పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : నారయణఋషి భాషణ

  •  
  •  
  •  

11-82-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లుగావున లోకరక్షణార్థంబు గృష్ణుండవతారంబునొందె” నని హరి భక్తిపరంబు లగు నుపాఖ్యానంబులు నారదుం డుపన్యసించిన విని విస్మితచిత్తులై దేవకీవసుదేవులుగృష్ణుని పరమాత్మునిగా విచారించి” రని శుకుండు రాజునకుం జెప్పిన నతండు “మునీంద్రా! యదువుల నే ప్రకారంబున హరి హరియించె? సపరివారు లగు బ్రహ్మరుద్రేంద్రదిక్పాలకమునీంద్రులు ద్వారకానగర ప్రవేశం బెట్లు సేసిరి? యేమయ్యె? మఱియుఁ బరమేశ్వర కథామృతంబు వీనులలరం జవిగొనియు, నింకం దనివి సనదు; భక్తరక్షకుండగు హరి చారిత్రం బేరీతిఁ జాగెఁ? దర్వాతి వృత్తాంతం బంతయు నెఱింగింపు' మనిన శుకుం డిట్లనియె.

టీకా:

అట్లు = అలా; కావునన్ = అగుటచేత; లోక = జగత్తును; రక్షణ = కాపాడుట; అర్థంబున్ = కోసము; కృష్ణుండు = కృష్ణుడు; అవతారంబున్ = అవతరించుటను; ఒందెను = పొందెను; అని = అని; హరి = విష్ణు; భక్తి = భక్తికి; పరంబులు = చెందినవి; అగున్ = ఐన; ఉపాఖ్యానంబులున్ = ఇతిహాసములను; నారదుండు = నారదుడు; ఉపన్యసించినన్ = చెప్పగా; విని = ఆలకించి; విస్మిత = ఆశ్చర్యచకిత; చిత్తులు = మానసులు; ఐ = అయ్యి; దేవకీ = దేవకీదేవి; వసుదేవులు = వసుదేవుడులు; కృష్ణుని = కృష్ణుని; పరమాత్ముని = భగవంతుని; కాన్ = ఐనట్లు; విచారించిరి = భావించిరి; అని = అని; శుకుండు = శుకుడు; రాజున్ = రాజున; కున్ = కు; చెప్పిన = తెలిపిన; అతండు = అతను; ముని = మునులలో; ఇంద్ర = ఉత్తముడా; యదువులన్ = యాదవులను; ఏ = ఏ; ప్రకారంబునన్ = విధముగ; హరి = కృష్ణుడు; హరియించెన్ = నశింపజేసెను; సపరివారులు = పరివారాలతోనున్నవారు; అగు = ఐన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = శివుడు; ఇంద్ర = ఇంద్రుడు; దిక్పాలక = దిక్పాలకులు; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; ద్వారకానగర = ద్వారకానగరమును; ప్రవేశంబున్ = ప్రవేశించుటను; ఎట్లు = ఎలా; చేసిరి = చేసారు; ఏమయ్యెన్ = తరవాతేమైంది; మఱియును = ఇంకను; పరమేశ్వర = హరి; కథా = వృత్తాంతములు అను; అమృతంబున్ = అమృతమును; వీనులు = చెవులు; అలరన్ = తృప్తిచెందునట్లు; చవిగొనియున్ = ఆస్వాదించినను; ఇంకన్ = ఇంకా; తనివి = తృప్తి; చనదు = చెందలేదు; భక్త = భక్తులను; రక్షకుండు = కాపాడువాడు; అగు = ఐన; హరి = శ్రీహరి; చారిత్రంబు = చరిత్ర; ఏ = ఏ; రీతిన్ = విధముగ; సాగెన్ = కొనసాగింది; తర్వాతి = పిమ్మటజరిగిన; వృత్తాంతంబున్ = వృత్తాంతము; అంతయున్ = ఎల్ల; ఎఱిగింపు = తెలుపుము; అనిన = అని అడుగగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా జగత్తును రక్షించటం కోసమే భగవంతుడు కృష్ణుడుగా అవతరించాడు.” అని హరిభక్తి పరాలైన ఉపాఖ్యానాలను నారదుడు చెప్పగా విని దేవకీ వసుదేవులు విస్మయం చెందారు. శ్రీకృష్ణుని పరమాత్మగా భావించారు.” అని శుకముని మహారాజు పరీక్షిత్తుతో చెప్పగా అతడు “మునీంద్రా! భూభారాన్ని తగ్గించటం కోసం ఏ విధంగా కృష్ణుడు యాదవులను తుదముట్టించాడు? బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు; ఋషీశ్వరులు తమ పరివారాలతో ద్వారకానగరాన్ని ఎలా ప్రవేశించారు? అటు పిమ్మట ఏమయింది? వివరంగా చెప్పండి. విష్ణు కథామృతం చెవులారా ఎంత విన్నా, తృప్తికలగటం లేదు. భక్తరక్షకుడైన శ్రీహరిచరిత్ర ఏ రీతిగా కొనసాగింది? ఈ వృత్తాంతమంతా తెలియజెప్ప” మని అడుగగా శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు.