పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : అవధూత సంభాషణ

  •  
  •  
  •  

11-105-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యడిగిన నయ్యాదవేంద్రుం డిట్లని పలుకం దొడంగె; “దారు మధ్యభాగంబున ననలంబు సూక్ష్మరూపంబున వర్తించు చందంబున నందంబై సకలశరీరుల యందు నచ్ఛేద్యుండు నదాహ్యుండు నశోష్యుండునైన జీవుండు వసించి యుండు” ననిన హరికి నుద్ధవుం డిట్లనియె; “సనక సనందనాది యోగీంద్రులకు యోగమార్గం బేరీతి నానతిచ్చితి, వది యేవిధం? బానతీయవే” యని యభ్యర్థించిన నతం డిట్లనియె; “వారలు చతుర్ముఖు నడిగిన నతండు, “నేనును దెలియనేర” ననిన వారలు విస్మయం బందుచుండ నేనా సమయంబున హంసస్వరూపుండ నై వారల కెఱింగించిన తెఱుంగు వినుము; పంచేంద్రియంబులకు దృష్టం బయిన పదార్థం బనిత్యంబు; నిత్యదృష్టి బ్రహ్మం బని తెలియవలయు; దేహి కర్మార్జిత దేహుండై సంసారమమతలు నిరసించి, నిశ్చలజ్ఞాన యుక్తుండై మత్పదప్రాప్తుండగు; స్వప్నలబ్ధ పదార్థంబు నిజంబు గాని క్రియఁ గర్మానుభవపర్యంతంబు కళేబరంబు వర్తించు నని సాంఖ్యయోగంబున సనకాదుల కెఱింగించిన విని, బ్రహ్మ మొదలైన దేవత లెఱింగిరి; వారివలన భూలోకంబునఁ బ్రసిద్ధం బయ్యె; నదిగావున నీవును నెఱింగికొని, పుణ్యాశ్రమంబులకుం జను; మస్మదీయ భక్తియుక్తుండును, హరిపరాయణుండునైన యతని చరణరజఃపుంజంబు తన శరీరంబు సోఁకజేయు నతండును, ముద్రాధారణపరులకును హరి దివ్యనామంబులు ధరియించు వారలకు నన్నోదకంబుల నిడు నతండును, వాసుదేవభక్తులం గని హర్షించు నతండును, భాగవతు” డని చెప్పి మఱియు “సర్వసంగపరిత్యాగంబు సేసి, యొండెఱుంగక నన్నే తలంచు మానవునకు భుక్తి ముక్తి ప్రదాయకుండనై యుండుదు” నని యానతిచ్చిన నుద్ధవుండు “ధ్యాన మార్గంబే రీతి? యానతీయవలయు” ననిన హరి యిట్లనియె; ఏకాంత మానసులై హస్తాబ్జంబు లూరుద్వయంబున సంధించి, నాసాగ్రంబున నీక్షణంబు నిలిపి, ప్రాణాయామంబున నన్ను హృదయగతుంగాఁ దలంచి, యష్టాదశ ధారణాయోగసిద్ధు లెఱింగి, యందణిమాదులు ప్రధాన సిద్ధులుగాఁ దెలిసి, యింద్రియంబుల బంధించి, మనం బాత్మయందుఁ జేర్చి, యాత్మనాత్మతోఁ గీలించిన బ్రహ్మపదంబుఁ బొందు; భాగవతశ్రేష్ఠు లితరధర్మంబులు మాని నన్నుం గాంతురు; తొల్లి పాండునందనుఁడగు నర్జునుండు యుద్ధరంగంబున విషాదంబు నొంది యిట్ల యడిగిన నతనికి నేఁ జెప్పిన తెఱం గెఱింగించెదఁ; జరాచరభూతంబయిన జగంబంతయు మదాకారంబుగా భావించి, భూతంబులందు నాధారభూతంబును, సూక్ష్మంబులందు జీవుండును, దుర్జయంబులందు మనంబును, దేవతలందుఁ బద్మగర్భుండును, వసువులందు హవ్యవాహుండును, నాదిత్యులందు విష్ణువును, రుద్రులందు