పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : నారయణఋషి భాషణ

  •  
  •  
  •  

11-77-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని యందుఁ గరభాజనుం డిట్లనియె; “ననేకావతారంబులు నానా రూపంబులును బహువిధ వర్ణంబులునుం గలిగి, రాక్షసులను సంహరించి, దుష్టజన నిగ్రహంబును శిష్టజన పరిపాలనంబునుం జేయుచుఁ గృతయుగంబున శుక్లవర్ణుండై చతుర్బాహుండై జటావల్కల కృష్ణాజినోత్తరీయ జపమాలికా దండ కమండలు ధరుండయి హరి నిర్మలతపోధ్యానానుష్ఠానగరిష్ఠు లైన పురుష శ్రేష్ఠులచేత హంసుండు, సువర్ణుండు, వైకుంఠుండు, ధర్ముం, డమలుండు, యోగేశ్వరుం, డీశ్వరుండు, పురుషుం, డవ్యక్తుండు, పరమాత్ముం డను దివ్యనామంబులం బ్రసిద్ధి వహించి గణుతింపంబడుఁ; ద్రేతాయుగంబున రక్తవర్ణుం డయి బాహుచతుష్క మేఖలాత్రయ విశిష్టుం డయి హిరణ్యకేశుండును, వేదత్రయస్వరూపుండును, స్రుక్‌ స్రువాద్యుపలక్షణ శోభితుండునయి విష్ణు, యజ్ఞ, పృశ్నిగర్భ, సర్వదేవోరుక్రమ, వృషాకపి, జయంతోరుగాయాఖ్యల బ్రహ్మవాదుల చేత నుతియింపంబడు; ద్వాపరంబున శ్యామలదేహుండును, పీతాంబరధరుండును, బాహుద్వయోపశోభితుండును, దివ్యాయుధధరుండును, శ్రీవత్స కౌస్తుభ వనమాలికా విరాజమానుండును, మహారాజోపలక్షణుండు నై జనార్దన, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్నానిరుద్ధ, నారాయణ, విశ్వరూప, సర్వభూతాత్మ కాది నామంబుల వెలసి, మూర్ధాభిషిక్తులచేత సన్నుతింపంబడు; కలియుగంబునఁ గృష్ణవర్ణుండును గృష్ణనామకుండునునై భక్తసంరక్షణార్థంబు పుండరీకాక్షుండు యజ్ఞ సంకీర్తనంబుల చేతం బ్రస్తుతింపబడు; హరి, రామ, నారాయణ, నృసింహ, కంసారి, నలినోదరాది బహువిధ నామంబులచే బ్రహ్మవాదులైన మునీంద్రులు నుతియింపుదురు; మఱియును.

టీకా:

అనినన్ = అని అడుగగా; విని = విని; అందున్ = వారిలో; కరభాజనుండు = కరభాజనుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; అనేక = పెక్కు; అవతారంబులు = అవతారములు; నానా = పలు; రూపాలును = స్వరూపాలు; బహు = చాలా; విధ = రకముల; వర్ణంబులునున్ = రంగులు; కలిగి = ధరించి, ఉండి; రాక్షసులను = రాక్షసులను; సంహరించి = చంపి; దుష్ట = చెడ్డ; జన = వారిని; నిగ్రహంబును = శిక్షించుట; శిష్ట = మంచి; జన = వారిని; పరిపాలనంబునున్ = రక్షణంబు; చేయుచున్ = చేస్తు; కృతయుగంబునన్ = కృతయుగములో; శుక్ల = తెల్లని; వర్ణుండు = రంగు కలవాడు; ఐ = అయ్యి; చతుర్ = నాలుగు (4); బాహుండు = చేతులు కలవాడు; ఐ = అయ్యి; జట = జటలుకట్టిన శిరోజములు; వల్కల = నారచీరలు; కృష్ణాజిన = జింకచర్మము చేసిన; ఉత్తరీయము = పైబట్ట; జపమాలిక = జపమాల; దండ = దండము {దండము - పైన చేతిని ఆన్చుకొని