పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : అవధూత సంభాషణ

  •  
  •  
  •  

11-111-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు గావున జనుండు బాల్య కైశోర కౌమార వయోవిశేషంబుల వెనుకనైననుం, బెద్దయైన వెనుకనైనను, నన్నెఱింగెనేనిఁ గృతకృత్యుండగుఁ; సంపద్గర్వాంధుం డైన నంధకారకూపంబునం బడు; వానిం దరిద్రునింగాఁ జేసిన జ్ఞానియై యస్మత్పాదారవింద వందనాభిలాషియై ముక్తుండగు; నట్లుగావున దేహాభిమానంబు వర్జించి యైహికాముష్మిక సుఖంబులఁ గోరక మనంబు గుదియించి యే ప్రొద్దు నన్నుఁ దలంచువాఁడు వైకుంఠపద ప్రాప్తుండగు; నేను నతని విడువంజాలక వెనువెంట నరుగుదు; నారదాది మునులు భక్తి భావంబునం జేసి నా రూపం బై” రని యుద్ధవునకుం జెప్పిన, నతండు మఱియు నిట్లనియె.

టీకా:

అట్లుగావున = కాబట్టి; జనుండు = మానవుడు; బాల్య = పసిపిల్లవానిగ ఉన్న; కైశోర = పిల్లవానిగా ఉన్న; కౌమార = యువకుడుగా ఉన్న; వయోవిశేషంబులన్ = అవస్థలందుగాని; వెనుకన్ = తరువాత; ఐననున్ = అయిన; పెద్ద = పెద్దవాడు; ఐన = అయిన; వెనుకన్ = తరువాత; ఐననున్ = అయినప్పటికి; నన్ను = నన్ను; ఎఱింగెనేని = తెలిసికొనినచో; కృతకృత్యుండ = ధన్యుడు; అగున్ = అగును; సంపత్ = సంపదలున్నవన్న; గర్వ = గర్వముచేత; అంధుండు = గుడ్డివాడు; ఐనన్ = అయినచో; అందకార = చీకటి; కూపంబునన్ = నూతిలో; పడున్ = పడిపోవును; వానిన్ = అటువంటివాడిని; దరిద్రునిన్ = బీదవాడు; కాన్ = ఔనట్లు; చేసినన్ = చేసినచో; ఙ్ఞాని = ఙ్ఞానముకలవాడు; ఐ = అయ్యి; అస్మత్ = నా యొక్క; పాద = పాదములనెడి; అరవింద = పద్మములను; వందనా = నమస్కరించుటందు; అభిలాషి = కోరిక కలవాడు; ఐ = అయ్యి; ముక్తుండు = మోక్షముపొందినవాడు; అగున్ = అగును; అట్లుగావున = కాబట్టి; దేహా = శరీరమునందు; అభిమానంబు = మమత్వము; వర్జించి = వదలిపెట్టి; ఐహిక = ఈ లోకమునకు చెందిన; ఆముష్మిక = పరలోకమునకలిగెడి; సుఖంబులన్ = సుఖములను; కోరక = ఆశించక; మనంబున్ = మనస్సును; కుదియించి = నిగ్రహించి; ఏప్రొద్దు = ఎల్లప్పుడు; నన్నున్ = నన్నే; తలంచు = స్మరించెడి; వాడు = వాడు; వైకుంఠపద = విష్ణులోకమును; ప్రాప్తుండు = పొందినవాడు; అగున్ = అగును; నేనున్ = నేను; అతనిన్ = అతనిని; విడువంజాలక = వదలలేక; వెనువెంటన్ = కూడకూడ; అరుగుదున్ = పోయెదను; నారద = నారదుడు; ఆది = మున్నగు; మునులు = ఋషులు; భక్తిభావంబునన్ = భక్తిభావము; చేసి = వలన; నారూపంబు = సారూప్యంబుపొందినవారు; ఐరి = అయ్యారు; అని = అని; ఉద్దవున్ = ఉద్దవుని; కున్ = కి; చెప్పినన్ = చెప్పగా; అతండు = అతను; మఱియున్= ఇంకా; ఇట్లు = ఇలా; అనియె = అనెను.

భావము:

అందుచేత, మానవుడు పసివానిగా కాని, పిల్లవానిగా కాని, యువకునిగ కాని, పెద్దవాడు అయిన పిమ్మట కాని నన్ను తెలుసుకుంటే కృతార్థుడు అవుతాడు. సంపదలు ఉన్నాయని గర్వంతో గ్రుడ్డివాడు అయితే చీకటిబావిలో పడతాడు. అటువంటివాడిని దరిద్రునిగా చేస్తే, జ్ఞాని అయి నా పాదపద్మాలకు నమస్కరించాలనే అభిలాష కలుగుతుంది. మోక్షం పొందుతాడు. శరీరము మీద అభిమానము వదలి ఈ లోకానికి పరలోకానికి చెందిన సుఖాలను కోరక మనస్సును నిగ్రహించుకొని, ఎల్లవేళలా నన్ను స్మరించేవాడు వైకుంఠాన్ని పొందుతాడు. నేనూ అతనిని విడచిపెట్టలేక వాని వెనువెంటనే వెళ్ళుతుంటాను. నారదుడు మున్నగు మునులు భక్తిభావం వలన నా సారూప్యం పొందారు.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పగా అతడు మరల ఇలా అన్నాడు.