నీలలోహితుండును, బ్రహ్మలందు భృగువును, ఋషులందు నారదుండును, ధేనువులందుఁ గామధేనువును, సిద్ధులయందుఁ గపిలుండును, దైత్యులయందుఁ బ్రహ్లాదుండును గ్రహంబులందుఁ గళానిధియును, గజంబులయం దైరావతంబును, హయంబులయం దుచ్చైశ్శ్రవంబును, నాగంబులందు వాసుకియును, మృగంబులందుఁ గేసరియు, నాశ్రమంబులందు గృహస్థాశ్రమంబును, వర్ణంబులయం దోంకారంబును, నదులందు గంగయు, సాగరంబుల యందు దుగ్ధసాగరంబును, నాయుధంబులందుఁ గార్ముకంబును, గిరు లందు మేరువును, వృక్షంబుల యందశ్వత్థంబును, నోషధుల యందు యవలును, యజ్ఞంబుల యందు బ్రహ్మయజ్ఞంబును, వ్రతంబులం దహింసయు, యోగంబులం దాత్మయోగంబును, స్త్రీల యందు శతరూపయు భాషణంబులయందు సత్యభాషణంబును, ఋతువులందు వసంతాగమంబును, మాసంబులలో మార్గశీర్షంబును, నక్షత్రంబులలో నభిజిత్తును, యుగంబులందుఁ గృతయుగంబును, భగవదాకారంబులందు వాసుదేవుండును, యక్షుల లోఁ గుబేరుండును, వానరులం దాంజనేయుండును, రత్నంబు లందుఁ బద్మరాగంబును, దానంబులలోనన్నదానంబును, దిథు లయం దేకాదశియు, నరులయందు వైష్ణవుండై భాగవతప్రవర్తనం బ్రవర్తించువాఁడును, నివియన్నియు మద్విభూతులుగా నెఱుంగు" మని కృష్ణుం డుద్ధవునకు నుపన్యసించిన వెండియు నతం డిట్లనియె.
^అష్టాదశ ధారణాయోగసిద్ధులు

టీకా:

అని = అని; అడిగిన = అడిగినట్టి; ఆ = ఆ ప్రసిద్ధుడైన; యాదవేంద్రుండు = కృష్ణుడు {యాదవేంద్రుడు - యాదవుల ప్రభువు, కృష్ణుడు}; పలుకన్ = చెప్పుట; తొడంగెన్ = మొదలిడెను; దారు = కఱ్ఱల; మధ్యభాగంబునన్ = లోపలిప్రదేశములో; అనలంబు = అగ్ని; సూక్ష్మ = సూక్ష్మమైన; రూపంబునన్ = రూపములో; వర్తించు = ఉండెడి; చందంబునన్ = విధముగ; అందంబు = కలిసి ఉన్నది; ఐ = అయ్యి; సకల = సర్వ; శరీరులు = దేహధారులు; అందున్ = లోను; అచ్చేద్యుండున్ = ముక్కలుచేయరానివాడు; అదాహ్యుండన్ = కాల్పరానివాడు; అశోష్యుండున్ = ఎండింపరానివాడు; ఐన = అయినట్టి; జీవుండు = జీవాత్మ; వసించి = నివసిస్తూ; ఉండును = ఉండును; అనినన్ = అనగా; హరి = కృష్ణుని; కిన్ = కి; ఉద్దవుండు = ఉద్దవుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; సనక = సనకుడు {సనకసనందనాది - సనకాదులు, 1సనక 2సనందన 3సనత్కుమార 4సనత్సుజాతులుఅను బ్రహ్మదేవుని కుమారులు}; సనందదన = సనందనుడు; ఆది = మొదలగు; యోగి = యోగులలో; ఇంద్రులు = శ్రేష్ఠుల; కున్ = కు; యోగమార్గంబు = యోగమార్గమును; ఏ = ఏ; రీతిన్ = విధముగ; ఆనతిచ్చితివి = చెప్పితివి; అది = అది; ఏ = ఎలాంటి; విధంబు = మార్గము; ఆనతీయవే = చెప్పుము; అని = అని; అభ్యర్థించినన్ = వేడుకొనగా; అతండు = అతను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; వారలు = వారు; చతుర్ముఖున్ = బ్రహ్మదేవుని {చతుర్ముఖుడు - నాలుగు మోముల వాడు, బ్రహ్మ}; అడిగినన్ = అడుగగా; అతండు = అతను; నేనునున్ = నేను కూడ; తెలియనేరను = ఎరుగను; అనినన్ = అనగా; వారలు = వారు; విస్మయంబున్ = ఆశ్చర్యమును; అందుచుండ = ఆశ్చర్యపోతుండగా; నేనున్ = నేను; ఆ = ఆ యొక్క; సమయంబునన్ = సమయమునకు; హంస = హంస యొక్క; స్వరూపుండను = రూపము ధరించినవాడను; ఐ = అయ్యి; వారలు = వారి; కిన్ = కి; ఎఱింగించిన = తెలిపిన; తెఱంగున్ = విధమును; వినుము = వినుము; పంచేంద్రియంబుల్ = పంచేంద్రియముల; కున్ = కు; దృష్టంబు = కనబడునది; అయిన = ఐన; పదార్థంబు = వస్తువులెల్ల; అనిత్యంబు = శాశ్వతమైనది కాదు; నిత్య = నిశ్చలమైన; దృష్టి = ఙ్ఞానము; బ్రహ్మంబు = పరబ్రహ్మ; అని = అని; తెలియవలయున్ = తెలిసికొనవలెను; దేహి = జీవుడు; కర్మ = చేసిన కర్మలచే; ఆర్జిత = సంపాదించుకొన్న; దేహుండు = దేహము కలవాడు; ఐ = అయ్యి; సంసార = సంసారమందలి; మమతలు = మమకారాల్ని; నిరసించి = వదలి; నిశ్చల = చలించని; ఙ్ఞాన = ఙ్ఞానము; యుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి; మత్ = నా యొక్క; పద = స్థానాన్ని; ప్రాప్తుండు = చెందినవాడు; అగు = అగును; స్వప్న = కలలో; లబ్ధ = దొరికిన; పదార్థంబు = వస్తువులెల్ల; నిజంబు = నిజమైనవి; కాని = కానట్టి; క్రియన్ = విధముగనే; కర్మానుభవంబు = కర్మానుభవము; పర్యంతంబు = అయినదాకా; కళేబరంబు = దేహము; వర్తించును = నడస్తుంటుంది; అని = అని; సాంఖ్యయోగంబున = సాంఖ్యయోగమార్గములో; సనకాదులు = 1సనకుడు 2సనందనుడు 3సనత్కుమారుడు 4సనత్సుజాతుడు అను బ్రహ్మకుమారులైన దేవర్షులు; కున్ = కు; ఎఱింగించినన్ = తెలియపర్చగా; విని = విని; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; మొదలైన = మొదలైన; దేవతలు = దేవతలు; ఎఱింగిరి = తెలిసికొనిరి; వారి = వారి; వలన = వలన; భూలోకంబునన్ = భూలోకములోకూడ; ప్రసిద్ధంబు = పేరుపొందినది; అయ్యెన్ = అయినది; అదిగావున = కాబట్టి; నీవును = నీవుకూడ; ఎఱింగికొని = తెలిసికొని; పుణ్య = పుణ్యవంతమైన; ఆశ్రమంబులు = ఆశ్రమముల; కున్ = కు; చనుము = వెళ్ళుము; అస్మదీయ = నా యందలి; భక్తి = భక్తి; యుక్తుండును = కలవాడు; హరి = విష్ణుమూర్తి యందు; పరాయణుండును = ఆసక్తికలవాడు; ఐన = అయినట్టి; అతని = వాని; చరణ = పాద; రజస్ = ధూళి; పుంజంబు = సమూహము; తన = తన యొక్క; శరీరంబున్ = దేహమును; సోకన్ = తగులునట్లు; చేయున్ = చేసెడి; అతండును = వాడు; ముద్రా = శంఖచక్రాదిముద్రలను; ధారణ = ధరించుటందు; పరులకును = ఆసక్తికలవారి; కున్ = కి; హరి = నారాయణుని; దివ్య = మహిమాన్వితమైన; నామంబులున్ = నామములను; ధరియించు = ధరించెడి; వారలు = వారి; కున్ = కి; అన్న = ఆహారము; ఉదకంబులన్ = నీళ్ళను; ఇడు = ఇచ్చెడి; అతండును = వాడు; వాసుదేవ = కృష్ణ; భక్తులన్ = భక్తులను; కని = చూసి; హర్షించున్ = ఆనందపడెడి; అతండును = వాడు; భాగవతుడు = భాగవతుడు; అని = అని; చెప్పి = చెప్పి; మఱియు = ఇంకను; సర్వసంగపరిత్యాగంబు = సన్యాసము {సర్వసంగపరిత్యాగము - అన్ని తగులములను పూర్తిగా విడిచిపెట్టుట, సన్యాసము}; చేసి = చేసి; ఒండు = వేరెవరిని; ఎఱుంగక = తెలిసికొనక; నన్నే = నన్నుమాత్రమే; తలంచు = స్మరించెడి; మానవుని = మానవుడి; కున్ = కి; భుక్తి = ఇహలోక జీవిక; ముక్తి = పరలోక మోక్షము; ప్రదాయకుండను = ఇచ్చెడివాడను; ఐ = అయ్యి; ఉండుదున్ = ఉంటాను; అని = అని; ఆనతిచ్చిన = తెలుపగా; ఉద్దవుండు = ఉద్దవుడు; ధ్యానమార్గంబు = ధ్యానము యొక్క; మార్గంబు = విధానము; ఏ = ఏ; రీతి = విధము; ఆనతీయవలయును = చెప్పుము; అనినన్ = అని అడుగగా; హరి = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఏకాంత = ఏకాగ్రమైన; మానసులు = మనస్సుకలవారు; ఐ = అయ్యి; హస్త = చేతులు అనెడి; అబ్జంబులు = పద్మములను; ఊరు = తొడల; ద్వయంబునన్ = జంట మీద; సంధించి = స్థిరపరచి; నాస = ముక్కు; అగ్రంబునన్ = కొస యందు; ఈక్షణంబున్ = దృష్టిని; నిలిపి = నిలిపి; ప్రాణాయామంబునన్ = ప్రాణాయామముతో; నన్నున్ = నన్ను; హృదయ = హృదయములో; గతున్ = ఉన్నవానిగా; తలంచి = భావించుకొని; అష్టాదశ = పద్దెనిమిది (18) {అష్టాదశసిద్ధులు - అణిమాది ఎనిమిది (8) గౌణసిద్ధులు పది (10) (చూ. అనుయుక్తములు)}; ధారణా = ధారణలచే లభించు; యోగసిద్ధులు = యోగసిద్ధులను; ఎఱింగి = తెలిసికొని; అందు = వానిలో; అణిమాదులు = అష్టసిద్ధులు {అణిమాది - అష్టసిద్ధులు - 1అణిమ 2మహిమ 3లఘిమ 4గరిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8వశిత్వము}; ప్రధాన = ముఖ్యమైన; సిద్ధులు = సిద్ధులు; కాన్ = ఐనట్లు; తెలిసి = తెలిసికొని; ఇంద్రియంబులన్ = ఇంద్రియవ్యాపారములను; బంధించి = నిరోధించి; మనంబున్ = మనస్సును; ఆత్మ = ఆత్మ; అందు = అందు; చేర్చి = చేర్చి; ఆత్మన్ = ఆత్మను; ఆత్మ = పరమాత్మతో; కీలించినన్ = లగ్నముచేసినచో; బ్రహ్మపదంబున్ = బ్రహ్మపదమును; పొందున్ = పొందును; భాగవత = భాగవతులలో; శ్రేష్ఠులు = ఉత్తములు; ఇతర = ఇతర; ధర్మంబులు = విషయములు; మాని = వదలివేసి; నన్నున్ = నన్నే; కాంతురు = పొందెదరు; తొల్లి = పూర్వము; పాండు = పాండురాజు; నందనుడు = పుత్రుడు; అగు = ఐన; అర్జునుండు = అర్జునుడు; యుద్ధరంగంబునన్ = రణరంగములో; విషాదంబున్ = విచారమును; ఒంది = పొంది; ఇట్లు = ఈ విధముగ; అడిగిన = అడిగితే; అతని = అతని; కిన్ = కి; నేన్ = నేను; చెప్పిన = చెప్పినట్టి; తెఱంగున్ = వివరమును; ఎఱింగించెద = చెప్పెదను; చరా = చలనముకలవి; అచర = చలనములేనివి; భూతంబు = జీవులు కలది; అయిన = అగు; జగంబు = లోకము; అంతయున్ = సమస్తమును; మత్ = నా యొక్క; ఆకారంబు = స్వరూపము; కాన్ = అయినట్లు; భావించి = తలచి; భూతంబులు = భూతములు; అందున్ = లో; ఆధారభూతంబును = ఆధారభూతము; సూక్ష్మంబులు = సూక్ష్మమైన వాని; అందున్ = లో; జీవుండును = జీవుడు; దుర్జయులు = జయింపరాని వాటి; అందున్ = లో; మనంబును = మనస్సు; దేవతలు = దేవతలు; అందున్ = లో; పద్మగర్భుండును = బ్రహ్మదేవుడు; వసువులు = అష్ట వసువులు {అష్టవసువులు - 1ద్రోణుడు 2ప్రాణుడు 3ధ్రువుండు 4అర్కుండు 5అగ్ని 6దోషుండు 7వస్తువు 8విభావసువు (ఇంకొక క్రమము) 1ఆవుడు 2ధ్రువుడు 3సోముడు 4అధ్వరుడు 5అనిలుడు 6ప్రత్యూషుడు 7అనలుడు 8ప్రభాసుడు}; అందున్ = లో; హవ్యవాహుండును = అగ్ని {హవ్యవాహుడు - హవ్యమును మోసుకుపోవు వాడు, అగ్నిహోత్రుడు}; ఆదిత్యులు = ద్వాదశ ఆదిత్యులు {ద్వాదశాదిత్యులు - 1ఇంద్రుడు 2ధాత 3పర్జన్యుడు 4త్వష్ట 5పూషుడు 6అర్యముడు 7భగుడు 8వివస్వంతుడు 9విష్ణువు 10అంశుమంతుడు 11వరుణుడు 12మిత్రుడు}; అందున్ = లో; విష్ణువును = విష్ణువు; రుద్రులు = ఏకాదశ రుద్రులు {ఏకాదశరుద్రులు - 1అజుడు 2ఏకపాదుడు3అహిర్బుద్న్యుడు 4త్వష్ట 5రుద్రుడు 6హరుడు 7శంభుడు 8త్రయంబకుడు 9అపరాజితుడు 10ఈశానుడు 11త్రిభువనుడు (మరొక క్రమము) 1అజైకపాదుడు 2అహిర్బుథ్న్యుడు 3త్వష్ట 4రుద్రుడు 5హరుడు 6త్రయంబకుడు 7వృషాకపి 8శంభుడు 9కపర్ది 10మృగవ్యాధుడు 11శర్వుడు (కశ్యపబ్రహ్మ వలన సురభి యందు జన్మించినవారు)}; అందు = లో; నీలలోహితుండును = శివుడు {నీలలోహితుడు - కంఠమున నీలము కేశములందు ఎరుపు కలవాడు, శివుడు (బ్రహ్మ హోమము చేయునపుడు లలాటమునందలి స్వేద బిందువు అగ్నియందు పడి నల్లని రంగు కలదై పిమ్మట ఎఱ్ఱనయ్యెనని పురాణ ప్రసిద్ధి)}; బ్రహ్మలు = నవ బ్రహ్మలు {నవబ్రహ్మలు - ప్రజాపతులు - భృగువు, పులస్థ్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, మరీచి}; అందు = లో; భృగువు = భృగువు; ఋషులు = ఋషులు; నారదుండును = నారదుడు; ధేనువులు = పాలు ఇచ్చు ఆవులు; అందున్ = లో; కామధేనువును = కామధేనువు; సిద్ధులు = సిద్ధులు; అందున్ = లో; కపిలుండును = కపిలుడు; దైత్యులు = దైత్యులు; అందున్ = లో; ప్రహ్లాదుండును = ప్రహ్లాదుడు; గ్రహములు = నవ గ్రహములు {నవగ్రహములు - 1సూర్యుడు 2చంద్రుడు 3అంగారకుడు4బుధుడు 5బృహస్పతి 6శుక్రుడు 7శని 8రాహువు 9కేతువు}; అందున్ = లో; కళానిధియును = చంద్రుడు; గజంబులు = గజములు {అష్టదిగ్గజములు - 1ఐరావతము 2పుండరీకము 3వామనము 4కుముదము 5అంజనము 6పుష్పదంతము 7సార్వభౌమము 8సుప్రతీకము}; అందున్ = లో {అష్టదిగ్గజముల భార్యలు - 1అభ్రము 2కపిల 3పింగళ 4అనుపమ 5తామ్రపర్ణి 6శుభ్రదంతి 7అంగన 8అంజనావతి}; ఐరావతంబును = ఐరావతము; హయంబులు = గుఱ్ఱములు; అందు = లో; ఉచ్చైశ్రవంబును = ఉచ్చైశ్రవము; నాగంబులు = నాగములు; అందున్ = లో; వాసుకియును = వాసుకి; మృగంబులు = జంతువులు; అందున్ = లో; కేసరియున్ = సింహము; ఆశ్రమంబులు = ఆశ్రమముల; అందున్ = లో; గృహస్థాశ్రమంబును = గృహస్థాశ్రమము; వర్ణంబుల = అక్షరముల; అందున్ = లో; ఓంకారంబును = ఓంకారము; నదులు = నదులు; అందున్ = లో; గంగయున్ = గంగ; సాగరంబుల = సముద్రముల; అందున్ = లో; దుగ్దసాగరంబునున్ = పాలసముద్రము; ఆయుధంబులు = ఆయుధములు; అందున్ = లో; కార్ముకంబును = ధనుస్సు; గిరులు = పర్వతములు; అందు = లో; మేరువును = మేరుపర్వతము; వృక్షంబుల = చెట్ల; అందున్ = లో; అశ్వత్థంబును = అశ్వత్థవృక్షము; ఓషధుల = ఫలించగనే నశించెడి చెట్ల; అందున్ = లో; యవలును = యవధాన్యము; యఙ్ఞంబుల = యాగముల; అందున్ = లో; బ్రహ్మయఙ్ఞంబును = బ్రహ్మయజ్ఞము; వ్రతంబులు = వ్రతములు; అందున్ = లో; అహింసయున్ = అహింస; యోగంబులు = యోగములు; అందు = లో; ఆత్మయోగంబును = ఆత్మయోగము; స్త్రీల = స్త్రీల; అందున్ = లో; శతరూపయు = శతరూప; భాషణంబుల = పలుకుల; అందున్ = లో; సత్య = సత్యమును; భాషణంబును = పలుకుట; ఋతువులు = ఋతువులు; అందున్ = లో; వసంతాగమంబును = వసంతఋతువు; మాసంబుల = మాసంబుల; లో = లో; మార్గశీర్షంబును = మార్గశిరము; నక్షత్రంబుల = నక్షత్రముల; లోనన్ = అందు; అభిజిత్తును = అభిజిత్తు; యుగంబులు = యుగములు; అందున్ = లో; కృతయుగంబును = కృతయుగము; భగవత్ = భగవంతుని; ఆకారంబుల = అవతారములలో; వాసుదేవుండును = కృష్ణుడు; యక్షుల = యక్షుల; లోన్ = అందు; కుబేరుండును = కుబేరుడు; వానరులు = వానరుల; అందు = లో; ఆంజనేయుండును = ఆంజనేయుడు; రత్నంబు = రత్నములు; అందున్ = లో; పద్మరాగంబును = పద్మరాగము; దానంబుల = దానముల; లోన్ = అందు; అన్నదానంబును = అన్నదానము; తిథుల = తిథుల {తిథులు - 1పాడ్యమి 2విదియ 3తదియ 4చవితి 5పంచమి 6షష్ఠి 7సప్తమి 8అష్టమి 9నవమి 