెను; అని = అని; శుకుండు = శుకుడు; పరీక్షిన్నరేంద్రున = పరీక్షన్మహారాజున; కున్ = కు; చెప్పెను = చెప్పెను; అని = అని; చెప్పి = చెప్పి.

భావము:

అంటూ దారుకుడు మిక్కిలి దుఃఖంతో ఇలా విన్నవించాడు. “సముద్రమంత యాదవ సమూహం నశించింది. బంధువులు, గురువులు, మిత్రులు అందరు అటు ఇటూ చెల్లాచెదురైపోయారు. ద్వారకకు పోయి మిత్రులతో ఏమని చెప్పాలి.” అని అంటూండగానే, శ్రీకృష్ణుని దివ్యమైన ఆయుధాలు, గుఱ్ఱాలూ మాయమైపోయాయి. శ్రీకృష్ణుడు దారుకుడితో, “అక్రూరునికీ విదురునికీ జరిగిందంతా చెప్పు. స్త్రీలను, పిల్లలను, పెద్దవారిని హస్తినాపురానికి తీసుకుని వెళ్ళమని అర్జునుడితో చెప్పు. వెళ్ళు.” అన్నాడు. దారుకుడు తిరిగివెళ్ళి కృష్ణుడి మాటలు వివరంగా అందరికీ చెప్పాడు. ఆయన చెప్పినట్లు చేసేటంతలో ద్వారకానగరం పూర్తిగా జలాలలో మునిగిపోయింది. ఎవరికీ ప్రవేశించటానికి వీలులేని స్థితికి వెళ్ళిపోయింది.
అప్పుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు నూరుకోట్ల సూర్యుల దివ్యతేజస్సుతో వెడలి నారదుడు మున్నగు మునులు, బ్రహ్మదేవుడు, రుద్రుడు, మొదలయిన దేవతలు జయజయ నినాదాలతో వెంట రాగా తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ నారాయణుని విగ్రహము సముద్ర ప్రాంతంలో జగన్నాథుడి రూపంతో ఉంది.” అని శుకబ్రహ్మ పరీక్షిన్మహారాజుకి చెప్పాడు.

11-123-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

థ విన్నను వ్రాసిన
బ్రాటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం
జేకొని యాయువు ఘనుఁడై
లోములో నుండు నరుఁడు లోకులు వొగడన్‌.

టీకా:

ఈ = ఈ యొక్క; కథ = వృత్తాంతమును; విన్నను = వినినను; వ్రాసినన్ = రాసినను; ప్రాకటముగ = ప్రసిద్ధముగ; లక్ష్మి = సిరిసంపదలు; యశము = కీర్తి; భాగ్యము = అదృష్టము; కలుగున్ = లభించును; చేకొని = చేపట్టి; ఆయువున్ = ఆయుష్షు; ఘనుడు = అధికముగ కలవాడు; ఐ = అయ్యి; లోకము = ప్రపంచము; లోన్ = లోపల; ఉండును = ఉండును; నరుడు = మానవుడు; లోకులు = ప్రజలు; పొగడన్ = స్తుతించుచుండగా.

భావము:

ఈ కథను విన్నవారు, వ్రాసినవారు సిరిసంపదలు కీర్తి అదృష్టము కలిగి దీర్ఘాయువుతో లోకులు మెచ్చే గొప్పవారై ప్రకాశిస్తారు.

11-124-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గుమొగమున్‌ సుమధ్యమును ల్లని మేనును లచ్చికాటప
ట్టగు నురమున్‌ మహాభుజము లంచితకుండలకర్ణముల్‌ మదే
తియు నీలవేణియుఁ గృపారసదృష్టియుఁ గల్గు వెన్నుఁ డి
మ్ముగఁబొడసూపుఁగాతఁ గనుమూసినయప్పుడు విచ్చినప్పుడున్‌.

టీకా:

నగు = నవ్వు; మొగమున్ = ముఖము; సు = చక్కని; మధ్యమును = నడుము; నల్లని = నల్లటి; మేనును = దేహము; లచ్చి = లక్ష్మీదేవి; కిన్ = కి; ఆటపట్టు = నివాసము; అగు = ఐన; ఉరమున్ = వక్షస్థలము; మహా = పెద్ధ; భుజములున్ = బాహువులు; అంచిత = అందమైన; కుండల = కుండలములు కల; కర్ణముల్ = చెవులు; మద = మదించిన; ఇభ = ఏనుగు వంటి; గతియున్ = నడక; నీల = నల్లని; వేణియున్ = శిరోజములు; కృపారస = దయారసముగల; దృష్టియున్ = చూపులు; కల్గు = కలిగిన; వెన్నుడు = విష్ణుమూర్తి; ఇమ్ముగన్ = స్పష్టముగ; పొడసూపుగాత = కనపడుగాక {పొడసూపు - పొడవు చూపు, కనబడు}; కనున్ = కనులను; మూసిన = మూసుకొన్న; అప్పుడున్ = సమయమునందు; విచ్చిన = తెరచుకొన్న; అప్పుడున్ = సమయమునందు.

భావము:

నవ్వు ముఖము; చక్కని నడుము; నల్లని దేహము; లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థలము; పెద్ద బాహువులు; అందమైన కుండలాలు కల చెవులు; గజగమనము; నల్లనిజుట్టు; దయారసం చిందే చూపు కలిగిన విష్ణుమూర్తి నేను కనులు మూసినపుడు తెరచినపుడు పొడచూపు గాక.