ఉంచుటకు అనువుగా ఉండి జపమునకు అనుకూలమైన కఱ్ఱ}; కమండలు = కమండలము {కమండలము - జలమును సన్నని ధారగా పోయుటకు వీలై జల భక్షణ, యోగ క్రియాదులకు అనుకూలమైన తొండము ఉండు కలశము, జలపాత్ర}; ధరుండు = ధరించినవాడు; అయి = ఐ; హరి = విష్ణువు {హరి - భక్తుల హృదయములను ఆకర్షించువాడు, విష్ణువు}; నిర్మల = పరిశుద్ధమైన; తపః = తపస్సు; ధ్యాన = ధ్యానము; అనుష్ఠాన = యోగాది అనుష్ఠానాలలో; గరిష్ఠులు = మిక్కిలి గొప్పవారు; ఐన = అయినట్టి; పురుష = మానవ; శ్రేష్ఠుల = ఉత్తముల; చేతన్ = చేత; హంసుండు = హంసుడు {హంసుడు - పరమాత్మ తానైనవాడు, విష్ణువు}; సువర్ణుండు = సువర్ణుడు; వైకుంఠుండు = వైకుంఠుడు {వైకుంఠుడు - చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమెకు జన్మించినవాడు, కుంఠనము (మొక్కపోవుట) లేని వాడు, విష్ణువు}; ధర్ముండు = ధర్ముడు {ధర్ముడు - ధర్మమే తానైనవాడు, విష్ణువు}; అమలుండు = అమలుడు {అమలుడు - పరిశుద్ధుడు, విష్ణువు}; యోగీశ్వరుండు = యోగీశ్వరుడు {యోగీశ్వరుడు - యోగులకు ప్రభువైన వాడు, విష్ణువు}; ఈశ్వరుండు = ఈశ్వరుడు {ఈశ్వరుడు - స్వభావము చేతనే ఈశత్వము కలవాడు, విష్ణువు}; పురుషుండు = పురుషుడు {పురుషుడు - పురములకు కారణభూతమైన వాడు, విష్ణువు}; అవ్యక్తుండు = అవ్యక్తుడు {అవ్యక్తుడు - వ్యక్తముకానివాడు, విష్ణువు}; పరమాత్ముండు = పరమాత్ముడు {పరమాత్ముడు - సర్వమునందు ఆత్మ యై ఉండి సర్వాత్మలు తానైన వాడు, విష్ణువు}; అను = అనెడి; దివ్య = మహిమాన్వితమైన; నామంబులన్ = పేర్లతో; ప్రసిద్ధి = ప్రసిద్ధి; వహించి = చెంది; గణుతింపంబడున్ = స్తుతింపబడును; త్రేతాయుగంబునన్ = త్రేతాయుగమునందు; రక్త = ఎఱ్ఱని; వర్ణుండు = రంగు కలవాడు; అయి = ఐ; బాహు = చేతులు; చతుష్క = నాలుగు (4); మేఖలాత్రయ = ముప్పేటల మొలతాళ్ళతో; విశిష్టుండు = మిక్కిలి శ్రేష్ఠమైనవాడు; అయి = ఐ; హిరణ్య = బంగారురంగు; కేశుండును = శిరోజములు కలవాడు; వేద = వేదములు; త్రయ = మూటి (3); స్వరూపుండును = ఆకృతి ధరించినవాడు; స్రుక్కు = స్రుక్కు; స్రువ = స్రువము; ఆది = మున్నగు; ఉపలక్షణ = ఉపలక్షణములతో; శోభితుండు = విలసిల్లువాడు; అయి = ఐ; విష్ణు = విష్ణువు {విష్ణువు - విశ్వమునందు వ్యాపించి ఉండువాడు, హరి}; యజ్ఞ = యఙ్ఞుడు {యఙ్ఞుడు - యజ్ఞకర్మ యజ్ఞకర్త యజ్ఞభోక్త తానైన వాడు, విష్ణువు}; పృశ్నిగర్భ = పృశ్నిగర్భుడు {పృశ్నిగర్భ - పృశ్ని (కిరణములకు) గర్భ (జన్మస్థానమైనవాడు) (మిక్కిలిగ ప్రకాశించువాడు), పృశ్ని (అదితి పూర్వజన్మ నామము) గర్భముననున్న వాడు, విష్ణువు}; సర్వదేవ = సర్వదేవుడు {సర్వదేవుడు - సమస్తమును (దివయింతి ఇతి