10దశమి 11ఏకాదశి 12ద్వాదశి 13త్రయోదశి 14చతుర్దశి 15అమావాస్య లేక పౌర్ణమి}; అందున్ = లో; ఏకాదశియున్ = ఏకాదశి; నరుల = మానవుల; అందున్ = లో; వైష్ణవుండు = వైష్ణవసంప్రదాయకుడు; ఐ = అయ్యి; భాగవత = భాగవతుల; ప్రవర్తనన్ = పద్దతిలో; ప్రవర్తించు = జీవించు; వాడును = వాడు; ఇవి = ఇవి; అన్నియున్ = అన్ని; మత్ = నా యొక్క; విభూతులు = అవతారాలు. రూపములు; కాన్ = ఐనట్లు; ఎఱుంగుము = తెలియుము; అని = అని; కృష్ణుండు = కృష్ణుడు; ఉద్దవున్ = ఉద్దవుని; కున్ = కి; ఉపన్యసించిన = విస్తరించిచెప్పగా; వెండియున్ = మళ్ళీ; అతండు = అతను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

అలా అడిగిన ఉద్ధవుడికి యాదవ ప్రభువు శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. “కఱ్ఱ లోపల అగ్ని సూక్ష్మరూపంలో ఉండే విధంగా, సకల శరీరాలలోను అచ్ఛేద్యుడు అదాహ్యుడు అశోష్యుడు అయిన జీవుడు నివసిస్తూ ఉంటాడు.” అనగా ఉద్ధవుడు మరల ఇలా అడిగాడు. “సనకుడు సనందుడు మున్నగు యోగీంద్రులకు యోగమార్గం ఏ విధంగా బోధించావు? ఆ మార్గం ఎలాంటిదో నాకు చెప్పు.” అంత శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “వారు మొదట ఈ విషయం గురించి బ్రహ్మదేవుడిని అడిగారు. అతడు తనకు కూడ తెలియదు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడుతుంటే, నేను ఆ సమయంలో హంస రూపం ధరించి వాళ్ళకు చెప్పాను. ఆ వివరం చెప్తాను శ్రద్ధగా విను.
పంచేంద్రియాలకూ కనిపించే పదార్థమంతా అనిత్యం. నిత్యమైనది బ్రహ్మం మాత్రమే. పూర్వజన్మ కృత కర్మలచేత లభించిన శరీరం కలవాడైన దేహి, సంసార మందు మమకారాన్ని వదలి నిశ్చలమైన జ్ఞానం పొంది, నా స్థానాన్ని ప్రాప్తిస్తాడు. కలలో దొరికిన పదార్ధం నిజం కానట్లుగా, కర్మానుభవం అయిన దాకా శరీరం ఉంటుంది. అని సాంఖ్య యోగాన్ని సనకాదులకు చెప్పాను. అది వినిన బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు తెలుసుకున్నారు. ఆ యోగం వారి వలన భూలోకంలో ప్రసిద్ధమైంది. కాబట్టి, నీవు తెలుసుకుని పుణ్యాశ్రమాలకు వెళ్ళు. ఇంకా, నా మీద భక్తి ఆసక్తికలవారి పాదరేణువులు తన శరీరానికి సోకించుకుండేవాడు; శంఖమూ చక్రమూమొదలైన ముద్రలను ధరించేవాడు; హరిదివ్యనామాలు ధరించేవారికీ అన్నమూ నీళ్ళూ ఇచ్చేవాడు; విష్ణుభక్తులను కాంచి సంతోషించేవాడు కూడ భాగవతుడు అని తెలియుము. అన్ని సంగాలను వదలి, ఇతరము ఎరుగక, నన్నేతలచే మానవునకు భుక్తినీ, ముక్తినీ ఇస్తాను.” అని బోధించాడు. అంత, ఉద్ధవుడు ధ్యానమార్గ స్వరూపం చెప్ప మని మళ్ళీ అడిగాడు. శ్రీహరి ఇలా అన్నాడు.
“ఏకాంతంగా కూర్చుని తొడలమీద చేతులు కలిపి పెట్టుకుని, ముక్కు చివర చూపు నిలిపి, ప్రాణాయామంతో నన్ను హృదయంలో ఉన్నవాడిగా భావించి. పద్దెనిమిది విధాల ధారణా యోగసిద్ధులను తెలుసుకుని, అందు అణిమ మొదలైన వానిని ప్రధాన సిద్ధులుగా గ్రహించి, ఇంద్రియాలను బంధించి, మనస్సును ఆత్మలో చేర్చి, ఆత్మను పరమాత్మతో లగ్నంచేసి, బ్రహ్మపదాన్మి పొందే భాగవతశ్రేష్ఠులు ఇతర విషయాలు మాని నన్నే పొందుతారు.
ఇంతకుముందు పాండుకుమారుడైన అర్జునుడు రణరంగంలో విషాదం పొంది, ఇలానే అడిగితే, అతనికి చెప్పిందే నీకూ చెప్తున్నాను విను. చరచరాత్మకం అయిన ఈ ప్రపంచమంతా, నా ఆకారంగా భావించి భూతాలలో ఆధారభూతము సూక్ష్మములందు జీవుడు, దుర్జనమైన వాటిలో మనస్సు, దేవతలలో బ్రహ్మదేవుడు, వసువులలో అగ్ని, ఆదిత్యులలో విష్ణువు, రుద్రులలో నీలలోహితుడు, బ్రహ్మలందు భృగువు, ఋషులందు నారదుడు, ధేనువులందు కామధేనువు, సిద్ధులలో కపిలుడు, దైత్యులలో ప్రహ్లదుడు, గ్రహాలలో చంద్రుడు, ఏనుగులలో ఐరావతము, గుఱ్ఱములలో ఉచ్ఛైశ్రవము, నాగులలో వాసుకి, మృగములలో సింహము, ఆశ్రమములలో గృహస్థాశ్రమము, వర్ణములలో ఓంకారము, నదులలో గంగ, సముద్రములలో పాలసముద్రము, ఆయుధములలో ధనస్సు, కొండలలో మేరువు, చెట్లలో అశ్వత్థము, ఓషధులలో యవలు, యజ్ఞములలో బ్రహ్మయజ్ఞము, వ్రతములలో అహింస, యోగములలో ఆత్మయోగము, స్త్రీలలో శతరూప, పలుకులలో సత్యము, ఋతువులందు వసంతము, మాసములలో మార్గశిరము, నక్షత్రములలో అభిజిత్తు, యుగములలో కృతయుగము, భగవదాకారములలో వాసుదేవుడు, యక్షులలో కుబేరుడు, వానరులలో ఆంజనేయుడు, రత్నములందు పద్మరాగము, దానములలో అన్నదానము, తిథులయందు ఏకాదశి, నరులలో వైష్ణవ భాగవతుడు ఇవి అన్నీ నా విభూతులుగా తెలుసుకో.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశించాడు. మళ్ళీ ఉద్ధవుడు ఇలా అడిగాడు.