దేవః) ప్రకాశింపజేయువాడు, విష్ణువు}; ఉరుక్రమ = ఉరుక్రముడు {ఉరుక్రముడు - పెద్ద అడుగులిడిన వాడు, వామనావతారుడు, విష్ణువు}; వృషాకపి = వృషాకపి {వృషాకపి - విష్ణువు, వ్యు. వృష+న+కంప+ఇన్, న లోపః, కృప్ర., ధర్మమునకు లోపము రానీయనివాడు, అధర్మముచే మునిగియున్న భూమిని వరహావతారమున ఉద్ధరించినవాడు, విష్ణుసహస్రనామములు శ్రీశంకర భాష్యం 101వ నామము}; జయంత = జయంతుడు {జయంతుడు - జయించు శీలము కల వాడు, విష్ణువు}; ఉరుగాయ = ఉరుగాయుడు {ఉరుగాయుడు - ఉరు (పెద్ద) కాయుడు (దేహము కలవాడు), ఉరుగాయుడు అను మహావిఙ్ఞానిగా అవతరించినవాడు, విష్ణువు}; ఆఖ్యలన్ = పేర్లతో; బ్రహ్మవాదుల = బ్రహ్మవాదుల; చేతన్ = చేత; నుతియింపంబడున్ = స్తోత్రములు చేయబడును; ద్వాపరంబునన్ = ద్వాపరయుగమున; శ్యామల = నీలవర్ణము కలిగిన; దేహుండును = శరీరము కలవాడు; పీత = పసుపువర్ణము కలిగిన; అంబర = వస్త్రములు; ధరుండును = కట్టుకొన్నవాడును; బాహు = చేతులు; ద్వయ = రెండు (2); ఉపశోభితుండును = తో ప్రకాశించువాడును; దివ్య = మహిమాన్వితమైన; ఆయుధ = ఆయుధములను; ధరుండును = ధరించినవాడు; శ్రీవత్స = శ్రీవత్స చిహ్నము; కౌస్తుభ = కౌస్తుభ మణి; వనమాలికా = ఆకులుపూలుగలమాలికతో; విరాజమానుండును = విలసిల్లువాడును; మహారాజ = మహారాజు యొక్క; ఉపలక్షణుండున్ = లక్షణములు కలవాడు; ఐ = అయ్యి; జనార్దన = జనార్దనుడు {జనార్దనుడు - (సమస్త)జనులకును అర్దనుడు (గమ్యమైన వాడు), విష్ణువు}; వాసుదేవ = వాసుదేవుడు {వాసుదేవ - ఆత్మలందు వసించెడి దేవుడు, విష్ణువు}; సంకర్షణ = సంకర్షణుడు {సంకర్షుణుడు- చతుర్వూహములలోని (1వాసుదేవ 2ప్రద్యుమ్న 3అనిరుద్ధ 4సంకర్షణ) సంకర్షణమనబడెడి వ్యూహము}; ప్రద్యుమ్న = ప్రద్యుమ్నుడు {ప్రద్యుమ్నుడు - చతుర్వ్యూహములలోని ప్రద్యుమ్నుండు, అహంకారము సంజ్ఞగాకలవాడు, విష్ణువు}; అనిరుద్ధ = అనిరుద్ధుడు {అనిరుద్దుడు - అడ్డుకొనరానివాడు, చతుర్వ్యూహములలోని అనిరుద్ధుడు (చిత్తమునకు సంకేతము), విష్ణువు}; నారాయణ = నారాయణుడు {నారాయణ - శ్లో. ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపోవై నరసూనవః, అయనంతస్యతా ప్రోక్తాః స్తేన నారాయణ స్మృత్యః. (విష్ణుపురాణము), నారాయణశబ్ద వాచ్యుడు, విష్ణువు}; విశ్వరూప = విశ్వరూపుడు {విశ్వరూపుడు - సమస్తమైన విశ్వము తన రూపమైన వాడు, విరాట్ పురుషుడు, విష్ణువు}; సర్వభూతాత్మక = సర్వభూతాత్మకుడు {సర్వభూతాత్మక - సమస్త జీవుల ఆత్మలందు నిండి ఉండువాడు, విష్ణువు}; ఆది = మున్నగు; నామంబులన్ = పేర్లతో; వెలసి = ప్రసిద్ధుడై; మూర్ధాభిషిక్తుల = చక్రవర్తులచేత; చేతన్ = చేత; సన్నుతింపంబడున్ = స్తుతింపబడును; కలియుగంబునన్ = కలియుగములో; కృష్ణ = నల్లని; వర్ణుండు = రంగు కలవాడు; కృష్ణ = కృష్ణుడు అను; నామకుండును = పేరు కలవాడు; ఐ = అయ్యి; భక్త = భక్తులను; రక్షణ = కాపాడుట; అర్థంబు = కోసము; పుండరీకాక్షుండు = కృష్ణుడు {పండరీకాక్షుడు - పుండరీకములు (పద్మములు) వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; యజ్ఞ = యజ్ఞములచేత; సంకీర్తనంబుల = సంకీర్తనల; చేతన్ = చేత; ప్రస్తుతింపబడున్ = స్తోత్రములు చేయబడును; హరి = హరి {హరి - భక్తులను ఆకర్షించువాడు, విష్ణువు}; రామ = రామ; నారాయణ = నారాయణ; నృసింహ = నృసింహ; కంసారి = కంసారి {కంసారి - కంసుని శత్రువు, కృష్ణుడు}; నలినోదర = నలినోదర {నలినోదరుడు - నలినము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; ఆది = మొదలైన; బహు = అనేక; విధ = రకముల; నామంబులు = పేర్ల; చేన్ = చేత; బ్రహ్మవాదులు = బ్రహ్మవాదులు; ఐన = అయినట్టి; ముని = మునులలో; ఇంద్రులు = ఉత్తములు; నుతియింపుదురు = స్తోత్రములు చేయబడును; మఱియును = ఇంకను.

భావము:

అని అడుగగా విని వారిలో కరభాజనుడనే ఋషి విదేహరాజుతో ఇలా అన్నాడు. ఎన్నో అవతారాలు; ఎన్నెన్నో రూపాలు; అనేక రకాల వర్ణాలు ధరించి రాక్షసులను సంహరించి; దుష్టశిక్షణం శిష్టరక్షణం కావించే శ్రీ మహవిష్ణువు…
కృతయుగంలో తెల్లని రంగుతో నాలుగుచేతులు కలిగి ఉంటాడు; జడలు నారచీరలు జింకచర్మం జపమాలిక దండం కమండలము దాల్చి నిర్మలమైన తపస్సు ధ్యానము అనుష్టానము గల మునిశ్రేష్ఠులచేత హంసుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే దివ్య నామాలతో ప్రశంసింపబడుతూ ప్రసిద్ధి చెందుతాడు.
త్రేతాయుగంలో ఎఱ్ఱనిరంగుతో, నాలుగుచేతులు బంగరురంగు జుట్టు కలిగి, మూడు పేటల మేఖలలు ధరించి, మూడువేదాల ఆకృతి ధరించి, స్రుక్కు స్రువము మొదలైన ఉపలక్షణాలతో శోభిల్లుతూ; విష్ణువు, యజ్ఞుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో బ్రహ్మవాదులచేత నుతింపబడతాడు.
ద్వాపరయుగంలో నీలవర్ణంతో, పసుపుపచ్చని బట్టలు కట్టుకుని, రెండు చేతులతో, దివ్యమైన ఆయుధాలు పట్టుకుని, శ్రీవత్సం కౌస్తుభం వనమాలికల ప్రకాశిస్తూ; మహారాజ లక్షణాలు కలిగి జనార్ధునుడు, వాసుదేవుడు, సంకర్షుణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు మున్నగు పేర్లతో వెలసి చక్రవర్తులచేత సన్నుతించబడతాడు.
కలియుగంలో నల్లనిరంగుతో కృష్ణుడు అనుపేరు కలిగి, భక్తులను రక్షించడానికి పుండరీకాక్షుడు యజ్ఞములందు కీర్తించబడతాడు. అప్పుడు ఆయనను హరి, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నళినోదరుడు మున్నగు పేర్లతో బ్రహ్మవాదులైన మునీంద్రులు స్తుతిస్తూంటారు.